తత్వ వేత్త యడ్ల రామ దాసు గారు
19వ శతాబ్దం చివరలో కాకినాడలో ఉన్న తత్వ వేత్తలలో యడ్ల రామదాసు ఒకరు .క్రీ.శ 1860లో జన్మించి 70ఏళ్ళు జీవించి 1910లో సిద్ధిపొందిన తత్వ వేత్త .బ్రహ్మం గారి తత్వాల తర్వాత ఈయన తత్వాలకే వ్యాప్తి ఎక్కువ .119కీర్తనలతో ‘’సాంఖ్య తారకామనస్క యోగంబనెడు సుజ్ఞాన చంద్రిక ‘ అనే గ్రంథాన్ని పీఠిక తో సహా తాను బ్రతికుండగానే ముద్రింపించుకొన్నాడు .
విజయనగరం సంస్థానం దగ్గరలో కలవ చర్ల గ్రామం లో యడ్ల అచ్చయ్య ,మహాలక్ష్మమ్మ దంపతులకు యడ్ల రామ దాసు జన్మించాడు .అక్షరాభ్యాసం అయిన తర్వాత 12వ ఏట కాకినాడ చేరాడు .అక్కడ మంతెన వేంకటాచార్య అనే వేదాంత గురువు వద్ద ఉపదేశం పొంది సాంఖ్య తారక అమనస్క,రాజయోగాదులలో ప్రావీణ్యం సంపాదించాడు
పీఠిక లో రాసుకొన్నట్లు తాను విద్య విహీనుడైనా,సద్గురు కటాక్షం చేత కవిత్వ ,వచన రచనలో ఒకధోరణికలిగి కొన్ని కీర్తనలు మరికోన్నితత్వాలు గద్య పద్యాలో సకల జనాహ్లాదకరంగా సులభ శైలిలో రాశాడు. సుజ్ఞాన చంద్రిక తోపాటు ఆయన శిష్యులు తాము రచించినవికూడా చేర్చి ;;యడ్ల రామ దాసు చరిత్ర ‘’పేర పుస్తకం ప్రచురించారు .ఇది బాగా ప్రచారం లో ఉంది ఇందులో రాసిన శిష్యులు –బూచి అప్పలదాసు ,చిట్టూరి నారాయణ దాసు ,విత్తనాల కొండయ్య దాసు ,వెంకటదాసు ,బోని అప్పలదాసు బోని గవరయ్య దాసు మామిడి అప్పలదాసు కంచుమర్తి యల్లయదాసు ,నాగన్న లు .
సుజ్ఞాన చంద్రికను యడ్ల రామ దాసు తన జీవిత చరిత్రగానే రాశాడు .హరికథా కథన శైలిలో, తోహరాలతో ఉత్తమ పురుష లో ఆత్మకథాకథన పద్ధతిలో రాశాడు –
‘’అండపిండ బ్రహ్మాండ పురంబున నా గురు రూపము జూపెన్ –కుండలాగ్రమున మంతెన వెంకట గురువై తానటియి౦చెన్ –శ్రీకరమగు శ్రీకాకినాడ పురి దాపున జేరిన వాడన్ –ప్రాకటముగ యడ్ల రామదాసు తలవాకిటపై ప్రకటించెన్’’
చంద్రికలో ఉన్నవి తత్వాలు మాత్రమేకాక ,చాలాపాటలు కీర్తనల రూపం లో ఉన్నాయి .భజనపాటలు మేలుకొలుపులు ,జోలపాటలు మంగళహారతులు ,ఆంజనేయ దండకం ,గోపీ కృష్ణ సంవాదం ,గురుశిష్య సంవాద గేయాలు ఉన్నాయి .రంగనాథ వెంకటేశ్వర ,రామ ,కృష్ణ ,వినాయక ,త్రిపురసుందరి ఈశ్వర ,నారాయణ రూప పరబ్రహ్మాలపైకీర్తనలున్నాయి .కొన్ని పల్లవులు బాగా ప్రచారం లో ఉన్నాయి -1-ఈశ్వరా పరమేశ్వరాజగదీశ్వరా కరుణించరా ,2- జీవమా మేలుకొనవే –మేలుకొనవే వెర్రిజీవమ చాలు ,3-అనుమాన మేలకే మనకు ఈతనువు నిత్యముగాదు హంస , ,4-దీనిభావము తెలియవలేనన్నా నీలోను బ్రహ్మముపూని కనుగొనవలెను వినుమన్నా.
