సంజీవరాయ కవి శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని 

సంజీవరాయ కవి శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -1

 కవికధా కమామీషు

      రావూరి సంజీవ రాయ కవి ప్రణీత ‘’శ్రీ రుక్మిణీ పరిణయము ‘’కావ్యం విశిష్ట మైంది .కారణాలు చాలా ఉన్నా ,అందులో ముఖ్య మైన కొన్నిటిని చూద్దాం .ఏ కావ్యాని కైనా కర్త ఒక్కడే ఉండటం సహజం .కాని ఈకవ్యకన్యక కు నిజం తండ్రి సంజీవ రాయ కవి అయినా ,తామూ ఆ కోవకు చెందిన వారమే నని కొప్పర్తి నరసాఖ్యుడు ముందు ప్రకటించగా ,మహా మహోపాధ్యాయ శ్రీ కాశీ కృష్ణాచార్యుల వారు తామే పరిష్కరించి ప్రకటించి నట్లు చెప్పారు .అంటే అసలు తండ్రే కాక ,మరో ఇద్దరి ముద్దుల పుత్రిక అయింది ఈ కావ్య కన్యక .అయితే ,సాహితీ లోకం వీరిద్దరిని గుర్తించ లేదు .అసలు తండ్రి సంజీవ రాయ కవి యే అని పరిశీలకులు ,పరి శోధకులు నిర్ణ యించారు .,ధ్రువీకరించారు .కనుక కర్తృత్వం పై వాదం సమసి పోయింది .ఈ కావ్య కన్యక కు ఇప్పుడు  280 ఏళ్ళ వయసు వచ్చింది .

           సంజీవ రాయ కవి వరంగల్లు జిల్లా కొలను పాక అనే గ్రామం లో జన్మించి నట్లు ఆది జైన పుణ్య క్షేత్రమని అక్కడ వీర నారాయణ స్వామి దేవాలయం ఉందని ఆరుద్ర తెలిపారు .అక్కడ గోపరాజు రాయప్ప గొప్ప శ్రీమంతుడు .ఆయన స్వామిపై శతకం రాయమని ఈ కవిని పిలిపించి ,సత్కరించి ,వేడుకొన్నాడు .’’కొలను పాక వీర నారాయణ ముకుంద విశ్వ కుంద‘’అనే మకుటం తొ సీస పద్య శతకం రాశాడు .వీటిని ‘’గునుగు సీసాలు ‘’అన్నారు దశావతార వర్ణన ,శ్రీ కృష్ణ లీలలను కూడా కవి వర్నిం ఛాడట .సంజీవయ్య తండ్రి గురవయ్య కూడా కవి గా ప్రసిద్ధుడే .కొండ వీటిలో ఉండే వాడు .ఆయన్ను ‘’కొండ వీటి పేద రావు గురవయ్య ‘’అనే వారట .మొదట తెలంగాణా వారే .తర్వాత  తెనాలి దగ్గర రావూరు చేరటం వల్ల ఇంటి పేరు రావూరి గా మారింది .’’అనుమ కొండలు ‘’అనే ఉప శాఖ ఉన్న  ప్రధమ శాఖ లో భాగమట..ఈ శాఖ బ్రాహ్మణులు ఓరుగల్లు దగ్గర ఉండటం వల్ల వీరి పూర్వీకులు ఇక్కడి వారే నంటారు ఆరుద్ర .కవి సంజీవయ్య చదువు తెలంగాణాలోనే సాగింది  .రాత్రి పూట శ్మశానం లో శవాల వెలుగు లో చదువు కొనే వాడట.అంతటి దుర్భర దారిద్ర్య స్తితిలో కుటుంబం ఉండేదన్న మాట .తర్వాత పెద్ద వాడై,సంపాదనా పరుడై వీర నారాయణ స్వామి ఆలయాన్ని అభి వృద్ధి చేశాడట .’’కృష్ణ హరీ వాసుదేవ నందన ‘’శతకం రాశాడు .ఆ శతకం లో తనను ‘’సుధా రస తుల్య కవిత్వ కల్పనా స్రావిని –కొండ వీటి పేద రావు గుర్వ తనూజు సంజీవిని ‘’అని చెప్పుకోన్నాడట .జాతక సిద్దాంతగ్రంధాలు చదివి వంట పట్టించుకోన్నాడు .వీర నారాయణ శతకాన్ని 1731లో రాశాడట .రుక్మిణీ పరిణయ కావ్యాన్ని1787  లో రాశాడు .పద్యాలు క్లిష్టం గా ఉండటం ,జనాలకు అర్ధం కాక పోవటం వల్ల సంస్కృతం లో వివరణలూ రాసుకొన్నాడు కవి .ఈ వివరాలన్నీ ఆరుద్ర సమగ్ర ఆంద్ర సాహిత్యం ‘’లో పొందు పరచాడు .

