తిరుపతమ్మ కథ పాట

తిరుపతమ్మ కథ పాట

కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు  తిరుపతమ్మ కథ ఇది .దీన్ని కామమ్మ కథపాట మాదిరిగా ఈ కథ పాట రూపం లో రాయబడి ,1927లో తెనాలిలోని రచిత ముద్రాక్షర శాలలో ముద్రింపబడింది .వెల కేవలం రెండు అణాలు .

‘’శుభమమ్మ తిరుపతమ్మ మాయమ్మా తిరుపతమ్మా –అతి పుణ్యనది యైన మునియేటి దరిని తిరుపతమ్మ –పెనుగంచిప్రోలనెడిఘనపురమునందుతిరుపతమ్మ –శ్రీ కమ్మ కులజుండు శివ సోమరాజు జననమొ౦ది –రంగమా౦బా యనెడి రమణి తోగూడిసుఖముగా –అతి ధర్మ శాలులై నలరు చుండెదరు తిరుపతమ్మ –తనకు సంతతి లేక తల్లడిల్లుచును రంగమాంబ –గుళ్ళు గోపురములు జాల గట్టించె రంగమాంబ –చెరువులు భావులు చాల త్రవ్వించె రంగమాంబ-అన్నమును బీదలకు నధికముగా బెట్టెరంగమాంబ’’అని మొదలౌతుంది పాట .

‘’ఒకనాటి రేయి శ్రీ వెంకటేశ్వరులు రంగమకును –కలలోన గనిపించి ఈ రీతి బలికె స్వామివారు –‘’నీవు స౦తతికొరకు చింతింపవలదు రంగమాంబ ‘’అని చెప్పి తాను పుత్రికను ప్రసాదిస్తాననీ తనపేరు పెట్టుకోమని చెప్పాడు.

‘’తొమ్మిదవ మాసమున తొలకరి మెరుపు రీతిగాను –ఒక్క స్త్రీరత్న౦బు నుద్భవించినది రంగమకు –  బ్రాహ్మణులను పిలిపించి ‘’తిరుపతమ్మ ‘’ని పేరు బెట్టిరి బాలికకు ‘’

రోజూ రహిమాన్ ఖాన్ ఆమెకోసం పూలు తెచ్చి ఇచ్చేవాడు .ఒకరోజు రాకపోతే తానె చెలులతో అతడు ఉండే పూల దుకాణానికి  వెడుతుంటే ఎదురొచ్చి

‘’నేను రావలెనని యత్నించు చుంటి యింతలోన –నీవిచ్చటికి నిట్లు రాతగున తల్లీ తిరుపతమ్మ ‘’అని ఆమెకు కావాల్సిన పూలన్నీ  అందించాడు .ఖాన్ అంగడిలో ఒక కుర్రాడుగోవిందరాజు  కూర్చున్నాడు .చూపులు కలిశాయి .వారిద్దరి మధ్య అదేదో తెలీని అనుబంధం ఏర్పడింది .

యవ్వనవతి అయిన తిరుపతమ్మకు సంబంధాలు చూస్తున్నారు. ఆమె మనసు గోవింద రాజుపైనే ఉంది .నిద్రాహారాలు లేవు .ఒకరోజు రంగామాంబ కలలో ఈశ్వరుడు కన్పించి ‘’

‘’నీ కూతురికి తగినపతి  ‘’గోప రాజు’’ రంగమాంబ –  అతడు కొన్ని దినములలో నీ ఇంటికి రాగల౦డు ‘’అని చెప్పి అదృశ్యమయ్యాడు .ఈవిషయం భర్తకు చెబితే అతడూ చాలాసంతోషించాడు

‘’స్వప్న వృత్తాంత మంతయు దెలుప తిరుపతమ్మ –మనమున సంతోష మగ్నురాలాయె తిరుపతమ్మ –అలనాడు తను జూచినట్టి నాయకుడే నాకు గనక –భర్తకాగలడని అతిసిగ్గుపడింది తిరుపతమ్మ ‘’

‘’అతి రూపవంతుడౌ గోపయాఖ్యునకు తిరుపతమకు –మంగళ వాద్యములు మ్రోగు చుండగను పెండ్లి ‘’చేసి అందరూ సంతోషించారు .అత్తవారింటికి కాపురానికి వచ్చిన తిరుపతమ్మ-

‘’భర్తయే దైవమని భావించు చుండే తిరుపతమ్మ –‘’నిత్యం సేవలు చేస్తోంది ‘

‘’అన్నవస్త్రము లేక నల్లాడు వారలకు –శక్తి కొలదిగా నన్న అన్న వస్త్రము లిడుచు’’పతివ్రతామ తల్లిగా పేరు పొందింది .ఇ౦త లొఆమెకు

