శ్రీ దాసు లింగమూర్తి -2
వివాహ ఉద్యోగాలు –దాసు గా అవతరించటం
గోదావరీ నదీ పాయ వశిష్ట గోదావరి ఒడ్డున విజ్జ్హేశ్వరం అనే గ్రామం లో నదికి ఆనకట్ట ,లాకులు ,నరసాపురం కాలువ ఉ౦డి,పరమ మనోహరం గా కనిపిస్తుంది .ఈ గ్రామ కరణం అల్లుడు ఒంటిమిల్లి వాసి ఎర్రమిల్లి వెంకట చలమయ్య కరణీకం చేస్తాడు ఈయన పెద్దకూతురు సంగమేశ్వరమ్మ ను లింగమూర్తి గారికిచ్చి 1914లో పెళ్లి చేశారు .మూర్తి గారు చదువు ముగించి ఉద్యోగప్రయత్నాలు చేసినా ఫలి౦చ లేదు.ఒక నాడు కాకినాడ స్టేషన్ లో షికారు చేస్తుంటే బాల్యమిత్రుడు కనిపించగా అయన తండ్రి డిప్యూటీ కలెక్టర్ నిట్టల రామమూర్తి నాయుడు కాకినాడ నుంచి కర్నూలుకు మారి .తనకొడుకుద్వారా మూర్తి గారి గురించి అడిగి తెల్సుకొని కర్నూలుకు వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు.ఆయన సిఫారసుతో మూర్తి గారు ద్రోణాచలం తాలూకాఆఫీసు లో 1915లో చేరారు .అప్పటినుంచి నాలుగేళ్ళు మార్కాపురం వగైరా చోట్లలో పని చేసి ,1919లో రెవెన్యు ఇన్స్పెక్టర్ అయ్యారు .రెండేళ్ళ తర్వాత అనంతపురం సెటిల్ మెంట్ రెవిన్యు ఇన్స్పెక్టర్ అయి రెండు చేతులా పుష్కలంగా డబ్బు సంపాదించారు .వీరికి రాముడు త్రిపురసుందరి ,కృష్ణుడు సంతానం .బీద బిక్కి కి సాయపడటం ,లోక సేవలో తరించటం వలన లింగమూర్తి గారిని’’ దాసు గారుగా పిలిచి జానం గౌరవించారు .
దిగంబర స్వామి
అనంతపురం బెల్గుప్ప గ్రామం లో ఒక దిగంబర పిచ్చోడు తిరుగుతూ ఒక కమ్మరివాడు పొయ్యిలో కొర్రు కాలుస్తూ ఆ దిగంబరుడి ఒంటికి వేళాకోళంగా కర్రుకాల్చగా ఆయన్ను ఏమీచేయ లేకపోవటం తో ఆయన్ను ‘’దిగంబర స్వామి ‘’అని ఆరాధించటం మొదలు పెట్టారు అక్కడి ప్రజలు .ఒకరోజు ఈ స్వామిఆ వూరి దేవాలయం లో ఉండగా దాసుగారు ఉద్యోగ బాధ్యత పై ఆ దేవాలయం లోనే విడిది చేశారు .ఆలయం దగ్గర పెద్ద గుంపు స్వామి చుట్టూ మూగి కోలాహల౦ చేస్తుండగా దాసుగారు రాగా,స్వామి చిరునవ్వుతో దాసుగారిని ఆప్యాయంగా కౌగలించుకొని ,ఆతర్వాత ఒక అరుగుపై పడుకొని స్వామి వెళ్ళిపోయారు .దాసుగారికీ ఏమి జరిగిందో చాలా సేపటిదాకా తెలీక స్మృతి రాగానే కళ్ళు తెరిచి చూస్తె స్వామీ ,ఆ జనమూ కనిపించలేదు .స్వామి కౌగిలింతలో తనకు ఒక స్వప్నం వచ్చిందని ,అందులో తన పూర్వ జన్మ వృత్తాంతం తెలియ జేయబడి౦దని దాసుగారు తన ఆ౦తరంగికులకు తెలియజేశారు .
