లంపెన్ ప్రోలిటరేట్ల లైంలైట్- రావి శాస్త్రి
‘ఈ జులై నెల 30వ తేదీశుక్రవారం సాయంత్రం శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావి శాస్త్రి )గారి 99వ జయంతిని విశాఖపట్నం లో విశాఖ రసజ్ఞ వేదిక ,రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ సంయుక్తంగా ద్వారకానగర్ పౌరగారంథాలయం లో నిర్వహిస్తూ ,ప్రముఖ రచయిత శ్రీ చింతకింద శ్రీనివాసరావు గారికి(2020) ,శ్రీమతి డి.కామేశ్వరీ దేవిగారికి (2021)సాహిత్య పురస్కారాలను డా రాచకొండ నరసింహ శర్మగారు ఎం .డి. అందజేస్తూ ,శ్రీనివాసరావు గారి కథాసంకలనం ‘’ఉడుకు బెల్లం ‘’ఆవిష్కరిస్తున్నట్లు నాకు శర్మగారు ఆహ్వానపత్రం మెయిల్ చేశారు .ఈ సందర్భంగా ఆకార్యక్రమం జయప్రదం కావాలని కోరుతూ , రావి శాస్త్రి గారిపై ఈ కింది వ్యాసం రాస్తున్నాను –‘’
‘’రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చేడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను, మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను” అన్నాడు రావిశాస్త్రి. 1922 జూలై 30న పుట్టి, పీడిత, తాడిత ప్రజల పక్షాన న్యాయంకోసం పోరాడి, విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి, అన్యాయాల నెదిరించి నెలల తరబడి జైలుపాలై, ప్రభుత్వ బిరుదుల్ని, అవార్డుల్ని తిరస్కరించి, పతితు కోసం, భ్రష్టుల కోసం, బాధాసర్పదష్టుల కోసం దగాపడ్డ తమ్ముల కోసం, చల్లారిన సంసారల కోసం, చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం.. తుది శ్వాసవరకు అవిశ్రాంతంగా ఉద్యమించి,అణచి వేతకుగురైనవారిలో ఆలోచన ,ఆత్మ విశ్వాసం కలిగించిన దీన జన పక్షపాతి .సమాజహృదయ౦ ,ప్రతిబింబం అయిన సాహిత్యాన్ని మనముందు నిలిపినవాడు రావి శాస్త్రి .రావి చెట్టు కింద జ్ఞానం కలిగిన వారెందరో ఉన్నారు .అలాగే రావి శాస్త్రికథలవలన విజ్ఞానులైనవారుఅనే కులే ఉన్నారు .
గురజాడ పుట్టిన దుర్ముఖి లోనేశ్రావణ శుద్ధ సప్తమి నాడు సీతారామల్క్ష్మి నారాయణ మూర్తి దంపతులకు శ్రీకాకుళం లో మేనమామల ఇంట రావి శాస్త్రి పుట్టాడు.అనకాపల్లి దగ్గర తుమ్మ పాలెం లో అచ్చటా ముచ్చట .మూడు మైళ్ళదూరం లోని అనకాపల్లి నడిచి వెళ్లి శారదా లైబ్రరీలో పుస్తకాలు తిరగేసేవాడు ఆయనకుటుంబం అంతా విద్యావంతులే అటూ ,ఇటూ మూడు తరాలవారు న్యాయవాదులే అవటం మరో గొప్ప విషయం .తండ్రి లాయర్ ,తల్లి భారత రామాయణాలతో బాగా పరిచయమున్న మహిళ .