‘’కుష్టు వ్యాధి సంభవించి చాల దిగులు పడుచుండె తిరుపతమ్మ ‘’

ఒక రోజు గోపయ్య ఆవులు , పాలేళ్ళ తో బాగా పచ్చిక ఉన్న అడవులకు వెళ్లి అవి బాగా మేస్తున్నందుకు  చూసి ఆనందిస్తూ అందరితోకలిసి అన్నాలు తింటూ కధలు చెబుతూ ఉండి,సాయంత్రం ఇంటికి తోలుకు పోయే  వేళఅవటం  తో ఆవులను లెక్కిస్తుంటే ,ఒకావు తగ్గగా .మిగిలినావుల్ని ఇంటికి తోలుకు వెళ్ళమని పాలేళ్ళకు  పురమాయించి, తాను  ఆఆవుకోసం కొండాకోనా జల్లడపట్టి  వెతికాడు.చీకటి బాగా పడి దారి కనిపించటం లేదు .ఇంతలో –

‘’క్రూర వ్యాఘ్రంబొకటి గోపయను జూచి దారిలోన –కుప్పించి గోపయ్య పై నెగసినాది పెద్దపులియు –ఘోరమౌ గోళ్ళ చే గోపయ్యను బట్టి చీల్చివేసి –రక్తమంతయు పీల్చి ప్రాణములు దీసె పెద్దపులియు ‘’

భర్త ఎంత సేపటికీ రాకపోయేసరికి తిరుపతమ్మ కలత చెంది పాలేళ్ళను బంధువులను వెదకటానికి పంపితే వాళ్ళు దీపాలు పట్టుకొని వెతుకుతుంటే గోపయ్య మృత దేహం కనిపించగా ఇంటికి పరుగు పరుగున వచ్చి ఆమెతో చెప్పలేక చెప్పలేక –

‘’ఓయమ్మ నీ భర్త నొక పులి జంపినాది యని యనుచు జెప్ప’’

‘’హా ఈశ్వరా అనుచు తనువుమరచి౦ది తిరుపతమ్మ ‘’తర్వాత తెలివి తెచ్చుకొని

‘’హా ప్రాణ నాథుండగోపయాఖ్యా ప్రాణనాథ –నిన్ను నెడబాసి నేనెట్లు బ్రతుకుదును ప్రాణనాథ ‘’అని భర్తతో సహగమనం చేస్తానని అగ్ని గుండం త్రవ్వించమని ఆనతిచ్చింది .

‘’తన బంధువుల కెల్లా దండములు పెట్టి తిరుపతమ్మ –పసిడి కాయంబంత పసుపు రాసుకొని తిరుపతమ్మ –మునియేటి(మున్నేరు –మునుల ఏరు )లోన స్నానము చేసినాది తిరుపతమ్మ –అత్తమామలకు దండము పెట్టినాది తిరుపతమ్మ –పస్పుచేలములను పరగ గట్టుకొని తిరుపతమ్మ –అగ్ని గుండము చుట్టు ముమ్మారు తిరిగి తిరుపతమ్మ –తనభర్త పాదములను తన హృదయమందు నిలుపుకొని –వీతి హోత్రుని చాల వినతులొనరించి  తిరుపతమ్మ –శ్రీరామ చంద్రుని చిత్తమున నిల్పి తిరుపతమ్మ –నా భర్త సన్నిధికి నను జేర్పు మనుచు తిరుపతమ్మ –అగ్ని గుండము నందు అతి వేగ దుమికె తిరుపతమ్మ –‘’

దూకిన గుండం లో తనమహిమలను చూపించటానికి –

‘’కుచ్చెళ్ల కొంగును, కుంకుమ భరిణ తిరుపతమ్మ – మాంగల్యసూత్రపు బొందు జూపినది తిరుపతమ్మ –ఈమూడు ఆనవాళ్ళను జూపినది తిరుపతమ్మ ‘’అప్పుడు అందరూ ‘’పరమ పతివ్రత తిరుపతమ్మ ‘’అని జేజేలు పలికారు .తర్వాత దేవాలయం కట్టించి గోపయ్య తిరుపతమ్మ విగ్రహాలు స్థాపించి కొలవటం ప్రారంభించారు .

