రామయాజి చరిత్ర
అనే పుస్తకాన్ని రాజమండ్రికి చెందిన బ్రహ్మశ్రీ శ్రీపతి భాస్కర శాస్త్రి రాశారు. వీరు కంచుమర్తి శ్రీ వెంకట సీతారామ చంద్రరావు బహద్దర్ జమీందారు గారి ఇండస్ట్రియల్ జనానా స్కూల్ లో ప్రధాన ఆంధ్ర ఉపాధ్యాయులు .పుస్తకం 1914లో బ్రాసీ ఇండష్ట్రియల్ మిషిన్ ముద్రాక్షర శాలలో ముద్రితం .వెల పావలా.
మద్రాస్ మండలం గుంటూరుజిల్లా ఒంగోలు తాలూకా కొప్పోలు గ్రామవాస్తవ్యులు కమ్మవారైన విబుధ వరేణ్యుడు సింగం నేని శ్రీరామయాజి గారి గురించిన విషయం .హిందూ జాతి ఉద్ధరణకోసం శ్రుతి స్మ్రుతి పురాణ ఇతిహాసాదుల సారాన్ని అందరికి అర్ధమయేట్లు ప్రచారం చేసి ,కర్మ ధర్మ మర్మ జ్ఞానం ఆచరించటానికి శ్రీరామ యజ్ఞం ,,వైశ్వ దేవం ,శ్రీరామ పట్టాభిషేకం నిరంతరంగా రామయాజి తీవ్ర కృషి చేశారు అని రచయిత ముందుమాటలో చెప్పారు ,ఇది 148పద్యాలతో అల్లిన కావ్యం .
కందపద్యం లో రామయాజి గారి గురించి రాస్తున్నట్లు కవి శివుడికి విన్నవించి మొదలు పెట్టారు .జన్నిదాల గోత్రానికి చెందిన సింగమనేని వంశం లో ఆదినారాయణ ,యజ్ఞమా౦బిక దంపతులకు వెంకటరామయ్య జన్మించి ,వెంకట లక్ష్మిని పెళ్ళాడి కొదండరామయ్యకు జన్మ నిచ్చారు .ఈయన వైష్ణవభక్తి దుర్యుడు ,శ్రీరాముని ప్రతిష్టచేసి దేవాలయం నిర్మించి ,అహింసకు ఆటపట్టుగా ,సత్య సంపదకు సొమ్ముగా వర్ధిల్లి కొప్పోలులో నివాసమున్నాడు .భార్య రామానుజమ్మ వీరికి నమ్బెరుమాళ్ ,రామయ్య ,పెద్ద కృష్ణయ్య ,చిన్న కృష్ణయ్య అనే నలుగురు కొడుకులు .వీరు ‘చతుర్విధ పురుషార్ధ సరణి గాంచు –నవని నాల్గు సముద్ర౦బులజెలంగు –నల చతుర్వ్యూహముల భాతి నలరు ‘’చున్నారు
వీరిలో రెండవ కుమారుడు రామయ్య కొప్పోలులో రామ సిద్ధ సామ్రాజ్య పట్టాభి షేక వైశ్వ దేవ సంకల్పమొనరించి ‘’విఖ్యాతుడయ్యారు.ఆయన వాగ్ధాటి గభీర శక్తియుక్తులు సాహిత్య చింతనా ,విద్యా వైదుష్యం నిరుపమానం .గాంభీర్యానికి పాలకడలి .వితరణలో దధీచి .సద్భక్తిలో సనకసనందనాదులు .’’శేముషీ గుణ యాజి రామయాజి ‘’.
