జయపూర్ మహా రాజా విక్రమ దేవ వర్మ ‘’కదా మంజరి ‘’-1
ఆచార్య సార్వభౌమ బ్రహ్మశ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారి సర్వవిధ అర్ధాంగి శ్రీమతి వేదుల ప్రభావతి గారు ఒరిస్సా లోని జయపూర్ సంస్థానాదధీశ్వరుడు విక్రమ దేవ వర్మ రాసిన 21 కధలను తెలుగులో అనువాదం చేసి ‘’కదామంజరి ‘’గా నామకరణం చేసి ఈ ఏడాది ఏప్రిల్ లో ముద్రించి తమ మాతృమూర్తి శ్రీమతి మరువాడ రామలక్ష్మి గారికి అంకితమిచ్చి మాత్రూణ౦ తీర్చుకొన్నారు. ఆ తల్లిగారు ఈ పుస్తక ముద్రణకు ప్రోత్సహించి ధన సాయం చేశారు .2015లేక 16 లో నాకు వేదుల వారి నుంచి వారి రచనలు కొన్ని పోస్ట్ లో వచ్చాయి .వారితో నాకు అసలు పరిచయమే లేదు .వాటిలోని వారి ఫోన్ నంబర్ తో ఫోన్ చేసి ‘’మీకు నేను ఎలా తెలుసు “”అని అడిగితె ,సాహిత్యం లో కృషి చేస్తున్నవారిని గుర్తించటం నాకు ఇష్టం .అందుకే తెలుసుకొని నా పుస్తకాలు పంపాను ‘’అన్న విశాల హృదయులు వారు .నేను వెంటనే సరసభారతి పుస్తకాలు పంపాను వారికి .అందినట్లు తెలియజేశారు అప్పటినుంచి ఫోన్ లో మాట్లాడుకోవటం నారచనలు వారికి పంపటం వారి రచనలు నాకు పంపుతూ ఉండటం జరిగింది .2017లో మేము ఐదవసారి అమెరిక వెళ్లేముందు డా రాచకొండ నరసింహ శర్మగారినీ ,వేదుల వారిని విశాఖలో దర్శించాలని సంకల్పించుకొని మా దంపతులం ,మా మనవడు చరణ్ కలిసి మార్చి 15 ఉదయం రత్నాచల్ లో బయల్దేరి ,విశాఖ చేరి మహారాణీ పేటలోని శర్మగారు వారి అర్ధాంగి డా శ్రీమతి అన్నపూర్ణా దేవి దంపతుల ఇంటికి వెళ్లి ,మధ్యాహ్నం వారింట్లోనే కమ్మని భోజనం చేసి,ఆదంపతులకు శాలువాకప్పిఆశీస్సులు పొంది ,వారి లైబ్రరీ చూసి ముచ్చటపడి ,వారి ఇంటినుంచి కనిపించే విశాఖ సముద్రపు అందాలను అనుభవించి వారి బంధువులను కూడా చూసి మాట్లాడి ,విశ్రాంతి తీసుకొని సాయంత్రం దొండపర్తి లో ఉంటున్న వేదుల వారింటికి చేరాం .అప్పటికే మాకోసం ఆదంపతులు ఎదురు చూస్తున్నారు .శాస్త్రి గారి టేబుల్ పై నేను రాసిన ‘’గీర్వాణకవుల కవితాగీర్వాణ౦’’రెండు భాగాలు ఉన్నాయి. వాటిని చూపిస్తూ ‘’వీటిని నిత్యం నేను చదివి స్పూర్తి పొందుతున్నాను .ఎంతమంది సంస్కృత కవులను గుర్తించి వారి ప్రతిభా విశేషాలను సరళమైన తెలుగులో పరిచయం చేశారండీ మీరు !మాలాంటి సంస్కృత కవి పండితులు చేయాల్సినపని మీరు చేశారు సర్వ సమర్ధంగా ‘’అని అంటే ‘’ఉబ్బు లింగడినే’’అయిపోయాను .ఆ దంపతులకు మేము ఉయ్యూరు నుంచి నూతనవస్త్రాలు శాలువాలు తీసుకువెళ్ళి ముందు వారికి సమ్మాని౦చా లనుకొంటే ఆదంపతులు ‘’మాకు మీరు అతిధులు .మేము మిమ్మల్ని సత్కరించాకే ,మీ సన్మానం అందుకొంటాం ‘’అని మమ్మల్ని నిరుత్తరుల్నిచేసిన ఆ దంపతుల సౌజన్యానికి కరిగిపోయాం .వారు అన్నట్లే ముందు మాకు వారు సన్మానం చేశాక వారిద్దరికీ మేము వస్త్రాలు అందించి శాలువాకప్పి సన్మామానించం అక్కడే విశాఖ సాహితీ ప్రముఖులు ఇద్దరు ముగ్గుర్ని చూశాం . వారిచ్చిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి 15౦వ జయంతి పుస్తకం శ్రీమతి చర్ల సుశీలగారిపై పుస్తకాలు అందుకోన్నాం . అంతటి సంస్కారం వేదులసంస్కారం మహోన్నతమైనది ఆమెను చూస్తుంటే అపర శారదా మూర్తిని దర్శించినట్లు ఉంది . .వారి శ్రీమతి గురించి శాస్త్రిగారు ‘’నాకు అన్నిరకాలా సహచరి తెలుగు ఎం ఎ .’’అని చెప్పారు . వారింట్లో కాఫీ టిఫిన్లు అయ్యాక మళ్ళీ ,సాయంత్రం రైలులో బయల్దేరి ఉయ్యూరు వచ్చాం . శాస్త్రి గారు పంపిన కదామంజరి పుస్తకం నాకు మే చివర్లోనో జూన్ మొదట్లోనోచేరింది .మళ్ళీ ఇవాళే దాన్ని తీసి చదివే అవకాశం కలగగా పై విషయాలన్నీ ఫ్లాష్ బాక్ గా దర్శనమిచ్చాయి .
