కవిపండిత ,విమర్శకుడుకేరళపాణిని- రాజరాజ వర్మ
రాజరాజ వర్మ కోయిల్ తంపురాన్ అని అసలుపేరు .రాజ వర్మ తంపురాన్,కోయి తంపురాన్ వగైరా లన్నీ రాజవంశస్తుల్ని కేరళ రాజ బంధువుల్ని సూచించేవి .1863లో రాజవర్మ తిరువనంతపురానికి ఉత్తరంగా చెంగనా శేరిలోని లక్ష్మీపురం లోని రాజప్రాసాదం లో జన్మించాడు .హైదరాలీ దండయాత్రలనుంచి తప్పుకొవటానికి అనేక రాజకుటుంబాలు మలబారు ప్రాంతం నుంచి తిరువనంతపురం చేరాయి .కాంది శీకులుగా తలదాచుకొన్నారు .వీరిని తిరువనంతపురం రాజు ఉదారంగా ఆదరించాడు .ప్రశాంత పరిస్తితులేర్పడినా చాల మంది వెనక్కి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయారు .రాజవంశం తో వివాహాలు ఏర్పాటు చేసుకొన్నారు .అలాంటి బాంధవ్యం ఏర్పాటు చేసుకోన్నవారిలో రాజరాజ వర్మ కుటుంబం కూడా ఉంది.
రాజరాజ వర్మ తల్లి కున్జిక్కవు తమ్ తమ్పురాట్టి సాహిత్య సామ్రాట్ కేరళవర్మ పెత్తల్లి కూతురు సద్గుణ రాశి .తండ్రి వాసుదేవ నంబూద్రి పట్టియం ఇల్లం గ్రామస్తుడైన వేద విద్వాంసుడు హాస్య చతురుడు .ఆకాలం లో బ్రాహ్మణ నంబూద్రి కుటుంబాలకు ,క్షత్రియ నాయర్ కుటుంబాలకు వివాహ సంబంధాలుండేవి .బాల్యం లో రాజవర్మను కొచ్చత్తాన్ అంటే చిట్టిబాబు అని పిలిచేవారు .ఇతడు రెండేళ్ళ వయసులో ఉండగా రాజ అంతఃపురం లో కలతలేర్పడ్డాయి .ఆకారణంగా కొందరు రాజ సంబంధీకులు చెంగనా శేరికి 20మైళ్ళ దూరం లోని కార్తికపల్లి కి వలస పోయారు .అక్కడ కేరళవర్మ రాజరాజలకు ఇబ్బందులేర్పడ్డాయి. తర్వాత మహారాజు సహాయం తో హరిపాదులో కొత్త ఇంట్లో చేరారు .దీన్ని అనంతపురం రాజ ప్రాసాదం అన్నారు .ఇక్కడే రాజరాజవర్మ బాల్యం గడిచింది .విద్యాధికులైన మేనమామలప్రోత్సాహం తో , తల్లి ఆశీస్సులతో బాల్యం ఇక్కడ హాయిగా గడిచింది .చిన్నతనం లో రెండు గండాలుగడిచి గట్టేక్కాడు.రాజభవన ప్రాంగణం లోని కొలనులో పడవలో విహరిస్తుంటే తలక్రిందులై నీటిలో మునిగిపోయారు వర్మా, బంధువులబ్బాయి ,పనిపిల్లా .కొనూపిరితో బతికి బయట పడ్డారు. మరోసారి పాములు బాగా తిరిగే తోటలో కుడి కాలుపై ఏదో పడి నట్లు అనిపించి క్రమమగా కాలు వాచిపోతుంటే భయం తో ఇంటికి చేరాడు .అది పాముకాటే అని నిర్ధారించారు. ప్రాణాలు దక్కాయి .ఇలా రెండు గండాలు గడిచిన గండర గండడు రాజవర్మ.
