సిద్ధ యోగుల సిద్ధ గుటిక

సిద్ధ యోగుల సిద్ధ గుటిక .

 సరసభారతి ఆస్థానకవులు మాrపూర్తి  చేసి ,ఇప్పుడే ఆపుస్తకం చదివాను .నిజంగా సిద్ధ ఘుటిక అనిపించింది .ఆచార్యులవారి పాండిత్యానికి,వైదుష్యానికి  బహుకావ్యాను శీలానికి ,తానూ సిద్ధహస్తులైన పద్యకవిత్వానికి ,తన బహు శాస్త్ర పరిచయానికి ,అధ్యన శీలత్వానికి ,బహుకాల తెనుగు బోధనాపటిమకు  అద్దంపట్టిన రచన . 2019డిసెంబర్ లో మేముఒంటి మిట్ట యాత్ర చేసినప్పుడు తిరుగు ప్రయాణం లో  బ్రహ్మం గారి మఠం  దర్శించాము.పాశ్చాత్యులకు ‘’నోస్టర్ డాం’’ఎలాంటివాడో మనకు వీరబ్రహ్మం గారు అలాంటివారు .అంతకంటే ఎక్కువైన వారుకూడా .సంఘం లో ఉన్న దురాచారాల్ని ఎత్తి చూసి సంస్కరించే ప్రయత్నాలు చేస్తే ఈ సమాజం ఆయన భావాలను జీర్ణించుకోలేక కూడా గుడ్డ కనీసం నీరు కూడా దక్కకుండా   బహిష్కరిస్తే ,ఒక్కరాత్రిలో మహా సంకల్పం తో చిన్నకొమ్ముతో  తెల్లారేటప్పటికి బావిని త్రవ్విన సంకల్ప సిద్ధుడు .ఆ బావి నీరు ఎండిపోవటం జరగనే జరగదు .ఆ నీటి రుచి అమృతం ఆయన సిద్ధ వాక్కుల్లాగానే  . ఈ పుస్తకం లో బ్రహ్మంగారు సిద్దయ్యకు చెప్పిన 55పద్యాలున్నాయి .55 వ సంఖ్యకు ప్రాముఖ్యమున్నది. దాన్ని దేవతా సంఖ్య అంటారు .అంతేకాక దైవ సందేశం ఇచ్చే సంఖ్యగా భావిస్తారు .జీవితం లో ఉత్తమ స్థాయి మార్పు సాధించటానికి ఈ సంఖ్య చిహ్నం .కొత్త అనుభూతులకు అనుభవాలకు నాంది పలుకుతుంది .గతి౦చిన దాన్ని మర్చిపోయి ఉజ్వల జీవిత పరమార్ధాన్ని సాధించటానికి తొలి మెట్టుగా ఉపయోగ పడుతుంది .అందుకే వీటిని విని సిద్దయ్య గురువు అంతటి విశిష్ట వ్యక్తిగా పరిణామం చెందాడు .కనుకనే 55పద్యాలు తీసుకొన్నారేమో? .చదివిన వార౦దరికి  అలాంటి ఆధ్యాత్మికానుభూతి కలగాలని ఆచార్యులవారి అభిమతం అయి ఉంటుంది . పుల్లయ్య తాతగారు అనే శ్రీశ్రీ తుమ్మోజు పురుషోత్తమానందస్వామి గారి అనుజుడు అపరధన్వంతరి  బ్రహ్మయ చార్యులవారి పౌత్రుడే ఈ పద్యాలకు వ్యాఖ్యానం రాసిన మన రామ లక్ష్మణాచార్యులు .

