21వ శతాబ్దం లో మతం -3(చివరి భాగం )
21వ శతాబ్ది ఆశా జ్యోతి ధర్మ౦ ఒక్కటే
21వ శతాబ్దిలో రాబోయే దశకాలలో ధర్మం ఒక్కటే సరైన మార్గనిర్దేశం చేసే దివ్య జ్యోతి .పడమటి దేశాలలో మతం పూర్తిగా మతతత్వవాదానికీ ,సెక్యులరిజ వర్గాలమధ్య ఇరుక్కు పోయింది .కానీ మనకు మాత్ర౦ ధర్మమే ఉత్కృష్ట ధ్యేయం.వాళ్లకు ఆ వాసనే తెలియదు .ధర్మం మనుగడ వృత్తి సంస్థలపై ఆధారపడనిది .ఏదేశం లోని మతమైనా మానవ ఉన్నతిని పెంచి కోల్పోయిన వైభవాన్ని సాధించి మానవాభ్యుదయానికి దోహదం చేయాలి .కనుక ధర్మం ఒక్కటే ఈ రెండు పనులను సమర్ధం గా నిర్వర్తించగలదు.ఈ విలువలు శాశ్వతమైనవీ ,మార్పు చెందనివీ అని గ్రహించాలి
ఈ ఆధ్యాత్మిక ,నైతిక విలువలు అన్నిమతాలకు ఆధారభూమి .ఆధునికయుగం లో మతాలన్నీ ఈ ధ్యేయంగా పనిచేస్తూ మానవాళి అభ్యుదయానికి దోహదం చేయాలి అప్పుడే వాటి ఉనికి సార్ధకం .కనుక ఈ నవనాగరక టెక్నలాజికల్ యుగం లో ధర్మం కేంద్ర బిందువుగా వ్యవహరించి దారి చూపాలి .
వేదాలలో ఋతం అనేది మొట్టమొదటి కీలక భావన .దానిలోనుంచే ధర్మం నిష్పన్నమైంది .రుతం అనేది సాధారణ ఆర్డర్ లేక ఆజ్ఞ.ఇదే విశ్వాన్నీ అందులో ఉన్నవాటికీ ప్రేరణ స్పూర్తి కలిగిస్తూ సహకరిస్తూ ఉంటుంది,ఉండాలి .సంస్కృతం లో ధర్ అంటే ధరించేది అనే ధాతువునుంది ధర్మం అనే పదం ఏర్పడింది .అంతరార్ధం -ఏది శాశ్వతంగా గట్టిగా దృఢంగా స్థాపించబడినదో అదే ధర్మం .
ధర్మం భౌతిక స౦పదతొపాటుఆధ్యాత్మిక వైభవాన్ని కలిగిస్తుంది .ధర్మం అనే పదానికి సరైన పదం ఏభాష లోనూ లేదు .ఇంగ్లీష్ లో వర్త్యు,మొరాలిటి,డ్యూటీ అనిఅర్ధాలు చెప్పారుకానీ అవేవీ ధర్మాన్ని సరిగ్గా నిర్వచించేవి మాత్రంకాదు .జీవితం లో అర్ధం ,కోరికల సాధనకు ధర్మం ప్రాతిపదిక కావాలి లేకపోతె అనర్ధం జరుగుతుంది .శీల నిర్మాణం ధర్మాదారంగా జరగాలి .అందుకే వ్యాసమహర్షి వీటన్నిటినీ బోధిస్తూ మహాభారత రచన చేశాడు .చివరికిచేతులెత్తి ప్రార్ధిస్తూ ‘’ఊర్ధ్వ బాహు ర్విరోభ్యేష నత కశ్చిచ్చ్రునోతుమే-ధర్మాదర్ధశ్చకామశ్చ స కిమర్ధ న సేవ్యతే ‘’ , భావం ‘’చేతులెత్తి ప్రార్ధిస్తున్నాను .నా మాట ఎవరూ వినటం లేదు .ధర్మంలో నుంచే అర్ధ ,కామాలు వస్తాయి ,కోరికలు తీరతాయి .ఎందుకు ధర్మాన్ని ఉపెక్షిస్తున్నారో,అనుసరించటం లేదో నాకు అర్ధం కావటం లేదు’’అని వాపోయాడు వ్యాసమహర్షి కృష్ణ ద్వైపాయనుడు
వివేకానందస్వామికూడా ధర్మం ఆధారంగా మతాలు ఉండాలి అన్నాడు .మతం అనే దానికి ఆయన ఆరు రకాల నిర్వచనాలు చెప్పాడు -1-ఇంద్రియాల అదుపుకు పోరాటం చేయాలి 2-మనిషిలోని దివ్యత్వాన్ని మేల్కొల్పాలి .3-శాశ్వత ఆన౦ద౦ పొందే కృషిలో సహకరించాలి 4-జ్ఞాన సముపార్జనకు తోడ్పడాలి 5-మానవుని భూత భవిష్యత్ వర్తమానాలకు కారణభూతమై సంపూర్ణ మానవుని చేయాలి 6-ఇది యదార్ధమా అనే ప్రశ్న కు సమాదానమివ్వాలి .అంటే మాని ఫెస్టేషన్ ,ఎండేవర్,రియలై జేషన్ ,రిలేషన్ షిప్ ,రియాలిటి లకు బాధ్యత వహించాలి మతం .మతం ఒక విశ్వాసానికి పరిమితమైనదిమాత్రమే. ధర్మం దీనికి విరుద్ధమైన శాశ్వతమైనది .నిజానికి మతం అంటేధర్మమే .అది మానవుని భౌతిక ఆధ్యాత్మిక ఆధిభౌతిక తత్వాన్ని ఉపదేశించేది .మత సూత్రాలన్నీ ఈ మూల ప్రాతిపదికలుగా ఉండాలి .ఇదే ప్రతిమతం మూల సిద్ధాంతంగా ఉండాలి ,లేకపోతె మానవభ్యుదయానికి ,సమాజాభి వృద్ధికీ అవి అవరోధాలుగా నిలుస్తాయి .
