మట్టి పువ్వులు
గా ,హోసూరు బస్తీ యువక బృందం డా అగరం వసంత్ కూర్పరి గావివిధ ప్రాంతాలకు చెందిన 61మందికవులురాసిన 15వ ‘’కవితల పొత్తం’’ ఈ సంవత్సరం ప్రచురించి కృష్ణ గిరి జిల్లా తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు కీ .శే .కలువకుంట నారాయణ పిళ్ళే కు అంకితమిచ్చి౦ది .ఈ పుస్తకాన్ని వసంత్ నాకు పంపి దాదాపు నెల రోజులయింది .ఇప్పుడే చదివి స్పందిస్తున్నాను .
పలమ నేరు బాలాజీ ‘’కల్లోలకాలం లో కవిత్వం కాసింత ఊరట నిచ్చింది ‘’అంటూ ముందుమాట రాయటమేకాక ‘’మనుషుల్ని నాటవలసిన కాలం ఇది,మనుషులు పండాలి ,మొలకెత్తాలి ,దయ ప్రేమ కరుణ ప్రశ్నించటం వాళ్ళ ఆనవాళ్ళు కావాలి ‘’అని కవిత కూడా కూర్చాడు. డా ఎన్. గోపి’’నేనొక యా౦టిక్’’అవుతున్నా అని బాధపడ్డాడు ‘’కాలపేటిక ‘’లో .పిళ్లే మరణానికి విచారిస్తూ ‘’నాకు మీ స్మరణ నేస్తం –సంస్మరణ నేస్తం’’అని గుండె బరువుతో అన్నాడు .’’భావం అర్ధమైతే చాలు –భాష బతుకు తుంది ‘’అని ఆశించాడు విజయకుమార్ .శ్రీ కాట్రగడ్డ ‘’ప్రకృతినేమారుస్తూ –ప్రకృతోత్సవాలు జరుపుకుంటున్నాం –సత్యాన్ని సమాధి చేస్తూ –స్వతంత్రులమనుకొంటున్నాం’’అని మన న౦గనాచి తు౦గ బుర్రల్ని కడిగేశాడు .చలపాక ప్రకాష్ ‘’ప్రాణాలన్నీ మాస్క్ వెనక దాగున్నప్పుడు –ఎన్ని సాని టేషన్ల నిప్పుల్లో చేతులు కడుక్కోవాలి ?’’అని సూటి ప్రశ్న వేసి ‘’అంటరాని తరం వెలివాడ ఇప్పుడు కొత్తకాపురం పెట్టింది ‘’అని బాధపడ్డాడు .’’కనిపించే సౌందర్యం వెనక –అజ్ఞాత వేదనలు ‘’గుర్తించినకవి రజిత .’’మట్టి తవ్వి పిసుకుతాడు –సారిపట్టి తిప్పుతాడు- కొలిమిలోకాలి సమ్మెటేత్తి బాది-తిత్తిపోయి, జబ్బుపట్టి’’మనోడే మన తోడబుట్టినోడే-భారతమ్మకు కన్న బిడ్డడే ‘’అని వ్యధ చెందాడు దేశరాజు .’’పాపం ఉప్పెనలా ఎగిసింది –అవతరించు దేవా –ధర్మాన్ని కాపాడు ‘’అని వేడుకొన్నాడు రాజారావు .
