శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు
చిలిపి’’ వరద ‘’
శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు చిన్నతనం విశాఖ పట్నం లో గడిచింది .అప్పుడు ఆయన తండ్రి శ్రీ అబ్బూరి రామకృష్ణా రావు గారు ఆంధ్రా యూని వర్సిటిలో లైబ్రేరియన్ గా ఉండేవారు. ఆయనవల్లనే శ్రీ శ్రీ ,ఆరుద్రలు పాశ్చాత్య సాహిత్యపు పోకడలను గ్రహించారు .పుస్తకాలిచ్చి వారితో చదివి౦చేవారాయన .వరద బాల్యం విశాఖ లో రావి శాస్త్రి తో ‘’యేరా అంటే యేరా ‘’అను కొనే చిలిపి స్నేహంగా గడిచింది .ఆచిలిపి చేష్టలను రావి శాస్త్రి ‘’వరద స్మృతి’’లో ‘’అబ్బూరి నా ఆది గురువు ‘’వ్యాసం లో వివరంగా రాశాడు అందులోని కొన్ని ముఖ్య విషయాలు .
‘’అబ్బూరి వరద ఆది గురువు ,నాచివరి గురువు కూడా ‘’అన్నాడు రావిశాస్త్రి .కొద్ది రోజులకు చనిపోతాడనగా వరద రావికి ఫోన్ చేసి ‘’ఒరే శాస్త్రీ !బతికున్న వాళ్ళకంటే చచ్చిపోయిన వాళ్ళే అదృష్ట వంతులురా .కనుక నువ్వు ఏం దుఖించకు –విచారించకు ‘’అని చెప్పాడు .
1932 లో విశాఖ ఏ వి యెన్ కాలేజీ లో శాస్త్రి సెకండ్ ఫాం ఒక సారి ఫెయిల్ అయి మళ్ళీ చదువుతుండగా అప్పుడొక ఎర్రటి కుర్రాడు స్పోటకపుమచ్చలతో వచ్చి చేరాడు .ఎక్కడినుంచి వచ్చావని శాస్త్రి అడిగితె ‘’బెజవాడ నుంచీ ‘’అని బెజవాడ విశాఖ కంటే గోప్పదనట్లు పోజిచ్చి చెప్పాడు .’’ఆడే వరద’’. .’’దేవుడు లేడు.నీకు తెలుసా ?’’అడిగాడు కుర్ర వరద కుర్ర శాస్త్రిని .ఆమాటకుతల్లీ తండ్రీ లేనివాడిలాగా బెదిరిపోయాడు శాస్త్రి.అప్పుడు ప్రహ్లాదుని గురించి రహస్యంగా ఒక కథ రాస్తున్నాడు శాస్త్రి .వరద మాటలకు భయపడి ఆ కథ చి౦చేశాడు ‘’దేవుడు ఉంటె మా చెల్లి ఎందుకు చచ్చిపోవాలి ?’’అన్నాడు బుడ్డి వరద .దీనిపై తానొక ఒక గేయం రాశానని మర్నాడు తెచ్చి చూపించాడు బాలవరద .వరద రెండవ భాషగా తెలుగు తీసుకోవటం వలన ఎ డివిజన్ లో ,రావి సంస్కృతం తీసుకోవటం వలన బి డివిజన్ లో ఉన్నారు .ధర్డ్ ఫారానికి ఇద్దరూ బి డివిజన్ లో ఉన్నారు .
ఒకసారి తెలుగు మాస్టారు వరదను కొట్టాడు .అతని అన్న వాణీకుమార్ కు పిచ్చకోపం వచ్చి మేస్టార్ని ‘’మా తమ్ముడిని ఎందుకు కొట్టావు బయటికి రా చంపేస్తాను ‘’అన్నాడు .ఫోర్త్ ఫారం లో వక్తృత్వ పోటీల్లో వరద ఎక్కువగా పాల్గొనేవాడు .కన్యకాపరమేశ్వరి దేవాలయం పూజారి స్థానాపతి సత్యనారాయణ మూర్తి వద్ద వరద సంస్కృతం నేర్చాడు .సత్యనారాయణగారి భార్య రుక్మిణమ్మ దేవీ భాగవతం ను సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించి విదుషీమణి .