            బులుసు వెంకట రమణయ్య గారు ‘’ ఆంధ్ర కవి సప్త  శతి ‘’లో సంజీవ రాయ కవి కవితా త్రివిక్రమవిలాసం ,భాగవతం లోని ఏకాదశ ,ద్వాదశ ఖండాలు కూడా పద్య కావ్యాలుగా  చెప్పి నట్లు వ్రాశారు .ఈ విషయాలను ఆరుద్ర చెప్ప లేదు .దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు కూడా సంజీవ రాయ కవి గురించి చెప్పారు .కవి ప్రత్యేకత వల్ల సాహితీ లోకం లో నిలబడి ,ఎన్ని తంత్రాలు జరిగినా ‘’చిరంజీవి ‘’గా సంజీవ రాయ కవి నామ సార్ధకాన్ని సాధించారు .ఆంజనేయ స్వామి పేరును సార్ధకం చేసుకొన్నారు .

 శ్రీ రుక్మిణీ  పరిణయ సంజీవిని-2

దౌహిత్రుని తాపత్రయం

            సంజీవ రాయ కవి కవి కథకులు రిటైర్డ్ రేడియో ఇంజినీర్ స్వర్గీయ శ్రీ గంధం వేంకాస్వామి శర్మగారి మాతా మహస్థానం  లోని వారు .ఆరు తరాల ముందటి వారు .సాధారణం గా దౌహిత్రుడు తాత గారి ఆస్తి కి వారసుడౌతాడు అనేది లోక రీతి .శర్మ గారు ఆరోతరానికి చెందిన వారు కనుక సాహితీ వారసత్వపు హక్కు లభించింది .అది తన తాత ,ముత్తాతల నే కాక ముందు తరాల వారికీ ఋణం తీర్చు కొనే హక్కు ,బాధ్యతగా భావించి తాను పది హేనవ ఏట చూసిన సంజీవ రాయ కృత రుక్మిణీ పరిణయ కావ్యం లోనీ చిత్రాలను సేకరించే ప్రయత్నం లో ఉన్నారు .ఇప్పుడీ కావ్యాన్ని పరి శుద్ధ పరచి తానే ‘’ప్రకాశకులు ‘’అయి ,దాన్ని సాహితీ ప్రకాశ మానం చేస్తూ తర తరాలరుణాన్ని సభక్తికం గా తీర్చుకొన్నారు .ఎందరికో ఆదర్శమాను లయారు .ఇలా ప్రచురించటం లో అమితానందాన్ని పొంది ,ఆ ఆనందపు  అను భూతిని సాహితీ ప్రియులకు అందజేసి ధన్యులవుతున్నారు .,ప్రశంస నీయులయారు .తప్పులు జల్లెడ పట్టి ,అభిప్రాయం రాయమని నన్ను ఆదేశించారు .వారి పై ఆదరాభిమానాలతో ఔదల దాల్చాను .కావ్యం చదువుతూంటే ,చేమ కూర వేంకటకవి ,రామ రాజభూషణ కవి,పోతన కవి ల కవిత్వాలు కలిపి ‘’మిక్సీ పడితే’’ ఎలాంటి కవిత్వం వస్తుందో అలాంటి కవిత్వం ఈ కవి రాశారని అని పించింది .మంచి పండితునితో అర్ధ తాత్పర్యాలను విశేషాలను వ్రాయిస్తే మరీ శోభ తో కావ్యం ప్రకాశిస్తుందని శర్మ గారికి సూచించాను .వారు వెంటనే ‘’మంచి సూచన చేశారు ప్రసాద్ గారూ ,నేను ఆ ప్రయత్నం చేసి మీరు చెప్పింది త్వరలోనే ఆచరణ లోకి తెస్తాను .అర్ధ తాత్పర్యాలు విశేషాల తో మళ్ళీ ఈ పుస్తకాన్ని ముద్రిస్తాను.మీ వ్యాఖ్యానాన్ని అక్షరం వదల కుండా అందులో ముద్రిస్తాను ‘’అని చెప్పారు .ఆ ప్రయత్నం తీవ్రం గా నే చేశారు .రాసే వారు దొరికారని ,పని జరుగుతోందని త్వరలోనే పూర్తీ అవుతుందని కని పించినప్పుడల్లా చెప్పే వారు .అయితే అకస్మాత్తు గా శ్రీ శర్మ గారు ఈ  ఏడాది 2012మే నెలలో ఆ పని పూర్తి కాకుండానే మరణించటం సాహితీ ప్రియులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది .శర్మ గారు సమర్ధులైన కధా రచయిత .గొప్ప సంస్కారి .’’అమృత హస్తాలు ‘’,’’నాయనమ్మ కథలు ‘’మొదలైన అద్భుత సంకలాను తెచ్చారు .ఇప్పుడు కావ్య విశిష్టత ను తెలుసు కొందాం