‘’కొప్పోలు లోపల కొట్టాయి నిర్మించి –వైశ్వ దేవమొనరించి వైభవమున
నాజ్య ధారాస్ఫూర్తి నగ్నిహోతరుని హోమ -తర్పణాదుల నెల్లదైవములను
సంతర్పణాదుల సర్వజన౦బుల –సత్కారముల చేత సకల బుధుల
నిష్ఠ కామ్యములిచ్చి ఎల్ల భాగవతుల-దానధర్మముల సత్కవుల బుధుల
తగిన దక్షిణ లిచ్చి యధ్వర్యవరుల –జగతి దన్పుచు,నవ భ్రుధ స్నాతుడగుచు
నియతి జెలువొందు సి౦గము నేని రామ – యాజి సద్గుణ రాజి విఖ్యాతి గాంచు ‘’
రామయాజిని దైవాంశ సంభూతునిగా కవి వర్ణించి –‘’అతడు వన్యాహారి యితడు ధన్యాచారు –డతని కంటే నితండేయధికుడగును ‘’అని తేల్చేశారు.ఆయన వాలిని కూలిస్తే ఈయన కీలిని వ్రేల్చాడు అతడు కోతికి మిత్రుడైతే యితడు నీతికి మిత్రుడు.ఆయన వైరులను కొడితే ఈయన క్రూరులను నెట్టాడు .ఆయన రాముడు అయితే ఈయన జగదభిరాముడు .
తప్పటడుగుల దగ్గర్నుంచి ధర్మం తప్పేవాడుకాడు .చదవటం రాయటం తోపాటు బ్రహ్మ విద్య అబ్బింది .విశిష్టాద్వైత మార్గాన సుశ్లోకుడై ప్రవర్తిల్లాడు .అన్నిమతాల సారం ఆకళింపు చేసుకొన్నాడు .
‘’పంచాక్షరీ మంత్రపంచాయుధమును పూని –పంచముద్రలు పట్టు పంచ గట్టి
పంచ తన్మాత్రలన్ పాంచజన్యము బట్టి –పాంచ భౌతిక చక్ర మెంచి తట్టి
పంచపంచస్వన పటు కిరీటము దాల్చి –పంచవాయుల తారు్క్షు వాహనముగ
పంచ చిదావస్తలెంచి సెజ్జగజేసి – పంచ కర్తల గద్దె పై వసించి
పంచ వింశతి తత్వ ప్రపంచ రాజ్య –మేలు విష్ణుడు ‘’అనిపించాడు రామయాజి .ఆయన ఔదార్యం ,జితేంద్రియ నిష్ఠ అద్భుతం .బ్రహ్మ మహాస్మి అనే పరమ రహస్యం తెలిసినవాడు .తత్వమసి,అహమేవ బ్రహ్మల పరమార్ధం వంట బట్టి౦చు కొన్నాడు .త్రిఋణాలను చక్కగా తీర్చుకొన్నాడు .స్వప్నంలో కూడా అనృతం ఆడడు .రుతుకాలం లోనే భార్యతో క్రీడిస్తాడు.అందుకే’’ వెండి కొండ నవాబు(శివుడు ) ‘’యాజిగారి కోరికలన్నీ నెరవేరుస్తాడు ‘’అని కావ్యం ముగించారు కవి .
కవి గారి సామర్ధ్యం గొప్పది .చెప్పిందే చెప్పినట్లున్నా ప్రతి సారీ కొత్తగా ఉంటుంది పద్య ధార సునాయాసంగా ప్రవహించింది .క్లిష్టంగా కాకుండా ఇష్టంగా ఆనందంగా రామయాజి గారి ఈవి యజ్ఞయాగాది వైదిక ధర్మకర్మలు, విశిష్టాద్వైత మత ప్రవర్తన కళ్ళకు కట్టించారు కవి విద్వాన్ శ్రీపతి భాస్కర శాస్త్రి .తన పాండిత్యాన్ని కవితా వైదుష్యాన్ని చక్కగా వెలువరించారు .ఈకావ్యాన్ని పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది .కవి గారి గురించి ఎక్కడా ఆయన చెప్పుకోలేదు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-10-21-ఉయ్యూరు