ఆరుద్ర పినతండ్రి భాగవతుల నారాయణ రావు సైకిల్ కు మున్సిపాలిటీ పన్ను ఏడాదికి రెండుమ్ముప్పావలా కట్టక పొతే సైకిల్ లాక్కెళ్ళారు. ఆయన వరదకు మంచి దోస్త్ .అందుకని వరద స్నేహితులందరి దగ్గరా అణా బేడా ఎంత ఇస్తే అంత వసూలు చేసి పన్నుకట్టి సైకిల్ విడిపించి ఇప్పించాడు .ఆ రోజుల్లో రూపాయకు 8 సేర్ల బియ్యం వచ్చేవిట .సైకిల్ పన్నుకు 22 శేర్ల బియ్యం వచ్చేవని రావి రాశాడు .దీనితో నారాయణ రావు అందరికీ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడట .అంత డబ్బు ఆ రోజుల్లో పోగు చేయటం చాలెంజ్ .దాన్ని చేసి చూపించినవాడు వరద .మేస్టర్లకు వరద ప్రియ శిష్యుడు.
శాస్త్రికీ వరదకూ లెక్కలు రావు . ఫిఫ్త్ ఫాం ఫైనల్ పరీక్షల్లో లక్ష్మణరావు అనే లేక్కలమేస్టారు నాలుగైదు లెక్కలు చెప్పేశాడు .శాస్త్రి కనిపెట్టి దణ్ణం పెట్టి’’ షేక్స్ పియర్ మొహం ‘’పెడితే అతనికీ చెప్పి ఇద్దరూపాస్ అయేట్లు చేశాడు .ఎస్ ఎస్ ఎల్ సి కి వచ్చేసరికి వరద వరదలా విజ్రు౦భించాడు .అప్పుడు జస్టిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికలు జరిగితే వరద బాచ్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేసింది .జస్టిస్ పార్టీమీద రోజుకొక బులెటిన్ రాసి వదిలేవాడు వరద .ఎవరికీ తెలిసేదికాదు .జయపురం రాజా విక్రమ దేవ వర్మ ఏ పార్టీనీ సపోర్ట్ చేయలేదు .వరదకు కోపం వరదలా వచ్చి ఆయన పై ‘’తొండం అప్పారావు ‘’అనే పేరు పెట్టి పెద్ద గేయం రాశాడు .అది అప్పట్లో పెద్ద పాప్యులర్ అయింది .బొబ్బిలి రాజా రామబ్రహ్మం అనే ఆయన్ను కాదని జస్టిస్ పార్టీ టికెట్టు అంకితం భానోజీ రావు ను సపోర్ట్ చేయమని ఆర్డర్ వేశాడు .దీనికీ మండింది వరదకి .
ఆ రోజుల్లో ‘’గోంగూర పాట’’అందరి నోట్లోనూ నానేది –అది –‘’నాను ఎల్లకెల్లకేల్లినాను గొంగూరకీ –తోటలన్నీ తిప్పినాడు గొంగూరకీ –దొడ్లన్ని తిప్పినాడు గొంగూరకీ –మాయ దారి నా కొడుకే గొంగూరకీ –చివరికి మంచమెక్కమన్నాడే గొంగూరకీ ‘’అనేది బాహా హిట్ సాంగ్ .అబ్బూరి వరద ఈ బాణీలో రామ బ్రహ్మం మీద పాటతో విరుచుకు పడ్డాడు –
‘’మేడలని కట్టావు రామ బ్రహ్మం –మిద్దేల్ని కట్టావు రామ బ్రహ్మం –స్టాండ్ స్టాండ్ అన్నావు రామబ్రహ్మం –స్టాండేను అన్నావు రామబ్రహ్మం –కానీ రాజా గారొచ్చారు రామబ్రహ్మం –సిట్టు సిట్టాన్నారు రామ బ్రహ్మం –సిట్టేను అన్నావు రామబ్రహ్మం –‘’ఈ పాట పిల్ల గాంగ్ అందరికీ నేర్పి రామబ్రహ్మం ఇంటి ఎదురుగా కూచుని పాడించేవాడు వరద .అప్పుడు తెన్నేటి విశ్వనాథం కాంగ్రెస్ కాండిడేట్ అంటే జస్టిస్ పార్టీకి వ్యతిరేకం కనుక భానోజీకీ వ్యతిరేకమే.పాట చివర్లో ‘’విశ్వనాథంకి జై –రామ బ్రహ్మంకి తుస్ ‘’అని పించేవాడు .పాటపాడి గాంగ్ వెళ్ళిపోయేది రోజూ .వైశ్యులు కాంగ్రెస్ సపోర్ట్
