కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన-2(చివరి భాగం )
ఆంధ్ర చాళుక్యులు జైన మఠాలను,కానీ జైన గ్రంథాలను కానీ తగలబెట్టినట్లు ఆధారాలు లేవు .9వ శతాబ్ది కి చెందిన’’కవి రాజ మార్గం ‘’అనే ఛందో గ్రంథం వడ్డారాధన కంటే ప్రాచీనమైనది .వాన్చియార్ అనే శాస్త్రవేత్త తెలుగులో ఛందో శాస్త్రం రాశాడని అందులో ఉంది .కానీ ఇది అలభ్యం .క్రీశ 855లో అసగ కవి కుమార సంభవం రాశాడని చాలామంది చెప్పినా ,అదీ దొరకలేదు .దొరికి ఉన్నట్లయితే నన్నె చోడుని కుమార స౦భవంతో పోల్చటానికి వీలయ్యేది .
వడ్డా రాదన లోని జైనమునులు దేవ ,మానవ ,తిర్యక్ ,అచేతనాలు అనే నాలుగు ఉపసర్గలను జయించి ,ధ్యానం తో ముక్తిపొంది’’ఉపసర్గ కేవలులు ‘’అని పించుకున్నారు .వీటిలోఅనేక జన్మల వరకు ఎన్నో కథలు వడ్డారాధన లో ఉన్నాయి .ఎప్పుడో జన్మాంతరం లో బంధువైన ఆడనక్క మూడురోజులు పీక్కు తింటున్నా ,జైనుడు ఓర్పుతో సహించి సమ్యక్ జ్ఞానం ,సమ్యక్ దర్శనం సమ్యక్ చరిత్ర లను పొందినవాడు సుకుమారస్వామి .సుకౌసలస్వామిని జన్మాంతర ద్వేషం తో ఒకపెద్దపులి తింటున్నా ఓర్చుకొన్న కథ మరొకటి.వాతపిత్త శేష్మాది 700 వ్యాదుల్ని తట్టుకొని సమాధి పొందిన వాడు సనత్కుమారజైనుడు .
ఎర్రగా కాలిన బండపై కూర్చుని వేసవి వడగాలుల్ని ఓర్చుకొని సద్గతి పొందాడు వృషభ సేన భటారుడు . దేహం లో బాణాలు నాటుకొని దుర్భర వేదన అనుభవిస్తూ ధర్మ ధ్యానం తో రత్నత్రయం పొందినవాడు ‘’దండ కరిసి ‘’..గానుగలో వేసి పిండుతున్నా ,ఓర్చుకొని మహేంద్ర దత్తాచార్యుడు మొదలైన 500 మందిజైన ఋషులు సద్గతిపొందినట్లు శ్రీ ఆర్ వి ఎస్ సుందరం కన్నడ సాహిత్య చరిత్రలో రాశారు.
తెలుగులో 14శతాబ్దిలో వచ్చిన సింహగిరి వచనాలు వడ్డారాధన తో పోల్చలేము .19వ శతాబ్ది మధిర సుబ్బన్న దీక్షితులుగారి కాశీ మజిలీ కథలతో పోల్చవచ్చు అది కూడా కథాకథన వైచిత్రి తోనే పోలిక, విషయం లో కాదు ..తల్లావఝల శివ శంకర స్వామి బుద్ధుని జాతకకథలను తెలుగులోకి అనువదించారు .జైనమత కథలు తెలుగులో రాలేదు .10వ శతాబ్ది కన్నడ ప్రజల సామాన్యజీవనం, ఆట పాటలు ,ఆచార వ్యవహారాలూ వడ్డారాధన చదివి తెలుసుకోవచ్చు అనిదీనికి ముందుమాటలు రాసిన శ్రీ రామమోహన రాయ్ అభిప్రాయ పడ్డారు .వడ్డారాధన లోని 19కథలను తెలుగులోకి అనువదించినవారిలో –డా.టి నారాయణ ,డా కే ఆశాజ్యోతి ,శ్రీ బాలాజీ ,డా జిఎస్ మోహన్ ,డా జి రాజేశ్వరి ,శ్రీ రంగనాథ రామ చంద్రరావు ఉన్నారు ..అనువాదాలు సరళంగా ఉన్నాయి హాయిగా చదివి ఆనందించవచ్చు .ఇలాంటి అరుదైన సాహిత్యాన్ని అందించిన కేంద్ర సాహిత్య అకాడెమి కి అభినందనలు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-21-ఉయ్యూరు