ఆ కల వివరాలు –ఒక భయంకరారణ్య౦ లో పెద్ద పర్వతం దానిపై ఒకకుటీరం దాని ప్రక్క కోనేరు ,గొర్రెలు మేపెకుర్రాడు ఒక ముసలాయన ఉన్నారు .ముసలి బాలుడి దగ్గరకొచ్చి అన్న౦ కావాలని అడిగితె ,పైన కుటీరం లో తన తలిదండ్రులు పెడతారని చెప్పాడు .వాళ్ళను అడిగాననీ ఏమీ లేదని చెప్పారని తెలిపాడు .మూడు రోజులనుంచి అన్నం లేదని చెప్పి కూలబడ్డాడు .తాను మధ్యాహ్నం తినటానికి ఉంచుకొన్న రొట్టెముక్క, వెన్న తెచ్చి ముసలికి పెట్టాడు .అందులో సగమే తని మిగతా సగం ఆబాలుడిని తినమని చెప్పి ‘’అబ్బాయీ !ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టావు. నీ పుణ్యం ఊరికే పోదు .వచ్చే జన్మలో వేలకొద్దీ జనాలకు ఉపకారం చేస్తావు ‘’అని దీవించి వెళ్ళాడని ఆకల సారాంశం .
దాసుగారికి నాలుగవ సంతానం కమల పుట్టి14రోజులైంది భర్త ప్రేలాపన అవతారం చూసి భయపడి౦దిభార్య సంగమేశ్వరమ్మ .తండ్రికి టెలిగ్రాం ఇప్పిస్తే ఆయనవచ్చి ,ఉద్యోగానికి రెండు నెలలు సెలవుపెట్టించి ,తమతో పాటు తీసుకువెళ్ళాడు .ఆరోగ్యం బాగై మళ్ళీ ఉద్యోగం లో చేరారు .కానీ దిగంబరస్వామి ప్రభావంతో దీన జన సముద్ధరణపైనే మనసు లగ్నమై పోయింది.స్వామి అనుగ్రహం లో దాసుగారిలో దివ్య తేజస్సు ఆవిర్భవి౦చ గా ప్రజలు ఆయనవైపుకు ఆకర్షి౦ప బడ్డారు .
అన్న సత్రాల స్థాపన
అనంత పురమండలం లో 1923-24లో తీవ్ర క్షామం ఏర్పడింది .ప్రజలకు అన్నం నీరు లేక విలవిల లాడారు .ఇందులోనుంచి ప్రజలను బయట పడేయాలని సంకల్పించుకొని దాసుగారు ,తాను వెళ్ళిన ప్రతి ఊరులోనూ అన్నదానమహిమ చెబుతూ రోజూ ఒక్కమనిశషికైనా అన్నం పెట్టమని ఉద్బోధించేవారు .కులీన యాచకుడిని ఒకరిని నియమించి గ్రామంలో ఆహారం అడిగి తెప్పించి ,అందులో అతని సంసారానికి తగిన ఆహారం ఉంచుకొని ,మిగిలింది ఆగంతులైన బాట సారులకు పెట్టె ఏర్పాటు చేశారు దాసుగారు .ఎలాంటి ఆర్భాటం హడావిడి ప్రచారం లేకుండా ఈ అన్నసత్రాలు నిర్వహి౦పబడుతూ అన్నార్తులకు తృప్తి కలిగిస్తూ ,ఇప్పటికీ నిర్వహింప బడుతూనే ఉన్నాయి .పినాకిని పత్రిక ఈ అన్న సత్రస్థాపన గురించి 1924 ఏప్రిల్ 12 న ‘’లింగరాజు అనేవారు సుమారు రెండు నెలలక్రితం సెటిల్ మెంట్ ఇన్స్పెక్టర్ గా ఈ ప్రాంతానికి వచ్చి ,తాము వెళ్ళిన ప్రతిచోటా మంచి విషయాలు బోధిస్తూ చెడును వదిలిపెట్టమని హితవు పలుకుతూ ,సన్మార్గ ప్రవర్తకులు కావాలని చెబుతూ ,ప్రతిపల్లెలో నిరతాన్న దానం జరగాలని ,అన్నసత్రాలు స్థాపించారు .