ఉగ్రనరసింహ శతకం
మార్కాపురం తాలూకా ఉమ్మడి వర ఉగ్ర నరసింహ స్వామి పై ఉగ్రనరసింహ శతకం ,దండకం ,పంచ రత్నాలు,సీసమాలికా సభక్తికంగా శ్రీ భాస్కరుని వీర రాఘవరావు గారు రచించి నెల్లూరు ప్రభాత ముద్రణాలయం లో ముద్రించి ప్రచురించారు. వెల –కేవలం పావలా .ముద్రణ జరిగిన సంవత్సరం లేదు .
కందా శతకం ఇది –‘’శ్రీ రమణీ ధవ వామన -సారస దళ నేత్ర చక్రి సర్వేశహరీ –మారజనక మందరధర –క్షీరాబ్ధి విహార బ్రోవు శ్రీ నరసింహా ‘’అని చెప్పి ఆయనమీద శతకం రాస్తున్నాననీ త్వరగా అయెట్లు చూడమని కోరాడుకవి .తనకుకవితా లక్షణాలు తెలియవనీ ఎదో ఉబలాటం కొద్దీ రాస్తున్నాననీ చెప్పాడు .తర్వాత దశావతారాలు అందంగా రాశాడు –‘’బాలకుని బ్రోచు కొరకై –వాలిని స్తంభంబు వెడలి ఉగ్రత దనుజున్ –లీల దునిమి ప్రహ్లాదుని –ఏలిన దొరవీవు గావే ఈశ నృసింహా ‘’అని ప్రస్తుత అవతారం గురించి రాసి –‘’సాక్షిగను నిలిచి జనులను –పక్షం బొక ప్రక్కలేక బహువిధములతో –రక్షించు బుద్ధరూపము –పక్షి గమన నీవు గావే పరమ నృసింహా ‘’అని బుద్ధావతారం వర్ణించి కలికాలం లో జనుల ఇక్కట్లు బాపటానికి ఎత్తిన కల్కి అవతార విశేషం చెప్పాడు .ఆతర్వాత కపిల దత్తాత్రేయ అవతాలు వర్ణించాడు .’’ఆకాశ వాయు తేజ భూమి జల బహు యోషధులు ,అన్నం ,ప్రాణం నువ్వే కదా స్వామీ అన్నాడు
64విద్యలు ,25తత్వాలు, ‘’యాబదారు వర్ణాలు’’26చందాలు నువ్వే అంటాడు దుష్కర ప్రాస తో –‘’ ప్రాడ్భాయిరక్కసులగమి-కఢ్భీతుల తుల జేసి దేవ గణములు యెల్లన్-పడ్బాధలు వారించెడి-షడ్భావ వికార దూర స్వామి నరసింహా ‘’లో తన సత్తా చూపాడు. తర్వాత షట్ చక్రాలు వాటి వివరణ ,అందులో ఉండే అక్షర సముదాయం ,దేవతలవివరాలు వివరించాడు –‘’ఇరువదియొకవెయియార్నూ-ర్దిరుగును దినమునకు హంస దీవ్రము గాగన్ –పరమాత్మ నీకు హంసను –స్థిరముగ నర్పింప ముక్తి జెందునృసింహా ‘’ యోగ భోగ త్యాగ యాగాలు అన్నీ ‘’రాగారహితా నీ మాయయే ‘’అంటాడు ..ప్రణవ స్వరూపమైటివి –అణువైతివి,నాద బిందు వైతివి –‘’జననమరణాలు లేకఇన సోమాగ్నుల వయ్యావు అన్నాడు .
విష్ణులోకం లో జయవిజయులు సనక సనందనాదులను స్వామి దర్శనానికి అనుమతించకపోవటం రాక్షస జన్మ లెత్తటం పేర్కొన్నాడు .’’హరి ఎవ్వడు యేటనుండును –హరియి౦తును వాని నిన్ను ‘’అని కొడుకు ప్రహ్లాదుని గర్జించిన తండ్రికి ‘’సరగున స్తంభము వెల్వడి –బొరిగొని రక్కసుని ,బాలు బ్రోచి నృసింహా ‘’అని ప్రహ్లాదవరదుని కీర్తించాడు.
