శ్రీ దాసు లింగమూర్తి
శ్రీ దాసు లింగమూర్తి జీవితము అనే పుస్తకాన్ని శ్రీ పాలపర్తి సూర్యనారాయణ రాశారు ఈయన అంతకుమునుపే ప్రియదర్శిని ,మేవాడపతనం లక్ష్మీ నరసింహ ,ముకుందమాల స్తోత్రాలు ,అహోబిల చరిత్రాదులు రాశారు .దీన్ని చాగలమర్రి వాసి డాక్టర్ గంగరాజు వెంకట రామయ్య గారు బెజవాడ ఆంద్ర గ్రంధాలయం లో 1931లో ప్రచురించారు .ఖరీదు 12అణాలు .ముందుమాట ఆళ్లగడ్డకు చెందిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ శ్రీ ఎస్.లక్ష్మీ నరసయ్య ఎం .ఎ .లిట్ ఇంగ్లీష్ లో విపులంగా రాశారు .
గ్రంథ కర్త తనమాటలలో శ్రీ పోణ౦గి లింగమూర్తి దాసు గారిపై ఉన్న భక్తితో తాను ఈ రచన చేశాననీ ఆయన జీవించి ఉన్నకాలం లోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన మహనీయులనీ ,పూజ్యులు ఆరాధ్యులు ,ఆదర్శ ప్రాయులు అనీ చెప్పారు .ఈ పుస్తకం అమ్మకాలవల్ల వచ్చే ఆదాయాన్ని చాగలమర్రి శ్రీ చెన్న కేశవ స్వామి శాశ్వత నిధికి జమ చేస్తున్నట్లు తెలిపారు .ఈ పుస్తకాన్ని అహోబిల క్షేత్ర స్థాపన ,పోషణ ,భవిష్యత్ ఉద్ధరణ కు కారకులైన భక్త బృందానికి అ౦కితమిచ్చినట్లు విన్నవించారు.తర్వాత ప్రవేశికలో శ్రీ లింగమూర్తి దాసు గారు వంటి జీవిత చరిత్రలు ఎలాస్పూర్తి నిస్తాయో వివరించారు .
బాల్యం విద్యాభ్యాసం
తిరుపతి క్షేత్రానికి నకలుగా ఉన్నవిశాఖ పట్టణం లోని ఉప్మాక వెంకటేశ్వర ఆలయం గొడే జమీందార్ల జమీ లోనిది .జమీందారు గణపతి రాయణి ఆస్థానం లో పోణ౦గి వెంకటరామయ్యగారనే భక్తుడు సముద్దారుగా కొద్ది జీతానికే పని చేస్తున్నాడు .ఈయన చంద్రవరానికి చెందినా ఆర్వెల నియోగి .భార్య కృష్ణ వేణమ్మ. వీరి అయిదుగురు సంతానం లో చివరి వాడు శ్రీ లింగమూర్తి దాసు గారు 4-11-1895 జయనామ సంవత్సర ఆశ్వయుజ బహుళ దశమి నాడు జన్మించారు .వీరి జాతక చక్రం కూడా ఇవ్వబడింది .35వ ఏడు ను౦చి 52వరకు అంగారక మహర్దశ ,అందులో భార్య మృతి ,పుత్ర వృద్ధి ఉంటాయి .ఆంగీరస సంవత్సరం లో ద్వితీయ కళత్రయోగం ,52 వయసు వచ్చేసరికి అనుకొన్న పనుల్నీ జరుగుతాయని ,ఉద్యోగ రాజ్య ధన భూ గృహ లాభాలు ,ఇంట్లో శుభకార్యాలు సూచింప బడింది .52నుంచి 69వరకు బుధమహర్దశ లో గృహ భూ జల శిదిలాలయపునరుద్ధరణ ,65లో గండం ,69-70లో మరణం .