  ఇందులో ముందుగా కవిత్వం ,కవి, కావ్యం లపై గొప్పపద్యాలున్నాయి .తర్వాత గురువు విషయం పై విశేషాలు ఆతర్వాతసన్యాసం యోగాలు వాటి రహస్యాల విచారణలో పద్యాలున్నాయి అన్నీ రస గుళికలే .వ్యాఖ్యానం చేయటానికి కవి పండితుడు విమర్శకవిశ్లేషకుడు అయిన ఆచార్యుల వారికి చేతి నిండా పని  దొరికి అత్యంత సమర్ధంగా సంతృప్తిగా వ్యాఖ్యానాలు చేశారు .మాన్యులనుంచి సామాన్యులదాకా ఆకర్షించే వ్యాఖ్యానం ఇది .ఎన్నెన్నో విషయాలు త్రవ్వి తీసి ,పూస గుచ్చినట్లుగా వివరించారు .అపారమైన ఆయన జ్ఞాన విజ్ఞాన ప్రకాశం మనకు జ్యోతకమౌతుంది .బ్రహ్మ౦గారి భావాల పసిడికి ఆచార్యులవారి భాష్యం తావిని చేకూర్చింది .సరళ సుందరమైన తెనుగు పండింది .అరచేతిలో వేదాంత సంపద నిలిపారని పిస్తుంది ..అన్నీ అన్నే .కొన్ని రసపట్లు మాత్రమె మీముందు ఉంచుతున్నాను .

  ‘’శ్రీకరముగా శివకవులకు –ప్రాకటముగ  భక్తులకును భావజ్ఞులకున్-లోకములోన వెల్గు నిరా –కారంమ్మునకు ,శరణమనరా సిద్దా ‘’అనే బ్రహ్మంగారి మొదటిపద్యానికి –శివకవులు అంటే సోమనాథాదులు మాత్రమేకాదు నిరంతర భగవద్భక్తి కలిగిన వారు.భగత్ తత్వాన్ని తెలుసుకొన్నవారే భావజ్ఞులు .లోకం లో ప్రకాశించే నిరాకార భగవంతుని శరణు వేడాలి అంటే జనతా జనార్దనుడిని గుర్తించాలి అని చక్కని భావం చెప్పారు .గొప్పపా౦డిత్యం నైపుణ్యం ఉన్నవాడే కవి .కావ్యపుత్రిక కన్యలాగా ఆకర్షించాలి .కవిత్వం లో మాయ సృష్టి ఉండరాదు ప్రపంచ జనులమెప్పు పొందే కవిత్వమే రాయాలి .మెస్మరిజం తాత్కాలికమే .’’పట్టు లేనికవిత భజియి౦ప రాదయా –పట్టు దివ్య గురుని పదముకవిత ‘’పద్యం లో బిగువు, సారవంతమైన కవిత్వమే శ్రేష్టం .విత్తాపహరునికాని చిటత్తాపహరుడైన గురుని పాదాలే పట్టుకోవాలి అని హెచ్చరిక చేశారు .తత్వ జ్ఞానం కలిగించే యోగ విద్యనూ బోధించేవారు జ్ఞానకవులు .కవికి మయబ్రహ్మకు అభేదం చెప్పారు బ్రహ్మగారు .మయబ్రహ్మ అంటే విశ్వాన్ని శిల్పించే పరబ్రహ్మమే .కవి పక్షిలాగా తిరుగుతూ ప్రపంచ దర్శన౦ చేస్తూ  కవిత్వం ఉన్న చలమలను కనిపెట్టి రాయాలి .అంటే కవితాభావన అంతగా కలగనివస్తువుల్ని చూసినప్పుడు కూడా కవితా వేశం పొందేవాడే కవి అని మంచి వ్యాఖ్యానం చేశారు  .కవి నిబద్ధతకు కళ్ళు ,వాక్కు నిబద్ధతకు పరులు ,ధర్మ నిబద్ధతకు దైవం సాక్షులు . తన నిబద్ధత కు లోకమే సాక్షి అన్నారు .గురు శుశ్రూష చేసి విద్యనభ్యసించే శిష్యులలో తానె ఉత్తముడను రవ్వ అంటే వజ్రం లాంటి కవుల పాద రజస్సు తానని అత్యంత వినయంగా ప్రకటించుకొన్నారు వీర బ్రహ్మేంద్రస్వామి .రవకవులు అంటే సామాన్యకవులు రసకవులకు తీసికట్టు .కవిత్వం రెండురకాలు ఒకటి ద్రవించి కాలం లో కలిసిపోతుంది .రెండు శాశ్వతంగా ఉండేది ధన్యత్వమైన కవిత్వం అని సిద్దయ్యకు గురుబ్రహ్మం ఉపదేశించారు .