                      కావ్య విశిష్టత

       శ్రీ రుక్మిణీ పరిణయ కావ్యం అనేక ప్రయోగాలకు నిలయం .కావ్యానికి కావలసిన సకల హంగులూ ఉన్నాయి .తన ఇష్ట దైవం సంజీవ పర్వతోద్ధారి అయిన శ్రీ ఆంజనేయ స్వామి కలలో కన్పించి ,కొండపల్లి మండలం లో కృష్ణా నదికి ఉత్తరాన గల కోడూరు లో తాను వెలసి ఉన్నానని ,అక్కడ మదన గోపాలుని ఆలయాన్ని నిర్మించి ,స్వామిని ప్రతిష్టించి ,రుక్మిణీ పరిణయ కావ్యం రాసి ధన్యుడైనాడు .జన్మ సార్ధకత చేసుకొన్నాడు .అలానే చిత్తాను వృత్తిగా ప్రవర్తించి ,కావ్యం రాసి సార్ధకత పొందాడు .ఈ కావ్యానికి ‘’మదన గోపాల చరిత్ర ‘’అనే పేరూ వచ్చింది .అయిదు ఆశ్వాసాల కావ్యం ఇది .

       శ్రీ మద్భాగవత దశమ స్కంధం లోనీ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పఠించిన కన్యకలకు వివాహం త్వరలోనే జరుగుతుందని మన దేశం లో నమ్మకం బాగా ఉంది .అలాచేసి సఫలీ కృతు లైన వారెందరో ఉన్నారు .ఆ కథకే కాయ కల్ప చికిత్స చేశారు సంజీవ రాయ కవి .తనకు ముందు తరాల వారైన పోతన ,భట్టు మూర్తి ,చేమకూర వెంకట కవుల బాణిని ,వాణిని స్వంతం చేసుకొన్నాడు .వారు పోయిన ఫక్కీ లన్ని అనుసరించాడు .,అనుక రించాడు కూడా .ముఖ్యం గా కథా వివరణ లో పోతన గారు ఏయే సందర్భాలలో ఎలా పద్యాలు చెప్పి పారాయణ చేయటానికి రాశారో అలానే ఈ కవీ పద్యాలు రాశాడు .అయితే అంత తాదాత్మ్యకత చూపలేక ,కల్పించలేక పోయారు .వర్ణనల విషయం లో యమకాలు ,చమక్కులు ,బంధ కవిత్వాలతో మిగిలిన ఇద్దర్నీ అనుసరించారు .కావ్య స్తితికి కావలసిన మసాలా అంతా దట్టించాడు .