సర్ సివిరామన్ చదివిన ప్రాంతం లో చదివినందుకు గర్వపడ్డాడు .ఆస్కూల్ హెడ్ మాస్టర్ కొడుకు శ్రీ శ్రీ సహవాసం ,తర్వాత ఆరాధన గా మారింది ,ఆంధ్రాయూనివర్సిటి కంటే అందులోని లైబ్రరీకి దగ్గరయ్యాడు .అది లోకజ్ఞాన పరిశీలను తోడ్పడింది .న్యూస్ రీడర్ పన్యాల రంగనాథరావు , జర్నలిస్ట్ ఆదిగురువు అబ్బూరి వరద రాజేశ్వరరావు లు హైస్కూల్ క్లాస్ మేట్స్ ,ప్రాణమిత్రులు .’’మొదట్లో తెల్లపాంటు షర్ట్ ,నుదుట పెద్ద కుంకుమ బొట్టు చేతిలో కొబ్బరిచిప్ప,చెవిలో పువ్వు తో కనక లక్ష్మీ అమ్మవారి భక్తుడి ‘’గా కనిపించేవాడు ప్రతి గురువారం .తర్వాత ఈ విధానం మారినా దేవుడు జ్యోతిష్యం పై నమ్మకాలున్నాయి .విశాఖ నాటకమండలి నాటకాలు తిరస్కృతి, నిజం, విషాదం లకు దర్శకత్వం వహించి కొన్నిట్లోనూ కన్యాశుల్కం లోనూ నటించాడు .స్నేహితుడు ఆకెళ్ళ కృష్ణమూర్తి తో కలిసి ‘గురజాడ కళాకేంద్రం ‘’స్థాపించి సాహిత్య సాంఘిక రాజకీయ అంతర్జాతీయ విషయాలపై చర్చించేవారు .చాణక్యుని స(క)లహాలనుఅప్పటి సమాజానికి అన్వయిస్తూ శాస్త్రి మాట్లాడేవాడు .కాంగోవిముక్తి ఉద్యమనాయకుడు , ఇండిపెండెంట్ కాంగో రిపబ్లిక్ మొదటి ప్రెసిడెంట్ పాట్రిస్ లుముబా హత్యపై పెద్ద సభ నిర్వహించి ,దేశ విదేశాలలో జరిగే అన్యాయాలకు తన వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ సామాజిక బాధ్యతా తీసుకొనేవాడు .భోళా శంకరుడైన శాస్త్రి ఈలపాట రఘురామయ్య, బడే గులాం పాటలంటే చెవికోసుకోనేవాడు . స్నేహితులకు అన్నివిధాలా పెద్ద దిక్కుగా ఉండేవాడు .
శాస్త్రి దేనినైనా వెయ్యి కళ్ళతో చూసే వాడు కనుకయదార్ధం యిట్టె పసిగట్టేవాడు .మద్రాస్ లో చదివి 1946లో లా పాసై ,ప్రసిద్ధ లాయర్ తాతా శ్రీరామమూర్తి దగ్గర 9ఏళ్ళు అప్ర౦టిస్ గా ఆయనను నొప్పించకుండా పని చేసి ,తర్వాత క్రిమినల్ లాయర్ గా స్థిరపడ్డాడు .1945లో లక్ష్మీ సోదేమ్మతో వివాహం జరిగినా ,1965లో తటవర్తి రామం ను ద్వితీయం చేసుకొంటే , 1993లో ఆమె చనిపోయింది .ఈవివాహానికి పుట్టిన లక్ష్మీ నారాయణ ప్రసాద్ ,ఉమా కుమారశాస్త్రి గార్లు కూడా లాయర్లయ్యారు .
