సాలిగ్రామ పుర వైభవం
యతి సార్వభౌమ శ్రీ రామానుజ పాదుకా తీర్ధ ప్రభావ ప్రపూరిత ‘’సాలిగ్రామ పుర వైభవం ‘’అనే స్తోత్రాన్ని శ్రీ మదస్టాక్షరీ మఠాధ్యక్షుడు స్వామి దయాసాగర భీష్మార్య శ్రీమన్నల్లార్య కులతిలక శ్రీ మద్వరద రామానుజపాదుకా సేవా ధురీణ ,దేశాభిమానీ మొదలైన బిరుదులున్నశ్రీ బి.పి .శ్రీనివాస శర్మ గారు రచించగా ,శ్రీమాన్ తూప్పిల్ గోపాలాచార్యకవి ,శ్రీమాన్ మైసూరు గోపాలకృష్ణ శాస్త్రి గారి సహాయం తో పరిష్కరింప జేసి ,చెన్నపురి లోని ఆనంద ముద్ర శాల లో శ్రీ రామానుజ పాద పద్మాశ్రిత వేంకటేశ గుప్త చేత 1914లో ముద్రింపబడింది .వెల-అర్ధ అణా.
ఇంతకీ సాలగ్రామ పురం అంటే ఏమిటి దాని కధా ,కమామీషు తెలుసుకొందాం .కావేరీ నది ఉత్తర తీరాన ఉప జిల్లా గా ఉన్న పట్టణమే సాలిగ్రామ అనే శ్రీ వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం .ఇది భగ ద్రామానుజా చార్యుల వారి నివాస నగరం .కర్నాటక రాష్ట్రం లో మైసూరు జిల్లాలో ఉన్నది .ఇక్కడ శ్రీ యోగ నరసింహ స్వామి దేవాలయం తోపాటు ,జైన బసాడీలు,ఆశ్రమ ఉన్నాయి .ప్రముఖ బంగారు వర్తకుడు నాగేష్ కెంపాచార్ ఇక్కడి వాడే .
రామానుజా చార్యులు ఇక్కడికి వెంచేసినపుడు అక్కడి గిరిజనులందరూ ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు .కానీ స్థానికులకు ఇది కన్నేర్రగా ఉండి,ఆయనను చంపటానికి కుట్ర పన్నారు .ఈకుట్రను కనిపెట్టిన ఆచర్యశ్రీ తన ముఖ్య శిష్యుడు ముదలి యందన్ స్వామిని , ఇప్పుడు సాలిగ్రాం గా పిలువబడుతున్న చోట ఉన్న మంచి నీటి చెరువులో తన పాదాలను ఉంచమని ఆదేశించారు .ఎప్పుడైతే శ్రీవారి పాద తీర్ధం లో పాల్గొన్న వారందరికీ ,ఆయనను చంపాలనుకొన్న వారి మనసులు మారి తప్పు తెలుసుకొని అమాంతం వారి పాదాలపై పడి క్షమా భిక్ష వేడారు .ఇందులో రామానుజమహిమేకాక మహా మహిమాన్వితుడు గా ముదలి యందన్ స్వామికూడా కనిపిస్తాడు
కులోత్తుంగ చోళుని తీవ్రమైన ఆదేశాలవలన రామానుజా చార్య అక్కడి నుండి వహ్ని పుష్కరిణికి వెళ్లి ,అక్కడి నుంచి సాలిగ్రామానికి చేరారు .కర్నాటక మెల్కోటే దగ్గర ఉన్న ఈ ప్రదేశానికి రామానుజులు సాలిగ్రామం అని పేరుపెట్టారు .అప్పటి నుంచి ఈపుష్కరిణి గేట్లు మూసేసి ,బయటివారు ఆనీటిని కలుషితం చేయకుండా పూజారులు అత్యంత జాగ్రత్త వహిస్తున్నారు .ఈపుష్కరిణి కి ఎదురుగా ఒక చిన్న గుడిలో రామానుజాచార్యులవారి తిరువది,చువదుగల్ లకు నిత్యార్చన జరుగుతుంది .ఆలయగర్భ గృహం లో శేషరూప శ్రీ రామానుజాచార్యుల విగ్రహం ఉంటుంది.
