పారు వేట( పార్వేట )కథా సంగ్రహం
పారు వేట( పార్వేట )కథా సంగ్రహం అనే చిరుపోత్తాన్ని కర్నూలు జిల్లా వోర్వకల్లు శ్రీ కేశవస్వామి ఉత్సవాన్ని గురించి ,కావ్యంగా నిజాం ఇలాకా ఇల్లూరు గ్రామానికి చెందిన శ్రీ అప్పకవి గారు వ్రాయగా కర్నూలు కు చెందిన శ్రీ గుంతా సుబ్బన్న శ్రేష్టి గారు 1918లో కర్నూలు శ్రీ చంద్ర మౌళీశ్వరి ప్రెస్ లో ప్రచురించారు .వెల ఎంతో రాయలేదు .
అసలు ఇంతకీ పారు వేట అంటే ఏమిటి ?దేవోత్సవం .దేవుడి తిరునాళ్ళ లో చివరి రోజున దేవుడు గుర్రం వాహనం పై ఊరిలోని జనం బయటకు వెళ్లి వేటాడి నట్లు ఆడే ఆట .వ్యభిచారించటానికి తిరగటం అనే అర్ధమూ ఉంది .పందెపు వేట అనే అర్ధమూ కనిపిస్తోంది .దేవుడి ఉత్సవాలలో ఒక గూటానికి పొట్టేలు నుకట్టి దూరం నుంచి తుపాకితో గురి తప్పకుండా కాల్చిన వాడికి ఆపోటేలు ను ఇవ్వటంరివాజు .దసరాలలో విజయ దశమినాడు రాజు లేక జమీందారు మొదలైనవారు జమ్మి చెట్టు కొమ్మను కొట్టటానికి వెళ్ళటాన్ని పార్వేట ఉత్సవం అంటారు .ఈ కావ్యం లో కవిగారు వోర్వకల్లు శ్రీ కేశవస్వామి ఉత్సవాల పారువేట విషయాన్ని వర్ణించి చెప్పాడు .
కవి ముందుగా ఒక సంస్కృత శ్లోకం లో కేశవస్వామిని –
‘’శ్రీ కాంతా కుఛ కుంభ కుంకుమ లసద్భక్త ప్రదేశం సదా –ధ్యాయేత్ఫుల్ల సరోజ పత్ర నయనం బ్రహ్మాండ భాండోదరం-సాకారి ప్రముఖాఖిలామర భ్రాజత్కిరీటప్రభా –భాస్వత్వత్పద మోర్వ కంటి నగరీ శ్రీ కేశవ స్వామినం ‘’ అంటూ స్తుతించాడు .తర్వాత ద్విపదలో ‘’శ్రీమించు కందనూల్ శీమ లోపలను –శ్రీ రమణికి ఇల్లయి చనునట్టి –ఘనమైన వోర్వకంటి పట్టణమును –అనుదినంబు బ్రోచు న౦బు జోదరుడు-కందర్ప సుందరాకారుడచ్యుతుడు-శ్రీ కేశవ స్వామి శృంగారముగను -ప్రాకట వన విహారము సల్పబూని ‘’అని మొదలుపెట్టాడు ఉత్సవాన్ని .తర్వాత కేశవస్వామి అలంకార వైభవాన్ని కన్నులపండువుగా వర్ణించి –‘’రంగుగా గరుడ తురంగ౦బు నెక్కి –కరమొప్ప శ౦ఖు చక్రములు నందకము –గడి మీరుచునుండు కౌమోదకియును-సరభసంబుగశాజ్న చాపసాయకము ‘’లతో గరుడ యక్ష కిన్నెర ఉరగ,సుర వసువు లాదిగా వెంటరాగా ,సూత్రధారులు ‘’అంగ కలింగ మహారాష్ట్ర ,లాట .బంగాల వంగ నేపళ,సౌవీర సౌర ,విదర్భ పా౦చాలాంధ్ర’’భూపతులతో .కరితురగ రధాదులతో ,నటవిట గాయక ,ప్రధానులతో ,గాలవ కశ్యప గాధేయ వాలఖిల్యాది మునులు దీవించగా పున్నాగ సౌరాష్ట్ర సురటి ,మోహన కన్నడ గౌడ,శ్రీకల్యాణి రాగ ఝరులు నిండగా ,సరిగమ పదనిస్వరయుక్తంగా ,మద్దెల తాళ గతులు వేశ్య సుందరులు పాడుతూ ఉంటె ,పతాక త్రిపతాక అర్ధ చంద్ర కర కర్తరీ ముఖ కటక మొదలైన ముద్రలతో హస్తాలు అభినయిస్తూ ఇంపుగా నాట్యాలు చేస్తూ ,మేదినీ నాధుడు పట్టణం దాటి –ఘనసార కేతకీ ఖర్జూర ని౦బపనస ద్రాక్ష పాటలాశోక,అశ్వర్ధ చంపక వకుళ మొదలైన ఫల పుష్పజాతులు ఉన్న అరణ్యానికి ‘’కలహంస ,సారసకలరవాకీర్ణ మైన కాసారాలు చూస్తూ ,పంకజ మారండ మత్తాళి సంరంభం గమనిస్తూ ,కొంచెం సేపు విశ్రమిస్తూ ప్రయాణం సాగించాడు .