  గురువుల గురించి చెబుతూ –‘’కృతి వాక్యము విని చూడరో –సతతంబెజాతి యైన సద్గురు సేవన్ –గతి గాంచు బ్రాహ్మణోత్తము–శ్రుతివటవృక్షమ్ము  బ్రహ్మ రూపము సిద్ధా ‘’

గురువు ఏజాతి కులానికి చెందినా ఉత్తముడైతే సేవించి జ్ఞానం పొందాలి.వటవృక్షం అంటే రావి చెట్టూ మర్రి చెట్టు అనే రెండు అర్ధాలున్నాయని ,శ్రుతి అంటే మర్రి చెట్టే అనీ ఊడలతో విస్తృతంగా విస్తరించే లక్షణం దానికే ఉందని గొప్ప వ్యాఖ్యానం చేశారు .వృక్షమే బ్రహ్మం. దాన్ని తెలుసుకోన్నవాడే ముక్తుడు అన్నారు .శిష్యుడు గురువు యొక్క గురుభావాన్ని అంటే శ్రేష్టత్వాన్నితెలుసుకోవాలి .గురుని దృష్టి ఎరుగు గురుని గురుడు ‘’అంటే ఏకాగ్రత చిత్త శుద్ధి ,మనో నిశ్చలత్వం గురువు యొక్క గురువు తెలుసుకొంటాడని భావం .ఉత్తమగురువు నాతోసమానం ,ఆయన నన్ను చూస్తాడు నేను ఆయన్ను చూడగలను అన్నారు బ్రహ్మగారు గుర్వాజ్ఞను పాటించే శిష్యుని ఏ శత్రువు తాకలేడు.కామక్రోధాది ఆరుగురు శత్రువుల శిఖలను కత్తిరించి సద్గురువు వారి భయాలను పోగొడతాడు .

  ఆతర్వాత రాజయోగం గురించి చెప్పారు –‘’అంతరంగమందు అమనస్కుడై యున్న –చింత గురుని మీద చిక్కి యున్న –పగఱు శిష్యు ముందు భంగమై పొయ్యేరు –భావమెరుగరేని  భ్రమలు సిద్ధ .’’సాంఖ్యతారక అమనస్క యోగాలతో కూడి ఉన్నదేరాజయోగం .ఇది ముక్తికి రాజమార్గం అన్నారు సీతారామా౦జ నేయసంవాదం  కర్తశ్రీ పరశురామపంతుల లింగమూర్తి గురుమూర్తిగారు  .అంతఃకరణ శుద్ధికలిగిచేది తారకం అయితే ,ఆత్మస్వరూపాన్ని తెలిపేదిసాంఖ్యం,అనుభవ జ్ఞానం తో కలిసింది అమనస్కం .మనసు భగవంతుడిపై లగ్నం చేసినవాడు అమనస్కుడు .గురు కృపతో అమనస్కం దాకావచ్చి రాజయోగాన్ని అనుభవం లోకి తెచ్చుకోనివాడు భ్రమలోనే ఉంటాడు .పరబ్రహ్మను తెలుసుకోలేడు అని వివరణాత్మకమైన విశ్లేషణ చేశారు ఆచార్య శ్రీ .

  సముద్రాలు ఈదచ్చు సప్త కులపర్వతాలను ఎగరేసి పట్టుకోవచ్చు కానీ ,తనలోని ఈశ్వరుని దర్శించటం మాత్రం అసాధ్యం .’’పలికెడు పలుకులు పలుకై –పలుకులలో నుండు నాతడు బ్రహ్మము తానై –వెలుగుచు వెలుగుల వెలుగై –వెలుగులలో నుండు నాతడు వెలుగౌ .

