రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -2

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -2

పాలు, తేనే, ఖండ , దధి స్వ చ్ఛజలం తో ఏ లోటు రాకుండా రుద్రమంత్రాలతో ఏకాదశ వృత్తి గా కాలగ్రీవుని అభిషేకం చేసేవారు లక్ష్మణ శాస్త్రి .ఆ లక్ష్మణ నిగమఖని అర్ధాంగి కామమాంబిక .వీరికి శంకరుడు కుమారుడు .భార్య పార్వతి .వీరికి సూర్యనారాయణ ,పాపన ,పేరి శాస్త్రి కుమారులు .సూర్యనారాయణ యజుస్సామాలను బాల్యం లోనే పూర్తిచేసి ,’’అమృత మయూఖ శేఖరుని ‘’నిత్యం షోడషోపచారాలతో పూజిస్తూ ,నిత్యం అఘమర్షణ స్నాన జపతపాదులు హరుని అభిషేకం చేస్తూ ‘’సూర్యనారాయణావధాని ‘’అయి ,సోమిదమ్మ పెళ్ళాడాడు భార్యపరమ సాధ్వి  అనిపించుకొన్నది .ఈదంపతుల కుమారులే  అప్పన ,సుబ్బారాయుడు ..అప్పన శాస్త్రి శైశవం లోనే ‘’యజుర్నిగమం ‘’అంతానేర్చి పూసపాటి విజయరామరాజు ఆస్థానం లో నిగమావధాన నిధి అయ్యాడు .భార్య సోదెమ్మ .వీరికొడుకు వెంకట నరసింహం వేద వేత్త ,రాముని అవతారం .యజుర్వేదం అంతం చూసి రాజాగారి వేద కళాశాలలో అధ్యాపకుడు అయ్యాడు .వీరికి కలిగిన లక్ష్మీ దేవిలాంటి కూతురికి పెళ్లి చేసి అల్లుడు  కూతురిని  ఇంట్లోనే ఉంచుకొన్నారు .వెంకట నరసింహం తమ్ముడు రామమూర్తి ఏణా౦కమనోజ్ఞ రూపమగు ఆత్మ భవ త్రితయాన్ని’’ పొంది వంశాభి వృద్ధి చేశాడు .

‘’  ఆయన్న దమ్ముల౦దు  ద్వితీయు౦డు –బుధ సభలనద్వితీయుడు సుబ్బా

రాయసుధీంద్రు౦డు విలసిలు –వైయాకరణౌఘ సార్వ భౌమాఖ్యాతిన్ ‘’

అక్షయనామ సంవత్సర పుష్య బహుళ పక్షం లో జనించారు  సుబ్బరాయశాస్త్రి .తలిదండ్రులు సుబ్రహ్మణ్యం గురువులు సుబ్బారాయుడు అంటే అందరికీ రాయుడు శాస్త్రి అయ్యారాయన .భాష్య బోధనలో అసలు సుబ్రహ్మణ్య స్వామిగా ,పత౦జలిగా భాసించారు .కన్నడం లో రాయ అంటే రాజు అని అర్ధం .తండ్రివద్దనే శ్రౌత స్మార్తాలు అభ్యసించారు .స్మృతికి మూలం స్మార్తం దీనికి మూలం సంస్కృతం కనుక సంస్కృతం ఆసాంతం అభ్యసించాలని రాయుడు శాస్త్రి గారు 8వయసులో రోజూ విజయనగరం వెళ్లి నేర్చుకొని వచ్చేవారు .శివాజీని తల్లి జిజియాబాయి తీర్చినట్లు రాయుడుగారి తల్లి శాస్త్రిగారినిఅలా తీర్చి దిద్దారు .