‘’దృశ్యాదృ శ్యాలమధ్య –దగ్ధమౌతున్నాను ‘’ అనే ఆవేదన డా ఉప్పలధడియం ది.’’కొత్త ఏడాది లోనైనా –ఆశలు చిగురించి –ఆశయాలు పుష్పించి ‘’ఫలించాలని ఆశ పడ్డాడు పంతుల వెంకటేశ్వరరావు.తాడినాడ కవికి ‘’కొత్త ఆశలే వసంతం –ఆరురుతువుల సమ్మేళనమే జీవితం –కలిమి చెలిమి పై బలిమి ‘’ఒక దాని వెంట ఒకటి రావాలని కోరిక ..’’తల్లడిల్లే వాతావరణ౦ కాదు –రెప్పలా కాపాడే రాచరికపు ఎత్తుగడ ‘’కావాలని సరిహద్దు పోరాటాలపై ప్రభుత్వ తీరు గురించి అంటాడు జోగారావు .’’ఆంధ్రుడి కంటి వెలుగు –అచ్చతెలుగు ‘’అని మురిసిపోయాడు కుమారస్వామి రెడ్డి .’’జీవన భ్రమణం లో చింతలకు హారతులిచ్చి –ఆనందాన్ని ఆహ్వానించ’మని సుసర్ల శిరీష కోరింది .రోజంతా ఆకలితో ఉన్న ముసలాడికి ఒకావిడ అన్నం వేసింది .ఆబగా తిన్నాడు ‘’ఇంతలో పలమారింది- ఎక్కిళ్ళతో ఊపిరాడలేదు –‘’తాగేందుకు ఎక్కడా నీరులేక అలమటించి ఉసురు పోయింది ‘’అని బాధా తప్త హృదయంతో గుడిమెట్ల చెన్నయ్య ‘’ఆకలి ‘’ ని వర్ణించాడు .’’ఒక పలకరింపు –వేయింతల చేయూత ‘’జీవితసత్యాన్ని డా టి.రంగస్వామి ప్రకటించాడు డా. రాధశ్రీ ‘’ముందుతరం నాకు దారిద్ర్య భాగ్యం అందిస్తే –నేను నా తరువాతి తరానికి భాగ్యమనే –దారిద్ర్యాన్ని అంటగడుతున్నాను’’అని నేటి వ్యవస్థ స్థితికి అద్దంపట్టాడు .కూచిపూడి నాట్య కళాకారిణి శోభానాయుడు ‘’ఓ శిల్ప కళాకృతి –ఆమె అభినయం ఓ అపూర్వస్మృతి ‘’అని నివాళు లర్పించాడు ఆకుల రఘురామయ్య ..’’మూకుమ్మడి మృత్యు మాతృకలను ముట్టి చూస్తుంటే -.సంరక్షణే ప్రాధాన్యమన్న దిశా నిర్దేశం ‘’వడలి రాధా కృష్ణకు ‘’మసక చీకటిలో కారుమబ్బుగా మిగులుతూనే కనిపించింది .
‘’భిక్షగాడి గా మారలేక-పర్యావరణ రక్షకుడుగా మారిన అతడి పేరు –రేషన్ కార్డు లో మాత్రం లేదు .కానీ ‘’ఎక్కడెక్కడి ప్లాస్టిక్ అంతా అతని వెన్నెల సంచీలో చేరిపోతుంది –వైరస్ యుగం లో –ఆత్మ గౌరవం ఆత్మ విశ్వాసం తో ‘’లోకం నేర్వని ఎన్నో కొత్తపాఠాలు చూశాడు బి .శంకరరా.బహుశా ఇలాంటి కవిత్వం ఎవరూ రాయలేదు అనిపించి౦దినాకు మాత్రం .’’శక్తి స్వరూపిణి మగువ –ఆమెజీవితం కలకాలం విరబూసిన కలువ ‘’కావాలని ఆశపడింది మారుతీ దేవి .శొ౦ఠి వెంకట రమణ కు ‘’పూరిపాకలే పేణాలకు సొర్గ సీమలు-పల్లెలయందం-పవిత్రానందం ‘’.జ్ఞాన వయో వృద్ధకవి నంద్యాల నారాయణ రెడ్డకి ఆఫీసర్లకు గ్రాసం తోపాటు లంచాలూనూ ‘’కావాలని తెలిసి ‘’వేయిటయోటాలు ,వెయి డకోటా లు తయారు చేస్తార్రా ?-ఏదీ –మీ జాగ్రత్త అంతాకలిపి ఒక్క టమేటా ,ఒక్క సపోటా ,ఒక్క వడ్ల గింజ నో –తయారించి చూడండ్రా ‘’అని సవాలు విసిరారు రైతుకవికనుక మట్టికవికనుక .
