భోగేశ్వర మహాత్మ్యం
భోగేశ్వర మహత్మ్య ప్రబంధకావ్యాన్ని కృష్ణా జిల్లా బందరు దగ్గర ఉన్న పెడన వాస్తవ్యులు మల్లంపల్లి మల్లికార్జున కవి చే రచింపబడి ,వారి ప్రియ శిష్యుడు శ్రీ దారా సూర్యప్రకాశ లింగ చంద్ర శేఖరస్వామి ద్రవ్య సహాయం తో మచిలీ బందరు భైరవ ముద్రాక్షర శాల లో ముద్రింపబడినది.వెల అర్ధ రూపాయి .సంవత్సరం లేదు ఈ కృతి శిష్యుడైనదారా వారికే అంకితమిచ్చి , వంశ వర్ణనం చేశాడుకవి .ఏలూరు వాసి కందుకూరి శ్రీశైలపతి గారు కవికి రాసిన ఉత్తరాలు కూడా పద్యాలలో ఉండటం విశేషం .ఈ జాబులు 2-4-1906,6-7-1907 న వ్రాసినట్లున్నది .కనుక పుస్తకం అదే సంవత్సరం లో1906-07లో ప్రచురించబడింది అని భావించవచ్చు .
ఈ మహాత్మ్యం లో పుర వర్ణనం ,శివ దేవ వర్ణనం ,సర్వ మంగళా ,వివాహ వర్ణనం ,చక్షుప్రీతి వర్ణనం మొదటి ఆశ్వాసం లో ,వసంతురుతు ,,స్త్రీ ,మనస్సంగాద్యవస్థ వర్ణనం ,శివ దేవుడు కొడుకు పుట్టలేదని చింతించటం ,ముని వర్ణనం ,ఆయన ఓదార్చటం ,దౌహృద వర్ణన రెండవ ఆశ్వాసం లో ,ఇక మూడులో గొడగూచి వర్ణన ,గొడగూచి తలి దండ్రులతో శ్రీ శైల వెళ్లాలని అనుకోవటం ,కొడుకును వద్దనటం తో బాధపడటం ,కొడుక్కి శివ పూజా రహస్యం ఉపదేశం ,సూర్యాస్తమయ వర్ణన ,భగవత్సాక్షాత్కారం , నాలుగులో శివదేవుడు శివుడితో స్వప్న వృత్తాంతం చెప్పుకోవటం ,శివదేవుడు శైశైల మహిమలు వర్ణించటం ,శుక్రోదయ ,పాతాళగంగ శ్రీ శైల ఉత్పత్తి ,పర్వతుడు శ్రీ పర్వతుడు అవటం ,పర్వత లింగం మల్లికార్జునలింగం గా పిలువబడటం ,సూర్యాస్తమయం ,పూర్ణ సోమోసా లంభనం ,పార్వతికి భ్రమరాంబ పేరు రావటం ,క్షీణ సోమోదయ ,సూర్యోదయ వర్ణనం ఉన్నాయి .చివరిదైన అయిదవ ఆశ్వాసం లో శివుడిని’’ గుది గొయ్య’’ అని ని౦ది౦చిన౦దుకు శివదేవుడు కొడుకును తిట్టటం గొడగూచి పశ్చాత్తాపం ,భోగేశుడు పాలు తాగాడని చెప్పగా శివదేవుడు ఆశ్చర్యపోవటం ,ఎలా కన్పించాడని అడగటం అతడు ప్రార్ధించటం ,భోగేశ సాక్షాత్కారం తో కావ్యం సమాప్తి . ‘’శ్రీ గౌరిం దన య౦క పీఠమునబేర్మిన్నిల్పి వృక్షోధరా –భోగ౦బందున జందనం బిడి’’చెలీ !భోగ్యా వృతింజెందమిం
బౌగౌనే’’యన నవ్వు పార్వతి నభి ప్రాయజ్ఞగా నెంచు నా –యోగి ధ్యేయుడుశ్రీ గిరీశుడు జిరాయు శ్శ్రీలు మా కీవుతన్ ‘’అనే శార్దూలం తో కావ్యం ప్రారంభించాడు కవి .తర్వాత శివకుటు౦బాన్ని వర్ణించి ,నంది భ్రుంగి చండి లకు ,వాల్మీకి వ్యాస కాళిదాస,నన్నయ తిక్కన,పోతన పెద్దన రామలింగాది కవులకు నమస్కరించి ,లోకగురు బ్రహ్మయ లింగాన్ని ,ముదిగొండ రామేశ,కాశీనాధుని నాగామార్య గురుని ,తాడేపల్లి వెంకటార్యుని ,వక్కలంక వీరభద్ర విద్వన్మణిని,అద్దేపల్లి సోమనాధకవికి ,గుమ్మలూరి సంగమేశ్వర తార్కిక సార్వ భౌముడికి ,చేగంటి మృత్యుంజయ దైవజ్ఞునికినమస్కరించి చిన్నతనం లో చదువు నేర్పిన చిన్న వియ్యన్న మనీషికి నమస్కారాలు చెప్పాడు .
తర్వాత తనతాత వీరేశ లింగం తపోధనుడని ,తండ్రి వీర మల్లేశ్వరుడు వీరశైవమత రహస్య వేత్త అనీ , తల్లి భ్రమరాంబ దేవి అనీ ,తండ్రి చనిపోతే తల్లి అన్నీ తానె అయి పెంచి పోషించిందని ,అన్న రామ లింగం గొప్పకవి అనీ ,చెప్పి ఇష్ట దేవతలకు మొక్కి షట్యంతాలు గుప్పించాడు .పద్యాలన్నీ భక్తీ పారవశ్యంతో పరుగులు తీస్తాయి .చివరిదైన 5వ ఆశ్వాసం లో ‘’
‘’ఈవే దిక్కికమాకు వేరెవరు లేరెచ్చోటగాలించినన్ ‘’అంటూ ప్రార్ధిస్తాడు గొడగూచి .’’దేవా భోగ విభో ‘’అని ఎలుగెత్తి పిలుస్తాడు .స్రగ్ధర ,లయగ్రాహి ,మణిగణ నికరం లలో చివరికి దండకం తో ప్రత్యక్ష మైన భోగేశ్వరస్వామిని గొప్పగా వర్ణింఛి సమాప్తి చేశాడు ప్రబంధ కావ్యాన్ని .ఇది భక్త గొడగూచి వృత్తాంతమే .’’
‘’భక్తి గొడగూచి కధ సత్ప్రబంధముగను –జేసి మీకు నర్పించుట చేత మాకు
గూడ దజ్జనకాదుల వలెముక్తి –నిడక తప్పదుమీకు గృతీశులార ‘’అని గడుసుగా తనకు ముక్తి ఇవ్వటం ఆయన బాధ్యతే అన్నాడుకవి .
ప్రబంధానికి కావలసిన సకల లక్షణాలు దీనిలో ఉన్నాయి. అన్నిటినీ సరసంగా పోషించాడు కవి .కానీ మనవాళ్ళ దృష్టికి ఆనినట్లు లేదు .ఎవరూ ఈకావ్యాన్నీ, కవినీ గురించి పేర్కొన్న దాఖలా లేనట్లు అనిపిస్తోంది .వీర శైవ సాహిత్యం లో బాగా ప్రాచుర్యం పొంది ఉండాలి ఇది .దీన్ని పరిచయం చేసే మహద్భాగ్యం నాకు దక్కింది .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-21-ఉయ్యూరు