ధూర్జటీ!

ధూర్జటీ!

శృంగేరి కి చెందిన శ్రీ యరికలపూడి సుబ్రహ్మణ్య శర్మగారు ‘’ధూర్జటీ ‘’శతకం రాసి ,శృంగేరి 34వ పీఠఠాదిపతులు శ్రీ శ్రీ చంద్ర శేఖర భారతీ తీర్ధ మహా స్వామివారికి అంకితమిచ్చారు .శర్మగారితో నాకుఎలాంటి పరిచయమూలేదు .కానీ వారుఆత్మీయంగా ధూర్జటిని మా ఇంటికి పంపగా ,అందిందనిఫోన్ చేస్తే ‘’మీ అభిప్రాయం రాయండి ‘’అని కోరారు .అందుకే  ఈస్పందన.పీఠం తరఫున ఆశీస్సులతోపాటు ,ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మ ,ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం ,ప్రొఫెసర్ ముది గొండ శివ ప్రసాద్ ,సామవేదం షణ్ముఖ శర్మగార్ల ఆశీరభినందనలు ఉన్నాయి .’’నామాట ‘’లో శర్మగారి  కృతజ్ఞతలున్నాయి .ధూర్జటీ అనేది మకుటం .

చక్కని ముఖ చిత్రాలతో ఉన్న ఈశతకం వెల 50రూపాయలు .

‘’వాగర్ధ ద్వితయైక విభవ రూపా ,నిన్ను సామాన్యదృ-గ్రాతీత ,నిరంతరౌప నిషదర్దా కార రోచి చ్ఛటా

ప్రాగాద్యష్ట దిశాదిప ప్రభ్రుతిదేవానీక సంధ్యార్చనా –భోగ స్వీకరణావ్యయా  కృతివి శంభూ కొల్చేదన్ ధూర్జటీ ‘’

ఈ ఒక్క పద్యం చాలు శర్మగారి కవితా వైదుష్యం తెలుసుకోవటానికి .

 హర కోదండం త్రు౦చిన  హరి ,హరుడిని మేరు ధనుర్విముక్త శరంగా అర్చించాడు ఈఇద్దరిలీల వర్ణించటం బహు కష్టం అన్నారొకపద్యం లో

‘’అనిలున్డైయినుడై మహానలుడునై యబ్జారియై,ఆత్మయై –వనమై ఆకసమై ,వసున్ధరయునై బ్రహ్మా౦డముల్ నిండి యే

ఘనుడానంద నటన్మనోహరుడు ప్రాకామ్యాష్టమూర్తి ప్రభ –న్మను,నా మూర్తిని ,నిన్ను నామనమునన్ ధ్యాని౦చెదన్ ధూర్జటీ ‘’అద్భుత రచన అనిపిస్తుంది .నడుము మీద చేతులు ఉంచుకొని నాల్గు దిక్కులా జటాజూటం ఊగుతుండే,ఉడు పథదృక్కు వైన శివుడు ‘’అంటే కవికి మహదానందం .అందుకే పరవశంతో రాశారు .

‘’నిను నజస్ర నాట్య పరిణీతు,నానారత సర్వ దేవతా –సన్నుతు ,శాశ్వతాగతను జారద సురూపు ,మహోరగాధినా

థోన్నయ  సద్గుణున్ ,బహు విధోక్త మహాత్వు ననంత యజ్ఞ సూ –త్రోన్నత దివ్య మూర్తి సహజోక్తి నుతింతు గ్రహింతు ధూర్జటీ ‘’

ఉదద్గిశా ధినాథ మిత్ర ,ఆది గృహస్థ శేఖర ,మృదంగవాది శ్రీహరీ ,సరీ సృపోత్తరీయ ,కౌముదీశ ఖండభూషణా,యమీ ,  మాలికా కృతాహిపాళీ,మాధి నాథమానితా ,నాగాధిరాజ కార్ముకా ,ప్రమర్దతాసుర త్రయీ ‘’వంటి విశేష పద బంధాలతో ధూర్జటిని సాభిప్రాయంగా వర్ణించి స్తుతించారు కవి శర్మగారు .