   మధుర సుందర సురుచిర తెలుగు పదాలతో గహన వేదాంత రహస్యాన్ని సులభంగా చేతి వెన్నముద్దగా అందించిన వీరబ్రహ్మ యోగేద్ర కవీన్ద్రులకు కైమోడ్పు .మన మాటలలోనే ఉన్న శబ్ద బ్రహ్మమే వేద మంత్రాలలోనూ ఉంది అదే .సూర్య చంద్రులకు దిక్కు. ఆజ్యోతే ముక్తి మార్గం చూపే వెలుగు అన్న ఆచార్యులవారి వ్యాఖ్యానం భేష్ .సర్వం తానె అని గ్రహించి సంసారం చేయటమే రాజయోగం .

  మిగిలిన లోక వ్యవహారాలనూ కవిత్వం లో రంగరించి బ్రహ్మం గారు చెప్పారు –

‘’తల్లియు కూతురు  చెల్లెలు –ఇల్లాలి యున్న భావమెరుగక తిరిగే –వల్లడిగానికి మోక్షము –కొల్లలుగా  నెటులు దొరకు  సిద్దా ‘’

మనం తరచుగా కార్యేషు దాసీ శ్లోకం ఉదాహరిస్తాం .భార్యకు ఆరు బాధ్యతలు అని గుర్తు చేస్తాం .దాన్నే పద్యం లో ఇమిడ్చి చెప్పారు .వివాహ విధానం లో ఢర్మశాస్త్రాలలో ఎనిమిదేళ్ళ పిల్ల కన్య అయి వివాహానికి సిద్ధం  ఆరేళ్ళ ప్పుడే ఆమెకు చంద్రుడు ఆతర్వాత గంధర్వులు పిమ్మట అగ్ని ఆమెను అనుభవిస్తారు .ఇంతమంది ఎంగిలి చేసిన అమ్మాయిని పెళ్ళాడి తనకే స్వంతమనుకోవటం అజ్ఞానం కాదా అని బ్రహ్మం గారి ప్రశ్న .ఇలా ఆలోచిస్తే లోకం లో ఏ కన్యనూ ఎవరూ పెళ్లి చేసుకోరు.ఇదొక పారడాక్స్ లోకం లో .అలాగే ఆకలి చంపుకొని   ,అడవుల్లో ఉంటూ ఉన్నవారికి మోక్షం ఎలావస్తుంది .ఆకులు తినే మేకలు మోక్షాన్ని పొండదుతాయా అని ఎద్దేవా చేశారు పరమగురుబ్రహ్మం గారు .

  తర్వాత సన్యాసుల పని పట్టారు ‘’కన్యలతో భ్రాంతి నొంది కామాన్ధకులై ‘’న సన్యాసులు  ముక్తి సాధన ఎందుకు అని ప్రశ్నించారు .తనలో తన్నేరుగు వారు ధన్యులుసిద్దా ‘’అని తేలిక చిట్కా చెప్పారు .దీనికి –‘’ఖేచరి యొక్కటేసత్యము –లోచనముల దృష్టినిలిపి లో జూచిన తా –తోచును వింతలు  భువిలో –నాచారము గలదు ముద్ర లైదుర సిద్ధా ‘’ యోగముద్రలలోని అయిదు  ముద్రలలో ఖేచరి ముద్రొకటి .అంటే ఆకాశం లో చరి౦చెది. దహరాకాశం లో పరం జ్యోతి దర్శనం చెయ్యాలి .లోచూపుతో సాధకుడు హృదయాకాశం లో దృష్టి నిలిపితే కనిపించే చిత్కళ దర్శనం తో ముక్తి పొందేవిధానం బోధించారిక్కడ –‘’గుండ్లను ద్రిప్పిన పువ్వుల –చెండ్లును చుక్కలును శశియు చిత్కళ లనగా –కండ్లకు నడుమును నావల –గుండ్లను దాటినను ముక్తి కుదరదు సిద్ధా ‘’అంటే కను గ్రుడ్లను తిప్పటం అంటే తారక అనగా నల్ల గ్రుడ్లను భ్రూ మద్యం వైపు తిప్పి చూస్తూ, మనసును ఆజ్ఞా చక్ర లోకి మళ్ళించి చూడాలి .అప్పుడు మెరుపు తీగలకాంతులు ,మిణుగురులకాంతులు నానా రత్నకాంతుల్లాగా అవి సూర్యకాంతి వంటి తేజస్సుతో కనిపిస్తాయి .పది రకాల నాదాలు వినిపిస్తాయి .ఇదే నాద యోగం .నాద బిందు కళాదర్శనం లో ఆకలీ దప్పిక ఉండవు .తానె బ్రహ్మం అనే స్థితిపొంది బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు .అదే ముక్తి .వీటి వివరణలో ఆచార్యులవారుతీసుకొన్న శ్రమ అత్యంత శ్లాఘనీయం .కరతలామలకం చేశారు .