మొదట్లో శాస్త్రి ఫీజుగా క్లయింట్లు ఆయనకిష్టమైన స్టార్ సిగరెట్ పెట్టె ,గుర్రం గుర్తు అగ్గిపెట్టె ‘’తో సరిపెట్టేవారు .సారా ,సారో కేసుల లో ఇరికించబడిన వారెందరికో శాస్త్రి దిక్కై వారి తరఫున వాదించి న్యాయం చేకూర్ఛి ‘’పేదోళ్ళ ప్లీడర్ ‘’అయ్యాడు .తాను ఎక్కడైనా పొరబాటు చేస్తే స్టే తెచ్చుకోవటానికి క్లయింటుకు డబ్బిచ్చి హై కోర్ట్ లో స్టే తెచ్చుకోమనే నిజాయితీ ఆయనది .’’లా ఈజ్ యాన్ యాస్ ‘’అన్న ప్రముఖ నవలాకారుడు చార్లెస్ డికెన్స్ లాగా శాస్త్రి ‘’ఇండియన్ కాన్ష్టిట్యూషన్ ఈజ్ లాయర్స్ పేరడైజ్ ‘’ అని ఎద్దేవా చేసేవాడు .
చిన్నప్పుడే పఠనాసక్తి కలిగి ఆతర్వాత డికెన్స్ ,ఉడ్ హౌస్ ‘’లను ‘’స్కాచ్ వడపోశాడు ‘’.1938లో మొదటిసారిగా శశాంక విజయం, దేముడే చేశాడు కధలురాశాడు రావి శాస్త్రి .కామేశ్వరరావు కేసు అనే డిటెక్టివ్ నవల రాశాడు .రాసిన’’కోనయ్య ‘’నవల ‘’ఇంతవరకూ కనిపించలేదని బాధ పడ్డాడు .అబ్బూరి వరద వగైరాలతో కలిసి యువ కళపత్రిక పెట్టి మూడు సంచికలు ప్రచురించాడు .జాస్మిన్ ,అన్ జానా వంటి 10మారు పేర్లతో రాసేవాడు .’’అల్పజీవి’’ నవలతో దశ తిరిగింది.చలం కొడవటిగంటి మాగోఖలే శ్రీపాద ఉన్నవ రచనలన్నీ చదివిజీర్ణం చేసుకొన్నా , తనదైన ‘’అననుకరణమైన శైలితో’’ కొత్తమార్గం పట్టి రాశాడు . . 1966లో రాజు మహిషి ,గోవులోస్తున్నాయి జాగ్రత్త నవల జ్యోతిలో అయిదు నెలలు ధారావాహికంగా వచ్చింది.1980లో ‘’సొమ్ములు పోనాయండి ‘’ అనే బ్లాక్ బస్టర్ నవల రాశాడు .చివరి నవల ‘’ఇల్లు ‘’.ఆయన 63కధలు 7సంపుటాలలో,నిజం తిరస్కృతి విషాదం నాటకాలు డాల్ఫిన్ డైరీలో ఎన్నో వ్యాసాలూ అసంపూర్తిగా ‘’ఏడవ చంద్రుడు’’ రాశాడు .
శ్రీకాకుళ గిరిజనోద్యమం నాయకుడు వెంకటాపు సత్యం తో పరిచయం తో ఎలర్ట్ అయి ‘’రచయితలారా మీరెటు ‘’కరపత్రం రాసి తెలుగు సాహిత్య చరిత్రను మలుపుతిప్పి ,విరసం ఆవిర్భావానికి నాంది పలికాడు రావి శాస్త్రి .1970ఖమ్మం సభలో శాస్త్రి కొ.కు. లు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు .ఇందిర ఎమర్జెన్సీ లో నిరసన చేసి జైలుకెళ్ళి 6-2-77వరకు జైలు జీవితం గడిపి ,జైలు అధికారులకు సంజాయిషీ రాసిచ్చి విడుదలై ,విరసం బహిష్కరణకు గురయినా సభ్యత్వం లేకుండా ఆదారిలోనే నడిచి ఆతర్వాత కమ్యూనిస్ట్ సానుభూతిపరుడిగా మిగిలాడు .1972లో వరవరరావు వగైరాల నిర్బంధానికి వ్యతిరేక ప్రదర్శన చేసి సంఘీభావం తెలిపాడు .అనారోగ్యం వలన రచన మందగించి౦దికానీ ప్రజలపక్షాన నిలిచి ,ప్రగతి బాట నుకోరిన ప్రజాబంధు వయ్యాడు .గిరిజన యువకులను పేద రైతులను అట్టడుగు వర్గాల వారినీ ఆలోచింపజేసి ఎదురు తిరిగి న్యాయం సాధించేట్లు చేసిన వెలుగు రేఖ శాస్త్రి.
