ఉపమాక (ఉప్మాక)క్షేత్ర మహత్వము .
.
ఉపమాక లేదా ఉప్మాక అగ్రహారం, విశాఖపట్నం జిల్లా, నక్కపల్లి మండలానికి చెందిన గ్రామం.. ఇది మండల కేంద్రమైన నక్కపల్లి నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తుని నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది.
ఈ ఊరిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధిచెందింది.ఒకప్పుడు సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్దనుండి వేదాలను దొంగిలించి సముద్రంలో దాగున్నాడు. తన వద్దకు వచ్చి మొరపెట్టుకొన్న బ్రహ్మదేవునికి విష్ణువు హయగ్రీవ మూలమంత్రం ఉపదేశించి, గరుడాచలం వద్ద “బంధుర” అనే సరస్సు దగ్గర తపస్సు చేయమని చెప్పాడు. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం ధరించి సోమకుని చంపి వేదాలను తెచ్చి బంధుర సరస్సు వద్దనున్న బ్రహ్మకు ఇచ్చాడు. బ్రహ్మ తపస్సు చేసిన క్షేత్రం ఉపమాక పేరుతో ప్రసిద్ధమౌతుందని, అక్కడ ఆచరించిన పూజ, తపస్సు, దాన, పుణ్యాదిక కర్మలు ఇతోధికంగా ఫలప్రదాలవుతాయని విష్ణువు ఆనతిచ్చాడు. కశ్యపుడు కూడా ఇక్కడ తపస్సు చేసి విష్ణువు అనుగ్రహం పొందాడు. కలియుగంలో వేంకటాద్రినుండి వేట నెపంతో తాను ఈ క్షేత్రానికి వస్తానని, శ్రీలక్ష్మీ సమేతుడై తాను ఉపమాకలో గూఢంగా నివసించువాడనని విష్ణువు చెప్పాడు. గరుత్మంతుడు కూడా ఇక్కడ తపస్సు చేసి తాను పర్వతరూపంలో స్వామివారి ఆవాసంగా ఉండేలా వరం పొందాడు. ఇలా ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి అనేక గాథలున్నాయి. సా.శ. 6వ శతాబ్దంలో తూర్పు గోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాధిపతి శ్రీకృష్ణభూపాలుడు స్వామివారికి ఆలయం నిర్మించాడని కూడా స్థల గాథలలో చెబుతారు.
రామానుజాచార్యులు వారు ఈ క్షేత్రాన్ని దర్శించారని అంటారు.17వ, 18వ శతాబ్దాలలో పిఠాపురం సంస్థానానికి చెందిన ప్రభువులు ఇక్కడి దేవునికి విలువైన కిరీటాన్ని సమర్పించారని తెలుస్తుంది. బ్రౌన్ దొర కూర్చిన హిందూ దేవాలయాల వివరాలలో ఉపమాక క్షేత్రం ప్రసక్తి ఉంది.ఇక్కడ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి. పాంచరాత్రాగమం ప్రకారం ఇక్కడ పూజాదికాలు జరుగుతాయి. సంతానార్ధులైనవారు ఇక్కడ స్వామిని దర్శించుకొంటే సత్సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
· ధనుర్మాస ఉత్సవాలు: ప్రతి సంవత్సరం ధనుర్మాసం నెలరోజులు జరుగుతాయి.
· శ్రీరామ అధ్యయన ఉత్సవాలు: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుగుతాయి.
· కళ్యాణ మహోత్సవం, బ్రహ్మోత్సవాలు: ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది.
ఈ ఉత్సవాలలో పుణ్యకోటి వాహనం, పొన్న వాహనం, గరుడ వాహనం, రాజాధిరాజ వాహనం, హంస వాహనం, అశ్వ వాహనం, గజ వాహనం, పెద్ద పల్లకి, చిన్న పల్లకి వాహనాలపై శ్రీ వేంకటేశ్వర స్వామిని ఉభయ నాంచారులతో గ్రామ వీధులలో తిరువీధి వైభగంగా నిర్వహిస్తారు. అన్ని క్షేత్రాలలో సంవత్సరానికి ఒకమారు లభించే ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ నిత్యవైకుంఠద్వార దర్శనంగా ఉంటున్నది. ఈ క్షేత్ర మహిమలను “శ్రీ ఉపమాక క్షేత్ర మహాత్మ్యం” పేరుతో తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి చక్కని శైలితో రచించారు.
ఉప్మాక క్షేత్ర మహత్వము అని శ్రీగండికోట బాబూరావు అనేకవి గారు రాసి ,తిరుపతి వెంకట కవులకు చూపించి సందేహాలు తీర్చుకొని ,శ్రీ గొట్టుముక్కల నరసింహా చార్యులు ,శ్రీ పుట్టా గంగరాజు గార్ల సాయంతో కాకినాడలో 1-4-1917న ముద్రించారు వెల తెలుపలేదు .కవిగారు తమపద్యాలకు తాత్పర్యం కూడా రాసి మరింత సులభతరం చేశారు .
మొదటగా శార్దూలం లో ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామిని స్తుతి౦చారు కవి –
‘’శ్రీ యుప్మాక పురంబనన్ బరగు సుక్షేత్రంబునన్ –శ్రేయంబౌ భజనాలి సల్పదివిజుల్ సేవింప చెన్నారనల్
చాయల్ దు౦దుభులెల్ల వేడ్క మొరయన్ జానోప్ప సద్భక్త పో-షాయుత్తుండగు వే౦క టేశ్వరుని నే ప్రార్ధింతు నెల్లప్పుడున్ .’’
