మధ్య పశ్చిమం లో వేదాంతం -3(చివరి భాగం )
లూస్ విల్ లో 48 గంటలు
జనాలతో చక్కగా కలిసిపోయి ప్రభావితం చేసే గొప్ప వ్యక్తిత్వం స్వామి పరమానంద ది.లూస్ విల్ లో ఆయన పర్యటన షెడ్యూల్ గమనిస్తే తనకోసం ఆయన ఉంచుకొన్న సమయం అతి తక్కువ అని తెలుస్తుంది .వేదాంత ప్రవచనాలలో ఆయన ఆధ్యాత్మికత ,ఆనందం ,శ్రేయస్సు మొదలైన విషయాలను కూడా చేర్చి మాట్లాడే వారు .ఈ పర్యటనలో ఒకే ఒక అపాయింట్ మెంట్ ,మాత్రమె ఉండి,వేదాంత క్లాసులు లెక్చర్స్ లతో బిజీ బిజీగా రెండు రోజులు గడిపారు .ఒక రోజు ము౦దేవచ్చి మిగిలిన రెండు రోజుల్లో మూడు ప్రసంగాలు చేసి వెంటనే తర్వాత వేరే ప్రదేశానికి వెళ్ళేవారు .ఇంగ్లీష్ ఆయన మాతృ భాష కాకపోయినా ,కాలేజీలో చదవకపోయినా ఆయన శ్రోతలను ఆంగ్ల భాషలో పరవశింప జేసేవారు .తన డైరీలో టూర్ వివరాలను ఆయన రికార్డ్ చేసుకోనేవారు .అదే ఇప్పుడు మనకు ఆధారం .ఉదాహరణకు –గురువారం సాయంత్రంతాను స్థాపించిన వేదాంత కేంద్రం బోస్టన్ నుంచి లూస్ విల్ కు వచ్చి ,శుక్రవారం రెండు ఉపన్యాసాలు ఉదయం 11గంటలకు ,మధ్యాహ్నం 3 గంటలకు ఇచ్చి శనివారం ఉదయం 11కు చివరి ప్రసంగం చేసి ,తాను వేదాంత సెంటర్ ఏర్పాటు చేసిన లాస్ ఏంజెల్స్ కు రైలు లో వెళ్ళారు .ఉపన్యాసాల మధ్య కాలం లో ఆడియెన్స్ తో సంభాషించేవారు .చాలాసార్లు లూస్ విల్, సిన్సినాటిలలో 48 గంటలలో ప్రసంగాలు చేసి .మరిన్ని ప్రసంగాలకోసం వెస్ట్ కోస్ట్ కు వెళ్ళేవారు .ఆయన టూర్ ప్రోగ్రాం అంతా పత్రికలద్వారా ,సోషల్ క్లబ్స్ ,పోస్ట్ కార్డ్ లద్వారా ప్రచారమయ్యేది.అయన వ్యక్తిత్వానికి, కార్యక్రమాలకువేలాది ప్రజలు ఆకర్షితులై ,ప్రభావితులయ్యారు .చాలామంది ఆయనతో ప్రత్యెక సమావేశాలు జరిపి సందేహాలు తీర్చుకొనేవారు .స్వామి పరమానంద ‘’ది మెసేజ్ ఆఫ్ ది ఈస్ట్ ‘’ అనే ఒక ప్రత్యెక మాసపత్రిక ప్రచురించేవారు .అందులో చందాదారుల లిస్టు చూస్తె ,ఆయన ఆసిటీలోనూ ,అమెరికాలోనూ ఎంతమందిని ప్రభావితం చేసిందీ ,అమెరికాలో ఎందరిని వేదాంత భావాలకు దగ్గర చేసిందీ మనకు అర్ధమౌతుంది. అంతటి చక్కని నెట్ వర్క్ ఆయనది ., అయన స్థాపించిన లాస్ ఏంజెల్స్ ,కోహాసేట్ వేదాంత కేంద్రాలు ఇప్పటికీ పని చేస్తూ వివేకానందుని భావధారను ప్రసారం, ప్రచారం చేస్తూనే ఉన్నాయి .భారత దేశం లో స్వామి వివేకానంద ప్రభావం వలన అక్కడ మరిన్ని కేంద్రాలు ఏర్పడ్డాయి .
చివరగా
యోగ చరిత్ర ,ధ్యానం ,ఆధ్యాత్మికతలు అభి వృద్ధి ఉద్యమం తో జత చేయబడి ఇరవై దశకాలలో ప్రతిధ్వనించింది .ప్రపంచ సమ్మేళనం,స్వామీజీతో ఉన్న అనుబంధం ,చేబట్టిన నిర్మాణ కార్యక్రమాలు మిడ్ వెస్ట్ ప్రజలను అత్యంత ప్రభావితం చేసి, వేదాంత భావనా వ్యాప్తికి అద్భుతంగా పని చేశాయి .వేలాది మంది స్వామి వివేకానంద తో ,ఆయన యువ శిష్యుడు పరమానంద తో వేదాంతం యోగాభ్యాసం లతో ఇంటరాక్ట్ అవటం వారికి గొప్ప సదవకాశమే అయింది .
స్వామీజీని అత్యంత హృదయపూర్వకంగా ఆహ్వానించి వారి బోధనలు మనసులో నింపుకొని ఆచరణలో నిలబెట్టుకొన్నారు అమెరికా ప్రజలు .తమ జీవిత గమ్యమేమిటో వారికి అర్ధమయింది .ఆధ్యాత్మికభావ విప్లవం అమెరికాను కుదిపేసింది .అది ఇప్పటికీ విశ్వ వ్యాప్తం గా ప్రభావిత౦ చేస్తూనే ఉంది .ప్రజలు జీవితాలను మెరుగు పర్చుకొంటూనే ఉన్నారు .
స్వామి పరమానంద తనజీవితకాలం లో చిరస్మరణీయమైన కాలం అమెరికాలో గడపటం విశేషం .స్వామి వివేకానంద తర్వాత ఆయన కార్యక్రమాలను మరొక 35 ఏళ్ళు అమెరికాలో కొనసాగేలా అంకిత భావం తో చేసిన పరిపూర్ణ వ్యక్తి స్వామి పరమానంద .సంస్కృతీ ప్రవాహం విశ్వ వ్యాప్తమై కర్మ, యోగ, గురు భావనలు ప్రజల నిత్య జీవితం లో నాలుకలపై నర్తిస్తూ ,అంతర్వాహినిగా జీవితాలలో నిలిచిపోయింది .సంస్కృతీ వినిమయం ,ఏకీకరణ ,అనుసంధానం అనేక విధాలుగా సాధ్యమవుతున్నాయి అంటే స్వామి వివేకానంద ,స్వామి పరమానంద ల అకుంఠిత ,దీక్ష ,త్యాగం కార్య దక్షత వలన మాత్రమె అని మనం గ్రహించాలి .ఆ మహితాత్ములకు మనం ఘన నివాళి సమర్పించాలి .
ఆధారం –సెప్టెంబర్ ‘’ప్రబుద్ధ భారత్’’లో మీరా అలగరాజ రాసిన ‘’వేదాంత ఇన్ మిడ్ వెస్ట్ ‘’వ్యాసం .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-21-ఉయ్యూరు