రాజ యోగి – శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ
రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ హిందీ లో ప్రేమ చంద్ లాగా తెలుగులో నిజం గా తెలుగు వారు .ఆయన శైలి కిసలయ కుసుమం .ఒక్క కఠిన పదం ఉన్నా సహించరు .జావళీలకు ,జట్కా సాహేబు వరుసలకు యతి ని తెలుగు గద్యం లో ప్రవేశ పెట్టిన ఘనులు .వ్రజ భాషాకవులు అంత్య ప్రాసను బాగా వాడారు .అది వారి జీవ లక్షణం .అలాగే శర్మ గారు ఆ ‘’తుక్ బందీ ‘’లేకుండా రచన చేయలేదు .వారికి లాక్షణికత కంటే సౌందర్య పిపాస ,రస లోలుపత ఎక్కువ . గాధా సప్త శతి లో ‘’సంకు ‘’అనే గ్రాంధిక పదం ఉంటె ‘’.సెంకు’’గా తెనిగించారు .అదీ యతి స్థానం లోనే వాడారు .ఆయన ప్రతి వాక్యమూ ఒక పల్లవి లాంటిదే .ఆయన వచనం లో సంగీతం ప్రాణం ..ప్రతి వ్యాసాన్ని కనీసం అయిదారు సార్లు సాఫు చేస్తే గాని తృప్తి చెందరు .శ్రవణ సుఖం లేని పదాన్ని వాడనే వాడరు .ప్రతివాక్యం అప్సరసగా తయారవ్వాల్సిందే .స్వతంత్రత ఆయన రచనలకు అలంకారం .లోకం ఎదురు తిరిగినా తన భావాన్ని మార్చుకోరు .నాచన సోమనకున్న ‘’నవీన గుణ సనాధథుడు ‘’అనే బిరుదు ఆయన భాషకే కాని భావానికి కాదని నిర్ద్వందం గా చెప్పారు .నాటకాలలో స్త్రీ పాత్రల్ని పురుషులు కూడా వేయ వచ్చు ‘’అన్నారు .బళ్ళారి రాఘవ కుదరదు అన్నా ‘’నా అభిప్రాయం అదే ‘’అని సభలోనే చెప్పారట శర్మాజీ .
హఠయోగం లో నిష్ణాతుడైన బిడారం కృష్ణప్ప శిష్యులై, రాజ యోగిగా మారి కర్నాటక ,ఆంద్ర దేశాల్లో వీర విహారం చేశారు .కన్నడ దేశం లో శర్మ గారికి సంస్కృత పండితుడి గా ,విమర్శకుడిగా పేరుంది కాని కవిగా ప్రసిద్ధుడు అని పించుకోలేదు .కాని గొప్ప గాయకుడి గా అక్కడ పేరుపొందారు .ఆయన సంగీతం అమృత ఖండం అన్నారు పుట్టపర్తి వారు .సాత్వికావేశం ఎక్కువ .స్వరాల్ని పెంచి పాండిత్యం చూపరు .ప్రక్క వాద్యాలపైకి విజ్రు౦భి౦పరు .శ్రోతలను ఈ లోకం లో ఉండేట్లు చేయరు .రస నాళిలను లలితంగా తాకి హాయి చేకూరుస్తారు .శర్మ గారి తో మాట్లాడటం ఒక సాహితీ విందు .మెదడులో ఉన్న పుస్తకాలన్నిటిని పరచి మన ముందు ఉంచుతారు .సరస సంభాషణా చతురులు .విసుగు ,అరుచి ఉండదు వింటుంటే .ఎదుటివారిని బహిరంగంగా ఖండించరు .సాను భూతి ఎక్కువ .ప్రతి పదాన్ని మంచి అభినయం తో,సంగీత జ్ఞానం తో చల్లని కమ్మని కంఠ స్వరం తో మనల్ని పరవశుల్ని చేస్తారు .కనుబొమలు నిలవవు .చేతుల్లో అతివేగంగా హస్తముద్రలు మారిపోతూ ఉంటాయి .చూసిన వారికీ ఈయన ‘’భరతాచార్యుడా “’అని పిస్తుందని అంటారు నారాయణా చార్యులు .
శర్మ గారు గద్యం తో ఒక శకాన్నే ఏర్పరచారు .కందుకూరి వారితో ప్రారంభమైన వచన రచన శర్మ గారితో భరత వాక్యం పలి కింది అన్నారు పుట్టపర్తి వారు. కొత్త పరికరాలతో కొత్త వస్తువులతో కొత్త శైలిని వచనం లో తెచ్చిన మహాను భావులు .పూల రధం వచ్చినట్లుంటుంది వారి వచన రచానా చమత్కారం .తిక్కన అంటే మహా ప్రాణం .శివ కవులను ఎక్కువగా ఆదరించారు.‘’తెలుగుకు ప్రత్యేక ఉనికి లేదా?సంస్కృతం వెంటఎందుకు పరిగెత్తాలి?’’అని ప్రశ్నించుకొని ,ప్రశ్నించి చక్కని తెలుగుకు జీవం పోశారు .ఆయన రచనలలో తిక్కన ,సోమన ,వేమన తొంగి చూస్తారు .శర్మ గారి రచనలన్నీ వ్రాసి చదివినవే .సభలో వ్రాసిన వ్యాసం లేకుండా ఎప్పుడూ ఉపన్యాసం చేయలేదాయన .తప్పు దొర్లుతుందో ,దారి తప్పుతామనో ఒక జంకు వారికి ఉండేదన్నారు ఆచార్య శ్రీ .ఆయన మనసు వీణా తంత్రి వంటిది .ముట్టుకోగానే రింగున మొగుతుందట .ఆగ్లంలో ‘’రాసిటీ ‘’వంటి మధుర భావుకుడు .ఆంధ్రలోకం లో అమృతాన్ని పంచారు .
శర్మ గారు మంచికవి .ఒకటే కావ్యం ‘’గాథా సప్త శతి ‘’అనే అనువాద కావ్యం రాశారు .కాని ‘’మహా కవి ‘’బిరుదు పొందారు .నూతన పదాల సృష్టిలో ఆయన అందె వేసిన చేయి .’’మగ సేత ,పరువమైన వయసు ,వలపు వేడి ప్రేమంపు చవులు ,సిగ్గు దెగిన వాడ ,మగడూర లేని దాన ‘’వంటివి ఎన్నో .ఒక్కో సారి ఒక పద్యం రాయటానికి నెల రోజులు పట్టేది .కళా రహస్యం తెలిసిన వారు కనుక చిత్రిక పట్టేవారు .విశ్వనాథ ‘’ఆంద్ర దేశం లో శర్మ గారి రచనలు చిరంజీవులు ‘’అన్నది నూటికి నూరు శాతం యదార్ధం అని ఆమోద ముద్ర వేశారు ఆచార్యుల వారు .శర్మ గారికి సంగీత ,సాహిత్యాలు వలచి వచ్చిన మహా భాగ్య శాలి .ఆయన కవిత్వం ఒక సంగీతం .ఆయన జీవితమే గానం అయింది .గద్య పద్యాలలో సంస్కారాన్ని కుప్పలు పోశారు. విమర్శకు ఆదర్శమై నిలిచారు .పండిత పామరులకు శర్మ గారి పేరు ‘’మంత్రం దండం ‘’అయింది .నేటి సాహితీ భూముల్లో శర్మ గారు జనకుని వంటి రాజ యోగి అని కితాబిచ్చారు నారాయాణాచార్య వర్యులు .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-21-ఉయ్యూరు