తరువాత కధలోకి వచ్చి బ్రహ్మవద్ద ఉన్న నాలుగువేదాలను ఎత్తుకుపోయిన సోమకాసురుని చంపటానికి విష్ణుమూర్తిని బ్రహ్మకోరాడు .’’సెబాసుపుత్ర నీ మనమున గల్గు వా౦ఛలిక మానకొసంగెద’’అని దగ్గర్లో ఉన్న బంధుర సరస్సు దగ్గర పవిత్రస్నానం చేసి తపస్సు చేయమన్నాడు .హయగ్రీవ నారసింహ అష్టాక్షరీ మంత్రాలు బోధించాడు .వీటితో తీవ్రతపస్సు చాలాకాలం చేశాడు బ్రహ్మ .విష్ణువు సాక్షాత్కరించి సోమకవధ చేస్తానని అభయమిచ్ఛి వాడిని చంపి వేదాలు తెచ్చి బ్రహ్మలోకం లో ఉన్న కొడుకు బ్రహ్మకి అందించాడు .
కశ్యపప్రజాపతికూడా విష్ణువు కోసం ప్రార్ధిస్తే బంధుర సరస్సువద్ద తపస్సు చేయమంటే చేసి ,విష్ణు సాక్షాత్కారం పొంది వరం కోరుకో మంటే ‘’నీ లాంటి కుమారుని ప్రసాదించు ‘’అని కోరగా సరే అనగా కొంతకాలానికి కొడుకుపుట్టాడు –‘’అతడే వామనాఖ్యుడాయి లోకైక ప్రపూజ్యు౦ డు నయి –యతి సూక్ష్ము౦డు ద్రివిక్ర ముండు నయి యొ-ప్పారెం భళీ’’అలాంటి క్షేత్రాన్ని వర్ణించటానికి బ్రహ్మాదులకూ సాధ్యం కాదన్నాడుకవి.
లోకం లో ఈ క్షేత్ర మహాత్వం విపరీతంగా వ్యాపించింది .’’ఖగ కులే౦ ద్రుండు’’కూడా వచ్చి ఇక్కడి సాగర ఘోషకు పరమానందం చెంది ,పవిత్రస్నానం చేసి మాధవునికోసం తపస్సు చేయగా లక్ష్మీ వరుడు దర్శనమిచ్చి కోరిక ఏమిటి అని అడిగితె ‘’శౌరీ !నా వర పక్ష ద్వయమందు నెల్లపుడు సంవాసంబుగా ను౦ డుమా ‘’అని ప్రార్ధించగా సరే అని వెంటనే వైకు౦ఠానికి వెళ్లి లక్ష్మీ దేవితో గుర్రాన్నెక్కి వస్తానని అది దివ్య క్షేత్రమౌతుందని అభయమిచ్చాడు .
గరుత్మంతుడు విష్ణువు రాకకోసం కృతయుగం లో బంగారు కొండ గా ,త్రేతాయుగం లో వెండికొండగా , ద్వాపరం లో రాగికొండగా ,కలియుగం లో రాతికొండగా వేచి ఉన్నాడు .చాలా కాలానికి తెల్లగుర్రం ఎక్కి లక్ష్మీ సమేతంగా విష్ణువు ఆప్రాంతానికి వచ్చి కొండ రూపంగా ఉన్న గరుడునిపై మునుల౦దరికి మోక్షం ప్రసాదించాడు .
సకలలోకాలు తిరుగుతూ నారదుడు బంధుర సరస్సు విష్యం విని ,ఇక్కడికి వచ్చి మనస్సులో ఎంతోమంది మహాత్ములు దర్శించి తరించిన ఈ క్షేత్రం మహత్తు వర్ణించటం ఎవరి తరమూకాదు అనుకొన్నాడు .దీనికి ఒక చారిత్రాత్మక ప్రసిద్ధి కలగాలని ,గరుత్మంతుని కొండపై ‘’లక్షీ హయ సమేతవిష్ణు మూర్తి ‘’ని ప్రతిష్టించాడు .మరికొంతకాలానికి నారాయణుడు ఒక గొల్లవాని కలలో కనిపించి తాను లక్ష్మీ హయ సమేతంగా కొండమీద ఉన్నాను ‘’అని చెప్పగా మర్నాడు అతడు వెళ్లి ,’’కుంఠీత తేజు యశో విహారు ‘’నో యబ్బ ‘’యటంచు వెంటనే జోహారొనరించి ఆముచ్చటైన విగ్రహాన్ని చూసి మైమరచి స్తుతించి రాజుగారికి తెలియజేశాడు .రాజు ఆలస్యం చేయకుండా వచ్చి శ్రీ వేంకటేశ్వరునికి ఆలయాది నిర్మాణం చేసి ,నిత్యపూజలకు,ఉత్సవాలకు అన్నిఏర్పాట్లు చేశాడు .ఇదే ‘’ఉప్మాక వేంకటేశ్వర మహత్వం సింపుల్ గా .
చివరలో కవిగారు –‘’ఈ కృతి బఠీయింపు వారల కింపు తోడ –నాలకించిన వారల కనుపమాన
భాగ్యభోగాదు లలరు పాపములు గూలు –చెలగు నిష్టమనోరధసిద్ధికరము ‘’ అని ఫలసిద్ధికూడా చెప్పారు .ప్రారంభం లోనే కవి గండికోట బాబూరావు ‘’ఈ చిన్ని పొత్తంబున శ్రీ యుప్మాక క్షేత్ర మహత్వమంతయు సంక్షిప్తముగా వ్రాసినాడను .ఇందలిగాథజగద్విదితమగునదియే కానీ ,ప్రమాణ౦బగు నే గ్రంథమును గాంచి వ్రాయబడినది కాదు ‘’ అని చెప్పారు .సరిగ్గా 18పేజీల గ్రందం.కవి గారి పూర్తివివరాలూ లేవు ఇందులో .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -13-7-21-ఉయ్యూరు