శ్రీ చెన్న కేశవ స్వామి –హరిజనార్చకులు
అనే పుస్తక౦ మొదటి భాగం శ్రీ గంధం నాగేశ్వరరావు గారు రచించి 1986లో ప్రచురించారు .వెల అమూల్యం .ఈ రచయిత 1920లో జన్మించి ,ఉపాధ్యాయునిగా చేసి తర్వాత తెలుగు లెక్చరర్ గా పదవీ విరమణ చేశారు పగోజి అత్తిలి లో కాపురం .వీరితో నాకు పరిచయం లేదు .ఈ పుస్తకం వారు నాకు పంపగా ఇవాళే అందింది .వెంటనే చదివాను .ఈయన ‘’ప్రధమ రధోత్సవం ‘’మొదలైన ఇరవైపుస్తకాలు రాశారు .అత్తిలికి చెందిన శ్రీ గంధం శేషేంద్ర రావు గారు మన ఊసుల్లో ఉయ్యూరు పుస్తకం పంపమని ఉత్తరం రాస్తే వెంటనే పంపాను .బహుశా ఆయన ద్వారా రచయిత నా అడ్రస్ తెలుసుకొని పంపి ఉంటారు .ఇక విషయానికి వస్తాను .
పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరు గ్రామం లో శ్రీ చెన్న కేశవ స్వామి ఆలయం గర్భ గుడిలో స్వామి వారి పాద పీఠం పై’’రాక్షస నామ సంవత్సర కార్తీక శుద్ధ దశమి వరకు యర్రా నారాయణుడుశ్రీ అప్పలస్వామి వారి ఉత్సవాలు జుజ్జూరి ‘’అని ఉంది .ఇది రచయితలోని పరిశోధకుని బయటికి తీసి విషయ సేకరణ చేయించి ఈ పుస్తకం రాయించింది.ఇందులోని సంవత్సరం, అప్పలస్వామి,యర్రా నారాయణుడు ,జుజ్జూరి అనే వారి విషయాలు కష్టపడి సేకరించారు .
శ్రీ అప్పలస్వామి -300ఏళ్ళు నిర్విఘ్నంగా పాలించిన కాకతీయ సామ్రాజ్యం 1340లో పతనమైంది .మహమ్మదీయ పాలకులు హిందూదేవాలయాలను విగ్రహాలను చిన్నా భిన్నం చేశారు .ఆసమయం లో సింహాచల క్షేత్ర నివాసి శ్రీ కందాళ కృష్ణ మాచార్యులు హిందూ మత సంరక్షణ కోసం నడుం కట్టి ,ప్రజలకు వైష్ణవ దీక్షనిచ్చి ,ధైరర్యోత్సాహాలు కల్గించి భక్త బృందంతో పుణ్య క్షేత్ర సందర్శన చేస్తూ ద్రాక్షారామం వచ్చి,తిరు వీధిఠంమ సందర్శించి ,వారిలో కొందర్ని వెంట తీసుకొని ,అంటరాని వారు అర్చకులుగా ఉన్న కొన్ని గ్రామాలలో ఒకటైన ఉప్పులూరుకు వచ్చి ,వారు చేస్తున్న క్షుద్ర దేవతారాధన మాన్పించి ,వైష్ణవం బోధించి, చేర్చుకొని ,ఉప్పులూరులో తానూ సింహాచలం నుంచి వచ్చారు కనుక శ్రీ అప్పలస్వామిని ప్రతిష్టించి వారిలో సమర్ధులను అర్చకులను చేశారు. కొన్ని గేయాలురాసి వారికిచ్చి ద్వారకా తిరుమల ,వలనాడు గుండా వరంగల్లు వెళ్ళారు . .అప్పల అంటే సంసార సాగరం నుంచి తరింప చేసేవాడు అని అర్ధం .పండితులు వరాహ లక్ష్మీ నరసింహ స్వామి అంటే పామరులు అప్పన్న అని పిలిచేవారు .ఈ గ్రామం లో అప్పలస్వామి తోపాటు బలిపోలేరమ్మ, అమ్మోరమ్మ దేవతలను కూడా పూజించారు ఇలా 300ఏళ్ళు గడిచిపోయాయి .
ఈ సంస్థాన పాలకులు జూపల్లి ఇంటి పేరిటవారు .మొదట్లో వీరిది నిజాం లోని పర్తియాల సంస్థానం ,.వీరిలో జూపల్లి రామచంద్ర ప్రభువు 1575లో రాజమహేంద్రవరం రాజు సితాబ్ ఖాన్ పై చేసిన యుద్ధం లో అతని పరాక్రమాన్ని గుర్తించిన గోల్కొండనవాబు ఇబ్రహీం కుతుబ్ షా జుజ్జూరు సంస్థానాన్ని బహుమతి గా ఇచ్చాడు .గుడివాడ దగ్గర, ఉయ్యూరు బందరు రోడ్డు పై ఉన్న జుజ్జవరం ఇదే .తర్వాత జుజ్జూరు అయింది.కానీ కంచిక చెర్ల దగ్గర జుజ్జూరు గ్రామం ఉంది .జూపల్లి రామ చంద్రుని ముని మనవడు రాగన 1660లో ఉప్పులూరులో అప్పలస్వామికి ఆలయం నిర్మించి విగ్రహాలు అందించాడు .ఇతని తర్వాత వెంకటాద్రి కాలం లో సంస్థానం అన్యాక్రా౦తమై నూజి వీడుప్రభువులు మేకావంశపాలనలోకి వచ్చింది .అప్పల స్వామి గుడి శిదిలమైతే మేకా రాజా ధర్మ అప్పారావు గారు పెద్ద గుడి కట్టింఛి ,7-11-1792న ప్రతిష్ట చేశారు .అప్పటికి రాజా వయసు 30.