వాళ్ళు ఒక పాట తయారు చేస్తే వరద బృందం వరద లీడర్షిప్ లో డాన్స్ చేస్తూ దాన్ని పాడేవాళ్ళు .-ఆపాట
‘’తెన్నేటి విశ్వ నాథమూ మన కాంగ్రేసు వారండీ –వారికి మన వోటు నిచ్చి ఖ్యాతి నిలపండి ‘’ .ఈ పాటను కోమట్లు వాళ్ళ ఆడవాళ్ళు చూడాలని వాళ్ళ ఇళ్ళముందు పాడించేవారు .ఇది గ్రహించి వరద శాస్త్రి తో ‘’ఒరేయ్ వాళ్ళ కులం వాళ్ళు చూడాలని మన చేత గంతులేయి స్తున్నారు ‘’అని చెప్పి ఆతర్వాత ముఖ్య కేంద్రాలలోనే పాడి డాన్స్ చేశారు
తోటి స్నేహితులందరూ ఒకరినొకరు ఒరేయ్ అనే పిల్చుకోనేవారు .అలా పిలవని వాళ్ళను వెలేసేవారు .ఇంటర్ ముందువరకు ఇలానే సాగింది . పాత ముఠా అంతా మారి కొత్తజనం చేరారు ఏవండీ అని పిలవటం అప్పుడు గౌరవం .అది వరదకు నచ్చలేదు .అలా పిలిస్తే ‘’జెల్ల ‘’కొట్టే వారు .కనుక ఈ బాధ భరించలేక అందరూ ఒరేయ్ లోకి దిగారు .దీనితో వరద ‘’ఒరేయ్ ఒరేయ్ క్లబ్ ‘’ను ఏర్పాటు చేశాడు .ఇంటర్ లో ఒరేయ్ క్లబ్ ను ‘’యువజన సంఘం ‘’గా మార్చాడు .కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసిన వారిని ఇంకా విడుదల చేయకపోతే విడుదల చేయాలని పెద్ద యాజిటే షన్ తెచ్చాడు వరద .ఇంటర్ లో స్టూడెంట్ యూనియన్ కార్య వర్గ సభ్యుడయ్యాడు. శాస్త్రినీ ఎలెక్ట్ చేయించాడు ..భమిడిపాటి కామేశ్వర రావు మాస్టారు రాసిన నాటకాల్లో తానూ వేషం వేసి రావి శాస్త్రి చేతా స్టేజి ఎక్కించాడు .1938 లో జపాన్ –చైనాపై అప్రకటిత యుద్ధం మొదలు పెట్టింది .అప్పట్లో మార్కెట్ అంతా జపాను సరుకులతో నిండిపోయేది .ఏ వస్తువైనా బేడా అర్ధణా .కాంగ్రెస్ వాళ్ళే వీటిని అమ్మేవారు .వరద షాపుల ముందు పికెటింగ్ నిర్వహించి ‘’డౌన్ విత్ ది సర్వీసెస్ ఆఫ్ జపాన్ గూడ్స్ ‘’అని నినాదాలు చేయించి ఆపించే ప్రయత్నం చేశాడు .రెండవ ప్రపంచ యుద్ధం లో ఎం యెన్ రాయ్ అనుచరులయ్యారు అబ్బూరి తండ్రీ కొడుకులూ .కమ్యూనిస్ట్ లు తటస్థం .కాని వరద హిట్లర్ కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య దేశాలకు సపోర్ట్ చేయాలన్న రాయ్ వాదం తో ఏకీభవించి సపోర్ట్ చేసి స్టూడెంట్ బలగాన్నీ సపోర్ట్ కు సన్నద్ధం చేశాడు .చిలిపి పనులలోనూ వరద కు ఒక ధ్యేయం ఆదర్శం దేశ భక్తీ ఉండేవి .అతన్నే అందరూ అనుసరించేవారు’’. దటీజ్ వరద’’మీ- గబ్బిట దుర్గాప్రసాద్-4-4-17-ఉయ్యూరు –