       కథ అంతా తెలుగు లోగిళ్ళు లోనే జరిగి నట్లు చేయటం తమాషా గా ఉంది .రుక్మిణి తెలుగింటి ఆడపడుచు లాగ కన్పిస్తుంది .ఆమె తల్లి గర్భవతి అయినప్పుడు జరిగే సీమంతం ,రుక్మిణి బాలసార ,ఆట ,పాట అన్నీ తెలుగు వారు జరుపుకొనే రీతి లోనే చూపారు .కవిత్వం చాలా చక్కగా ,వయ్యారం గా నడుస్తుంది .’’పద్మేశు కధలు –మధు మాధురీ నాద స్తిత   కున్మేలై ,కాగిన మీగడ పాలై విన ,గ్రొత్త సేయు ‘’రీతిగా ఉంటాయట. .రుక్మిణి తల్లికి కలలో లక్ష్మీ దేవి కన్పించటం ఆమె అందాన్ని ,లావణ్య దీధితిని చూసి ముచ్చట పడి తనకు కూతురు గా జన్మించమని కోరటం కవి చేసిన భలే కల్పన .ఆ సందర్భం లో ‘’పుష్ప వత్సవ మహా రాజ భాగమునకు రాజు వెంచేసే నొక రేయి రాజసమున ‘’అని శ్లేషను ప్రయోగించి సందర్భ శుద్ధి గా చెప్పాడు .ఆమె గర్భవతి గా ఉన్నప్పుడు ,శారీరకం గా వచ్చిన మార్పులను సాంప్రదాయ పద్ధతులలో వర్ణించి చెప్పాడు .రుక్మిణి జన్మించింది ..పీటలపై దంపతులు కూర్చుని ,స్వస్తి పుణ్యః వాచనం చేసి’’ బాలికా మణి దేహ శోభా విభూతి రుక్మ కాంతి (బంగారు కాంతి )విలాసైక రూఢిదగుట వల్ల ‘’రుక్మిణి అని పేరు పెట్టారట .అద్భుతం అని పిస్తుంది .ఆమెను చూడ టానికి వచ్చిన పురజనులు రుక్మిణి తన పిన తల్లి పోలిక అని ఒకరంటే ,తల్లి పోలిక అని ఇంకోరు ,అమ్మమ్మ పోలిక అని వేరొకరు అనటం లో మన తెలుగింటి అమ్మలక్కల తీరు ప్రతి బి౦బిస్తుంది .చివరకు ‘’అగణ్య పుణ్య జన నిశ్శేష భువన పోషణ ,సువత్సతల విభూషిన్మతల్లి యైన బాలికా మణి ‘’అని సాక్షాత్తు లక్ష్మీ దేవి యే ఆమె అని నిర్ధారించింది ఒక పేరంటాలు  .రుక్మిణి దిన దిన ప్రవర్ధ మానమవుతూ ఉంది .ఆమెను ఉయ్యాల్లో వేశారు .ముత్తైదువులు ‘’ఉయ్యాలో జంపాలో ‘’అని తెలుగింట్లో లాగా ఉయ్యాలా లూపారు .బాల రుక్మిణి తల్లి పాలు తాగే విధానమూ వర్ణించాడు కవి .మనోహరం గా .’’ఒక చన్నా నుచు ,నొక చన్ను బుడుకుచు ,మార్చి మార్చి ‘’పాలు కుడుస్తోందిట .ఇది అందరు పిల్లలు చేసే విధానమే .బొమ్మ కట్టి మన ముందుంచాడు .బాలికకు బేసి నెలలో అన్న ప్రాసనా చేయటం మన రివాజు .రుక్మిణికి అయిదవ నెలలో ‘’అయిదవదౌ నెల యందు నైదువల్ ‘’చేశారని వర్ణించాడు .తోటి పిల్లలతో ఆమె ఆటలాడింది .’’జగదుద్ధారర మోహనా కార వర్తి యై ‘’విల సిల్లు తోంది .’’చలువ జాజిగి మించు చలువ వలువలు ధరించింది ‘’రవిక లోపల రవిక తొడిగిందట .అని చమత్కారం గా చెప్పాడు కవి .అంటే ఇప్పుడు స్త్రీలు వేసే ‘’బాడీ ‘’వేసిందన్న మాట ఆనాడే రుక్మిణి .ఇంతకూ రుక్మిణి తండ్రి పాలించిన విష్ణు కుండిన నగరం మన కొండ వీడు దగ్గరే నని చరిత్ర కారులు చెబుతారు .ఆది దృష్టిలో పెట్టుకొని కవి ఇంతటి తెలుగు వాతావరణాన్ని తెలుగింటి శోభను తెచ్చాడని  పిస్తుంది .

 శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -3

       రుక్మిణీ దేవి సర్వ దేహ వర్ణన ను చమత్కారం గవర్ణించాడు ‘’సువర్ణా’’లతో .యుక్త వయస్సు వచ్చింది .ఆమెకు తగిన వరుడు శ్రీ కృష్ణుడే నని ఊహించి చక్కని పద్యం చెప్పాడు .

