శ్రీ దాసు లింగమూర్తి -6(చివరిభాగం )
ముక్తీశ్వరం ,చంద్రవరం
గోదావరి మండలం లో కమలాపురం రాజోలు తాలూకాలు రెండు ఉద్యానవనాలు .విద్యలకు ఆటపట్టు ,ప్రకృతి సంపదకు నిలయం .ద్రాక్షారామ తర్వాత క్షణ ముక్తీశ్వరం లో దాసుగారు ఒక సప్తాహం వైభవంగా జరిపారు .కవిపండితులంతా దాసుగారికి బ్రహ్మ రధం పట్టారు .ఒకసారి రాజమండ్రి పడవ మీద వెళ్లాలను కొంటె అది వెళ్ళిపోతే .కనపడిన దారిగుండా నడుస్తూ చంద్రవరం చేరారు .ప్రజలు ఆదరంగా ఆహ్వానించి ‘’ఇది మీ పూర్వుల గ్రామం .అన్ని చోట్లా మహాకార్యాలు చేశారు ,ఇక్కడ కూడా ఏదైనా ఒక సత్కార్యం చేయండి ‘’అని కోరగా ,ఒక కాపు నూట యాభై ఏళ్లుగా రామాలయం ఇక్కడ కట్టించాలని అనుకొన్నా జరగలేదు మీరు ప్రయత్నించండి అని కోరగా ‘’నువ్వు ఎంత చందా ఇస్తావు ?’’అని అడిగితె ఒక అణా చేతిలో పెట్టాడు .దానితో ఒక టెంకాయ తెప్పించి దగ్గరలో ఉన్న రామమందిరానికి వెళ్లి ,రాముడిపటానికి నమస్కరించి కొబ్బరికాయకొట్టి నైవేద్యం పెట్టి ,లోపలి గరుడ స్తంభం ఫోటో తెచ్చి ,ఒక ఇంట్లో ఉంచి ,పూరిపాకలో ఉన్న మందిరాన్ని ఊడ దీయించారు .కాసేపటికే అది నేల మట్ట మైంది .ఆరాత్రి పునాదులు తీశారు .
మర్నాడు ఉదయం ఆరువందల రూపాయలు ,చందాల వివరాలు దాసు గారి చేతిలో పెట్టగా దాన్ని తీసుకోకుండా ,ఒకసంఘాన్ని ఏర్పాటు చేసి వారికిచ్చారు .రామమందిరం ఆఘమేఘాలమీద పనులు జరుగుతున్నాయి .అప్పుడే పాలపర్తి సూర్యనారాయణగారు దాసుగారిని చాగలమర్రి కి తీసుకు వెళ్ళటానికి వచ్చారు .అందరితో పాటు భజన చేసి శ్రీమంతులు పునాదులు త్రవ్వుతుంటే ,అగ్రవర్ణ స్త్రీలు భజన చేస్తుంటే ,చూసి ఆశ్చర్యపోయారు .అక్కడి నుంచి రాత్రి 12 గంటలకు ప్రయాణానికి రైల్వే స్టేషన్ కు వెడితే ,అక్కడ దాదాపు మూడువందలమంది జనం చేరగా ,అయిదారుగంటలలో దాసుగారు ఆరు ఉపన్యాసాలు ఇచ్చారు .ఒక్క కాసు కూడా కూలీ తీసుకోకుండా అగ్రజాతి స్త్రీలు సంపన్నుల గృహిణులు భజన చేస్తూ సున్నపు గానుగ త్రిప్పి సున్నం తయారు చేసి రామలయ నిర్మాణం పూర్తీ చేశారు .ప్రతిష్టకోసం దాసు గారి రాకకై నిరీక్షిస్తున్నారు .
చాగలమర్రి
చాగలమర్రికి దాసుగారు శుక్ల సంవత్సర మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చారు అంతకు ముందు ఆగ్రామం లో రెండు నెలల నుంచి ఒక సాదువున్నాడు .ఆయనకు బావిలో సాలగ్రామం దొరికితే శ్రద్ధగా పూజిస్తున్నాడు .ఆ సాలగ్రామం తనకు ఇవ్వమని సూర్య నారాయణ గారు కోరితే దాసు గారు వారించి’’ఇది ఉత్కృష్ట లింగం సామాన్య గృహస్తు భరించలేడు.దేవాలయం లో ప్రతిష్టించాలి అని చెప్పారు .దగ్గరలో ఉన్న చెన్న కేశవ దేవాలయం లో ఉన్న ఖాళీ మందిరానని అప్పటికప్పుడే బాగు చేయించి ఆరాత్రి 12 గంటలకు అమావాస్య మంగళవారం నాడు ప్రతిష్టించి మూడవరోజు ఈ భవానీ శంకర లింగానికి బిల్వార్చన చేశారు .
చెన్న కేశవాలయం1350లో చోళ రాజ ప్రతిష్టిత పురాతనాలయం అని శాసనం ఉంది .భూవసతిలేక పూజా పుంస్కారాలు కనీసం దీపారాధన కూడా జరగటం లేదు .దాసుగారి లింగ ప్రతిష్టతర్వాత జనం లో కదలిక వచ్చి 5వేల రూపాయలు చందా వసూలు చేసి శాశ్వతం గా గాపూజ జరిగే ఏర్పాటు చేశారు .దాసుగారి లింగ ప్రతిష్ట ప్రభావమే ఇదంతా అందరి భావన .
సురభేశ్వరీ కోన సప్తాహం
సెలవు పూర్తయ్యాక దాసుగారిని కంభం తాలూకా రాచర్ల ఫిర్కా రెవిన్యు ఇన్స్పెక్టర్ గా బదిలీ చేశారు .రాగానే జమదగ్ని మహాముని ఆశ్రమం ,కోటి లింగాలకు ఉనికిపట్టు ,గండకీ నదీ తీర ప్రదేశం అయిన సురభేశ్వరీ కోన లో వైభవంగాసప్తాహం చేశారు .అహోబిల క్షేత్రం యొక్క దీన స్థితి దాసుగారికి వివరించి ,పెద్దలు ఏదైనా ఉపాయం ఆలోచించమని కోరగా ,మాఘ శుద్ధ సప్తమి మంచి ముహూర్తంగా భాగవత ప్రశ్న ద్వారా భావించి 26-3-1931అహోబిల క్షేత్రం లో సప్తాహం చేయటానికి నిశ్చయించారు .జియ్యరుగారి సలహా సంప్రదింపులతో అది నిర్విఘ్నంగా పూర్తయింది .
సమాప్తం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-5-21-ఉయ్యూరు
శ్రీ దాసు లింగమూర్తి దాసు గారి భగవన్నామ సంకీర్తనలు చాగలమర్రి భక్తసమాజం వారు నేటికీ పాడుతూనే ఉన్నారు –