ప్రభావతిగారు ఒరిస్సా రాష్ట్రం లో పుట్టి ఒరియా భాష మాధ్యమంగా చదువుకొని ,ఆ భాషపైపట్టు సాధించి ,శాస్త్రిగారితో వివాహాంతరం తెలుగు రాష్ట్రం లో స్థిరపడి సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషాధ్యయనం చేసి తెలుగు ఎం ఎ చేశారు .విక్రమ దేవ వర్మ 150వ జయంతికి ఒరియాలో పత్ర సమర్పణ చేయామని ‘’బెహరా ‘’గారు కోరితే చేశారు .డా ప్రకాష్ కుమార్ సేనాపతి వర్మగారి సాహిత్యంపై పరిశోధన చేసి ,ఆయనకధలను’’బిక్రమ డెబ బర్మా౦క గళ్ప సమగ్ర ‘’ సంపుటిగా ప్రచురించారు .ఈకధలనే శ్రీమతి వేదుల అనువాదం చేశారు . వర్మ గారి జీవిత చరిత్రను కూడా రాసి మనకు తెలియని విషయాలెన్నో చెప్పారు .
సాహిత్య సామ్రాట్ శ్రీ విక్రమ దేవ వర్మ –ఒరిస్సా –జయపూర్ సంస్థానాదిపతులు
జయపూర్ రాజు కృష్ణదేవ వర్మ రేఖా దేవి దంపతులకు మొదట ఆడపిల్ల పుట్టగా మగ పిల్లాదికోసం తపన చెంది శ్రీకాకుళం జిల్లా ముఖ లింగ క్షేత్రం లో పంచ ముఖేశ్వరుడిని లక్ష బిల్వ దళాలతో ,పంచాక్షరీ మంత్రాను ష్టానం తో ఆరాధించగా 28-6-1869న విక్రమ దేవ వర్మ జన్మించారు. రాజవంశం లో పుట్టినా ఒకకుగ్రామం లో బాల్యం గడిచింది .సామాన్యుడిగా జీవించటమే ఆయనకు మొదటి నుంచీ ఇష్టం .తలిదండ్రులే మొదటి గురువులు .ఇంటి పురోహితుడు రెండవ గురువు .విద్వత్ శిరోమణి రఘునాధ రధ ముఖ్య గురువు వద్ద ఒరియా సాహిత్యపాండిత్యాన్ని సాధించారు .కేశవ కోయిలి ,మధురా మంగళా ,గోపీ భాష మొదలైన గ్రంథాలు అధ్యయనం చేసి ,తెలుగు సాహిత్యాన్ని కూడా కూలంకషంగా మదించి ప్రావీణ్యం పొందారు .
తోమ్మిదవఏట తల్లినీ ,పదిహేనవ ఏటా తండ్రినీ ఆతర్వాత ఏకైక సోదరినీ కోల్పోయి ఏకాకి అయ్యారు .జయపూర్ రాజవంశానికి చెందినా ,బాల్యం జయపూర్ లో గడపలేదు .మహారాజ రామ చంద్ర దేవ్ మరణం తర్వాత జయపూర్ వచ్చి ,ఆయన పెద్దమ్మ కొడుకుపేరు కూడా ఇదే అవటం తో తనకు గుర్తింపుగా పేరు చివర ‘’వర్మ ‘’తగిలించుకొన్నారు .సరైన ఆదరణ లేకపోవటం వల్ల జయపూర్ వదిలి మాడుగుల రాజ్యానికి రాగా ,అమ్మా దేవికుమార్తే రాజెంద్రమణీ దేవి ఖర్చులన్నీ భరించి ఉపనయనం చేయాలనుకొని .ఆమహోత్సవానికి అనేక పశువుల్ని పక్షుల్నీ తెప్పించగా .వాటి నన్నిటినీ విడిచి పెడితే తప్ప ఉపనయం చేసుకోనని చెప్పగా ,అలాగే వదిలేశాక ఉపనయనం చేసుకొన్నా సర్వప్రాని హృదయం ఆయనది . భోజనాలు కూడా శాకాహారమే ఏర్పాటు చేశారు .
