శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారిది ‘’చదువు తీర్చిన జీవితం ‘’
ఒక సామాన్య మహిళ ఆత్మ కథ గా శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మగారు తన జీవిత చరిత్ర రాసుకొంటే ,కృష్ణా జిల్లా తెన్నేరు వాసి సాహిత్య ,విద్యోపజీవి మాన్యమిత్రులు శ్రీ దేవినేని మధుసూదనరావు గారు తమ తల్లిగారి పేర ఏర్పరచిన ‘’దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ ‘’తరఫున జులై 2020లో మొదటి ,ఏప్రిల్ 21 రండవ ముద్రణ చేసి అందించారు .దీన్ని నాకు మొదటి దానితర్వాత పంపారో రెండవ ముద్రణ తర్వాత పంపారో తెలీదుకానీ ,హాయిగా నా పుస్తకాలమధ్య నిద్రపోయింది పార్సిల్ కూడా విప్పబడకుండా .ఇవాళ ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే దర్శనమిచ్చింది .రచయిత్రి తో నాకు పరిచయం లేదు ఎవరు పంపారో చూస్తె మధుసూదనరావు గారు అని అర్ధమై ,కాస్త తీరిక దొరకగానే చదివేశాను .ఒక మధ్యతరగతి మహిళ తాను కావాలంటే ఎలా ఎదిగి జీవితాన్ని సార్ధకం చేసుకో గలదో అందరికీ మార్గ దర్శనం చేసే పుస్తకమని పించింది .
ఈ పుస్తక రచనకు నేపధ్యం ,ప్రేరణ తో ప్రారంభించి ,తన మరణం ఎలాసార్ధకం కావాలో తెలియ జేస్తూ ముగించారు శేషమ్మగారు. మధ్యలొఎన్నెన్నొ మజిలీలు ఎత్తుపల్లాలు ఆత్మీయుల ఎడబాటు ,అన్నిటినీ తట్టుకొంటూ జీవిత ధ్యేయాన్ని నేరవేర్చుకొన్న సార్ధక జీవి శేషమ్మగారు .నిత్య విద్యార్ధిని ఆమె .ఉపాధ్యాయ వృత్తి చేబట్టిన అదృష్ట శీలి. 78వ పడిలో కూడామనవల విద్యాభి వృద్ధికోసం తన విద్యను సార్ధకం చేస్తూ పాటుపడుతున్న నిత్య విద్యా శ్రామికురాలు .కూతురు సలహాతో తన జీవితానుభవాన్ని జోడించి రాసిన పుస్తకం .కనుక కరదీపికగా నిలిచింది .
ఇటీవలి కాలం లొఆడపిల్లల్లొ పెరుగుతున్న అసహనం ఆమెను కలవరానికి గురి చేసింది .ఆడంబరం ,అట్టహాసంగా పెళ్ళిళ్ళు చేసుకోవటం ,కట్టు’’కొన్న’’వాడి తో వివిధకారణాలతో కాపురం చేయలేక తిరిగి పుట్టింటికి’’ బాక్ టు పెవిలియన్’’ గాఅతి త్వరలోనే రావటం చూసి బాధపడ్డారామే .సహనం లేకుంటే కుటుంబాలు నిలబడవు అని నిర్మొహమాటం గా చెప్పారు .ఈమెకు తల్లి గర్భం లో ఉన్నప్పటి నుంచి సాహిత్య౦ వంటబట్టి ,తండ్రి ఇచ్చే సలహాలతో జీవితం తీర్చి దిద్దుకోవటం అలవాటైంది .కాలేజీలో చదువుతుండగానే శ్రీ హరినాధ బాబు గారితో 14వ ఏట వివాహం ,చదువు కు గంట కొట్టబడి ,భర్తకు ప్రమోషన్ కోసం ఒకపరీక్షకు తయారు చేయించి ,ఆయన పాసవ్వగానే ఆమెకోరినట్లు హిందూ పత్రిక చందా కట్టి దానితో ఆమె, ఇంటిల్లిపాదీ విద్యా విజ్ఞానాలు సంపాదించారు .
స్వయం బోధనా ,నిరంతర శ్రమతో బిఏపాసై శేషమ్మగారు విశ్వనాథపుస్తకాలతో ఆత్మబలం ,మనో ధైర్యం పెంచుకొని ,విమర్శనాత్మక దృష్టి అలవడి ,కీట్స్ షెల్లీ కవిత్వాలతో నిత్యసత్యాలు గ్రహించి ,సంసారం పెరిగి వారి ఆలనాపాలనలో మురుస్తూ ,ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అన్న సామెతకు అర్ధం తెలిసి అమలు జేస్తూ ,అనుకోకుండా వచ్చిన టీచర్ ఉద్యోగం లో చేరి ,మొదటిసారే పదవ తరగతి కి సాంఘిక పాఠం ధైర్యంగాబోధించి హెడ్ మన్నన పొంది ,ఆతర్వాత భర్త ట్రాన్స్ ఫర్ లతో ఎక్కడుంటే అక్కడ అందివచ్చిన స్కూళ్ళలో టీచర్ గా పని చేస్తూ 16సంవత్సరాలు విద్యాబోధన చేశారు .
జీవిత భాగస్వామిని కోల్పోయినా ధైర్యాన్ని పుంజుకొని ,మంచి వార్తాపత్రికలు ,పుస్తకాలు చదువుతూ ,జీవితం అంటే ఏమిటో చర్చించి తెలుసుకొని ,మనకూ పాఠం చెప్పారు .చివరగా మరణం కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిపారు .చావు మెలకువ రాని నిద్ర అన్నారు .ముగింపుగా మరణం దేవుడు జీవికి ఇచ్చే స్వేచ్ఛ అంటారు శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ.ఎన్నో నీతులు ,జీవిత సత్యాలు ,మార్గదర్శక సూత్రాలు ,తన అనుభవ సారం తో నింపిన శేషమ్మగారి జీవిత చరిత్ర ఇది .
శేషమ్మగారి సార్ధక జీవితమైన ఈ పుస్తకాన్ని అందంగా ముద్రించి లోకానికి అందించిన శ్రీ మధు సూదనరావు గారిని అభినందిస్తున్నాను .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-21-ఉయ్యూరు