అగస్త్య లింగ శతకం -2(చివరి భాగం )
మల్లికార్జున శాస్త్రి రెండవ భార్య కొడుకు పుట్టగానే చనిపోగా ,కళ్ళికోట కు చెందిన మీనాక్షమ్మను తృతీయం చేసుకొని అయిదుగురు కుమారులను పొందాడు .మల్లికార్జున గారి శిష్యులు వరంగల్ చాందా ,నాగపూర్ ,కామిఠీ,ఆశనపర్తి సీతం పేట ,కోరుపల్లి మొదలైన చోట్ల ఉన్నారు .మల్లికార్జునగారు –అచ్చతెనుగు హరిశ్చంద్రోపాఖ్యానం ,కూకడ మారయ్య కదా ,శ్రియాలుని కథ ,రౌద్ర సత్తెక్క కథ ,మిధున రామయ్య కథ ,సిద్దేశ్వర శతకం ,భజనకీర్తనలు ,రామేశ్వర యాత్రా తటస్థ క్షేత్ర దేవతా పంచరత్నాలు ,అష్టకాలు రాశారు .హరిశ్చంద్రోపాఖ్యానం నుంచి మచ్చుకు ఒక పద్యం –
‘’తలనాకసపు జాలు ,,మొలను బెబ్బులి తోలు –మేన వెన్నెల డాలు మేరుగులీన
చేత కంకాటి తుండు సికను జాబిలీ తుండు –నెడను తాచుల పిండు కుదురు దనర
నుదుట మండేడికన్ను ,పెదవి నగవు చెన్ను –కురువులండలి యన్నుకులుకు గదుర
పూప జక్కవ రేని ,రూపు ననెన్నగరాని –జడల క్రొమ్ముడి జిగి సౌరు చెలగ
తెల్లముగా చంక నొక జింక పిల్ల నిడుక –పూన్కపల్లెరమొక చేత బూని మిగుల
మత్తల్లిన తెల్ల గిత్త నెక్కి –కనికరంబు న నా మ్రోల గానుపించె’’.
మల్లికార్జునుడు నిత్యం 21,600 జపం చేసేవాడు .ఆతపో ఫలితంగా శ్రీముఖ సంవత్సర మాఘ బహుళ చతుర్దశి మహా శివరాత్రి నాడు లింగోద్భవ సమయం లో ,శిష్యుల సందేహాలు తీరుస్తూ శివ సాయుజ్యం పొందాడు .లింగైక్యం చెందాక,వరంగల్ లోని చిదరవారు లింగ ప్రతిష్టాదులకు ,గ్రంధ ప్రచురణకు పూనుకొని నెరవేర్చారు .
అగస్త్యలింగ శతకాన్ని మల్లికార్జున ఆరాధ్యులు
‘’శ్రీ గిరిజా సతీ చిత్తాబ్జ రోలంబ –భక్త హృత్పద్మినీ భానుబింబ
తారకాచాలవాస తారతారక భాస –భూరి శైలస రాస-బుధవిలాస
ఇందు ఖండన వతంస ఈడిత ముని హంస –యాహి భూషి తా౦స సంహత నరు శంస
హర గణ పరివార హత పురాసురవార –శరనిధి తూణీర శర్వ ధీర
పరమపావన నామ సద్భక్త ధామ –అభయ విశ్రాణన సుశీల అజిన చేల
అంగజ విభంగ పరమ దయాంతరంగ –ఈమని అగస్త్యలింగ బాలేందు సంగ ‘’
అంటూ ప్రారంభించి ‘’ ఈమని అగస్త్యలింగ బాలేందు సంగ ‘ అనే మకుటాన్ని మకుటాయమానంగా పెట్టాడు .
