శ్రీ దాసు లింగమూర్తి -5
భార్య మరణం
దాసుగారు భార్య ప్రసవం కోసం అత్తారింటికి తీసుకు వెళ్ళారు .కొద్దిరోజుల్లోనే ఉబ్బు వ్యాధి వచ్చింది .రాజమండ్రిలోని ఘోషా ఆస్పత్రికి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశారు దాసుగారు సెలవు పెట్టి వచ్చేసరికి మామగారు ఆమెను సవారీ బండిలో రాజమండ్రి తీసుకు వెడుతుండగా భార్య కాస్త కాఫీ ఇమ్మని చెప్పగా తయారు చేయించి ఇస్తే దాసుగారు ఆమె పెదవులకు అందించగా ఆమె సంతృప్తితో కన్ను మూసింది .బండీలో నుంచి ఆమె శవాన్ని ది౦పి౦చి ,ఆమె తలను తన తొడపై ఉంచుకొని దీర్ఘాలోచనలో మునగగా అందరూ గొల్లుమన్నారు .దాసుగారు తన ఇష్ట దైవం తో బాధ చెప్పుకోగా ఆయన వేదాంత వచనాలతో ఊరడించి ,అందరికిధైర్యం చెప్పి ఉత్తర క్రియలు యధావిధిగా నిర్వర్తించారు .
ద్రాక్షారామ కోటి పత్రిపూజ
భార్య మరణానికి సెలవుపై వచ్చిన దాసుగారికి అకస్మాత్తుగా ద్రాక్షారామం లో కోటిపత్రి పూజ చేయాలని ఆలోచనవచ్చి ,ఆషాఢ అమావాస్యకు అక్కడికి చేరి ,మర్నాటి నుంచి కోటిపత్రి పూజ ప్రారంభమౌతుందని తెలియ జేశారు .చేతిలో చిల్లిగవ్వ లేదు .అప్పటికే నాలుగు బస్తాల మారేడు దళాలు వచ్చాయి. మర్నాడు సప్తగోదావరి లో స్నానం చేసి ,భీమేశ్వరాలయం చేరి తాము తెచ్చిన జలాలతో విఘ్నేశ్వరునికి అభిషేకం చేసి ,బ్రాహ్మణులతో పూజా సంకల్పం చేయించి అందర్నీ ఆశ్చర్యపరచారు .పూజారులతో సహా ‘’ఈ వవెర్రోడికి ఎంత తోస్తే అంత ‘’అని సణుగుడు మొదలుపెట్టగా దాసుగారు ‘’ఇది అమ్మ మాణిక్యాంబ సంకల్పం నాదికాదు .బిక్క వోలు పూజలో ఉన్నప్పుడే నన్ను ఆహ్వానించింది అనటానికి ఈ జోగావదానులే సాక్షి .ఈయనే ఆమెతరఫున నాదగ్గరకు దూతగా వచ్చారు .దీనికికర్త లోకాధినాధుడు ఫాలాక్షుడు భీమేశ్వరుడే .నేను తప్పెట వాయించే వాడినే .అమ్మవారే దీనికి పూనుకొన్నది .ఈశ్వర సంకల్పం నిరాటంకంగా జరుగుతుంది అనుమానం వద్దు ‘’అన్నారు .
ఇంతలో బిక్కవోలు నుంచి ఒక బ్రాహ్మణ దంపతులు రాగా ,వారిగోత్రనామాలతో పూజ మొదలు పెట్టించారు .ఆక్షణం నుంచి జనం అడగకుండానే ముందుకు వచ్చి తోచిన ద్రవ్యం అందించారు .దీనికి విఘ్నం కలిగించటానికి ధర్మకర్తను లోబరచుకొని కొందరు తప్పతాగి వచ్చి దాసుగారిని కొట్ట బోగా,ఆయన ఉపన్యాసం వినగానే మంత్రముగ్ధమైన పాముల్లాగా అయిపోయి పూర్తి సహకారం ఇచ్చారు .అంతగొప్పకార్యక్రమం ఎప్పుడూ జరగలేదని అందరూ వేనోళ్ళ దాసుగారిని స్తుతించారు .పూర్ణాహుతిలో పది వేల రూపాయల విలువగల హోమ ద్రవ్యాలు సమర్పింప జేసి , నభూతో అనిపించారు .పిఠాపురం లో అత్య౦త వైభవం గా కోటి పత్రి పూజ నిర్వహించిన గరిమెళ్ళ విశ్వనాధ శాస్త్రిగారు చివరి రోజున ఇక్కడికి వచ్చి పూర్ణాహుతి సమయంలో ‘’మహత్కార్యం చేసి విజయం సాధించావు నాయనా ‘’ అని ఆశీర్వ దింఛి దాసుగారిని ఆప్యాయంగా కౌగిలించుకొని ఆనందా శ్రువులు రాల్చారు .ఈపూజా దినాలలో దాసుగారు చిన్న పంచ మొలకు చుట్టుకొని ఉపన్యసించేవారు .జనం రాత్రీ పగలు లేకుండా తండోప తండాలుగా వచ్చి చూసి విని ధన్యత చెందారు .ఒక రోజు వారి ప్రవచనం –‘’ముసలమ్మను(మాణిక్యాంబ ) చూడటానికి వచ్చారా నాయనలారా!శంకర భగవత్పాదులు ప్రతిష్టించిన శక్తిపీఠంఇది .2వేల ఏళ్ళు యోగ నిద్రలో ఉన్న భీమేశ్వరుని మేల్కొల్పి ఈ దేశవాసులు ధర్మహీనులై ప్రవర్తిస్తున్నారు .వీరిని ఆదుకో నాధా’’అనగా భీమేశ్వరస్వామి నన్ను చూసి ‘’ఒరేయ్ !టముకు వేయట౦లొ నేర్పరివి .మా ఆలయానికి వచ్చి సింహద్వారం ముందు ‘’భీమేశ్వరునికి కోటి బిల్వార్చన ,మాణిక్యాంబ కు కోటి కుంకుమ పూజ ‘’అని ఎలుగెత్తి చాటిస్తూ డప్పు మోగించు ‘’అని ఆనతివ్వగా ఇక్కడికి వచ్చిమీకు తెలియజేశాను .నేను సన్యాసినీకాను దిగంబరుడినీకాను .నిర్బల,కురూపిని .గోచిపాత రాయుడిని .నాదగ్గర పైసా లేదు కానీ ఈకార్యానికి రోజుకు వేలకొద్దీ రూపాయలఖర్చు .ఇది దక్షుని యాగం భగ్నమైన చోటు .మీకంటేనివిధాలా అతి తక్కువవాడిని నేను .నేనే ఈ కార్యం సంకల్పిస్తే, మీరు ఇలాంటివి ఎన్నైనా చేయగల సమర్ధులు అని గుర్తించండి ‘’అని చెప్పారు నూరు రోజుల మహా క్రతువు అత్యంత వైభవంగా ముగిసింది .దాసుగారికి చివరి రోజున ఘనసన్మానం చేసి సన్మానపత్రం రాయించి చదివించి గౌరవించారు .
ఈకార్యక్రమం ముగిశాక జీర్ణమైన భీమేశ్వర ఆలయ గోడలు బాగు చేయించారు పురజనులందరూ కలిసి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-8-21-ఉయ్యూరు