ధనుస్సుతో బాణ సంధానం చేసి వనమృగాలను వేటాడుతూఉంటె విలాసంగా లక్ష్మీ దేవి దగ్గరకు చెలికత్తెలు వచ్చి ఆమెతో ఏమి చెప్పారో ‘’చణుకు’’లో ఇలాచేప్పించాడు కవి –‘’వెలది మేమేమాని వివరింతుమమ్మా –నీ చెలువూని హోయలెట్లు తెలియవలేనమ్మా ‘’సందేహాలు తీర్చటానికి మేమెంతటివారం అన్నారు .ఆమె కనుగవ కెందోయి దోపగా ఆమెకూడా చెణుకు లోనే భైరవి రాగం లో –‘’మోసమాయే గద వమ్మా –ఎందుకోసమో కాని రాడమ్మా-మాట మీరనివాడూ మొగమాటం లేనివాడూ –బూటకాడు –మృగయా వినోదమంచు –కనుమాటి పోయే ‘’అని బాధపడుతుంది .
తిరుమంగ ఆల్వారును పిలిపించి ‘’పొండు మీరిపుడుపుండరీకాక్షు వంచన జేసి ద్రవ్యము గొని రండు ‘’అని చెప్పగా ఆమె ఆజ్ఞతో బయల్దేరి అడవిలోని చుంచు వాళ్ళన౦దర్నీ పిలిపించగా ‘’చికిలి నాయుడు చిన్నకుమారుడు,సింగడు వోబులపతి చినమొదలైన నాయకులు గోచులు బిగించి ముందుకువచ్చి ఆల్వారుగారికి నమస్కరించి ఆయన చెప్పింది విని ‘’చక్రి చిహ్నములు –కనుపడ కుండగా గైకొని వచ్చి పేరైన సొమ్ములు వేర్వేరుగాను –శ్రీ రమాదేవికి అర్పించి రావేళ’’
అప్పుడు శౌరి వనవిహారం చాలించి కాసేపు విశ్రమించగా ,క్విష్వక్సేనుడు సేనుడు సైన్యమంతా పరికించి ఆభరణాలు కనబడక పోవటం తో స్వామి చెంత చేరి ‘’స్వామిపరాకు హెచ్చరిక ఈ వేళ-‘అంటూ బరాబరులు చేసి ఎవరో కన్నుగప్పి ద్రవ్యమంతా అపహరించుకు పోయారని చావు కబురు చల్లగా విన్న వించాడు .కేశవస్వామి కూడా విహ్వలుడై వెతికి పట్టుకొమ్మని ఆనతివ్వగా ,జాడలన్నీ వెదుకుతూ సొమ్ములు దొరికి ‘’కంటిమి పొడగంటిమి -తుంట విల్తుని గన్న డంట యైన తమ్మికంటి సొమ్ములు జాడ ‘’అని చణుకులో అంటూ జాడల ను బట్టి కదిలి ‘’శ్రీ రమామణి ఇంటికి ‘’వచ్చి సొమ్ములు ఇక్కడే ఉన్నాయి లోపలి వెళ్లి తీసుకొంటాము అంటే లక్ష్మీదేవి ఖబడ్దార్ జాగ్రత్త అంటే గుడ్ల నీరు కుక్కుకొంటూ చేసేదిలేక శౌరికి చెప్పటానికి వెళ్ళిపోయారు