‘’హరి  య౦శ౦ బున బుట్టె గ్రుష్ణు డిలపై ,నద్దేవుని గూర్ప ,వా

  గ్వరుడూహించి విచిత్ర కల్పనముగా ,బద్మాంగి నీలాల కో

త్కరంగ ,నీ సుదతిన్ సృజించి ,జఘన స్థానంబు గాజేసెనో

ధరణిన్ ,దత్తరుణీత్రయంశాక్రుతి ,దత్తాద్దేతువై కన్పడన్ ‘’

కృష్ణుని లోనీ అంశాలన్నీ ఆవిడ శరీరం లో ఉన్నట్లు చెప్పటం భావుకతకు పట్టం కట్టటమే .ఆమె మోవికి మామిడి చిగురు ,మంకెన పువ్వు ,యెర్ర తామరా వగైరాలేవీ సరి పోవటం లేదనటం చిత్రం గా ఉంది..పరిణతి లో సారూప్య స్తితి తో వర వర్ణిని గా పేరు పొందింది .కృష్ణుడు కూడా ఆమె రూప లావణ్యాలను తెలిసి కొని ,’’తనకుం జాయగా జే కొందు ననుచు శౌరి దలచెన్ ‘’అని పిస్తాడు .’’మేడ్ ఫర్ఈచ్ అదర్’’అన్నట్లున్నా రన్న మాట .

         కూతురి పెళ్ళి చేయాలని తండ్రి భీష్మకుడు భావించి ,మంత్రులతో ,పెద్దలతో తగిన వరుడెవరు అని అడుగుతాడు .తనకు కాబోయే అల్లుడు తలిదండ్రులు బల వంతులైన బంధు గణం గురు పురోహిత హితులు ,సిరి సంపదా ,కళా ,సాహస ఔదార్యం ,పరాక్రమం గుణ విరాజం ఉన్న రాజ కుమారుడై ఉండాలని అన్నాడు .కమల వంటి కుమార్తెకు హరిని బోలిన అల్లుడు దొరికితే మహదానందం అన్నాడు .

‘’కన్యాం రూప గుణాన్వితాం మమ సుతాం ,క్ష్మాపాల బాలైక మూ

  ర్ధన్యాం కాంచన రత్న భూషణ యుతం దాస్యామి తే విష్ణవే

  ధన్యోహం హి గృహాణ ‘’యంచు హరి పాదద్వంబు న్వార్చి ,ఈ

  కన్యాం దానము సేయగలగు ఘన భాగ్యం బెన్న దిన్కబ్బున్ ‘’

   ఇలా సంస్కృతం లో తెలుగులో పద్యాన్ని ,కన్యాదానాన్ని వివరించాడు విచిత్ర కవి .

         మంత్రు లంతా ఏకాంత మందిరం లో సంప్రదించుకొని ఏక వాక్యం గా శ్రీ కృష్ణుడే తగిన వరుడని అతని పుర విశేషాలు ,ఆయన గుణ శీలాదు లన్నిటిని సవివరం గా చెప్పారు .శ్రీ కృష్ణుని కలిమి ముందు ఇంద్ర ,కుబేర సముద్ర ,ఈశ్వర విభూతు లేవీ చాల వన్నాడు .అతని శరీరం లోనీ ప్రతి భాగాన్ని అద్భుత మైన పద్యాలతో వర్ణించాడు .ఆయనే రుక్మిణీ పతి కాగలిగిన వాడని చెప్పారు .

            అన్న రుక్మి అక్కడే ఉన్నాడు .వీళ్ళ తీరు నచ్చలేదు .అతని మనసులో శిశు పాలుడున్నాడు .ఇచ్చకపు మాటలతో రాజును ప్రక్క దోవ పట్టిస్తున్నారని ‘’అనర్ఘ్య రత్నాన్ని ఆర ఊతంబు తోదవున అతకటం లాఉంటుంది రుక్మిణిని కృష్ణునికిస్తే’’ అన్నాడు .కృష్ణుని చేష్టల్ని తన వాక్య చాతుర్యం తో గేలి చేశాడు .’’నిలువెల్లా మాయ ,కులం ,గుణం లేవు .ఎన్నో చోట్లు మార్చాడు .గుణం లేని వారి స్నేహం రూప రేఖాదులు లేని వాడు ‘’అంటూ నిందా స్తుతి చేశాడు .కవి సామర్ధ్యం ఇక్కడ ప్రస్పుటం గా కన్పిస్తుంది .మరి శిశుపాలుడు ‘’మహిత కనక కుదర చాప మంత్ర జపుడు ,భరిత పరమ కృపుడు ‘’అని మెచ్చాడు .రుక్మిణి భరించలేక పోయింది .రాచ కన్య ఏమీ చేసే స్తితి లో లేదు .అక్కణ్ణించి వెళ్లి పోయింది .ఎక్కడికి వెళ్ళిందో ,ఏమి చేసిందో చూద్ద్దాం