విద్యాభ్యాసం
రాజవర్మ చదువు సంప్రదాయ బద్ధంగా సాగింది .చునక్కర అచ్యుత వారియర్ ,,శంకర వారియర్ ప్రాధమిక గురువులు చదువుకంటే ఆటలపై ధ్యాస ఎక్కువ .కనుక నాయకుడయ్యాడు బాలలకు .స్వయంగా తెలివి తేటలు అధికం కనుక ఎక్కువ సేపు చదవకుండానే అన్నీ వచ్చేసేవి .రాజవర్మకంటే మేనమామ కేరళ వర్మ 18 ఏళ్ళు పెద్ద వాడు .అప్పటికే ప్రతిభావంతుడైన రచయితగా కేరళ వర్మ ప్రసిద్ధికెక్కాడు .తిరువనంతపురం రాజుతో ఉన్న తగాదా వలన గృహ నిర్బంధం లో ఉండాల్సి వచ్చింది .తర్వాత అలేప్పీ నుంచి హరిపాదుకు తరలించారు .దీనివలన మళయాళ వాజ్మయం గొప్ప లాభం పొందింది .మేనమామ సమక్షం లో రాజవర్మకు సంస్కృతం నేర్చుకోవటానికి గొప్ప అవకాశం లభించింది .ప్రసిద్ధ సంస్కృత సందేశ కావ్యమైన ‘’మయూర సందేశం ‘’కేరళవర్మ దుర్భర భార్యా వియోగ దుఖాన్నిఅనుభవిస్తూ హరిపాదులోరాశాడు ఆరేళ్ళకాలం లో రాజరాజవర్మ సంస్కృత కావ్యాలలో నిష్ణాతుడై,కవిత్వం లోనూ సిద్ధహస్తుడయ్యాడు ఒకసారి గురువు శిష్యులు ముగ్గుర్నీ గణపతిపైఅష్టకం రాసి మధ్యాహ్న౦ రెండు గంటలకు చూపించాలని ఆదేశించారు .ఇద్దరుశిష్యులు వెంటనే మొదలుపెట్టి ఆతర్వాత తోచక బుర్రలు గోక్కుం టు౦టే,రాజవర్మ చివరి నిమిషం వరకు ఏమీ రాయకుండా మధ్యాహ్నం రెండు అవబోతుంటే గభాల్న గుర్తుకొచ్చి అష్టకం రాసేశాడు .మొదటి శిష్యుడి కవిత్వం లో కొన్ని దోషాలున్నాయనీ రెండో వాడి కవిత్వం సంతృప్తిగా ఉందని చెప్పి రాజవర్మను తన అష్టకాన్ని బిగ్గరగా చదవమంటే మొదట్లో భయపడినా చదివాడు
.గురువు రాసిన అష్టకాన్ని కూడా తెప్పించి వర్మమనే చదవమన్నాడు .ఇద్దరూ నవ్వుకొన్నారు ఒకర్ని చూసి ఒకరు .గురువు కవితాస్థాయిలో శిష్యుడు వర్మ కవిత్వమూ ఉన్నది. మేనమామ కేరళ వర్మ మేనల్లుడి కవితాప్రాభవాన్ని మెచ్చుకొన్నాడు మేల్లుడూ ఖుషీ అయ్యాడు .గురు,శిష్యుల అష్టకాలకు నకళ్ళు రాయించి కవి పేర్లు తెలపకుండా తన అన్నగారికి పంపాడు. గురు కవిత్వం తో పాటు సమాన స్థాయిలో వర్మకవిత్వం ఉందని తేల్చాడు అన్న. రాజవర్మకు గొప్ప బహుమతులు లభించాయి .అప్పుడతనివయసు 15మాత్రమే. ఏలాత్తూరు రామస్వామి శాస్త్రిగారు కేరళ వర్మకు గురువు ఒకసారి రాజ ప్రాసాదానికివచ్చి కేరళవర్మ శిష్యుల ప్రజ్ఞా పాటవాలను పరీక్షించాడు .అప్పయ్య దీక్షితులు రాసిన కువలయానందం అనే అలంకార గ్రంధం లో ‘’అద్యదపి ‘’శ్లోకం తో మొదలుపెట్టి కొన్ని శ్లోకాలు చదివి ,వాటిని వివరించమని కోరారు .పసివాడైన రాజవర్మ వివరించిన విధానానికీ చేసిన వ్యాఖ్యానానికీ ,తెలిపిన అంతరార్దానికి పరవశించిపోయి ,ఆశ్చర్యంతో మనస్పూర్తిగా అభినందించాడు .బాల్యం లోనే సంస్కృత కవికి ఉండాల్సిన ప్రతిభా సామర్ధ్యాలు రాజరాజ వర్మకు అలవడినాయి.సంస్కృత ఛందో వ్యాకరణాలలో అపార పాండిత్యం సాధించి ,అసామాన్య ప్రజ్ఞా దురీణతతో కవిత్వం రాసి కుటుంబీకులను ఇతరులను మెప్పించాడు .