1967లో ఆంద్ర ప్రదేశ్ అకాడెమి రావి శాస్త్రి కథలు కు పురస్కారం ఇస్తే తీసుకొన్నాడు కానీ ఆతర్వాత 1983లో తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాడు .ఆంధ్రాయూనివర్సిటి ‘’కళాప్రపూర్ణ ‘’ప్రకటించి సత్కరించాలనుకొంటే తిరస్కరించాడు .రత్తాలు రాంబాబు నవలకు మన అకాడెమి ఇచ్చిన పురస్కారం వద్దన్నాడు .యజ్ఞం కథకు కారా మాస్టారు ఏకారణాలు చెప్పి తిరస్కరించారోఅవే కారణాలు రావి చెప్పాడు .మూడు కథలబంగారం కు శిరీషా సాహిత్య సంస్థఇచ్చిన అవార్డ్, గోపీచంద్ అవార్డ్ పుచ్చుకొన్నాడు ..స్త్రీ సినిమాకు కథా మాటలు ,రాసి౦దీ ఆయన నిజం నాటకం సినిమాగా వచ్చిందీ చాలామందికి తెలీదు .రావి శాస్త్రి ఇంట్లోవాళ్ళకు విశ్వం ,బార్ లో వాళ్లకు ఆర్ వి ఎస్ ,క్లయింట్ లకు ‘’చాత్రిబాబు’’ గా త్రిమూర్త్యవతారం దాల్చాడు .
రిక్షా ,ఆటోలను ఎప్పుడూ బేరమాడి ఎక్కని బడుగు జీవుల పెన్నిధి .నిజాయితీ చిత్తశుద్ధి .ఆత్మ విశ్వాసం ఆత్మ విమర్శ ఆయన ఆభరణాలు .1990డిసెంబర్ 9న పక్షవాతానికి గురై ,కొద్దోగొప్పో కోలుకొని 1993జూన్ 2న మూత్రపిండాల వ్యాధి బయటపడి ,చాలాసార్లు డయాలిసిస్ జరిగి ,తట్టుకొని 10-11-1993ఉదయం ‘ఇహం ఇల్లు ఖాళీ చేసి ‘’వెళ్ళిపోయాడు’’పెన్నూ,కన్నూ మూసి ”’ రావిశాస్త్రి .
రావి శాస్త్రి అల్ప జీవి నవల తెలుగులో మొట్టమొదటిసారిగా చైతన్య స్రవంతి ప్రక్రియ లో రాసిన మనో వైజ్ఞానిక నవల.గోవులొస్తున్నాయి నవల ఇంటర్నల్ మోనోలోగ్ .మూడుభాగాల రత్తాలు రాంబాబు నవల స్త్రీ జీవితం గాలిపటం గా చూపబడింది .గోవులు పోనాయండి ఒక వర్గనికి జరిగిన అన్యాయం .ఇది అయన స్నేహితుడు ,మెంటార్ వరద కు అంకితం .వియత్నాం విమలలు పుట్టాల్సిన అవసరం ,బంగారానికి బలైన చెల్లి ,ధర్మం కోసం ,లోక రక్షణకోసం బయల్దేరటం ‘’మూడుకథల బంగారం ‘’ లో ఆంతర్యం .మంచికి ఉపకారం, చెడుకు అపకారం ‘’ఇల్లు ‘’నవల .ఆయన చిత్రించిన పాత్రలన్నీ సామాజిక బాధ్యతతో చిత్రించిన సజీవ శిల్పాలే .ముత్యాలు పాత్ర ముత్యం లా మెరుస్తూనే ఉంటుంది ఉత్తరాంధ్ర మాండలికాలు జాతీయాలు సామెతలు లోకోక్తులు పుష్కలంగా కురిపించాడు .