త్రికోటీశ్వర చరిత్ర
త్రికోటీశ్వరాన్ని కోటప్పకొండ అంటారు .గుంటూరుజిల్లా నరసరావు పేటకు సుమారు 10కిలోమీటర్ల దూరం లో ఎల్లమంద ,కొండ కావూరు గ్రామాల మధ్య ఉంది .దీని చుట్టుకొలత ‘’అడుగు తక్కువ ఆమడ ‘’అంటారు .కానీ మూడు క్రోసులే ఉంటుంది వైశాల్యం 15వందల ఎకరాలు .ఎత్తు1587అడుగులు .600అడుగుల ఎత్తులో శ్రీ కోటీశ్వరస్వామి దేవాలయం ఉంది .దీనీపైన పాత కోటప్ప గుడి ఉంది ఇప్పుడు ఎవరూ అక్కడికి వెళ్ళటం లేదు .ఇక్కడ GT సర్వే స్టేషన్ ఉంది .ఇది ఫారెస్ట్ రిజర్వ్ లో ఉంది .ఇక్కడ వనమూలికలు పండ్లు వంట చెరకు దొరుకుతాయి .నీటి దొనలు,భయంకర గుహలున్నాయి .చిరుతల, దొంగల ఆటపట్టు .
ఈ పర్వతానికి మూడు సోపాన మార్గాలున్నాయి .ఒకటి పాప వినాశన స్వామి గుడి కింద. పడక దారి అంటారు ,ఎల్లమంద సోపాన మార్గం అంటారు . .రాజుగారిఒంటెలు ఎక్కే మార్గమిది .రెండవది ఇప్పుడు అందరు నడిచేమార్గం దీన్ని రాజా నరసింహరాయని౦ గారు సుమారు 150 ఏళ్ల క్రితం నిర్మించారు.మూడవది దీనికి కుడిప్రక్క ఉన్న రాధా కృష్ణ సోపానమార్గం . ఈ పర్వతం పై నీటి వసతికోసం దోనెలు నిర్మించారు .వీటిలో నిర్మలమైన నీరు ఉంటుంది .యాత్రికుల స్నాన ,పానాలకు ఉపయోగం .
పాత కొటీశ్వరలయానికి దగ్గరలో ఎద్దుఅడుగు అనే చోట బసవేశ్వరుడు తపస్సు చేసినట్లు ఐతిహ్యం .పాత కోటీశ్వర గుడికి ఉత్తరాన ఫర్లాంగు దూరం లో ‘’పుర్ర చేతి దోనే’’ ఉంది ఇందులో ఎడమ చెయ్యి తప్ప కుడి చెయ్యి పట్టదు .మంచి నీళ్లుంటాయి . .పాత గుడికి తూర్పున ‘’ఉబ్బు లింగం దోనే’’ ఉంది .దీనికి సూర్య రశ్మి తగలదు కనుక నీరు చాలా చల్లగా ఉంటుంది .ఇక్కడ రామ లింగం అనే లింగం ఉండేదట .పాప వినాశనస్వామి గుడిదగ్గర ఒక దోనేదీనికి ఉత్తరాన గాడిద దోనే ,మారెళ్ళశల కు దగ్గరలో ఒక దోనే,ఎల్లమంద ,కొండ కావూరు పొలి మేరలో పాల దోనే బుంగ దోనేకాడి దోనే,చిన్న దోనే,హనుమంతుని లొద్దిదోనే,పాప వినశన స్వామి గుడికింద ఒక దోనే (ఇప్పుడు మూసుకు పోయింది )అని మొత్తం 13 దోనేలున్నాయి.
కొత్త కొటీశ్వరాలయానికి మైలున్నర దూరం లో జంగాల మఠం ఉండేది జంగాలు ఉండేవారు .దీనికి తూర్పున ‘’దొంగల దొడ్డి గుహ ‘’ఉంది .ఎద్దు అడుగుకు తూర్పున ఋషులు తపస్సు చేసుకొనే గుహ ఉంది .పాపవినాశన ,కొత్త కోటీశ్వర గుడులమధ్య మరో గుహ మొత్తం నాలుగు గుహలున్నాయి .ఈ పర్వతం ఎటుచూసినా మూడు కూటాలుగా కన్పించటం విశేషం .అందుకే త్రికూట పర్వతం,స్వామి త్రికోటీశ్వరుడు అయ్యాడు .దీని స్థల పురాణం ను ‘’త్రికూటాచల మహాత్మ్యం ‘’అంటారు .శాసనాలలో త్రికూటాచలం అనే పేరుకనిపించదు .ఇది ఆశ్చర్యం..
