సంత్ కబీర్ సప్త శతి
మాన్య మిత్రులు శ్రీ పంగులూరి హనుమంతరావు –మాజీ కులపతి ,శ్రీ యల్లా ప్రగడ ప్రభాకరరావు -మాజీ అధ్యాపకులు జంటగా ఇప్పటికి చాణక్య నీతులు తిరువళ్ళువార్ దివ్యాకృతి -తిరుక్కురళ్ మొదలైన వాటిని చక్కని అనువాదం చేసి కౌండిన్య పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించారు .వారు ఎవరికీ వారే విడిగాకూడా రచనలు చేసి ముద్రించారు .ఈ జంటతో దాదాపు పదేళ్ళ పరిచయం నాది .వారి పుస్తకాలు నాకు ,మన సరసభారతి పుస్తకాలు వారికీ బట్వాడా అవుతూనే ఉన్నాయి .ఇప్పుడు ఈ పుస్తకం ‘’సంత్ కబీర్ సప్త శతి’’ ఈ ఏడాదే ఈమధ్యే ప్రచురితమై నాకు పంపగా ఈనెల 6న అందింది .ఇవాళే చదివి మీకు పరిచయం చేస్తున్నాను .కబీర్ కవితలు 700హిందీలో,ప్రతి కవితకు తెలుగు పద్యం లో అనువాదం ,తాత్పర్యాలు రాసి ఒకరకంగా కబీర్ కవితా సర్వస్వంగా తీర్చి దిద్దారు. . కబీరు ఆదర్శమానవుడు,మానవతా వాది,సమాజ ప్రేమ ఉన్నవాడు .భూతకోటి సమస్తం ఆయనకు ప్రాణమే .ఆనాటి ధార్మిక సాహిత్య సాంస్కృతిక రంగాలను ప్రభావితం చేశాడు .మహోన్నత వ్యక్తిత్వంతో జ్ఞానులలో మహాజ్ఞాని ,మహా సాధకుడు కూడా .ఆయనకాలం 1397-99మధ్య .120ఏళ్ళు జీవించిన జ్ఞాన వయో వృద్ధు.1518-19మధ్య కీర్తి శేషుడయ్యాడు. కాశీలో మహమ్మదీయ చేనేత కారులైన నీరూ, నీమూ దంపతుల ఇంట పెరిగాడు .ఉత్తర భారతం అంతా తిరిగి తన జ్ఞాన జ్యోతితో ప్రజలను చైతన్య పరచి మగహర్ గ్రామం లో మరణించాడు .ఆయన దృష్టిలో దేవుడే గురువు .కబీరు రచనలు సాఖీలు ,రామైనీలు ,పదాలు అని మూడు రకాలు .సాఖీలు దోహా ఛందస్సులో రాస్తే ,మిగిలినవి కీర్తనల రూపం లో ఉంటాయి .సాధారణంగా కబీర్ దోహాలు అనే పేరుతోనే ఎక్కువ ప్రచారమయ్యాయి .ఆంద్ర దేశం లో భద్రాచల రామదాసు గారికి కబీరు గురువు అని మనకు తెలుసు ..ఇద్దరూ శ్రీరామ భక్తులే .కబీర్ గురువు రామానందుడు అంటారు …కబీర్ దాస్ గా అంటే మహాజ్ఞాని గా సుప్రసిద్ధుడు .మొదటి భార్య చనిపోతే రెండవ భార్యను చేసుకొంటే ఆమె పరమ గయ్యాళి కావటం వలన ,అసలే దుర్భర దారిద్ర్యంతో కునారిల్లుతున్న కబీర్ పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లయింది .పెద్దగా విద్య లేకపోయినా ,ఆయన ముఖతహా వెలువడిన జ్ఞానబోధను శిష్యులు ‘’కబీర్ బీజక్ ‘’గా గ్రంథస్థ౦ చేశారు .కబీర్ చనిపోతే అసలే హిందూ ముస్లిం తాదాలతో అట్టుడికి పోతున్న ఆకాలం లో ఆయన శవం కోసం ఈ వర్గాలు మాదంటే మాది అని పోట్లాడుకోగా ,ఆయన భౌతిక కాయం మాయమై ,దాని బదులు అక్కడ పుష్పాలు వెలిశాయని కథనం .ఆయన మహా మహిమాన్యత్వానికిది గొప్ప ఉదాహరణ . ‘’రాం రహీం ఏక్ హై’’అనేది ఆయన సిద్ధాంతం .పువ్వులోని వాసనలా దేవుడున్నాడు .కస్తూరి మృగం తనదగ్గరున్న కస్తూరిని గ్రహించలేక బయట గడ్డి పై వెతుకు తుంది .అలాకాకుండా భగవంతుని నీలోనే వెతుక్కో అనేది అయన సందేశం .