‘’కాంత ఏకాంత కాంత నిశాంత శయ్య –వాన్తగతి నొప్పె తాం త లతాం తమై

  దంతరిత పూర్వ జోదితో దంత చింత –సంత సంతాప దంతురి తాం త రామమున ‘’

  అంతటి బాధను ఇంతటి అందమైన పద్యం లో బంధించాడు కవి .ఆమె వెంట మనమూ వెళ్తున్న భ్రాంతి కల్గించాడు .ఆమె బాధ ‘’గోరు చుట్టు పై రోకటి పోటు ‘’లా ఉన్నదని మంచి జాతీయం ప్రయోగించాడు .

  శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -4

   బాపని రాయబారం

         తన మనసులోని ప్రేమను శ్రీ కృష్ణునికి విన్న వించటానికి పేరు లేని బాపనయ్య ను పిలిపించి కృష్ణుని చేరి తన విషయం తెలియ జేయమని కోరింది .’’రూఢ మేదో విషలు ,వాచాలు నిన్ను బిల్వ న్వలసే నితకు నా వార్త దెల్ప బుధే౦ద్రా ‘’అన్నది .తన మనసంతా హరి పై చిక్కు కున్నదని సింహముపాలి సొమ్ము  గోమాయువు హరి౦చి నట్లు గా శిశుపాలుడున్నాడని పోతన శైలిలోనే చెప్పింది కాదు చెప్పించాడు సంజీవ రాయ కవి –

 ‘’కారము చేయునగ్రాజు వికారము దూరముగా భవచ్చమ –త్కారము జూపి ,నాదగు ప్రకారము శౌరికి విన్న వించి ,స

 త్కారము సేయనిన యుపకారము కై ప్రతీకారమే నమ-సకారము నేయు చుండుదు చొ కారాముగా హరి దెచ్చు నంతకున్ ‘’అంటూ ‘’కారం ‘’తో చమత్కారం చేస్తాడు కవి ..

        బాపడు ద్వారకా నగరం చేరి అక్కడి పట్టణవిశేషాలన్నీ తిలకిస్తాడు .పుర వర్ణన లో అద్భుత మైన పద్యాలున్నాయి .తన రాక ను ద్వార పాలకుని ద్వారా ద్వారకా కా౦తునికి చెప్పిస్తాడు .ఆయన విని ,’’భీష్మ కరాట నయా ,గతి దెల్పగా వచ్చిన వాడ’’నితెలిసి హృష్ట చిత్తుడౌతాడు కన్నయ్య .అంతటి పరేంగితావగాహి .బ్రాహ్మణునికి ఎదురేగి పూజించి ఉచితాసనం పై కూర్చో బెట్టాడు .ఇక్కడ శ్రీ కృష్ణుని దివ్య సుందర విగ్రహాన్ని చూసి నోరారా ప్రస్తుతిస్తాడు రాయబారి బాపడు .ఎన్ని పద్యాలు చెప్పి వర్ణించినా కవి కౌతుకం తీరలేదు .ఓ దండకం దండ వేసి ,దంచేస్తాడు .అదీ సంతృప్తి నివ్వదు .బహు విధ కందాలలో అర వింద దళాయతేక్షణుడిని వర్ణిస్తాడు .పాద భ్రమర ,క్షురికా బంధ , ఆర్ద భ్రమర ,గుడి ఏకాక్షర ,తల కట్టు ,శ్రుంగ కందాలలో అందాన్ని కలం యేతాముతో తోడేస్తాడు .ఇది చాలక గుణితం లో గుణిస్తాడు .సాప్తిక ,ఆంద్ర సప్తిక విభక్తికం గా భక్త్యంజలి ఘటిస్తాడు ..చక్ర బంధ ,నాగ బంధ అనుప్రాస సీస ,ఆంద్ర గీర్వాణ భాశిక్య పద్యాలతో ఆనంద పులకామ్కితం గా చక్ర వర్ణన చేస్తాడు .రుక్మిణీ సందేశాన్ని అప్పుడు విని పిస్తాడు .అలాగే రుక్మిణి అందాలణు రుక్మిణీ కాన్తునికి విన్న విస్తాడు .ఇదంతా ఒక రసమయ లోకం లా ఉంటుంది .ఇక్కడ ఒక పద్యం హృద్యం గా రాస్తాడు