 ‘’నూతియు తుదనొక నాతియు –నాతికి తుదనొక్క కోతి నయమగు భాతిన్ –నాతికికోతికి నావల –జ్యోతికి పై నుండుశివుడు చూడర సిద్ధా ‘’  అనే మార్మిక అంటే మిస్టిక్ పద్యం లో బ్రహ్మంగారు తత్వాన్ని ప్రాస కవితాత్మకంగా చెప్పారు .నుయ్యి నరకం. నాతిస్వర్గం .కోతిమనసు ,జ్యోతి పరబ్రహ్మకు సంకేతాలు .నరకకూపంలో పడకుండా ఉంటేనే స్వర్గం అనే స్త్రీ దొరుకుతుంది .పుణ్యఫలం ఖర్చవగానే మళ్ళీ పుట్టుక మరణం కనుక అది శాశ్వతం కాదు దానికి పైనున్నదే జ్యోతి .అక్కడికి చేరుకోవటం మానవుని గమ్యం .మరో పద్యం లో –‘’తానెవ్వరు నేనెవ్వరు –తానె నేనాయే పంచ తత్వము లందున్ –తాననుచు జీవ కళలను –తానె తానాయె బ్రహ్మ తత్వము సిద్ధా ‘’పరబ్రహ్మ జీవిలో ఆత్మ అయ్యాడు .ప్రళయం లో విశ్వకర్మ సర్వజగత్ సంహార హోమకర్తయై తనలో లయం చేసుకొంటాడు .సృష్టికాలం లో మళ్ళీ ప్రాణుల్ని సృష్టించి వారి హృదయాలలో ప్రవేశిస్తాడు (అవరాన్ అవి వేశ )ఇదే తానె నేనై నేనే తానై ,తానె తానైన అద్వైతభావన  .బ్రహ్మగారు కమ్మని తెలుగుపద పద్యం లో అంతటి భావాన్నీ వెన్నముద్ద చేసి అందిస్తే ఆ మనోహర భావాన్నిశ్రుతి స్మృతి పురాణాల వివేచనతో ఆచార్యులవారు మనకు అందించి ధన్యులయ్యారు

 మరోమిస్టిక్ పోయెం లో –‘’మూడవ దినమందగ్నికి –చేడియ సతియాయే ననుచు చేబట్ట గదా –గూడె మును పెండ్లికొడుకని –చూడ నరులకియ్యది బ్రహ్మ సూత్రము సిద్దా ‘’