‘’మాఘ ,ఫాల్గుణ మాసముల పూర్ణిమందు తిరుపతమ్మ –సకల కులముల వారు ప్రతి వత్సరమున తిరుపతమ్మ –నీకు పూజలు చేసి నిన్ను గొల్చెదరు తిరుపతమ్మ ‘’

మున్నేటిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించి ,పొంగళ్ళు వండి నైవేద్యాలు పెడతారు .సంతానం కోసం స్త్రీలు ప్రాణాచారం పడతారు .ఆది వ్యాధి గ్రహదోషాలన్నీ తిరుపతమ్మ మాన్పిస్తుందని భక్తులకు గొప్ప విశ్వాసం .అమ్మవారి చరిత్రరాయమని వైశ్యకులానికి చెందినా నరసింహారావు కోరగా కవి ఈపాట రూపం లో రాశాడు .-

‘’అవనిలో నీ కథను చదివినాను విన్నవారలకును –కరుణ తో సిరులొసగి  కాపాడుమమ్మ తిరుపతమ్మ –మంగళము నిత్య జయమంగళము నీకు తిరుపతమ్మ ‘’అని తిరుపతమ్మ కథ పాట ముగించాడు కవి .ఆయన పేరు ఎక్కడా చెప్పుకోలేదు .రాయమన్న ఆయన పేరు చెప్పి తనపేరు మరుగున ఉంచాడు మహాభక్తకవి ..ఈ పుస్తకాన్ని కూడా పరిచయం చేయటం నా అదృష్టం .

నేను పెనుగ౦చి ప్రోలులో ఒక ఏడాది సైన్స్ టీచర్ గా పని చేశాను .అప్పుడు గుడికి వైభవం లేదు ఇప్పుడు జ్వాజ్వల్యమానంగా వెలిగిపోతోంది .సినిమాగా కూడా తీశారు. టివి లో ధారావాహికంగా చరిత్ర ప్రసారమైంది .ఇప్పుడు ‘’శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ’’గా అమ్మవారిని పిలుస్తున్నారు .కొత్త గుడి చాలాబాగా ఉంది విగ్రహాలు నయన మనోహరంగా ఉంటాయి  .

తిరుపతమ్మ కొల్లా వారింటి ఆడపడుచు .కాకాని గోపయ్య బావ అవుతాడు .తాను  అగ్ని గుండం లో ప్రవేశించిన చోట గుడి కట్టించమని హెడ్ మాస్టర్ శ్రీశైలపతిని ఆదేశించింది .యోగాగ్నిలో ప్రవేశించిన మర్నాడే అక్కడ తిరుపతమ్మ గోపయ్య విగ్రహాలు కనిపించి ఆమె మహిమను చాటాయి .హెడ్ మాస్టర్ దేవాలయం కట్టించి ఈ విగ్రహాల ప్రతిష్ట చేశాడు భక్తితో .మూడవ రోజు అగ్ని గుండానికి ఉత్తరాన గోపయ్యను చంపిన పులి వచ్చి ప్రదక్షిణ చేసి అక్కడే చనిపోయింది .ఇక్కడే హెడ్ మాస్టార్’’ పెద్దమ్మ ఆలయం ‘’కట్టించాడు .క్రీ శ.1695లో తిరుపతమ్మ అ భర్తతో అగ్ని ప్రవేశం చేసింది .తిరుపతమ్మను శక్తిగా భక్తులు ఆరాధిస్తారు .

ఈ కథ సుమారు 300ఏళ్ల నాటిది .పెనుగంచి ప్రోలు అంటే పెద్దకంచి .చిన్న కంచి తమిళనాడులో మనం పిలిచే కంచి .పెనుగంచి ప్రోలులో 108దేవాలయాలు ఉండేవి .దాదాపు అన్నీ మునేరు వరదల్లో కాలగర్భం లో కలిసిపోయాయి .ఇప్పటికీ వరద తగ్గుముఖం పడితే ఇసుక తిన్నెలమీద శిధిల దేవాలయ స్తంభాలు కనిపిస్తాయి .ఇక్కడి ఆదినారాయణ స్వామి గోపాలస్వామి విగ్రహాలు అలా దొరికినవే .అనేక శాసనాలుకూడా బయటపడ్డాయి .ఈగ్రామం పూర్వం పేరు ‘’పాలం చెన్నూరు’’ అని,క్రీశ.1520లో గోల్కొండనవాబ్ కులీ కుతుబ్ షాకు, హిందూ రాజులకు ఇక్కడయుద్ధం జరిగి హిందూ సైన్యం ఓడిపోయిందని చరిత్ర చెబుతోంది .

ప్రస్తుతం తిరుపతమ్మ దేవాలయంకాకుండా ధర్మపురి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి పురాతన దేవాలయం ,అతి పురాతన రుక్మిణీ గోదా సహిత గోపాలస్వామి దేవాలయం ,ఆదినారాయణ ప్రాచీన దేవాలయం, అతి ప్రాచీనశంభు లింగేశ్వరాలయం ,రామాలయం ,వరలక్ష్మీ ఆలయం , కట్టమైసమ్మ ఆలయం ఉన్నాయి

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-10-21-ఉయ్యూరు

‘’

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అవర్గీకృతం. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.