వింత ఆలయాలు విచిత్ర విశేషాలు -2
విగ్రహాలబదులు మూడు శిరసులున్న అమ్మవారు –వైష్ణవీ దేవి
జమ్మూ కాశ్మీర్ కాత్రా త్రికూట పర్వతాలపై వైష్ణవి దేవి ఆలయం ఉంది. ఆలయం అంటే నిర్మాణం కాదు .రాతి గుహ దేవాలయం .అమ్మవారు మహా లక్ష్మీ దేవి అవతారం .ఆమెను త్రికూట అనీ మాతా రాణి అనీ భక్తులు పిల్చుకొంటారు .కాత్రా నుంచి 12 కిలో మీటర్లు ట్రెకింగ్ చేసి వెళ్ళాలి .ఆ పవిత్ర గుహలో సహజ సిద్ధమైన మూడు రాతి శిరస్సులు కనిపించి ఆశ్చర్యం కలిగిస్తాయి .వీటిని ‘’పిండీలు ‘’అంటారు .ఈ మూడు వైష్ణవ దేవి కి ఉన్న మూడు రూపాలు అంటే మహా సరస్వతి ,మహా లక్ష్మి ,మహా కాళిరూపాలన్నమాట .వైష్ణవ దేవి తన భక్తులెవరో నిర్ణయించి ,వారిని తన సన్నిధికి రప్పించు కొంటుంది అని నమ్మకం .
వైష్ణవ దేవి తొమ్మిదేళ్ళ వయసులో శ్రీరామ దర్శనం కోసం,ఆయననే వివాహమాడాలనే ఉదేశ్యం తో తీవ్ర తపస్సు చేసింది .అప్పుడు ఆమె పేరు త్రికూట .రాముడు సీతా దేవిని వెతుకుతూ త్రికూట పర్వతానికి వచ్చి ఆ బాలిక తననే భర్తగా కోరుతూ చాలాకాలం నుంచి తపస్సు చేస్తోందని గ్రహించి ఆమెతో తాను సీతను వివాహ మాడానని ,తాను ఏక పత్నీ వ్రతుడను ,మళ్ళీ కలియుగం లో కల్కి అవతారంగా మానవ రూపం లో అవతరిస్తానని ,అప్పుడు ఆమెను తప్పక పెళ్లి చేసు కొంటాననీ నచ్చచెప్పి ఆమెకు ‘’వైష్ణవి ‘’అని పేరు పెట్టాడు .పాండవులు కూడా విజయం కోసం కురుక్షేత్ర సంగ్రామం ముందు వైష్ణవి దేవిని దర్శించి ,ఆమె ఆశీస్సులు పొందారని ఐతిహ్యం .
2-దశ మహా విద్యలకు ప్రతిరూపమైన కామాఖ్య దేవాలయ సముదాయం –అస్సాం
కమల ,మాతంగి ,బగళాముఖి ,ధూమావతి ,ఛిన్నమస్తక ,భైరవి ,భువనేశ్వరి ,షోడశి,తారా ,కాళీ అనే పది మహా విద్యలకు ప్రతిరూపమైన దేవాలయం అస్సాం లోని కామాఖ్య దేవాలయం .ఇందులో ముఖ్యమైనది 8వ శతాబ్దికి చెందినకామాఖ్య దేవాలయం .7వ శతాబ్దం వరకు ఈ దేవాలయం చాలాసార్లు పునర్నిర్మాణం పొందింది .కామాఖ్య దేవాలయం లో అమ్మవారి విగ్రహం ఉండదు దానికి బదులు స్త్రీ జననే౦ద్రియమైన యోని ఆకార రాయి ,దానిపైనుండి అనుక్షణం ప్రవహించే సహజ సిద్ధ జలధార ఉంటుంది. ఇదే అమ్మవారుగా భావించి పూజిస్తారు .అమ్మవారికి మేకలు బలి ఇస్తారు .జూన్ నెల మధ్యలో ఇక్కడ ‘’అంబు బాచి మేలా’’ఉత్సవం కామాఖ్య అమ్మవారి ఏడాదికి ఒక సారి జరిగే ఆమె బహిష్టు రోజులలో జరుపుతారు .ఈ ఉత్సవాన్ని తాంత్రిక ఉత్సవం లేక’’ అమేతి’’అంటారు .ఈ ఉత్సవం లో పాల్గొనటానికి దేశం నలుమూలాల నుంచి తాంత్రిక భక్తులు అశేషంగా వస్తారు .అప్పుడు ఆలయాన్ని మూడు రోజులు మూసి ఉంచుతారు .అమ్మవారికి రుతుస్నానం అయిన నాలుగవ రోజు మళ్ళీ దేవాలయతలుపులు తెరిచి దర్శనానికి అనుమతిస్తారు.ఎర్ర బట్టలు ప్రసాదంగా అంద జేస్తారు .