జయపూర్ లో అంతర్భాగమైన నవరంగాపూర్ మహారాజు చైతన్యదేవ్ మరణించాక ఆయన చిన్నభార్య బల౦ ఘీర్ రాజకన్య రాజ్యానికి వచ్చింది ఆమె తన అన్నమనవరాలు హీరాదేవితో విక్రమ దేవ వర్మ కు 1908 లో వైభవంగా వివాహం జరిపించింది .ఈ దంపతలకు మణిదేవి కుమార్తె జన్మించింది ఈమె వర్మతల్లి రేఖా దేవిలాగా విదుషీ మణి.వారసుడు లేకపోయినందున మరో వివాహం చేసుకోమని అందరూ బలవంతం పెట్టినా ఒప్పుకోక ఏక పత్నీ వ్రతమే పాటించారు వర్మగారు.కూతుర్ని ఇచ్చా గడ్రాజవంశీయుడు కుమారధరకిచ్చి పెళ్లి చేసిఅల్లుడిలోనే కొడుకును చూసుకొన్నారు.
జయపూర్ రాజు నాల్గవ రామ చంద్ర దేవ్ కు కొడుకులు లేరు .ఆయన చనిపోగా బ్రిటిష్ ప్రభుత్వం వర్మగారినే జయపూర్ రాజుగా ప్రకటించగా 5-6-1931న62వ ఏట పట్టాభి షిక్తులై,20ఏళ్ళు పాలించారు .ఈయనే చివరి మారాజు .
ఒరిస్సా రాష్ట్రావిర్భవానికి వర్మగారు తీవ్ర కృషి చేశారు .40ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి సాధించారు .జయపూర్ ను ఒరిస్సాలో అంతర్భాగం చేశారు. ప్రజలకు ఉద్యోగాలు కల్పించారు. వీరి సేవలకు దక్షతకు రాజకీయ అనుభవానికి విశాఖలో మేజిస్ట్రేటు ను చేశారు .విశాఖలో జగన్మిత్ర హాల్ అనే నాటక శాల కట్టించారు .మొదట తెలుగు, తర్వాత ఒరియా నాటకాలు ప్రదర్శించారు .విక్రమ దేవ్ తెలుగులో రాసిన శ్రీనివాస కల్యాణం ,నాగార్జున చరితం ,మానవతి చరితం నాటకాలు అక్కడ ప్రదర్శింప బడ్డాయి .నాటక ప్రదర్శనకు పది వేల విరాళం ఇచ్చారు వర్మ గారు. విశాఖలో ‘’ఉత్కళ సమాజం ,వైజాగ్ పట్నం క్లబ్ ప్రారంభించి జీవితాంతం ఆర్ధక సాయం చేశారు .ఆంద్ర విశ్వ విద్యాలయానికి ఏటా ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చేవారు .వీరి పేరు మీదుగా జెవిడి కాలేజేస్ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ‘’విభాగం ఏర్పాటు చేసి దాని ముందు వీరి కాంశ్య విగ్రహం ఏర్పాటు చేసి ,సరోజినీ నాయుడు చేత ఆవిష్కరింప జేయగా ఆమె ‘’రాజర్షి ,సమన్వయ సాంస్కృతిక వార్తాహరుడు వర్మాజీ ‘’అని ప్రశంసించింది .రవీంద్రుని శాంతినికేతన్ కు అయిదు వేలు విరాళం ఇచ్చారు .కటక్ మెడికల్ కాలేజి ,జైపూర్ కాలేజిమొదలైన విద్యా సంస్థలకు ఉదారంగా విరాళాలు ఇచ్చారు .ఆంధ్రా ,ఉత్కల్ యూని వర్సిటీ విద్యార్ధులకు రిసెర్చ్ చేసే వారికి ప్రోత్సాహకాలిచ్చారు .ఈ రెండు యూని వర్సిటీలకు ప్రోచాన్సలర్ వర్మగారు .
విశాఖ టౌన్ హాల్ ,హిందూ రీడింగ్ రూమ్ ,చెంగల్రావు పేట సీతారామస్వామి దేవాలయ శ్రీరామనవమి ఉత్సవాలకు ఆర్ధిక సాయం వీరిదే .ఆంధ్రాయూనివర్సిటి ఆనాటి వైస్ చాన్సలర్ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుడు 1934లో స్వహస్తాలతో వర్మగారికి కళాప్రపూర్ణ ఇచ్చి సత్కరించారు .సాహిత్య సామ్రాట్ ,విద్యాసాగర ,డిలిట్ వంటి బిరుదులెన్నో పొందారు .వర్మగారితో ప్రత్యక్ష పరిచయమున్న శ్రీ కవి శేఖర చింతామణి ,వర్మగారిని ‘’ఉత్కళ విక్రమాదిత్య ‘’,సరస్వతీ పుత్రా ‘’అని అభినందించారు .
ఆంద్ర –ఉత్కళ ఆంద్ర భాషా ,సాంస్కృతిక వారధి శ్రీ విక్రమ దేవ వర్మ 13-4-1951న దేవలోకం చేరారు . తర్వాతి భాగం లో వర్మగారి కదావైవిధ్యం ,ప్రభావతిగారి అనువాద ప్రతిభ చూద్దాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-7-21-ఉయ్యూరు
—