నిరాడంబరుడైన తండ్రి వెంకటరామయ్య గారికి భార్యావియోగం ,దాసుగారు పుట్టిన నాలుగు నెలలకే జరిగి అష్టకస్టాలుపడ్డారు .అయిదుగురు పసిపిల్లలనీ ప్రేమతో పెంచుతున్నారు .పసి దాసుకు తల్లిపాలు లోటు తీర్చలేక పోయారు తండ్రి .పెంకె పిల్లాడుగా పెరిగాడు .ఉన్న చోటే ప్రాధమిక విద్య నేర్చి ,పదేళ్ళ వయసులో కాకినాడలోని దగ్గర బంధువు కానుకొల్లు వెంకట అప్పారావు గారివద్ద ఇంగ్లీష్ నేర్చుకోటాని పంపారు .అక్కడ పిఠాపురం రాజా కాలేజిలో మాధ్యమిక విద్యనేర్చారు రెండవ ఫారం లో ఉండగా ఒక ఒరిస్సా జ్యోతిష్యుడు అప్పారావు గారింటికి వచ్చి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చిన బాల దాసుగారిని చూసి మహాయోగ పురుషుడు అవుతాడని చెప్పాడు .ఎలా చెప్పగలిగారని అప్పారావు గారు అడిగితె కాలి బొటన వ్రేళ్ళ లో చేతి బొటన వ్రేళ్ళలో తప్పక చక్రాలు ఉండి ఉంటాయని ,అలాంటివాడు రాజుకానీ మఠాధిపతికానీ తప్పక అవుతాడని చెప్పాడు .దాసుగార్ని పిలిచి నాలుగు వ్రేళ్ళల్లో ఉన్న చక్రాలు ఆజ్యోతిష్యుడు అప్పారావు గారికి చూపించాడు .ఆతర్వాత మూడేళ్ళకు దాసుగారు ఒకరాత్రి ఒక హరిదాసు చెప్పిన మానసిక పూజా విధానం విని ఆకర్షితులయ్యారు .ప్రహ్లాద చరిత్ర బాగా ఆకర్షించి ,నిత్య మానసిక పూజ చేశారు .
కలకత్తా ప్రయాణం –బలినుంచి తప్పించుకోవటం
దాసుగారు స్కూల్ ఫైనల్ చదువుతున్నప్పుడు ఉప్మాక వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు చూసి ,అక్కడున్న వికలాంగ రోగపీడిత కుష్టు వారిని చూసి మహా జాలిపడి ,వారి దుఃఖ నివృత్తికోసం హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయాలనుకొన్నారు .కాకినాడ చదువుకోసమని తండ్రి దగ్గర డబ్బు తీసుకొని సరాసరి సింహాచలం వెళ్లి ,అక్కడి నుంచి కాశీ వెళ్లాలని కలకత్తా కు రాత్రి8 గంటలకు చేరారు .ఆకలి దంచేస్తోంది దగ్గరున్న మూడు అణాల మూడు కానులతో మార్వాడీ దుకాణం లో మిఠాయికొని తిని మంచినీళ్ళు తాగి స్టేషన్ లోనే పడుకొన్నారు .
మర్నాడు ఉదయం లేచి ఆమార్వాడీని కాళికా దేవి గుడికి ఎలా వెళ్లాలని వచ్చీరాని భాషలో అడిగితె పాపం పసివాడు అని జాలిపడి తనదగ్గరే మూడు రోజులు ఉంచుకొన్నాడు .ప్లాట్ ఫారం పై పచారు చేస్తున్న దాసుగారిని చూసి ఒక మార్వాడీశ్రీమతుడు తన ఇంట ఆతిధ్యమిచ్చాడు .ఆమహల్ లో ఇతనికి సేవ చేయటానికి ఒకబాలికను ఏర్పాటు చేశాడు .ఆమె ఎప్పుడూ విచారంగా ఉండటం చూసి కారణం అడిగారు .ఆమె ‘’నీకు ఆతిధ్యమిచ్చినవాడు మా తండ్రే .శక్తి పూజ అబ్బింది ఆయనకు .నిన్ను కాళికామాతకు బలి ఇవ్వాలని అనుకొంటూ మేపుతున్నాడు .మానాన్న బారి నుంచి నిన్ను తప్పించటం ఎట్లా అన్నదే నా బాధ ‘’అని చెప్పింది .కాళీమాత యే తన్ను రక్షిస్తు౦ది అను కొని ఆమె చెప్పినట్లు చేశాడు .ఒకరోజు దాసుగారు తెలివిగా మార్వాడీ తో తన సోదరుడుకూడా కలకత్తా వచ్చాడని స్టేషన్ లో ఉన్నాడనీ అతన్ని కూడా తీసుకొస్తాననీ అంటే ఇద్దరు ‘’బకరాల్ని బలివ్వచ్చు’’ అనుకోని సరే అనగా ఇద్దరూకలిసి కారులో బయల్దేరి స్టేషన్ కు బయల్దేరగా .దారిలో కొందరు తెల్లవాళ్ళు మరో కారులో రావటం చూసి దాసుగారు బిగ్గరగా కేకలు వేశారు .వాళ్ళు విని వీళ్ళ కారు ఆపి౦చి ,దాసుగారిని కారణం అడితితే జరిగింది అంతా చెప్పగా ,అందులో ఉన్న తెల్లదొర డిటెక్టివ్ అవటం తో మార్వాడీని మందలించి ,దాసుగారి చెర వదిలిలించి కాకినాడకు రైల్ టికెట్ కొనిచ్చి రైలు ఎక్కించారు .చావుతప్పి కన్ను లొట్టబోయినట్లయింది .కాకినాడ చేరి బుద్ధిగా చదివి పాసయ్యారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-8-21-ఉయ్యూరు