ఘనంగా త్రీ ఇన్ వన్ గా అంతర్జాతీయ తెలుగు బడి పురస్కార ప్రదానోత్సవం
ఈ రోజు 24-7-21 శనివారం గురుపౌర్ణమి మహర్షి వ్యాస జయంతిఅవటం .మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయంలో ప్రతి ఏడాది లాగే స్వామి వారలకు శాకంబరి పూజ నిర్వహించాలని చాలా రోజులక్రితమే నిర్ణయించటం, ఆతర్వాత అంతర్జాతీయ తెలుగు బడి పురస్కారాలు సరసభారతి చేత ఇప్పించాలని ఆ శాఖ భావించటం తో త్రీయిన్ వన్ గా సరసభారతి 159వ కార్యక్రమం రూపొందించి ఘనంగా నిర్వహించాము .
ఉదయం 9గం లనుండి 9-30వరకువివిధ కాయగూరాలతో స్వామివార్లకు విశేష పూజ నిర్వహించాం . కొత్తగా ఫ్రేం కట్టించిన వ్యాసమహర్షి చిత్ర పటానికి ,పుష్పహారాలు .,తులసి మాలలతో అలంకరించి ,వ్యాస శ్రీ విష్ణు ,శ్రీ కృష్ణ లకు అష్టోత్తర పూజ చేశా౦ .శ్రీ కపిలవాయి రైవత శర్మగారు వేద పనసలు చదివి వాతావరణాన్ని మరింత పవిత్రం చేస్తే శ్రీమతి మాదిరాజు శివాక్ష్మి భగవద్గీత భక్తియోగం పారాయణ చేయటం తో మరింత దివ్యమైనది .
ఉదయం 10.30గం లకు సరసభారతి 159వ కార్యక్రమానికి నేను అధ్యక్షత వహించగా ఆత్మీయ అతిధులుగాహెడ్ మాస్టర్ ,తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య కోశాధికారి శ్రీ దండి భట్ల దత్తాత్రేయ శర్మ ,తెలుగు ఉపాధ్యాయిని ,వక్త డా .శ్రీమతి కొమాండూరి కృష్ణా,ఉపాధ్యాయిని ,బాలసాహిత్య కర్త శ్రీమతి గుడిపూడి రాదికారాణి,జాగృతి కో –ఆపరేటివ్ సొసైటీ నిర్వాహకురాలు శ్రీమతి పామర్తి రాజీవి గార్లు వేదిక నలంకరించారు .రైవత శర్మగారు వేద మంత్రాలతో ప్రార్ధన చేశారు .నేను ఈసభ ముఖ్యోద్దేశం వివరించాను –‘’సుమారు వారం క్రితం అమెరికా టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరం లో అంతర్జాతీయ తెలుగు బడి నిర్వాహకులు ,నిరతాన్నప్రదాత ,అపర అన్నపూర్ణ కీశే డొక్కా సీతమ్మగారి ఇనిమనవాడు శ్రీ డొక్కా రామభద్ర ఫోన్ చేసి ,కరోనా వలన గత రెండేళ్లుగా అమెరికాలో తెలుగు బడి కార్యక్రమాలు జరగటం లేదనీ ,కనుక ఆంద్ర దేశం లో తెలుగు బోధించే ఉపాధ్యాయులు ఉపాధికోల్పోయి ఆర్ధిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా ,మానకుండా తెలుగు బోధిస్తున్న వారిని ఎంపిక చేస్తే సరసభారతి ద్వారా ప్రోత్సాహక నగదు పురస్కారం అందజేద్దామనీ చెప్పారు నేను వెంటనే దత్తాత్రేయ శర్మ ,కృష్ణా ,కోసూరు ఆదినారాయణ గార్లకు ఫోన్ చేసి ఈవిషయం చెప్పగా ఆదినారాయణగారు తాను బందర్లో ఉన్నానని ఆబాధ్యత రాధికా రాణికి అప్ప గి౦చానని చెప్పారు .పై ముగ్గురూ ఆసాయంత్రానికే అయిదుపేర్లు సేకరించి వారి బయోడేటా ఫోటో లతో సహా నాకు పంపగా ,నేను వెంటనే రామభద్రగారి ఫార్వార్డ్ చేశాను .అన్నీ చూసి సంతృప్తి చెంది సరే అని తాను డబ్బు పంపుతున్నానని చెప్పి నా బాంక్ అకౌంట్ కు 81 ,161 రూపాయలు నాకు పంపారు .నేను పై ముగ్గురికీ విషయం చెప్పి ,సరసభారతి ఆ అయిదుగురికి కొంత ఇస్తుందనీ, వారు కూడా ఏదైనా కొంత ఆర్దిఅక సాయం చేయగలరేమో ఆలోచించమని సూచన చేస్తే ‘’మహద్భాగ్యం ‘’అన్నారు .