చిలుకూరి దీవెనకు ‘’నల్లమబ్బులు –కరువు రైతుల మెడకుఉరితాడుగా ‘’కనిపించి ,’’తెల్లని మనసుతో –చల్లగా నవ్వు తున్నట్లు-రైతుల ఆశల శిశువుకు –ఊపిరి పోస్తున్నట్లు ‘’వాన పడుతోందట .చాలాసహజ వర్ణన .దక్షిణాఫ్రికాలో గాంధీని ఫస్ట్ క్లాస్ రైల్వేబోగీ నుంచి ప్లాట్ ఫాం పైకి నెట్టిన జాత్యహ౦కారం పడగ విప్పిన చోట ,గాంధీ విగ్రహం పెట్టి ఆ స్టేషన్ కు ‘’గాంధీ స్టేషన్ ‘’గా మార్చిన ఉదంతాన్ని కవిత్వీకరించి వై హెచ్ కే మోహనరావు ‘’గాంధీని మహాత్మునిగా మార్చిన –ఒకటవ తరగతి బోగీ –మెడబట్టిన జాత్యహంకార హస్తమా –అందుకోండి కోట్లాది గళాలకృతజ్ఞతలు –అవధులు దాటిన జన నీరాజనాలు ‘’అని పరవశించి పాడాడు .
‘’ఏమైనా మనిషి ఒక వింత మనిషబ్బా –దేవుడైనా దయ్యమైనా వాడిలోన ఉందబ్బా ‘’ అంటూ మానవుని స్ప్లిట్ పర్సనాలిటి ని బయటపెట్టాడు మధురాంతకం శ్రీధర్ .’’హృదయాన్ని పూలపాన్పు చేసి – ప్రియుడికోసం ఎదురు చూస్తోంది సిరివరపు అన్నపూర్ణ ‘’మధు పాత్ర ‘’తో .’’ఆప్త వాక్యం అవిభాజ్య కవల ‘’గా గోచరించింది సుంకోజి దేవేంద్రాచారికి .కవిత్వం కోసం ఎక్కడెక్కడో వెతకనక్కర్లేదు ‘’రైతులకు అండగా –శ్రామికుడికి బాసటగా –కార్మికుడికి మద్దతుగా –పీడితునికి దన్నుగా ‘’ఉండు చాలు ‘’అప్పుడు సూర్య చంద్రులిద్దరూ –నీ గదిలోనే కనిపిస్తారు ‘’అంటాడు గొడవర్తి శ్రీను .పార్టీ మారిన వాడు ‘’ఇపుడు నేను బినామీని –ప్రస్తుత పార్టీ లోఎనిమీని’’ –అని లబోదిబో అంటాడని శ్రీకా ఉవాచ .
ఇలా వైవిధ్యం తో పలువురు కవులు ఈసంకలనం లో రాశారు .కొందరు ఆమనికిస్వాగత౦ పలికితే ,కొందరు తల్లిభాష పై ప్రేమ ప్రకటిస్తే ,మరికొందరు గాధీమళ్ళీ పుట్టాలనికోరితే ,ఇంకొందరు రైతు ను బుజానికి ఎత్తు కొ౦టే ,మిగిలినవారు తెలుగుకు పట్టిన తెగులుకు విచారించారు .అన్నీ మంచి కవిత్వాలే అందరూ అభిన౦దనీయులే .చక్కని శీర్షికలే .నాకు ‘’స్ట్రైకింగ్’’ గా కనిపించిన వాక్యాలే ఉదాహరి౦ చాను అంతే . బస్తీ మే సవాల్ లాగా బస్తీ నుంచి మరిన్ని అర్ధవంతమైన రచనలు వెలువడాలనీ,హోసూరు తెలుగు కలకాలం వర్ధిల్లాలనీ , డా వసంత్ సాహితీ సేవలు మరువరానివని తెలియ జేస్తున్నాను .ఎప్పుడూ కవితల పొత్తం లో చివరికవితగా తనకవిత వేసుకొనే వసంత్ కవిత ఈ సారి లేకపోవటం కాస్త ఆశ్చర్యం కలిగించింది . మీ –గబ్బిట దుర్గాప్రసాద్ – 21-8-21 –ఉయ్యూరు