 ‘’ విజీనగరం ‘’లో రాయుడు శాస్త్రిగారు శ్రీ బులుసు సుబ్బయ శాస్త్రి గారివద్ద గీర్వాణ౦ నేర్చి ఘనులని పించుకొన్నారు .విజయరామరాజు ఉచితంగా విద్యాబోధన కలిగిస్తూ వసతి భోజనాదులు సమకూర్చి సంస్కృతానికి గొప్ప సేవ చేశాడు .ఈ రాజు ఈనినపులి ఉండే పొదలో దూరి దానిపిల్లను చెవులు పట్టుకొని బయటికి తెచ్చేవాడు .కళ్ళెం బల్లెం లేకుండా గుర్రాన్ని ఎక్కేవాడు .రెడ్డి  దొడ్డమల్లుని ఓడించిన పోటుగాడు .రూపాయి బిళ్ళను వేళ్ళమధ్యపెట్టి మైనంగా ముద్ద చేసే వాడు –‘’రామలీలా మహప్రణేత’’అనిపించాడు .ఎన్నెన్నో యజ్ఞాలు చేసి భూరి సంభావనలిచ్చి దేవతలను భూదేవతలను తృప్తి చెందించాడు .బ్రాహ్మణ కు కుటుంబాల్లో ఆడపిల్లలు ఎందరికో పెళ్ళిళ్ళు చేయించాడు .వేదవేత్తలకు అగ్రహారాలిచ్చి పోషించాడు .వీటినిశిలాశాసనాలపై రాయించాడు .’’కెసిఎస్’’అయి,అనేక సార్ధక బిరుదులూ పొందాడు .మాతా శిశు సంరక్షణకు దీనజనులకు వైద్యాలయం కట్టించాడు  .కాశీలో గురువు అంటే కాశీ విశ్వనాధుడే అన్నట్లు’’ పరి భాషేందు  శేఖరం ‘’కు గురువుతీర్చి  దిద్దిన వాడు,శబ్ద రత్నానికి సానబెట్టి కావ్యార్ధ చంద్రిక వెలార్చిన హరి శాస్త్రి గారిని తన ఆస్థాన పండితుని చేశాడు .

  అలాంటి రాజు పాలించే విజయనగరం లో రాజావారి కాలేజిలో రాయుడు శాస్త్రి గారు ఉపాధ్యాయుడు అయ్యారు .’’శ్రీ విద్యానిధి సుబ్బయ ధీమణి’’ప్రతి  ఏడాది  దేవీ నవరాత్రి ఉత్సవాలు అద్వితీయంగా నిర్వహిస్తూ ,అన్నసంతర్పణలు చివరిరోజున ఘనంగా నిర్వహించి అందరికి సంతృప్తి కల్గించారు.పన్నెండేళ్ళవయసులాయింతటి అద్భుతాలు  చేశారు ,.సంస్కృత దృశ్య కావ్యాన్తాలన్నీ మూడేళ్ళలో రోజూ అగ్రహారం నుంచి ఇక్కడికి వచ్చి నేర్చేశాడు .కుర్రాడు చాకులాఉన్నాడు బాకులా దూసుకు పోతున్నాడని గ్రహించి రుద్రాభట్ల రామ శాస్త్రి ,లక్ష్మణ శాస్త్రి సోదరద్వయం ‘’శబ్దాగమధ్యేత’’ గా తీర్చి దిద్దారు. ఆసోదరులు ‘’ఫణిపతి శాస్త్ర వాద పధ్ధతి యందు అసహాయ శూరులు .ధీబలం లో శంభునైన ఎదిరించగలరు .త్రిపుర సుందరీ ఉపాసకులు .నిత్యాన్న దాన నిరతులు .అసమాన సకల భోగ సమృద్ధి ఉన్నవారు.

 ‘’వ్యాకరణాధ్వనీన మతి పాటవమున్,ఘటియించి నంతతో-బోక ఆలంక్రియాగమా సముద్రము ద్రచ్చి ,తదుద్గ్తతామృత  

స్వీకృతి పాత్రు జేసి తమ శిష్యుని రాయుడు శాస్త్రి నాత్మ నెం-తో కృపనూని  పూర్ణ విబుధున్ బొనరించిరి  రామ లక్ష్మణుల్ ‘’

అలంకార ఆగమ శబ్దా మ్నానం ,మీమాంస మొదలైన వాటిలోఅద్వితీయుడై ‘’అచలాధీశాత్మజా మంత్రం ‘’(త్రిపురసుందరీ దేవి )దీక్ష పొందారు .ఇరవైఏళ్ల వయసు రాకముందే ఇన్నింటిలో అపార ప్రజ్ఞానిధిఅవటం అసాధ్యమే అయినా రాయుడు శాస్త్రి గారు సుసాధ్యం చేశారు .బ్రహ్మ చర్యం నుంచి  గృహస్థాశ్రమ౦ పొందాలని తగిన వధువు సూరమ్మగారిని వరించి పెళ్ళాడారు.అదే సమయంలో విజయనగర సంస్థానానికి ఆనంద గజపతి మహారాజయ్యాడు.

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-9-10-21-ఉయ్యూరు      

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అవర్గీకృతం. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.