‘’టంకంపు౦డకటో౦కులి౦క విడి,యాట౦కంబు లూటాడ నీ –బి౦క౦ బింక సడల్చి లెంక నను రావే గావ ‘’పద్యం బహు సొగసుగారాశారు .నాద రహస్యం తెలీకపోయినా ‘’సుస్వరరాగా మంజరీ మెదుర గానుపున్ శ్రుతుల మేకొని ‘’తానూ విహరించాలని కోరుతున్నారు.

‘’శివ హరు దక్క ఖండ శశి శేఖరు దక్క ,కృతాంత శాసక –ప్రణవ మహా౦ఘ్రిదక్క ,నటరాజును దక్క మహాహి శింజినీ –రవ దళితారి దక్క –గరలగ్రహణప్రతి షేదితాఖిలార్తివి నీవు దక్క ‘’అని హరుడే తప్ప తనను కాపాడేవాడు లేడు అని చక్కని దక్క పద్యాన్ని ఢక్కా బజాయించి చెప్పారుకవి .

మరో హరార్పిత కమనీయ పద్య బిల్వదళం –‘’శరమై వాహనమై ,శరీరామున తా సవ్యార్ధమౌ భార్యయై –కిరియై ,మోహినియై ,మృదంగ వహన క్రీడా సమార్చుడౌ’’ అరవిందాక్షుడు స్వీయనేత్రమిచ్చి పూజించాడు ‘’.ఆత్మకుమధ్య ప్రాణం అనీ ,ఆధ్వనికీ ప్రాణానికి మధ్య ఆత్మ అనీ ,నాదానికీ ,ఆధ్వనికీ ఆపైన ఉన్న నిన్ను నాదత్మగా అంటారనీ వేదాన్తపరిభాషలో ఉత్పలమాల అల్లి శివుని మెడలో వేశారు .

‘’ఇంగల మొండుకంట,నిను ,నిన్దుని తక్కిన  కంటి జంటగా గంగ నెత్తిపైనా ,పునుకలు మెడలో చేతిలో జింక ఉన్న  త్రినేత్రుడు’’సింగపు తత్త డి౦గలుగు చిన్నది సంగడి కత్తె,కాపురం కడ వీట’’ఉన్నా ‘’మ్రొక్కిన గావగముందు నుండు నీకుం గల గుండె మెత్తనకుకోటులు దండము లయ్యదూర్జటీ ‘’అని అన్ని విచిత్ర సంగతులతో ఉన్నా ధూర్జటి’’ యద మెత్తన ‘’అనటం కవి అనుభవమే .

‘’సనందన ప్రధాన శిష్య సంఘ సంశాయాపహా – మనోభవ ప్రభావ భంగ మాన్యు పావకా౦బకా

జనార్దనాబ్జ సంభవాది సర్వ దేవసన్నుతా –  మనస్వినీ సమాదృతాంగ మౌని పాహిధూర్జటీ ‘’అని పంచ చామరం తో పద్య వింజామర వీచారు  .

చెలికత్తెలు పార్వతితో మేలమడే సందర్భంగా ,ప్రశ్నోత్తరమాలికా ఉత్పలమాల అయిదు పాదాలు –‘’’’

‘’నీ మగడింత తెల్లనటే-నిక్కము చక్కని వాడే ,గాని తా –నీమమటేజడల్నుదుట నేల ధరించే చిచ్చు  – ముచ్చటే ,-పాముల దండలున్ డమరు పాణినిదాల్చుచు నిల్చు తీరు నీ కే మనిపించేనే ?’’అని నవ్వుతుంటే చెలులు ‘’మందహాస సస్యామల గౌరీ గాంచు భవదాస్య రుచిన్నుతి యింతు ధూర్జటీ ‘’ఆది మిథునమైన అమ్మా, అయ్యల దిద్దరిదీ చిరునవ్వే సమాధానం  అనటం మహా చమత్కారం.