కార్యక్రమ విషయం వాట్సాప్ లో చూసిన 55ఏళ్ల క్రితం ఉయ్యూరు హై స్కూల్ లో ,ట్యూషన్ లో నా శిష్యురాలు శ్రీమతి కరుణానిధి రామగుండం నుంచి ఫోన్ చేసి తానూ ఈ కార్యక్రమానికి డబ్బు పంపుతున్నానని నా అకౌంట్ కు 5వేల రూపాయలు పంపగా ఆమెకు ధన్యవాదాలు తెలియజేసి ,ఆడబ్బు అయిదుగురికీ తలొక వెయ్యి రూపాయలు ఆడంపతులు శ్రీ పువ్వుల నరసింహారావు ,శ్రీమతి కరుణానిధి పేరు మీద అందిస్తామని చెప్పాను .మా అన్నయ్యగారబ్బాయి గబ్బిటరామనాధ బాబు తానూ తలొక రెండు వేల రూపాయలు ఇస్తానని ముందుకు వచ్చాడు . దీనితో తెలుగుబడి వారు ఒక్కొక్కరికి 16,240రూపాయలు సరసభారతి తలా అయిదువేలరూపాయలు , కరుణానిధి దంపతులు తలొక వెయ్యి రూపాయలు ,రామనాధబాబు తలొక రెండు వేలరూపాయలు అంటే ఒక్కొక్కరికి 24,240 రూపాయలు ఇవ్వగలుగుతున్నాం .ఉయ్యూరు నుంచి వారికి కనీసం 25 వేల రూపాయలన్నా అందించి సత్కరించి పంపాలన్న నా కోరిక దాదాపు నేరవేరి౦ది .పై ముగ్గురు సెలెక్టర్లు వారికి తోచిన ఆర్దికాన్ని ఒక్కొక్కరికి కవర్ లో పెట్టి అందించారు .ప్రతిఒక్కరికీ ఆమొత్తం నగదు పురస్కారం, ఒక శాలువా ,ఉత్తరీయం ,సరసభారతి పుస్తకాలు 10 అందించాము . నా శిష్యుడు ఫణి నాకు శాలువా కప్పాడు .రాధిక దంపతులు మా దంపతులు నూతనవస్త్రాలు అందించారు .ఇంకొకరు శాలువాకప్పారు.మా కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి ,సాంకేతిక నిపుణులు శ్రీ విబిజి రావు ,కోశాధికారి గబ్బిట వెంకట రమణ గొప్ప సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పురస్కార గ్రహీతలు శ్రీమతి జి.మాధవీ లత(హైదరాబాద్ ) శ్రీ పెరక రవికుమార్ (పెడన ) ,శ్రీమతి ఆదిలక్ష్మీ ప్రభావతి –విజయవాడ, శ్రీ కపిలవాయి రైవత శర్మ –వియవాడ ,శ్రీ దేవరపు ఈశ్వరరావు –విశాఖపట్నం గార్లు తమ స్పందన తెలియ జేస్తూ -ఈ అనుభవాన్ని ఊహించలేకపోయామనీ తమకు ఈ నగదు పురస్కారం ఎంతో ధైర్యాన్నీ ఉత్తేజాన్ని కలిగించిందనీ ,ఇకముందుకూడా అంకిత భావంతో తెలుగును ఎన్ని అడ్డంకులను ఎదిరించైనా బోధిస్తూనే ఉంటామని చెప్పారు .అతిధులు వారు ఎంపిక చేసినవారి గుణగణాలు చక్కగా వివరించారు మా మనవరాలు రమ్య తిదులప్రకారం పుట్టిన రోజు కూడా కావటం తో అందరూ ఆశీర్వ దించి ,నూతనవస్త్రం అందించారు .
ఆతర్వాత స్వామి వారలకు హారతి ,నక్షత్రహారతి ,మంత్రపుష్పం నిర్వహించాము .నైవేద్యంగా చక్రపొంగలి పులిహోర చేయించి అందరికి ప్రసాదం పెట్టి౦చా౦ .అర్చకస్వామి చి వేదాంతం మురళళీ కృష్ణ శాకంబరి పూజ అలంకారం అద్భుతంగా చేశాడు .అందరి కనులకు ఆనందం కలిగించాడు .అతడిని మిక్కిలి అభినందిస్తున్నాను .అతిధులకు ,పురస్కార గ్రహీతలకు కనకదుర్గా హోటల్ లో విందు ఏర్పాటు చేశాం .అంతాపూర్తి అయేసరికి మధ్యాహ్నం 2 అయింది .
పురస్కార గ్రహీతలు అయిదుగురు అంతర్జాతీయ తెలుగు బడి ఆస్టిన్ శాఖ నిర్వాహకులు శ్రీ డొక్కా రామభద్ర గారికి -తమను గుర్తించి నగదు పురస్కారం సరసభారతి ద్వారా అంద జేసినందుకు ,ఇకను౦చి కూడా అదే అంకిత భావం తో తెలుగు బోధిస్తామని వ్రాత పూర్వకంగా రాసి సభాముఖంగా తెలియబర్చారు .30మంది పాల్గొన్న ఈ కార్యక్రమం వైభవంగా ఎమోషనల్ గా ,అత్యంత సంతృప్తిగా జరిగింది . ఈ ఎమోషన్ లో అతిధులకు శాలువా ఉత్తరీయం లతో చేయాల్సిన సత్కారం మర్చే పోయాం .పురస్కార గ్రహీతలకుఅతిధులకు ,వదాన్యులకు సరసభారతి కార్యవర్గానికి ధన్యవాదాలు అందజేస్తున్నాను .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-7-21-ఉయ్యూరు