1880లో తిరువనంతపురం సంస్థానానికి విశాఖం తిరునాళ్ రాజు అవటం తో కేళవర్మ కు అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది
రాజప్రాసాద వాసులకు మంచి ప్రోత్సాహం లభించింది .కేరళ వర్మ తిరువనంత పురం మళ్ళీ చేరాడు .విద్వత్ కవి రాజరాజ వర్మ కు రాజుతో సన్నిహిత సంబంధం ఏర్పడింది .రాజవర్మను ఆహ్వానించి విద్యను కొనసాగించమని రాజు కొరాడు.రాజరాజ వర్మ ఇద్దరు విద్యార్ధులతో కలిసి ఇక్కడికి వచ్చి ,’’చంగానా శేరి మూడత్తు మఠం’’లో చేరి ,ఉన్నతపాఠశాలలో విద్య కొనసాగించాడు .ఇదంతా మేనమామ కేరళవర్మ ప్రోత్సాహమే .1881లో ఇక్కడ చేరిన వర్మకు కొన్ని బోధనాంశాలు అర్ధం కావటం లేదు .లెక్కల్లో పది శాతం కంటే తక్కువ మార్కులోచ్చినా సగటు మార్కులు ఎప్పుడూ 70శాతం కి తగ్గనేలేదు .ప్రధానోపాధ్యాయుని ప్రత్యెక సిఫారసుతో పైతరతికి ప్రమోటయ్యాడు .ఇప్పుడు మళయాళం కూడా నేర్వాల్సి వచ్చింది.వర్మకు ఆభాషా వ్యాకరణం పై ఆసక్తి పెరిగింది .ఉపాధ్యాయుడు దీనికి తగినట్లు బోధించేవాడు .ఆరోజుల్లో మలయాళానికి విద్యలో తక్కువ స్థానం ఉండేది .వర్మకూడా అలానే భావించాడు .సిలబస్ కూడా విసుగ్గానే ఉండేది అందుకే చులకన భావం ఉండేది అందరికీ .
మహారాజు విద్యార్ధుల్ని ప్రోత్సహించటానికి సంస్కృతం లో ఎనిమిది పేజీల వ్యాసం రాయమని పోటీ పెట్టాడు .ఉత్తమ వ్యాసానికి గొప్ప బహుమతి .ఆ వ్యాసాలను మొదట రాజు పరిశీలించి ,తర్వాత కేరళ వర్మకు పంపాడు .రాజరాజ వర్మ రాసిన వ్యాసమే ఉత్తమమైనదిగా ఆ ఇద్దరూ ఏకగ్రీవ అభిప్రాయంతో ప్రకటించి గొప్ప బహుమతి అందించారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -29-8-21-కాంప్ -బాచుపల్లి -హైదరాబాద్