ఈ స్వామికి ‘’ఎల్లమంద కోటీశ్వరుడు ‘’అని పేరు .ఎల్లమంద కన్నా కావూరు దగ్గర కనుక ‘’కావూరు కోటీశ్వరస్వామి ‘’అనీ అంటారు .సత్తెనపల్లికి దగ్గరలో వెలంపల్లి త్రి కోటీశ్వర క్షేత్రం ఉన్నట్లు అక్కడి శాసనం వలన తెలుస్తోంది .ఇదే పాటి దిబ్బ .ఇదినందిపాడు అనే గ్రామం అనీ ,జనం లేక పాడైపోయి గురువయ్య పాలెం లో కలిసింది .ఇక్కడ శిధిల శివాలయ ఆనవాళ్ళున్నాయి .
మరి రెండు త్రికూటాచలాలు
ఈ పర్వతం కాక త్రికూట పర్వతం అనేది గజేంద్ర మోక్షం జరిగినట్లు భాగవతం లో చెప్పబడిన పర్వతం రాజస్థాన్ అజ్మీర్ దగ్గర పుష్కర క్షేత్రం .ఇక్కడ గాయత్రి సావిత్రి ,సరస్వతి అనే మూడు పర్వత శిఖరాలున్నాయి .ఇదే గజేంద్ర మోక్షణ స్థలం అని మైసూర్ వాసి ,మహా పర్యాటకుడు ,నరసరావు పేటలో 90ఏళ్ల వయసులో 1-11-1932న సిద్ధిపొందిన బ్రాహ్మణుడు చెప్పాడు .
రెండవ త్రికూట పర్వతం తమిళనాడు తిరునల్వేలి జిల్లా టేన్కాసి రైల్వే స్టేషన్ కు మూడు మైళ్ళ దూరం లో ‘’తిరుకుత్తాలం ‘’(కుర్తాళం)దగ్గర ఉంది .ఇక్కడ తిరుకుత్తాలేశ్వరుడు రాజరాజేశ్వరీ దేవి కొలువై ఉంటారు .ఇక్కడ అగస్త్యాశ్రమం ,వాటర్ ఫాల్స్ ఉన్నాయి ‘
త్రికూటాచల మహాత్మ్యం
అనేక యుగాలనుంది మహిమ గల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది కోటప్పకొండ .సత్తెనపల్లి కోసూరు వాసి శ్రీ కొప్పరాజు నరసిన్గయ్య అనే నరసింహ కవి మూడు ఆశ్వాసాల ‘’త్రికూటాచల మహాత్మ్యం ‘’అనే పద్య కావ్యం రాశాడు .ఇదే దీని చరిత్రకు ఆధారం .శ్రీ రూపెన గుంట సీతారామయ్య 1905లో ‘’గుమ్మెట కథ’’అనే రగడ రాశాడు .దీనిలో ఉత్సవ వేడుకలు తెలియజేశాడు .దీన్ని ఆధారంగా శ్రీ తుళ్లూరి మాధవరాయుడు ‘’మనోకాంతా ముక్తికాంతా సంవాదం ‘’అనే 12చరణాల కీర్తన రాశాడు .
1852విరోధి మాఘ బహుళ చతుర్దశి శివరాత్రినాడు నాడు నరసింహకవి సకుటుంబంగా ఈక్షేత్రాన్ని దర్శించి ,స్వామి సన్నిధిలో ఉపవాసం చేసి ‘’ఇంత గొప్పగా ఉత్సవాలు జరిగే క్షేత్రం ఏదైనా ఉందా “”?అని అక్కడి బ్రాహ్మణులను అడిగితె ‘’మాకు తెలిసినంతవరకూ లేదు .స్థలపురాణం ఉండే ఉంటుంది .మీరు ఆవిషయాలు రాయండి ‘’అనికోరారు .సరే అని మర్నాడు మళ్ళీ గుడికి వస్తుంటే దారిలో శ్రీశైల ప్రాంత వాసి ఉద్భటారాధ్య వంశం వాడు ముదిగొండ వీరభద్రా రాధ్యుల పౌత్రుడు కేదారలింగం అనే బ్రాహ్మణుడు కనిపిస్తే తనమనసులోని కోరిక చెబితే ఆయన ‘’ఇది పూర్వం శివునిఅవతారమోర్తి దక్షిణా మూర్తి అవతారమైన 12ఏళ్ల వటువు సమస్త దేవ ఋషులకు బ్రహ్మోప దేశం చేసిన పుణ్యక్షేత్రం .ఈ విషయం ‘’చిదంబర నట తంత్రం ‘’లో ఉంది ‘’అని చెప్పాడు..వీటిని ఆధారంగా నరసింహకవి త్రికూటాచల మహాత్మ్యం మూడు ఆశ్వాసాల కావ్యంగా శ్రీ దక్షిణామూర్తికి అంకితమిస్తూ రాశాడు .ఈకవి 1878 బహుధాన్య మార్గ శిర బహుళ పంచమి నాడు మరణించాడు .వీరికున్న అనేకమంది శిష్యులు గురువారాధన గొప్పగా చేస్తారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-9-21-ఉయ్యూరు