‘’అభ్ర విభ్రమము మధ్యమమునందే కాదు -పొందిన వేనలి యందు గలదు

  హరి మనోహరిత్వ మాస్యమ్బునందే కా—దనిశము పాలకుల యందు గలదు ‘’ అంటూ ‘’ముందు శ్రీత్వంబు భావంబు నందే కాదు –కర్ణముల యందు గలదు ‘’అంటూ ‘’ ఆ వరారోహ యాఖ్య చేత నె కాదు దేహ విభూతి నలరు ‘’అని ముక్తాయింపు నిస్తాడు .

          ఆమె పలకులు ‘’కు౦దమ్ములు   పలుకుదురున ,కుందంము లటంచు బల్కు గొన నౌ జేలికిన్ ‘’అని చెప్పుతూ ‘’కం దమ్ములు లు ఘన శోభా –కం దమ్ములు మారుని నంత గందమ్ములగున్ ‘’అన్న మాటలు ఆయన కంద పద్యాలకు అన్వ యించ వచ్చని పిస్తుంది .అందమైన కందం ,మా కందం ,మధుర నిష్యందం ,ఆనంద రస నిక్షేపం .

శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -5(చివరి భాగం )

రుక్మిణీ కృష్ణ పరిణయం

       శ్రీ కృష్ణుడు రుక్మిణి సందేశాన్ని విని పోతన గారు ‘’వచ్చెద విదర్భభూమికి ‘’అని చెప్పి నట్లు సంజీవ రాయ కవీ చెప్పాడు .’’వచ్చేద విదర్భ నృప వరాన భీష్మక కుండి నంబు ‘’అని చెప్పాడు .బ్రాహ్మణుడు బయల్దేరాడు .కృష్ణుడు ‘’సకలా రాతి చమూ సమూహ కలశా కూపార ,మందానమై ,పటు రుక్మిణ్య బాలా వివాహ కలనా ప్రారంభ సంధానమై ‘’బయల్దేరాడు కుండిన నగరానికి .

           చతుర్ధా శ్వాసం లో రుక్మిణి తాను పంపిన రాయ బారి కోసం ఎదురు చూడటం వెళ్ళాడో లేదో నని సందేహించటం తన సందేశం చెప్పాడో లేదో నని పోతన గారి రుక్మిణి లా సందేహించటం ఇక్కడా ఉంది.తర్వాత విరహం ,ఉప చర్యలు ‘’చక్కని దాన నంచు నేల జవ్వని నంచు సఖీ జనావళి ‘’అన్న పద్యం ముక్కు తిమ్మన గారి సత్య భామ పద్యం లా ఉంటుంది .ఆమె విరహాన్ని భరించలేక ‘’భైరవ కామ సుమాస్త్ర వేదనా శాలినిజంగ జాల గని హస్తాద్రికి చేరాడు .చంద్రోదయ వర్ణన కూడా సందర్భోచితం గా చేశాడు .’’ఆగ మిష్య త్శ్రిత య యామినీ నిటలాగ్ర దీపిత చందన తిలక మనగ ‘’లా ఉన్నాడు చంద్రుడు .రుక్మిణి పూర్ణ చంద్రుని పూజించి ‘’సిత భాసురాయ పూత వివిధ సుపరవిక పుణ్య దాయ దివ్య తారక మూర్తయే తే నమోస్తు ‘’అని సంస్కృత పదభూయిష్ట౦  గా స్తుతిస్తుంది .తర్వాత‘’పాపి ‘’అనే అదే రేంజి లో తెలుగు లో తిట్టి పోయింది .

          తర్వాత భానూదయం –‘’రుక్మిణీ కన్యకా వివాహ పూర్వ పరి ప్రేష్య వర చిరతర దీప్య మాన రత్నాకార దీపమనగా ‘’అన్నట్లు సూర్యుడు ఉదయించాడు .శ్రీ కృష్ణ భాగవానుడూ ఉదయించాడు .బ్రాహ్మణ ,సుదర్శన యోగమూ కలిగింది .వివరాలు తెలుసుకొని సంబర పడింది .గుండె దిటవు చేసుకొన్నది ..ప్రత్యుపకారం గా ‘’అంజలి ‘’ఘటించటం తప్ప ఏమీ చేయలేని అశక్తు రాలనని చెప్పి దీవన పొందింది .