కథనం లో ఓరల్ ట్రడిషన్ పాటించాడు ఏదిరాసినా దాని ఎత్తుగడ ముగింపు లో ఆయన ప్రత్యేకతకనిపిస్తుంది. ఎందులో ఒక్కలైన్ చదివినా ఇది రావి శాస్త్రిది అని యిట్టె చెప్పయ్యచ్చు.టాల్ స్టాయ్ , డికెన్స్ ,పెర్ల్ ఎస్ బక్ ప్రసిద్ధ నవలలోని ఆరంభవాక్యాలుగా శాస్త్రి ముఖ్యనవలలోని మొదటి వాక్యాలు కోటబుల్ కోట్స్ గా ఉండటం ప్రత్యేకత .అల్పజీవి రాసిన రావి శాస్త్రి మహోన్నత సాహిత్య జీవి .ఆయన రచనా సర్వస్వం ‘’ధర్మేతిహాసం ‘’అన్నారు . ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక అజంతా కవి
ఇక కథ లేదు వ్యధ,
దారి లేదు, ఎడారి, ఎడారి ఎడారి
అడుగడుగునా ఇక అశ్రుఘాతాలే
శిరస్సు వ్రయ్యలైన అపశబ్ద శరీరాలే
వీధి మొగలో ధూళి, ధూళి
జీవన గ్రంథం నిండా పొగ’ అని అన్నాడు.
రావి శాస్త్రి కథలను కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ లోకి ఆయన తమ్ముడు నరసింహ శర్మ గారు మొదలైన వారితో అనువాదం చేయించి ప్రచురించి గొప్ప గౌరవం కలిగించింది .మా మిత్రుడు స్వర్గీయ టిఎల్.కాంతారావు నోటిలో ఎప్పుడూ శ్రీ శ్రీ ,రావి శాస్త్రి నానుతూ ఉండేవారు .వారిద్దరూ ఆయనకు ఆరాధ్య దైవాలు .శ్రీ శ్రీ కవిత్వం ,శాస్త్రి కధలపై పత్రికలలో వ్యాసాలు తరచుగా రాసేవాడు. మాతో ముచ్చటి౦చేవాడు. శాస్త్రిపై పరిశోధన చేసి పుస్తకం తేవాలని కలలు కన్నాడు .కానీ అది నెరవేర లేదు .ఈవిషయం శాస్త్రి నవలలపై బెజవాడ సిద్ధార్ధ కాలేజి తెలుగు లెక్చరర్ శ్రీ తాటి శ్రీకృష్ణ నాటి నాగార్జున యూని వర్సిటి ఆంద్ర శాఖాధ్యక్షులు ఆచార్య ఎస్. గంగప్పగారి పర్య వేక్షణలో పరిశోధన చేసి ప్రచురించిన ‘’రావిశాస్త్రి నవలాను శీలనం ‘’పుస్తకంలో ఆచార్యులవారు’’వామపక్ష భావాలను గూర్చి మంచి అవగాహన కలిగిన టిఎల్ కాంతారావు జీవించి ఉంటె ‘’రావి శాస్త్రి కథా ప్రపంచం ‘’ అనే అంశం పై ,నా పర్య వేక్షణలో ఇంతకు ముందెప్పుడో మంచి సిద్ధాంత వ్యాసం వచ్చి ఉండేది ‘’అని సెలవిచ్చిన విషయం ఇది .
ఈవ్యాసానికి ఆద్ధారం శ్రీ తాటి కృష్ణ పరిశోధన ‘’ ’రావిశాస్త్రి నవలాను శీలనం’’
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-7-21-ఉయ్యూరు