కేశవ స్వామి ఆ ఆడది ఎలాంటిదో తెలుసుకోవాలని చూర్నిక లో ఒక లేఖ రాయించాడు –‘’శ్రీమదఖిల గురు ద్విదళన పాటవ శతకోటి ధర తరుణీప్రముఖ సుర సుందరీ నికార —-‘’జలరుహ సేడనే యుష్మత్పరి చారకః-సకలాభరణ ప్రముఖ వస్తూని గృహీత్వా – త్వచ్చిద్ధాంతముప విష్టాః-‘’అంటూ ఆద్రవ్యాన్ని వెంటనే తెచ్చివ్వమని హుకుం పంపాడు .దీనికి సమాధానంగా లక్ష్మీదేవి కూడా చూర్నికలోనే ‘’శ్రీమత్కామల సంభవ భావా ఖండలాది నిలింప నికర మస్తకన్య స్తహాటక కోటీర సంధానిత మందార ప్రసూనమాలికా మకరంద బిందుధారా –‘’అంటూ గీర్వాణ౦ లోనే ‘’చన్న కేశవా రాయా త్వదీయ పత్రికాభిప్రాయం హృద్గత మామ జైతు-ఏతత్కార్యం మయాజజ్ఞాతవ్యంకుత భవతి-తత్రైవ విచార ణియ్య ‘’అని గడుసు సమాధానం రాసింది .
వెంటనే ద్వారపాలులను తలుపులు మూసేయ్యమన్నది .కిటుకు గ్రహించిన కేశవుడు అమ్మవారి భవనం దగ్గరకొచ్చి తోడిరాగం చణుకు తో ‘’వారిజ నేత్రి కవాటము మూసినకారణమేమో చప్పవే భామా ‘’అనగా లక్ష్మీదేవి ‘’ కారణమడిగెదవు నీ పేరేమిటో చెప్పవోయి కృష్ణా ‘’అన్నది .తాను మాధవుడనని తనతో పరచికాలేమిటని అన్నాడు .వసంతుడవైతే తరు రంజన చెయ్యమని కోరింది .వసంతుడినికాను చక్రిని నీవాడినే ‘’అన్నాడు .కుమ్మరివాడవైతే కుండలు చెయ్యి అంది .హరినే ముద్దులగుమ్మా అనగా ‘’హరివైతే బాగాయనట్ట యితే –నరుడుగా గంతులు వేయు కృష్ణా ‘’అంది .ధరణీ ధరుడనే కొమ్మా అన్నాడు అయితే వాల్మీకం లో దూరవోయి ‘’అన్నది .పామునుకాను పాముల రాజు మదం అణచే వాడినే అన్నాడు .విహ౦గ పతివైతే ఆకాశం లో గింగిరాలు కొట్టు ఫో అంది .’’కీరవాణి ఖగపతి నేగానే వోర్వ క౦టీశుడనే’’అనగా ‘’పరనారీచిహ్నాలు కనిపిస్తున్నాయేమిటి సామీ అంది .దిగొచ్చిన కేశవుడు ‘’నానేరమేమో చెపుమా ‘’అని బామాలాడు .నీతో వాదాలేమిటి కొంటె కిట్టయ్యా ఫోఫో అంది .