శ్రీ కృష్ణుడు ఒంటరి గానే బయల్దేరాడు .తర్వాత ససైన్యం గా అన్న బలరాముడు వచ్చాడు .పోతన గారి లాగానే ‘’జతయా చక్రి విదర్భ రాజ సుతకున్ ,సత్యంబు వైదర్భియున్ జత ఈ చక్రికి నింత లెస్స యగునే ‘’అని పుర జనులనుకొన్నారు .భవానీ దేవిని దర్శించి ‘’మతి లో నమ్మితినే సనాతనుల నమ్మా ,మిమ్ము బ్రోచిన దంపతులుగా ‘’అని పోతన గారి రుక్మిణి ‘’నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమా మహేశులన్ ‘’అన్న పద్యాన్ని ప్రేరణ గా చెప్పాడు సంజీవ కవి .రుక్మిణిని అశ్వం పై చేర్చిన కృష్ణుడు ద్వారకకు చేరటం శిశుపాలుడు ఎదిర్చినా ఫలితం లేక పోవటం రుక్మి ఎదిరించి  శృంగభంగ మవటం మనకు తెలిసిందే

          ద్వారక లో గార్గ పురోహితుడు శుభ లగ్నం లో వివాహం జరిపించాడు .’’వృష రాశి జాత ,యాదవ వృషభుడు రుక్మి ణీ౦ద్రు తులయన్మిష చేత భార్గవి యయ్యెను దృశానే కాది పతయ మెసంగగె నుభయతన్ ‘’అని చెప్పి కవి తన జ్యోతిష పాండిత్యాన్ని చక్క గా జోడించాడు .తులా వృష భాలకు రాశి నాయకుడు ఒక్కడే అవటం భార్గవుడైన హరికి ,భార్గవి అయిన రుక్మిణి అని చమత్కరించాడు .’’హరి పతి యగు చుండగా మరి ,హరిణీ నామము ఘటిల్లి నది ‘’అన్నాడు .హరి ది గోరాశి .రుక్మిణిది తుల .షష్టా ష్టకం  .న్యాయం గా పనికి రాదు పొత్తు కుదరదు .కాని ‘’ఉభయైక స్వామికత్వం ‘’వల్ల దోషం లేదని తేల్చాడు .మానుష రూపం దాల్చిన కృష్ణుడు మాయి మూర్తి .మాయ లేనిది రుక్మిణి జగన్మాత .వారిద్దరి పరిణయం చేయటం తనకు పూర్వ పుణ్య ఫలమని గర్గుడు భావించాడు .వివాహం మన పద్ధతి లోనే జరిపించాడు .’’జానక్యాః కమలాంజలి ‘’అన్న ప్రసిద్ధ శ్లోకం లోనీ భావాన్ని ‘’రుక్మిణి పోసే ముత్యాలు కెంపు లై హరి శిరం పై పడి శుద్ధాలై శరీరం నుండి జారుతూ నీలాలై తలంబ్రాలు శోభించాయట .వధూ వరులు పేర్లు చెప్పుకోవటం ,పరమాన్నం తినటం పానుపు మీద తాంబూలాలు కొరకటం ,నాక బలి వగైరాలు పూర్తి చేశారు .తర్వాత గర్భా దానమూ చేయించాడు కవి .రుక్మిణీ కళ్యాణం ఈ విధం గా ఫలప్రదం అయింది .ఈ కథ వ్రాసినా ,విన్నా ,చెప్పినా శ్రీ కైవల్యం తప్పదని సంజీవ రాయ కవి భరోసా ఇచ్చాడు .ఇలా పోతన గారి పోకడా ,భట్టు మూర్తి అల్లికా ,వేంకటకవి చాతుర్యం త్రివేణీ సంగమం గా వర్ధిల్లిన కావ్యం ఇది .కవి సంజీవ రాయలకు ,మనకు ఈ దివ్య సంజీవినిని అందించిన వారి వారసుడు స్వర్గీయ గంధం వేంకా స్వామి శర్మ గారికి అంజలి ఘటిస్తున్నాను .రుక్మిణీ పరిణయ కావ్యం  భవ్యం దివ్యం –శుభం భూయాత్.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.