నేను కాంగ్రెస్ ప్రచారానికి ముదిగల్లు గ్రామం వచ్చాను నేనుచేయాల్సిన పనేమీ కనిపించలేదు .ఎందుకంటే అక్కడి ప్రజల ఐకమత్యం ,మిత్రత్వం వాత్సల్యం పాపభీతి ధర్మమార్గం నన్ను ముగ్దుడిని చేశాయి .ఇలాంటి గ్రామం ఇంతకూ ముందు నేనేప్పుదూచూడనే లేదు .దీనికి కారణం ఎవరై ఉండచ్చునా అని విచారించగా దాసు లింగమూర్తి గారు అనే మహనీయుడు అని తెలిసింది .వారి తత్వోపదేశం లో పరధనాపేక్ష ,,పరస్త్రీ సంగమం ,పరస్పర శత్రుభావాలను త్యజించమని ఉద్బోధిస్తున్నారు. వారిమాట త్రికరణ శుద్ధిగా ప్రజలు ఆచరిస్తున్నారు .ఈ కరువుకాలం లో ఈ ప్రాంతంలో నిన్నటివరకు 10అన్న సత్రాలు స్థాపించి ఆకలి గొన్నవారికి అన్నం అందిస్తూ మహామానవ సేవ చేస్తున్నారు దాసుగారు తన విధ్యుక్తధర్మ నిర్వహణ సంతృప్తిగా చేస్తూనే .ఇవాళ 11అన్నసత్రాన్ని కళ్యాణ దుర్గలో స్థాపిస్తున్నట్లు తెలిసింది .ఇలా ప్రతిగ్రామం లోనూ జరగాలని దాసుగారి ఆలోచన త్వరలోనే కార్యరూపం దాలుస్తు౦దనటానికి ఎలాంటి అనుమానమూ లేనేలేదు –సోంపల్లి వెంకటరమణయ్య చౌదరి -24-3-24-ముదిగల్లు .ఇలా దాసుగారు తన సంకల్ప బలం తో ,ప్రజల సహకారంతో 100 అన్న సత్రాలు స్థాపించి అన్న దానం చేసి పెద్దల పిన్నల బీద ప్రజల చేత కృతజ్ఞత పొందారు .
తారకనామ ఉపదేశం
పదేళ్ళ వయసుగల ఒక బాలయోగి తన చుట్టూ వందలాది జన౦ మూగిఉండగా ఊరూరు తిరిగాడు .ఊరివారు వాళ్లకు భోజనవసతులు కల్పించేవారు .ఒకరోజు దాసుగారు ఉండే చెట్టూరు గ్రామానికి వచ్చి ఒక చెట్టుకు ఉయ్యాల కట్టించు కొని ఊగు తుండగా దాసుగారు సైకిల్ పై వస్తూ౦డగా ఎంత పెద్దవాదినైనాఒరేయ్ అని పిలిచే బాలయోగి ‘’ఒరేయ్ .ఇక్కడికి రా ‘’అని పిలువగా ,ఆశ్చర్యపడి అతడు తనతోషికారు రమ్మంటే ఆయన గుర్రం మీదా ఈయన సైకిల్ పైనా రెండు మైళ్ళు వెళ్లి ఒక దిగుడు బావి దగ్గర దిగారు .దాసుగారిని ఏదైనా మంత్రం వచ్చా అని అడిగి ,రాదనీ చెప్పగా బాలయోగి తారకమంత్రం దాసుగారికి ఉపదేశించి అనుగ్రహించారు .అప్పటి నుంచి దాసుగారు అన్నసత్రాలతో తృప్తిపడకుండా శ్రీరామ సప్తాహాలు ,దేవాలయ నిర్మాణాలు జీర్ణాలయ ఉద్ధరణలు మొదలైన మహత్కార్యాలు కూడా చేబట్టారు .నిత్యం మానసిక పూజతో చిత్తాన్ని పరిపక్వం చేసుకొన్నారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -18-8-21-ఉయ్యూరు