3-55మీటర్ల ఎత్తైన మహా బోధి దేవాలయం –బీహార్
బీహార్ రాష్ట్రం గయ జిల్లా లో ఉన్న మహా బోధి దేవాలం బౌద్ధులకు అతి ముఖ్య యాత్రాస్థలం .ఇక్కడే గౌతముడు బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొంది బుద్ధుడయ్యాడు .7వ శతాబ్దిలో నిర్మించబడిన అతి పురాతన ఇటుకరాతి దేవాలయం ఇది .అనేక సార్లు పునర్నిర్మాణం పొందింది బర్మా రాజు ,భారతీయ పురావస్తు శాఖ ఆలయ పునరుద్ధరణ చేశారు .ఈ దేవాలయ సముదాయం అత్యంత నాణ్యమైన ,సున్నితమైన నగిషీలతో కూడినది .మధ్యలో ఉన్న మహా బోధి ముఖ్య దేవాలయం ఎత్తు55 మీటర్లు .దీనికి చుట్టూ నాలుగు శిఖరాలున్నాయి .వీటికి ఉన్న రాతిరైలింగ్ అత్యంత సున్నితమైన చెక్కడపు పనితొఆశ్చర్య పరుస్తాయి .పాత రైలింగ్ క్రీ పూ.150 నాటివి .ఆతర్వాతవి గుప్తులకాలం లో ముతక గ్రానైట్ తో చేయబడి ఉన్నవి .
ముఖ్య దేవాలయం లో కాలిమీద కాలు వేసుకొని ఉన్న బుద్ధ భగవానుని అతి పెద్ద నల్లరాతి విగ్రహం బంగారు రంగు పూత తో చూపరుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది.అశోకుడు నిర్మించిన స్తూపం ఆకారం లో ఈ దేవాలయం ఉండటం విశేషం .ఈ ప్రాంగణం లోనే గౌతముడు తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం ఉంటుంది .ఈ వృక్షాలు ఆనాటి బోధి వృక్ష శాఖలే అని నమ్మిక .
3-10 టన్నుల బరువున్న కలశం తో విరాజిల్లే సోమనాథ స్వామి
గుజరాత్ లో జునాగడ్ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన జ్యోతిర్లింగా క్షేత్రం శ్రీ సోమనాథ దేవాలయం .సోమనాథ జ్యోతిర్లి౦గాన్ని ద్వాపరయుగం లో శ్రీ లి౦ గేశ్వరలింగం అనీ ,త్రేతాయుం లో శ్రావణికేశ్వర లింగం అనీ ,సత్యయుగం లో భైరవేశ్వర లింగమని పిలిచేవారు. సోముడు అంటే చంద్రుడు స్థాపించిన లింగం కనుక సోమనాథలింగం ఐంది .మామగారు దక్షుడు ఇచ్చిన శాపాన్నయీ శివుడు నివారించి నందుకు చంద్రుడు భక్తితో ఈ ఆలయం నిర్మించాడు .