ఈ సాలిగ్రామ పుర వర్ణన స్తోత్రం సంస్కృతం లో రచించబడింది.
‘’యో దేవోధారయేద్లక్ష్మీం -స్వర్ణాభరణ రూపవాత్ – శంఖ చక్రాది భిర్యుతః –‘’
‘’నాగాభరణ సంప్రీతః ప్రభుర్హర్హరిర్హరేశ్వరః –ధ్యాన నందన పూజాద్యైఃయస్తం దేవముపాస్మ్యహం ‘’అని ప్రారంభించారు .’’దేవ దేవోత్తమ హరే కురు మంగళం సదా ‘’అని కోరాడుకవి .తర్వాత వేదాంత దేశిక మనవాళ్ళముని లనుస్తుతి౦చి ’’’వక్ష్యామి తత్వ బోదార్ధం సాలిగ్రామస్య వైభవం ‘’అని మొదలుపెట్టాడు .
వింధ్యకు దక్షిణాన ,యాదాద్రికిపశ్చిమాన ,హేమావతీ,కావేరీ సంగమస్థలం గౌతమ క్షేత్రం గా ప్రసిద్ధి చెందింది .అక్కడ ‘’నృసింహ క్షేత్ర మత్యత్ర ,రామ క్షేత్రం తధైవచ ‘’ఈమధ్యలో సాలిగ్రామం విరాజిల్లుతోంది .విశిష్టాద్వైతసిద్ధాంత స్థాపనాచార్య పాదుకే తత్రాపి పాదుకా తీర్ధం రమణీయం మనోహరంగా ఉంటుంది .అదిపవిత్రం ,జ్ఞాన సాధకం ..అక్కడ నిత్యారాధన జరుగుతుంది .’’సాలిగ్రామ శుభం క్షేత్రం –సర్వ క్షేత్రేషు ఉత్తమం ‘’అని దాని గొప్పతనం చెప్పారు .శ్రీపాదతీర్ధ మహాత్మ్యాన్ని వర్ణించటం ఎవరితరమూకాదన్నారు .
కుష్టురోగి అక్కడి తీర్ధం పుచ్చుకొని రోగం పోగొట్టుకొన్నాడు .’’రామానుజయతి మానుషోపి నమానుషః’’అని శ్రీవారి గొప్పతనం చాటారు .’’వివిధానిచ పాపానీ ,రోగ ప్రతినిధీ న్యహో-మనోవ్యధాచ దారిద్ర్యం –పర సేవాయచ దారుణా ‘’దులన్నీ నశిస్తాయిఅని భరోసా ఇచ్చారు .అది సర్వ దుఃఖ శమనం ,సర్వ రోగ నికృ౦తనం .మేష ,ఆరుద్ర సంభవకాలం లోసాలిగ్రామపురం తీర్ధం తాగినవారికి మోక్షం గ్యారంటీ .ఈ తీర్ధ మహత్యాన్ని చదివినా విన్నా పరమపదం లభిస్తుంది .
చివరకు మంగళం చెబుతూ –
‘’మంగళం భాష్యకారాయ –శుద్ధ తత్వాయ మంగళం –మంగళం లక్ష్మణార్యాయ-యోగ రూఢాయ మంగళం –మంగళం విష్ణు భక్తాయ –సుసంకల్పాయ మంగళం –మంగళం రాజ రాజాయ –యతిరాజాయ మంగళం –మంగళం లోక నాథాయ –లోకాచార్యాయ మంగళం ‘’
ఆచివర్లో అద్వైత ,ద్వైత మత సిద్ధాంతాలను పేర్కొని విశిష్టాద్వైతమత౦ గొప్పతనాన్ని సంస్కృతంలో ఉల్లేఖించారు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-8-21-ఉయ్యూరు