మదినిండా శివుడు కొలువై ఉంటేనే వచ్చే పద్యాలలో మరో మణిపూస లాంటి పద్యం –

‘’మానన్మానను మాననే మానస రామావామ సీమా రమా –జుని ప్రార్ధిత నిత్య దక్షిణ ముఖా ,సంమౌని సంస్తుత్య వే-దానీ కానన కాననావ పథ నాదాకార పంచాస్య ‘’నన్నునిరంతరం కనిపెడుతూ ఉండు అని వేడుకొన్నారుకవి .శివుడు –

‘’అతడు విరాగి ,రాగి ,సమయాను నయామిత భోగి ,యోగి ,సం-గత నియతామితా నుగత గాత్రయు గైక విభాగి ‘’అలాంటి యోగికి ‘’సాగి నేనతని నుతింతు సంతత శయాను హృదంత రర్చితా తపపతితావనున్ పతిని తత్పరతన్ గురు మూర్తి ధూర్జటీ అని బహు సొగసుగా పద్యం చెప్పారు .

  ధనుష్యాగ్రణి యైన దాశరధి సిద్దాశ్రమదగ్గర అసాంఘిక రక్షస్సంఘాన్ని ఆనాడు నిర్మూలనం చేస్తే –అలాగే ‘’ఆహార్యోగ్ర ధన్వీ మనో –ధ్యాన స్థాన విహరివై  షడరులన్  ద్వంసంబు గావి౦పుమీ –నీ ,నా సందిది వీడ రాని ముడి తండ్రీ పాహి ధూర్జటీ ‘’అంటూ ఆయనకూ తనకూ ఉన్న ఆ బంధనపు ముడి బయట పెట్టారు కవి .

శార్దూలం లో చాలా ఆర్తిగా –

‘’శాపా౦త౦ బెపు డౌను నాకు గిరిశా,సాయం మహా నాట్య వే-ళాపార్శ్వ్య ప్రియ వర్తినై తమకు వ్యాళాలంకృతుల్  దీర్చు మ

ద్వ్యాపారాన పునః ప్రవేశపు డార్యాపాంగ మందస్మిత –శ్రీ పారమ్యరహో విహార ,కవితా శ్రీ మూర్తి నా ధూర్జటీ ‘’

పద్యాలన్నీ ఆత్మ వేదనా భరితాలు, ధూర్జటి మహత్వ సంపన్నాలు ,భక్తి భావ మందారాలు ,ఆర్తి భావ మంజూషాలు .శతకమంతా ధూర్జటి వర్ణనమే ఉండటం మరింత ఇంపు కూర్చింది .లోకం లోని రాజకీయాలు ,కరోనా ,కోవిడ్ విహారాలు అవినీతి వగైరా ల జోలికి పోకుండా శతకం అంతా ధూర్జటి మాయం చేయటం మహదానందంగా ఉంది .అన్ని రకాల వృత్తాలూ చుట్టారు కవిత్వం లో .

ఇంతకూ ఈ కవిగారు సౌత్ వెస్ట్రన్ రైల్వే –హుబ్లి లో చీఫ్ యార్డ్ మాస్టర్ గా పని చేసి రిటైరయ్యారు .వీరికి ఇంతటి కవిత్వ సంపద అలవడం చూసి అవాక్కౌతాం .వీరిది గుంటూరుజిల్లా సత్తెనపల్లి తాలూకా ,కృష్ణా తీరగ్రామం –కామేపల్లి .బెజవాడ ఎస్ ఆర్ ఆర్ . కాలేజిలో పియుసి ,లయోలాలో బిఎస్ సి చదివారు  .గురువులు –శ్రీ శిష్ట్లా లక్ష్మీ కాంత శాస్త్రి గారు ,శ్రీ చెరుకుపల్లి జమదగ్ని శర్మగారు అని చెప్పుకొన్నారు .వీరి ఆరాధన జ్ఞానమూర్తి –శ్రీ శ్రీ శ్రీ భారతీ మహా తీర్ధ మహాస్వామి వార్లు.శర్మగారు త్వరలో ‘’మంజుఘోష’’ అనే ఖండ కావ్యం వెలువరిస్తున్నట్లు తెలిపారు  .

 బెజవాడ లో శ్రీ ఎరికలపూడి గోపీ నాథ రావు గారు అనే మంచి పద్యకవి ఉన్నారు సరసభారతికి ఆప్తులు వారు .వీరికీ ఈ  శతకకర్త యరికలపూడి  శర్మగారికీ ఏమైనా బంధుత్వం ఉందేమో తెలీదు .

  శ్రీ వరలక్ష్మీ వ్రత శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-8-21-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.