తక్షణ కర్తవ్య౦
సెక్యులర్ వాతావరణం లో మతం మానవ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి దోహదం చేసే పాత్ర నిర్వహించాలి .తరతరాలుగా పోషిస్తున్న ఆధ్యాత్మిక సంపద వృధాకాకుండా బాధ్యత వహించి చేరాల్సినవారికి చేర్చాలి .రాబోయే తరాలకు కరదీపికలుగా మతాలు ప్రవర్తించాలి.కనుక ఆధ్యాత్మికత్వాన్ని శక్తిమంతంచేసి నైతికతను పొందుపరచి బలమైన మూలాలతో మతం వర్ధిల్లాలి అదే తక్షణ కర్తవ్యం .ఈపవిత్రకార్యం మతాలు మాత్రమె చేయగలవు .దీనితో భౌతికతనే కూపం లో స్వార్ధం సంకుచితత్వం అత్యాశ లలో కూరుకుపోయిన మానవాళికి వెలుగు కలుగుతుంది .
కనుక 21వ శతాబ్ది లో మతం అంటే వర్గాలు గా విడిపోయినవారిని సమైక్యపరచి ఆధ్యాత్మిక నైతికతా విలువలను బోధించి ధర్మమార్గాన ప్రవర్తింప చేయటమే ..సమాజంలో నైతిక విలువలు పెంచాలి .మత౦ విభజించేదిగా కాకుండా ,.. సమైక్య పరచేదిగా ఉండాలి .సర్వమానవ సౌభ్రాత్రుత్వమే మతం ధ్యేయంగా ఉండాలి .ఆధునిక యుగం లో నిరంకుశ ,మతోన్మాద ,మతమార్పిడి లక్షణాలతో మతాలు ఉండరాదు .అవి ప్రమాదకరం వినాశహేతువు అభి వృద్ధి నిరోధకం కూడా .రాజ్యాదికారంతో పెత్తనం చేయకుండా ,,వ్యాధిగ్రస్తులను వోదార్చేదిగా ,ఆపనులకు అమృత హస్తం అంది౦ చేదిగా,ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోవటానికి మార్గ దర్శిగా మతం ఉండాలి .బలమైన రాజకీయనాయకుల చేతిలో,స్వార్ధపరుల చేతిలో వికర్షణ(రిపల్సివ్ ) శక్తిగా మతం ఉండరాదు .
ఆదర్శమతం
వివేకానంద స్వామి చెప్పినట్లు భవిష్య మతం ,రాబోయే తరాలకు ఆదర్శంగా ,అందర్నీ కలుపుకుపోతూ వివక్షత చూపకుండా ,ప్రపంచంలో ఉన్నమంచినీ గొప్పతనాన్ని గుర్తించి అనుసరిస్తూ ,ద్వేష ,కార్పణ్య భావాలను వదిలేసి నడవాలి .అనుకంప, కనికరం ,తోటిభావన(ఫెలో ఫీలింగ్ )తో ఒకరి నొకరు గౌరవిస్తూ ,స్నేహ సౌహార్దాలతో కలిసి నడవాలి .
ఈ సందర్భంగా స్వామి వివేకానంద ‘’విశ్వ మతం ‘’అనే భావన తెస్తూ ‘’నా ఉద్దేశ్య౦ లో అందరూ అంగీకరించే ,అందరి వేదాంతాలను ఒప్పుకొనే,అందరిభావోద్వేగాలకుసరిపడిన ,అందరి ఆధ్యాత్మికతకు అద్దంపట్టే ,కర్తవ్యానికి అనుకూలమైన విశ్వ మతం కావాలి .’’అన్నాడు ఆయన ఉద్దేశ్యం లోప్రతిమతానికి కోల్పోరాని ఒక ఆదర్శం ఉంటుంది .కనుక ప్రతిమతం తెలివిగా ,వివేకంతో ముందడుగు వేయాలి .21వ శతాబ్దిలో మతానికి దీనికంటే అమృతోపమానమైన మాటలతో చెప్పే గొప్ప బ్లూ ప్రింట్ అనేది ఉండదు .
ఆధారం – ప్రబుద్ధ భారతి –జులై –స్వామి వీరేశ్వరానంద ఎడిటోరియల్