అప్పుడు కేశవస్వామి ‘’ఎప్పుడూ లేని వింత ఇప్పుడు కలిగినదే చింత .పోలయలుకలు మాని పొందుమీ నన్నూ ‘’అన్నాడు ..నీ మెరమెచ్చుమాటలు చాలు అక్కడికే పో నాతొ పనేమిటి అనగా ‘’నిన్ను విడిచి అన్యమెరుగని వాడను ‘’అంటే శ్రీరాగం లో ఆమె ‘’పోరా చక్కని సామిగా –పోరా ఊరూ వాకంటి విహారా శ్రీ చన్నరాయా ‘’అంటూ కాసేపు మేలమాడుకొన్నారు .కేశవుడు అష్టపద్యార్ధం లో ‘’అందము మీరగా వనవిహారము సల్పు చుండ కస్తూరి అ౦టుకొందికాని స్త్రీలకాటుక కాదన్నాడు .లక్ష్మి రేగుప్తి రాగం లో ‘’సుందరరూప ఏచందన గ౦ధిని లీలతోకౌగ లింలచు కొన్నావో ‘’అని ప్రశ్నిస్తే ,ఆయన సీసార్ధం లో ‘’వట్టి నిందలు పలకటం న్యాయం కాదు ‘’అనగా ఆమె తగ్గేదేలే అన్నట్లు ‘’మళ్ళీ ఏకటం మొదలు పెడితే లెంపలేసుకొని సమాధానాలు చెప్పాడు .ద్విపదార్ధాలతో ఇద్దరూ తగువు పెంచుకుంటూ పోయారు .ఆయనకూడా ఆమెకు లక్ష్మి ‘’యాలాలు ‘’లో’’ మల్లెపోదల్లో తిరుగుతుంటే వాటి వాసన పట్టుకున్నది తనకు అంది .
లక్ష్మికి సమాధానం చెప్పలేక ‘’ఎన్ని విధముల వేడినాగానీ మానినీ మణి ప్రమాణ మంటేని –పామునైనాను చేత బట్టెద నింక ‘’అన్నాడుపాపం .ఆమె ఊరుకొంటు౦దా ‘’పాముమీద పవళించు వాడికి పాముకాటు లెక్కలోనిదే ‘’అంది వెటకారంగా .అగ్ని చేతులో పట్టుకోమంటావా అంటే ‘’ భగభగమందు దిక్కులా –పోగలలెగయు దావానలంబు పొందిక చాతాన్ –దిగమ్రింగు వాని కనలము ‘’పట్టుకోవటం వింతేమీ కాదు ఫో అంది .
లక్ష్మి కందపద్యం లో నామీద ప్రేమ ఉంటె ‘’బాకేత్వము బల్కి రమ్ము పంకజ నాభా ‘’అనగా ఆయన ‘’బాకేత్వ మీయనేరనే –నా కోడలుగాదే వాణినామాట లలన్ .నాకొరకే దీర్చు భామ నయగుణ ధామా ‘’అని అనునయంగా పలుకగా మళ్ళీ కందంలో అందంగా కవి –‘’భేరీనాదము భాభా భూరీ విభవయవన సతుల బొడగన బూబూ – చీరు లరుగగగానభీభీ –అరయంగా గొల్లవారలందురు బేబే ‘’అని మంగళం పాడాడు .
దీనికి ఫినిషింగ్ టచ్ గా బాలకవి శతావధాని ,దోమా వెంకటస్వామి గుప్త గారు నాటి రాగం ఆది తాళం లో –
‘’జయమంగళం హయరాజముఖ –భయవార శూరా- న్వయనాథ దేవా –జయ భక్తానుకూల –పరమార్ధ లోల –యుక్తి ప్రపాల సూక్తి సుశీల –కరిరాజు నాడు మొర లిడవిని –యరమరబాపి-నావయ్య శ్రీశ –ధరనోరుగంటిపుర కేశవేశ –వరబాలకవి వెంకయాఖ్య నుత జయమంగళం ‘’
20పేజీల పార్వేట కథా సంగ్రహం ఇది.తమాషాగా గిల్లికజ్జాలు లా చిలిపి సంభాషణల్లా ,ఎందుకోననుకొంటి గోంగూరకి పాటలా సరదాగా తనకున్న సంస్కృత ఆంద్ర పాండిత్యాన్ని సంగీతాన్నీ గుది గుచ్చిఅప్ప కవి లోకానికి అందించాడు ఈకావ్యమూ, ఈకవీ కూడా లోకానికి పట్టినట్లులేదు .పరిచయం చేసే భాగ్యం నాకు కలిగినందుకు ఆనందంగా ఉంది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-8-21-ఉయ్యూరు .