దక్షయాగ విధ్వంసం జరిగాక ,అతని భార్య పతి భిక్షకోసం ప్రాధేయపడగా వీరభద్రుడు గొర్రె ఎప్పుడూ తల వంచుకొనే ఉంటుంది కనుక దక్షుడు కూడా అలాగే ఇక తలవంచుకొనే ఉండాలని గొర్రె తల తెచ్చి పెట్టి బతికించాడు .సతీ దేవి పిలువని పేరంటంగా వెళ్లి ,తండ్రియాగం లో తనకు జరిగిన పరాభవానికి కాలి బొటనవ్రేలు నేలకు రాసి ఏర్పడిన అగ్నిలో ఆహుతైంది . అప్పటి నుంచి లోకం లో ‘’పిలువని పేరంటానికి వెళ్ళరాదు’’అనే సామెత వచ్చింది .అంతేకాక ఆడవారు కాలి బొటన వ్రేలితోనేలరాయ రాదు అనేదీ అమల్లోకి వచ్చింది .శివుని క్రోధం తగ్గి శాంతమూర్తియై ,12ఏళ్లదక్షిణా మూర్తిగా అవతరించి ,సమస్త విద్యలు నేర్చి ,కైలాసం లో సప్తమ ఆవరణ లో సమాధి స్థితి లో ఉండిపోయాడు .
బ్రహ్మ విష్ణు సనకాది మహర్షులు ,నారదాది దేవ ఋషులు కలిసి కైలాసం లో ఉన్న దక్షిణా మూర్తిని దర్శించి తమకు బ్రహ్మోప దేశం చేయమని కోరారు .సరే అని వారందరితో కలిసి , ఈ త్రికూట పర్వతానికి వచ్చి ,రుద్రరూపి ఆయన దక్షిణామూర్తి మధ్య శిఖరం చేరి ,బిల్వవనం లో యోగ నిష్టలో ఉండి అందరికి మౌనంగానే బ్రహ్మోపదేశం చేశాడు ;ఇది బ్రహ్మచారి అయిన దక్షిణా మూర్తి క్షేత్రం అయింది కనుక స్వామికి కళ్యాణోత్సవ౦,ధ్వజస్తంభం ఇక్కడ ఉండవు .
గురునాథ పొంగళ్ళు
దక్షిణా మూర్తి దేవాదులకు గురువు అవటం వలన ‘’గురునాథ స్వామి అని పిలుస్తారు .గురు నాథుడికి పొంగళ్ళు నైవేద్యం పెట్టె ఆచారం ఉంది .కూర్మ పురాణం లో లోపాముద్రకు అగస్త్యుడు గురునాథ వ్రత కల్ప విధానం బోధించినట్లున్నది .ఆ వ్రత కథప్రకారం –సముద్ర మధనం లో లభించిన అమృతాన్ని దేవాసురులకు పంచటానికి విష్ణువు మోహినీ రూపంలో రాగా శివుడు మోహించి దారుకావనం లో దీర్ఘ సంగమం జరుపగా ,మోహినికి తీవ్రంగా చెమటలు పట్టి ,గండ స్థలం నుంచి కారిపోగా ‘’గండకి’’ నది ‘’ఏర్పడింది .దీనిలోనే సాలగ్రామాలు ఉత్పత్తి అవుతాయి .మోహినికి సద్యోగర్భం వచ్చి మార్గశిరమాస పూర్ణిమనాడు ఆర్ద్రా నక్షత్రం లో మూడుకళ్ళు,నాలుగు భుజాలు ,త్రిశూలం ,ఖడ్గం లతో శివ కేశవుల సమాన రూపం తో 14 ఏళ్ల’’’శాస్తి ‘’ అనే కొడుకు పుట్టాడు .ఇతడినే గురునాథుడు ,శివుడు అనీ పిలువబడ్డాడు . ఆ బాలుడు తను చేయాల్సిన పనేమిటి అని తండ్రి శివుడిని అడిగితే ‘’ప్రమథ గణాలకు నాథుడవై ,కైలాసం లో ఉంటూ వారి కోర్కెలు తీర్చమన్నాడు .ఇతడు ఆజన్మ బ్రహ్మచారి .అప్పటి నుంచి లోకం లో గుర్నాథుడు శివుని రూపుగా పూజి౦ప బడుతున్నాడు .ఉద్యాపన, వ్రతకల్పమూ ఉన్నాయి .పొంగలి చేసే స్త్రీకి భర్త ముగ్గులుపెట్టి తోరణాలుకట్టి ,విఘ్నేశ్వరపూజ ,సంకల్పమూ చేసి ,అఖండ దీపారాధన చేసి గుర్నాథుని విగ్రహం , దానికి కుడివైపు త్రిశూలం ,ఎడమవైపు ఖడ్గం పెట్టిపూజ చేయాలి .అగ్ని స్థాపన చేసి ,గిన్నెలో ఆవుపాలు పోసి కాచి బియ్యం బెల్లం వేసి పొంగలి వండాలి .నైవేద్యం పెట్టి అందరూ దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి .
భైరవుడు
శివుడికి పుట్టింది భైరవుడు కదా ,పై కమామీషు ఏమిటి అని సందేహం వస్తుంది .కాశీ ఖండం లో భైరవ వృత్తాంతం ఉంది .ఒకసారి బ్రహ్మ అహంకారంతో తానే మూల పురుషుడను అని శివుడితో వాదానికి దిగితే ,శివుడు రౌద్ర దృష్టి నుంచి ఒక భైరవుడు పుట్టి బ్రహ్మ అయిదవ తల నరికేశాడు .బ్రహ్మ హత్యా దోషం పోగొట్టుకోవటానికి ,అనేక క్షేత్రాలు దర్శించి చివరికి బదిరికాశ్రమం దగ్గర కపాల మోక్ష తీర్ధం లో స్నానం చేసి పాప ప్రక్షాళన చేసుకొన్నాడు ఆక్షేత్రమే బ్రహ్మకపాలం . విష్ణుశిఖరం
రుద్ర శిఖరానికి ప్రక్కన అంటే పాప వినాశన శిఖరం అంటే గద్దలబోడు పై విష్ణువు ఉంటూ ,శివుడికి తపస్సు చేయగా ,ప్రత్యక్షమై ఇంద్రాది దేవతల సమక్షం లో తాము పూర్వం దక్షుని యాగానికి వెళ్లి పొందిన అవమానాలు పోగొట్టుకోవటానికి లింగ రూపం ధరించి ఎప్పుడూ అందుబాటులో ఉండమని శివుని ప్రార్ధించగా ,శివుడు ఒక రాతిమీద త్రిశూలాన్ని పొడవగా ,నీరు ఉద్భవించి ,శివలింగం ఏర్పడింది .ఆ జలం లో స్నానించి తనను పూజించమని దేవాదులకు శివుడు చెప్పగా ,వారు అలాగే చేసి తమ పాపాలను పోగొట్టుకోవటం వలన పాప వినాశేశ్వరుడు అనే పేరుతొ ప్రసిద్ధి చెందాడు .కనుక ఇదే ముఖ్యమైంది .భక్తులు మొదట ఇక్కడ స్నానం చేసి ,తర్వాతే కోటీశ్వర స్వామి దర్శనం చేస్తారు .ఇక్కడ దేవ,గరుడ గ౦ధర్వ సిద్ధ సాధ్యులు ఎల్లప్పుడూ ఉంటారని ప్రతీతి .కార్తీక మాఘలలో ఇక్కడ స్నానిస్తే సరాసరి మోక్షమే అని నమ్మిక.
బ్రహ్మ శిఖరం
రుద్ర శిఖరానికి కింద నైరుతిలో ఉన్న శిఖరమే బ్రహ్మ శిఖరం .విష్ణు రుద్రశిఖరాలపై జ్యోతిర్లింగాలు ఉండి,ఇక్కడ లేకపోవటం తో బ్రహ్మ బాధపడి శివ తపస్సు చేయగా ,ప్రత్యక్షమవగా ,అక్కడ ఒక లింగరూపం లోవెలియమని ప్రార్ధించగా వెలిసి ‘’నూతన కోటీశ్వర లింగం’’గా ప్రసిద్ధి చెందాడు .ఇక్కడ బ్రహ్మాది దేవగణ౦ అందరూ ఉంటారు.శివుడు ఇక్క తాండవం చేస్తాడు .’’ఎల్ల’’ మునులు ‘’మంద ‘’అంటే గుంపుగా ఇక్కడ ఉండటం చేత’’ ఎల్లమంద’’కొండ అనిపేరోచ్చింది దీనికి ఉత్తరానున్న ఊరు ఎల్లమంద గ్రామం అయింది .ఇలా మూడు శిఖరాలమీద దేవతా పూజలు అందుకొంటున్న జ్యోతిర్లింగాలు ఉన్నా ,మనుషులకు కనిపించవుకనుక,అనేక రాతి శివలింగాలు ఏర్పరచుకొని పూజించటం అలవాటైంది .ఇప్పటికీ ఇక్కడ మహనీయుడైన ఒక సిద్దుడున్నాడని అ౦దరికి నమ్మకం .సుమారు యాభై ఏళ్ల క్రితం శ్రీ భారతుల నరసింహ శాస్త్రిగారు కొత్త కొటీశ్వరాలయం లో జపం లో ఉండగా ,ఒక సిద్ధుడు కనిపించినట్లు చెప్పారట .
శరీరానికి త్రికూటస్థానం లో ఓంకారం ప్రసిద్ధమైనట్లే ,ఈ త్రికూటాద్రి కి దగ్గరలో ‘’ఓగేరు’’అంటే ఓంకార నది ప్రవహిస్తోంది .దీనిలో స్నానించి శ్రార్ధకర్మలు చేసి పితృదేవతలకు తృప్తి కలిగిస్తారు ,స్వర్గం ,మోక్షమూ లభిస్తాయి .ఈనది పుట్టుక ఈ క్షేత్రానికి కొద్ది రూరంలో ఉన్న ‘’చేరు౦ జర్ల ‘’అనే ‘’చేజెర్ల ‘’.ఇక్కడ శిబి చక్రవర్తి శివైక్యం అయ్యాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-21-ఉయ్యూరు