కృష్ణ లీలా సంకీర్తన –శ్రీరాగం –ఆదితాళం
‘’ఎన్నిమాయలు నేర్చినాడమ్మా నీ కొడుకన్నిటికి నెరజాణు డో యమ్మా ‘’తేటతేటమాటలతో జీవాత్మ ,పరమాత్మ సంబంధం ఎరుకపరచాడు .పరమాత్మ క్రీడా విలాసాలే బాలకృష్ణలీలలు –
‘’వ్యవసాయము జేసేవారము –ఈ అడవిలోపల కాపువారము –నవద్వార పురము వీధి వారము-నవనీత చోరుని భక్తపరులము -అండ పిండ బ్రహ్మాండము మేము మెండుగ పండించినారము – పుండరీకాక్షుని నామము ఈ పుడమి అంతట జల్లినారము ‘’
అంటూ తత్త్వం లో భక్తిసాధన వ్యవసాయం తో పోల్చి నిగూఢమైన వేదాంత రహస్యాన్ని బోధించాడు .
నాదనామ క్రియ –ఆటతాలం
‘’ఈ ఊరికిదే దారికదా గురురాయలు తెలిపినదదే కదా –దారికి ఎదురై మూడు శునకములు దాటుచు మిక్కిలి మొరిగే కదా –ఎక్కువైన ఏకాక్షరి కుక్కల కెదురుకొనీ మదమణచె గదా ‘’
గురు శిష్య సంవాదం –హిందూస్థానీ ఆటతాలం
శిష్యుడు –ఇలను సద్గురు సేవ చేసితే ఏమి ఫలితము గురువరా
గురువు-ఈ ధరను సద్గురు కృపను పరముకు దారిదొరకును శిష్యుడా
శి-పంచభూతములు ఏ స్థలమున సంచరించును గురువరా
గు-పంచభూతము లైదుగూడి ప్రపంచమాయను శిష్యుడా .
బాగా ప్రసిద్ధి చెందిన యడ్లవారి తత్త్వం –
సావేరి రాగం –ఆట తాళం
‘’ఏమి జన్మ౦బేమి జీవనమూ –ఈ మాయకాయము
ఏమి జన్మము మేమి శాశ్వత మేమి సౌఖ్య –మిదేమి నా ప్రారబ్ధకర్మము స్వామి నన్నిటు చేసి మరచెను .’’
మూడు భాగాలుగా ఉన్న యడ్ల రామదాసుగారి ‘’సుజ్ఞాన చంద్రిక ‘’లో నుంచి కొన్ని కీర్తనలు –
గీ-చతుర్వేదముల ఫలశృతి –మతి నిను దలంచి ,హితము మీరగ మోక్ష సతిని గూడి వ్రతము సలుపువాడు –అతడే పో ఆచలుండు –ధరను యడ్ల రామ దాస పోష .
‘’ముఖ్యమైనటు వంటి మోక్షమేదో దెలిపి మోక్షమొసగుమి వెంకటార్యా-‘’చక్కగా గురు సేవ సలుపు చుండు నీకు –సంప్రాప్తమవు రామ దాసా ‘
‘’సోహమెద్దియు వెంకటార్యా –అహం బ్రహ్మాస్మి యనునుచు –యజుర్వేదంబు దనరుచున్నది రామ దాసా ‘’
‘’ఆచలపరిపూర్ణ బ్రహ్మము –క్రమము నొందుట దెల్పుము వెంకటార్యా –పంచ దశాక్షరిని పరికించు –ద్వాదశాక్షర భావమది రామ దాసా ‘’
‘’వందనము నీకు గురువరా –చార్యమూర్తి –వందనము నీకు అక్షరాకార సూత్రి-వందనము సా౦ఖ్యతారక మనస్క జైత్రి –వందనము నీకు సదానంద మూర్తీ ‘’
‘’అనాదియగు విఘ్నపతిని –చోద్యమలర హృదయైక వేద్యు నచట పూజింతు విమలమతిని –రాజ్యమున రాజ యోగ –రాజ్యంబు నందు ‘’
‘’మ్రొక్కెద పద్మజు రాణికి –మ్రొక్కెద వాగీశ్వరికిని –మ్రొక్కెద మక్కువ తోడుత-గ్రక్కున మత్కావ్య సిద్ధి కలుగుటకై ‘’
కీర్తన -మోహన రాగం –ఆటతాలం
‘’ ఎందుబోయెద వి౦దురావయ్యా –శ్రీ లక్ష్మీ రమణా-పొందుగా నన్నేలు కోవయ్యా ‘’
యదుకుల కాంభోజి-ఆటతాలం
‘’ గరుడా వాహన పరంధామా –నన్ను కరుణించ రావే శ్రీరామా –నరుల బ్రోచే దొరవు నీవని స్మరణ జేసెద –పరమ పురుష .’’
మూడు భాగాల ఈ చంద్రిక కాకినాడ సుజన రంజని ముద్రాక్షర శాలలో 1898లో ముద్రింపబడింది .వెల –పావలా మాత్రమె .తత్వ వేత్త
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-21-ఉయ్యూరు