శ్రీ యర్రా నారాయణుడు –ఈయన యర్రా వారి వంశం లో 8వ తరం వాడు .ఇతడిచిన్నతనం లోనే తండ్రి అయ్యవారి వెంకటరామయ్య చనిపోగా బావగారు ఆకుల మల్లయ్య నూజి వీడు సంస్థానం లో పలుకు బడి కల వాడు అవటం తో అన్నలు ఆయన దగ్గరకు పంపారు .అక్కడ కొంత చదివి ఆశ్వశాలలో చిన్న ఉద్యోగి అయ్యాడు. 1783లో ఈస్ట్ ఇండియా కంపెని నూజి వీడుకోటను ముట్టడించగా ,పడమటి వైపునుంచి కంపెనీ సైన్యాల మేజర్ టీన్స్ ,మేజర్ మేజర్ లానేజ్ లు మొగల్రాజపురం నుంచి కోటమీదకు రాగా ఈ మల్లయ్య దండనాధుడు ఎదిరించి ,ఘోర యుద్ధం చేసి ,సైన్యాధ్యక్షుడు ఫెఫర్డ్ ను చంపి 10-12-1783న వీర స్వర్గం అలంకరించాడు .అప్పటికి నారాయణ వయస్సు 20.ఈ విషాద సంఘటనకు కలతచెంది ,నూజివీడునుంచి సోదరి తో 1784లో ఉప్పులూరు చేరాడు .
తన బావ మల్లయ్య ఆత్మశాంతికై అప్పలస్వామి సేవలో శ్రద్ధగా పాల్గొంటూ ,న్యాయం గా మార్గదర్శనం చేశాడునారాయణ .1788లో మేకా ధర్మ అప్పారావు మళ్ళీ నూజి వీడు ప్రభువు అయ్యాడని తెలిసి దర్శనం కోసం వెళ్లి విఫలుడై ,ఆయన బాడీగార్డ్ సర్దార్ సెట్టిపల్లి రాఘవ రాయనిం గారు మల్లయ్య గారి బంధువు అవటంవలన ఆయనద్వారా దివాన్ ను దర్శించి ,తమ దేవాలయ విషయం ప్రస్తావించాడు .రాజు, దివాను సానుకూలంగా స్పందించి ఉప్పులూరు ఆలయ పునరుద్ధరణకు అంగీకరించారు .కావలసిన సామగ్రి సేకరించి పునర్నిర్మాణం ప్రారంభించి రాక్షస నామ సంవత్సరం కార్తీక శుద్ధ దశమి 1-1-1792న పూర్తి చేయించాడు .రచయిత రాగి రేకుమీద చూసిన తేదీ ఇదీ ఒకటే .నారాయణ1784 నుంచి 1792 వరకు ఉప్పులూరు శ్రీ అప్పలస్వామిసేవలో పునీతుడయ్యాడు. నూజి వీడు ప్రభువు ఈయనను ఆలయ ధర్మకర్తగా నియోగించాడు .శ్రీ ధర్మ అప్పారావు మందీ మార్బలం తో ఉప్పులూరు వచ్చి నూతన ఆలయ ప్రారంభోత్సవం చేశారు .విశాఖ వాసి ,వైష్ణవ తె౦గలై సంప్రదాయకులు, అనకాపల్లి గోడే సంస్థాన గురువు శ్రీ పరవస్తు శ్రీనివాసా చార్యులు కూడా వచ్చి ప్రారంభోత్సవ కార్యక్రమ లో పాల్గొనట విశేషం .
కొంతకాలానికి వైష్ణవులలోతె౦గలై ,ఒడగలై వర్గాలు ఏర్పడ్డాయి మొదటి వారి నామం ఇంగ్లీష్ y లాగా రెండవ వారిది uగా ఉంటాయి .వీర శైవం ఆంధ్ర దేశం లో బాగా ప్రబలి తమ ఆరాధ్యుడైన చెన్న బసవడు పేరుగా దేవుళ్ళపేరులో చెన్న చేర్చి అప్పలస్వామిని చెన్న కేశవస్వామిగా 1868నుంచి మార్చారు .కానీ చెన్న అంటే అందమైన అని అర్ధం .ఉప్పులూరు మఠం చెన్నకేశవ మఠం అయింది .రాగి రేకు మీద ధర్మ అప్పారావు గారి పేరు లేదు .నూజి వీడు సంస్థానం ఉయ్యూరు వల్లూరు మైలవరం,శనివారప్పేట వగైరా అనేక సంస్థానాలుగా విడిపోగా ,ఆయన రెండవ సోదరుని మనవడు పార్ధ సారధి అప్పారావు వారసుడై 1899లో శనివారప్పేట ఎస్టేట్ ప్రభువయ్యాడు .ఉప్పులూరు చెన్నకేశవస్వామి కళ్యాణ మహోత్సవాలలో’’ రాజా పార్ధ సారధి అప్పారావు సవాయ్ ఆశ్వారావు పేట మున్సదార్ రుస్తుంబా నగర్ సంస్థాన్ పాల్వంచ, భద్రాచలం అండ్ నిడద వోలు వగైరా దొరవారు సమర్పించిన మంత్రం పుష్పం ‘’అని చెబుతారు .
ఇవిగాక అనేక విషయాలు పరిశోధించి శ్రీ గంధం నాగేశ్వరరావు ఈ పుస్తకం రాసి సమగ్రత తెచ్చారు .వారి పరిశోధనా శక్తికి అభినందనలు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-9-21-ఉయ్యూరు