ఈ సర్వస్వం లో 7కా౦డలున్నాయి .మొదటికాండలో గురువు ,సాక్షాత్కారం ,విశ్వ రూపం ,వైరాగ్యం ,తత్వ సారం ,మధ్యేమార్గం ,విచారణ ,సంజీవని ,సరాబు ,ఉద్భవం అనే 10విభాగాలున్నాయి .రెండవ కాండ లో భక్తిరసం ,సనాతనం ,గమ్యస్థానం ,పాతివ్రత్యం ,మాయ ,మనసు ,సూక్ష్మ మార్గం ,మేలు కొలుపు ,సర్వ సమర్ధుడు అనే 9విభాగాలున్నాయి .మూడవ భాగం లో మిధ్యాజ్ఞానులు,సహజ స్వభావం ,పైపై మెరుగులు ,సాదుగరిమ ,గుణహీనులు ,విమర్శకులు ,సత్య నిష్ఠ ,పరుష భాషణ విభాగాలు ,నాలుగవ కాండ లో శబ్ద సౌందర్యం ,చెప్పేది చేసేది ఉపదేశం ,నమ్మకం ,అన్వేషణ ,శాశ్వతత్వం ,అయిదవ కాండ లో స్మరణం ,విరహం ,ఆరవ కాండలో కాలం ,సాంగత్యం ,దాంపత్యం ,జీవన్ముక్తులు ,ఏడవకాండ లో శౌర్యం వైరభావం ,కస్తూరి మృగం ,చిత్త కాపట్యం ,కాముకత్వం ,భ్రమ వినాశనం ,అనే 7విభాగాలు చివరగా తుది విన్నపం ఉన్నాయి .చాలా లోతైన విశ్లేషణతో ,అర్ధ వంతంగా చేసిన విభాగాలనిపిస్తాయి .కబీర్ జీవితానికి సంబంధించిన అనేక చిత్రాలు కూడా పొందుపరచారు .
మొదటి దైన సద్గురు విభాగం లో గురువును మించిన బంధువు లేడు.జ్ఞానదాతకంటే గొప్ప దాత లోకం లో ఉండడు,దైవాన్ని మించిన మిత్రుడు ,భక్త సంఘం కంటే గొప్ప సంఘం ఉండవు .భక్తి విభాగం లో లో ‘’భక్తిరసమును గ్రోలిన సక్తునకిక –అలుపురాదు సొలుపురాదు అంత సుఖమే –కొలిమి కాలిన కుండకు కొదువ ఏమి ?మరల సారె నెక్కుటనిన మాట లేదు ‘’.దాంపత్య భావన గురించి –‘’తడిపొడి మనసును పిసికి తట్టి కొట్టి –మెత్తిమెత్తినీ వొనరింపు మృదులముగను –సుఖము సొంత మందుకొనును సుందరుడపుడు –పరమ జోతియే శీర్షాన పరిఢవిల్లు ‘’.భావం -పొడి పిండిని పిసికి పిసికి తట్టుతూ మెత్తని ముద్దగా చేసి నట్లు ,సాధకుడు తనమనసును అలాగే మృదులం చేసుకోవాలి .బాహ్య ప్రభావాన్ని లోనికి రాకుండా చూసుకోవాలి అప్పుడే ఆత్మ సుందరిగొప్ప సుఖం అనుభవిస్తుంది .పరం జ్యోతి బ్రహ్మ రంధ్రం లో ప్రజ్వరిల్లుతుంది –
దీనికి కబీర్ దోహా –‘’ఇస్ మాన్ కో మైదా కరోనాన్హా కరికరి పీస్ – తబ్ సుఖ్ పావో సుందరీ ,బ్రహ్మ ఝలక్కేశీర్ష్’’..
చివరగా కబీర్ చేసిన తుది విన్నపం –‘’సాయీ ఇతనా దీజియే జా మై కుటుం సమయ్-భైంభీ భూఖా న జావూం సాధు భీ మూఖా న జాయ్’’
‘’నేను ,నా వారు బ్రతుకును నిలుపగలిగి –నంతయే యిమ్ము ,వలదింక సుంత గూడ-మేమును గడప త్రొక్కిన స్వాములైన –కడుపు మార్చుకోరాదయ్య కన్న తండ్రి ‘’
భావం –నేను నా వాళ్ళు బతకటానికి చాలిన౦త మాత్రమెఇవ్వు. ఆపైన ఆవగింజంత కూడా ఇవ్వక్కర్లేదు .మేముకానీ ఇక్కడికి వచ్చిన సాధువులు కానీ ఆకలితో అలమటి౦చకుండా కాపాడే కన్న తండ్రివి నువ్వే ప్రభూ .
దోహాల భావాలకు తగిన దీటైన తెలుగు అనువాద పద్యాలున్నాయి ఒక వేళఅనువాదం లో కూడా క్లిష్టత ఉంటె భావం ద్వారా హాయిగా దోహాల అనుభవాన్ని పొంది కబీర్ మనసును అర్ధం చేసుకోవచ్చు .కబీర్ హృదయావిష్కరణమే ఈ సప్త శతి .అర్ధవంతమైన ముఖ చిత్రం ,స్కాలిత్యం లేని ముద్రణ పుస్తకానికి మరింత వన్నె చిన్నెలు కల్పించాయి ..కబీర్ దోహాలను తెలుగు సాహిత్య నందనోద్యానం లో విరబూయించినందుకు జంటకవి మిత్రులు పంగులూరి ,ఎల్లా ప్రగడ వారికి అభినందనలు.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-21-ఉయ్యూరు .