వేదాలుశాస్త్రాలు నృసిహుని తమపై ఉండమనికోరితే ఒప్పుకొని ,వేద రాశి ,శాస్త్రానీకం శైల రూపం ధరిస్తే ,ఉమ్మడిగా అక్కడ వెలిశాడు నరసిహుడు –‘’ఉమ్మడిగా వరమిచ్చుట –ఉమ్మడి వర శైలమనగ నొప్పెను నామ౦-బిమ్మహి వేదము ,శాస్త్రము –సమ్మతితో గూడె శైల సరణి ‘’అని ఉమ్మడి వర మై ఆ కొండపై ఉగ్రనరసింహుడు ఉద్భవించాడు .దేవాలయం ,ప్రాకారాలు వెనువెంటనే ఏర్పడ్డాయి .రాజేంద్ర చోలుడుపిశాచి బాధ పడి,తీర్ధ యాత్రలు చేస్తూ ఇక్కడికి వస్తే అతడిని ఆదుకొన్నాడు స్వామి కళ్ళు పోయిన బ్రాహ్మణుడికి నేత్రాలు తెప్పించాడు .’’సిరిధవ కేశవ నిను మది –మరువక సంస్మరణం సేయు మానవ తతికిన్ ‘’వరాలిచ్చి మరణాలు మాన్పమని కవి కోరాడు.
శాలివాహన శకం ప్రజాపతి నామ సంవత్సరం లో వైశాఖ శుద్ధ చతురుర్దశి నాడు స్వామి ఆవిర్భావం రోజే శతకం పూర్తి చేసి అ౦కిత మిచ్చానని కవి చెప్పుకొన్నాడు . శతకం పేరు ఉగ్రనరసింహ శతకం .కానీ ఆఉగ్రత ఎక్కడా దర్శనమివ్వదు. శాంత నరసి౦హుడే కనిపిస్తాడు కవిత్వం లో .తర్వాత నరసింహ దండకం కూడా కూర్చాడు కవి .ఆతర్వాత నరసింహ పంచరత్నమాలిక వేశాడు .మచ్చుకి మొదటిపద్యం
‘’సీ-శ్రీధర భవహర చిన్మయ నలినాక్ష –కరుణాకర మహాత్మ –గరుడగమన
పురుషోత్తమావ్యయ శరణాగత త్రాణ –బిరుదాంకితాచ్యుత నిరుపమాన
చక్రదారణహరి శక్రాదిపూజిత –నీల మేఘ శరీర నిగమ వంద్య
కాంచన చేల శ్రీకర చతుర్భుజ శౌరి –కౌస్తుభ వక్ష శ్రీ కంఠ మిత్ర
ఉరు గుణ విశేష యుమ్మడి గిరి నివాస –వజ్ర నఖ తీక్ష్ణదంష్ట్ర ధీవర ముకుంద
పరమ పురుష పరాత్పర శరధి శయన –శ్రీ రమాధవ నను గావు శ్రీ నృసింహా ‘’
చివరగా సీస మాలిక అల్లి –మార్కాపురం లో ఉమ్మిడివరం లో సాబాదు వారి వంశం లో ముగ్గురు మూర్తుల దయతో లక్ష్మీ నరసింహుడు పుట్టి ,రామావదూతను గురునిగా పొంది ,ఆసేతు హిమనగపర్యంతం పర్యటించి ,చివరికి స్వగ్రామం ఉమ్మిడివరం చేరి ఉగ్రనరసి౦హుని అనుగ్రహంతో ప్రాకారగోపురాలుకట్టించి ,నిత్యపూజా నిత్య సంతర్పణ ఏర్పాటు చేసి .చోళపురం లో శిష్యులనుచూడటానికి వెళ్లి ,లంబికాయోగం లో చైత్ర బహుళ పంచమి నాడు తన హృదయపు వెలుగును విశ్వ వెలుగులోకలిపేశాడు .పద్యాలు శరవేగంతో పరిగెత్తి కందంలో అందగించాయి .పెద్దగా వర్ణన, స్వామి కధాకమామీషు లేదు వేదాంతం గుమ్మరించాడు .ఈ శతకం గురిఛి, ఈకవి శ్రీ భాస్కరుని వీరరాఘవ రావు గురించి లోకం లో ఎక్కడా ప్రచారం కనిపించలేదు .నాకు శతకం, ఆకవి, ఆక్షేత్రం గూర్చి పరిచయం చేసే అదృష్టం కలిగింది .
మీ-గబ్బిట-దుర్గాప్రసాద్ -27-7-21-ఉయ్యూరు