పద్యాలన్నీ పరుగుదీస్తాయి –పులితోలు మొలకట్టు ,తెలిగట్టు నీ పట్టు ‘’అంటూ పట్టు పడతాడు .తర్వాత శివతాండవం వర్ణించాడు .త్రిపురాసుర సంహార విజ్రు౦ భణ కన్నులకు కట్టించాడు .’’నేరమా నినువేడ భారమా నను బ్రోవ బీరమానాతోడ ‘’అని నిలదీశాడు .శివుని పంచముఖాలు పంచభూతాలకు ప్రతీకలన్నాడు .పంచముఖాలతో తానూ పంచ విషయాలు గ్రహించగా ఆయన చిదానంద రూపంగా వెలుగుతున్నాడట .శివభక్తుల చరిత్రలన్నీ విప్పి చెప్పాడు .ఒక భక్తుడు భార్య చర్మం వొలిచి చెప్పులు కుట్టి ఇచ్చాడు .ఒక భక్తుడిని బానిసనుఇమ్మని అడిగితె దభార్యనే ఇచ్చాడు
‘’నీ మన్కి నా యున్కి ‘ఒక్కటే అన్నాడు .’’సురపతి సురముఖ సురవర చయమకుటమనికిరణ పద కమల యుగళ’’అంటూ గుక్కతిప్పుకోకుండా సీసాలు రాసే నేర్పుకవిది భక్తి పరవశంతో చెప్పినపద్యాలు .సముద్ర మధనం లో విషం పుడితే అందరూ భయంతో పారిపోతే ‘’నువ్వు తొడరి భుజించ గా అమృతము పుట్టిన్దన్నాడు .’’వేదాంత వేద్యాయవిమలాన్తరంగాయ –మౌని హృన్నిలయాయ తే నమోస్తు ‘’అని భక్త్యాంజలి ఘటిస్తాడు .బెజ్జమహాదేవికి కొడుకుగా పెరిగావు .గొడగూచి భక్తితో ఇచ్చిన పాలు తాగావు బాణాసురుని వాకిటి కాపలా కాశావు కన్నప్ప పుక్కిలించిన నీళ్ళు పోస్తే అభిషేకంగా భావించావు ఇలాంటి భక్త సులభుడు లేదు అన్నాడు .నీభూషణం పాము నీకొడుకు వాహనం ఎలుకను తినటానికి ,మీకొడుకు కుమారస్వామి వాహనం నెమలి నీ పాముల్ని తినటానికి ,నీభార్య పార్వతి వాహనం సింహం గజాన్ని కొట్టటానికి ,నీభార్యలు సవతిపోరు,ఫాలాగ్ని చంద్రుడిని బాధ పెడుతూ ఉంటె ఎలా తట్టుకొంటున్నావు సామీ ‘’’కుటు౦బ కలహాలతో విసిగి విషం తాగుతున్నావేమో ‘’అని చమత్కరించాడుకవి .
ఆరు మొగాల శూరుని కొడుకుగా ,ఆరక్షరాలు మంత్రంగా ,ఆరుపద్మాలలో ఆరు లింగాలుగా ఆరు చక్రాల అవతల జ్యోతిస్వరూపుడివిగా వెలుగుతున్నావని ఆరు సంఖ్య సార్ధకత వర్ణించాడు .నీకన్నా గొప్ప దేవుడే ఉంటె నిన్ను మహాదేవుడు అని ఎందుకంటారు అని సమర్ధిస్తాడు .అన్ని చక్రాలసస్థానాలను వర్ణించాడు ’ .తన సీసపద్యాల చివర గీత పద్యాలు రాయటాన్ని సమర్ధిస్తూ –‘’చెరకునకు వంకబోయిన చెడదు తీపి –యనుచు బల్కెడి లోకోక్తి ననుసరించి
సీసపద్యాళి సుమమాల జేసి నీదు –కంఠమున దాల్ప నొసగితి కరుణ దాల్పు ము ‘’అని చివరి పద్యం చెప్పాడు కవి .
తర్వాత ఇష్టలింగాన్ని పంచరత్న సీసాలతో స్తుతించాడు. ఆతర్వాత శివ భజన కీర్తనలు వివిధరాగాలలో కూర్చాడు .
గొప్ప శతకం ఇది మహా భక్తుడు రాశాడుకనుక ఉదాత్తంగా ఉత్తమోత్తమగా భక్తి భావ గర్భితంగా సరళంగా నడిపించాడు కవి ధన్యుడయ్యాడు .శివ భక్తులకు వరప్రసాదం అగస్త్య లింగ శతకం .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-9-21-ఉయ్యూరు