శ్రీ కృష్ణుని అవతార సమాప్తి కూడా ఇక్కడే జరిగింది .ఇక్కడే ప్రసిద్ధ సరస్వతి నది సముద్రం లో కలుస్తుంది .గజనీ మహమ్మద్ అనేక దండయాత్రలు చేసి ఆలయద్వంసం చేసి అపూర్వ సంపాదనను దోచుకుపోయాడు .శిధిలమైన ప్రతిసారీ ఆలయ పునర్నిర్మాణం అరుగుతూనే ఉంది.స్వతంత్ర భారత దేశం లో సర్దార్ వల్లభ భాయిపటేల్ పూనికతో ,అనేకుల సహకారం తో మళ్ళీ సోమనాథ దేవాలయం నిర్మించబడి చరిత్ర సృష్టించింది .ఆలయ శిఖరం 15మీటర్ల పొడవు తో 8.2మీటర్ల పొడవున్న స్తంభం పై కాషాయ పతాకతో హిందూ సంస్కృతికి ఆలవాలం గా కనిపిస్తుంది .ఈ శిఖరం కలశం 10టన్నుల బరువు ఉండటం మరో ప్రత్యేకత .ప్రాక్కనే ఉన్న సముద్రం అలలు ఆలయ గోడలను తాకుతూ ఉండటం మహాదాశ్చర్యం .
4-65 మీటర్ల ఎత్తైన పూరీ జగన్నాధ దేవాలయ
ఒరిస్సా మధ్య ప్రాంతం లో రాజధాని భువనేశ్వర్ కు దగ్గరలోనీలాచలం లో పూరీ క్షేత్రం లో 12వ శతాబ్దిలో రాజా అనంతవర్మ చోడ దేవ నిర్మించిన శ్రీ జగన్నాథస్వామి ఆలయం ఎత్తు65మీటర్లు అంటే అవాక్కవుతాం .ఆలయ గోడల ఎత్తు20అడుగులు అంటే ముక్కుమీద వేలేసుకొంటాం .ఇక్కడి విగ్రహాలు దారు నిర్మితం అంటే కొయ్య విగ్రహాలు అంటే మరీ ఆశ్చర్యపోతాం .శ్రీ బలరామ శ్రీ కృష్ణ స్వామి మధ్యలో సోదరి సుభద్ర ఉండి పూజలు అందు కొంటోంది అంటే అబ్బురపడతాం .ఈ దారు విగ్రహాలు ప్రతి 12ఏళ్లకోకసారి లేక 19ఏళ్లకొకసారి పవిత్ర వృక్షపు కా౦డాలతో పునర్నిర్మింప బడుతాయి అంటే మన ఆశ్చర్యానికి అంతు ఉండదు .ఈఆలయంలో అంటు,సొంటు ఉండవని సర్వం జగన్నాథం అనీ పేరోచ్చింది అంటే మరీ’’ ఇదై’’పోతాంకదా.అయ్యవారి ప్రసాదాన్ని మహా లక్ష్మీ దేవి పర్యవేక్షణలో తయారు చేయబడుతుందనీ ,ఆలయం లో 11మీటర్ల పొడవు ,16అంచుల ఏక శిలా స్థంభం అయిన ‘’అరుణ స్తంభం ‘’ను కోణార్క సూర్య దేవాలయం నుంచి 18వ శతాబ్దిలో తీసుకొని వచ్చి ప్రతిష్టించారని ,హిందువులు కానివారికి ఆలయ ప్రవేశం లేదనీ తెలిస్తే మనకు నోట మాట రాదు .అంతేనా 45అడుగుల ఎత్తైన రథం లో ఆ షాఢ శుద్ధ తదియ నాడు ముగ్గురు మూర్తుల రధయాత్ర వేలాది ప్రజలు రథాన్ని లాగుతూ నిర్వహించటం చూసి కోట్లాది జనం పులకించి పోతారు కదా. ప్రక్కనే ఉన్న అరేబియా సముద్ర తీరం లో కాలికి బేడీలతో ఉన్న ‘’బేడీ హనుమాన్ ‘’విగ్రహం ఉంది అంటే ఆశ్చర్యాతి ఆశ్చర్యం కలుగుతుంది .ఇన్నిఆశ్చర్యాలకు అబ్బురాలకు నెలవు పూరీ జగన్నాథాలయం .ఇక్కడే భక్తమహాకవి జయదేవుడు ‘’గీత గోవింద కావ్యం ‘’రాసి తాను చరితార్ధుడయి, మనల్ని ధన్యులను చేశాడు అని తెలిసి పట్టరాని ఆనందం పొందుతాం .
సశేషం