  మూడవ రోజు కన్యను అగ్నికిస్తే అతడూ పెళ్లి కొడుకే అని కన్య అతడిని కలుస్తుంది .ఇదే నరులకు బ్రహ్మ సూత్రం అంటారు బ్రహ్మంగారు .సోముడు మనస్సుకు ,గంధర్వుడు రాజోగుణానికి,అగ్ని తమో గునణానికీ సంకేతాలు .త్రిగుణాలను అణచి   నిశ్చలలమనస్సుతో ధ్యానం చేస్తే ముక్తికాంత స్వంతమౌతుంది లేకపోతె దక్కీ దక్కనట్లు దోబోచులాడుతుందని అర్ధం గా  వ్యాఖ్యానకర్త వివరించారు .ఈ సూత్రం తెలియకపోతే ఎంత చదివినా ‘’తమలో వాసించి యున్న త్రిజగ – ,ద్భానుని గానరైరి మాయపాలై సిద్ధా ‘’శాస్త్రాలు చదివితే మాయ తొలగిపోదు .మాయ ఆవరి౦చి ఉంటే లోపలి పరతత్వాన్ని చూడలేరు .కనుక సద్గురు ఆశ్రయం తో సద్గ్రంధ పఠనం తో జ్ఞానం పొందాలి అని సూచన .చివరి 55 వ పద్యం –

‘’అంతా బ్రహ్మమయం బని –సంతసమున తిరుగు వారు సర్వజ్ఞులు శ్రీ –కాంతుని కృపచే వారికి –చింతలు లేవయ్యెయోగ సిద్ధులు సిద్ధా ‘’

ప్రపంచమంతా బ్రహ్మ తో నిండి ఉందని తెలుసుకొన్నవారికి అప్రమేయ ఆనందం లభిస్తుంది .ఇది తెలిసినవాడు బ్రహ్మే తానూ అవుతాడు. ఇదే సర్వజ్ఞత్వం. అతడే యోగ సిద్ధుడు లక్ష్మీకా౦తుడు అంటే మోక్షలక్ష్మికి అధిపతి .ఈవిధంగా అందరూ సిద్ధులు కావటానికి శ్రీమద్విరాట్ పోతులూరి వీర  బ్రహ్మేంద్ర స్వామి శిష్యుడు సిద్ధయ్యకు  చెప్పినట్లుగా అందరికీ జ్ఞాన బోధ చేశారు .బ్రహ్మం గారి తత్వాలు లోకం లో బాగా ప్రచారం లో ఉన్నాయికానీ .ఈ పద్యాలు పెద్దగా జనాలకు తెలియవు .చరిత్రకారులు, విమర్శక శిఖా మణులు కూడా వీటిపై ఉపేక్ష వహించారని పిస్తుంది .మిత్రులు శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు ఇలాంటి అమృతోపమానమైన పద్యాలను జన హృదయాలలో  చిరస్థాయిగా నిలవాలనే ఏకైక లక్ష్యం తో వాటికి కమ కమ్మని వ్యాఖ్యానం చేశారు .సులభాన్ని మరింత సులభతరం చేశారు .ఎన్నెన్నో గ్రంథాలనుంచి ఉదాహరణలు ఇస్తూ తమ వ్యాఖ్యానానికి నిర్దుష్ట త కలిపించి ,ఆదర్శ ప్రాయులయ్యారు .సిద్ధ యోగులకు సిద్ద గుటి(ళి)క గా ఈ పుస్తకంలోని పద్యాలు, వ్యాఖ్యానం ఉన్నాయి .ఇలాంటి మరిన్ని రచనలు ఆచార్యుల వారి లేఖిని నుండి వెలుగు చూడాలని కోరుతున్నాను

 ఈ అపూర్వగ్రంథంను హైదరాబాద్ లోని కాశ్యప ప్రచురణల వారు అందమైన బ్రహ్మ౦గారి ముఖ చిత్రం తో ,దోషరహితంగా పెద్ద అక్షరాలతోముద్రించి మహోపకారం చేశారు .దీని వెల ప్రకటించలేదు కనుక అమోల్యం అని భావిస్తున్నాను .ఆసక్తి ఉన్నవారు వ్యాఖ్యాన రచయిత గారి 97037 76650 కు ఫోన్ చేయవచ్చు .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-8-21-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.