త్రికోటీశ్వర చరిత్ర -5(చివరి భాగం )
బొచ్చు కోటీశ్వరాలయం
కోటప్పకొండపై పది దేవాలయాలున్నాయి .అందులో బొచ్చు కొటీశ్వరాలయం మధ్య సోపానమార్గం మొదట్లో ఉంది .ఇక్కడ భక్తులు మొక్కులు తీర్చుకొని తల వెంట్రుకలు సమర్పిస్తారు కనుక ఆపేరొచ్చింది .అష్ట దిగ్బంధన౦, లో ఇది తూర్పు వైపున ఉన్నది. ఇక్కడ ఒక శిధిల శాసనం ఉంది .
ఎల్లమంద సోపాన మార్గ మద్యం లో గుంటి మల్లయ్య లింగం ఉంది .ఈప్రాంతాన్ని హనుమంతుని లొద్ది అంటారు .శిధిల హనుమ విగ్రహం ఉంది .
పూర్వాశ్రమం లో నరసరావు పేటకు చెందిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి 18-2-1909న నూతన కోటీశ్వరాలయానికి నైరుతిన, తాము కాశీ నుంచి తెచ్చిన లింగాన్ని ప్రతిష్టించారు .ఆమధ్యాహ్నమే ప్రజలలో కలతలు వచ్చి దౌర్జన్యం దోపిడీ,దహనాలు జరిగి,తర్వాత నేరవిచారణ జరిగి దోషులకు శిక్ష పడింది .
కొండ దిగువ ఆలయాలలో ప్రసన్న కోటీశ్వర ,నీల కంఠేశ్వరదేవాలయాలున్నాయి .బొచ్చు కోటీశ్వరగుడివెనుక తొండపి కి చెందిన రాయిడి సాంబయ్య వేయించిన శిలాశాసనం ఉంది .ఇవికాక బసవ మందిరాలు మఠాలు చాలా ఉన్నాయి అన్నదాన సత్రాలు,పురాతన శాసనాలు,యంత్ర స్థాపన శాసనాలు కూడా ఉన్నాయి .
అష్ట దిగ్బంధన యంత్రం
పై యంత్రాలేకాకుండా ఈస్థలం రక్షణార్ధం అష్టదిగ్బంధనం చేశారు తూర్పు బొచ్చుకోటయ్య ,ఆగ్నేయం లో పాపులమ్మ ,దక్షిణం లో వేములమ్మ,నైరుతిలో హనుమంతుడు ,వాయవ్యం లో ముమ్ముడి దేవత ,ఉత్తరం ఉబ్బు లింగస్వామి ,ఈశాన్యం లో పాప వినాశన స్వామి .యంత్రం బలంగా ఉండటానికి బంగారు యంత్రం వేయించారు .ఇందులో నిధి నిక్షేపాలున్నాయని దొంగలు 1934 సెప్టెంబర్ 18నిశిరాత్రి కొన్ని తంతులు జరిపి తవ్వుతుంటే ,కొండపైనుంచి ఒక వృద్ధ స్త్రీ పెద్ద వెలుగుతో శక్తితో వచ్చినట్లు కనిపించి మూర్చపోయి తర్వాత పారిపోయారు .వాళ్లకు దారి చూపించటానికి అఖందాన్ని చేత్తో పట్టుకొన్న చాకలి యువకుడికి జ్వరం వచ్చి చచ్చిపోయాడు .ఈ యంత్రం వేసిన ఏలేశ్వరపు అయ్యవారు ఆవంశం లో అయిదవ వారు .
ఆధారం –నరసరావు పేట వాస్తవ్య్యులు శ్రీ మద్దులపల్లి గురుబ్రహ్మ శర్మగారు 1939లో వచనం లో రచించిన ‘’శ్రీ త్రికోటీశ్వర చరిత్రము ‘’-కోటప్పకొండ .దీనిని నరసరావు పేట శార్వాణీ ముద్రాక్షర శాలలో కోటప్పకొండ దేవస్థానం వారు ప్రచురించారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-9-21-ఉయ్యూరు