బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం -2(చివరి భాగం )
ద్వితీయాశ్వాసం లో ‘’మొక్కు లిచ్చెడి భక్తుల బ్రోవు తోడ –నికరమైనట్టి మహాత్య్మనియతి తోడ –సుకము కల్గించు మంచి వస్తువుల తోడ –రాజిలు చుండు నా సుబ్బా రాయ షష్టి ‘’.అన్ని రకాల ఆర్తులు బాధలు తొలగిస్తాడు .ఆయనమహిమలనుచాటే కథలు చెప్పారు కవి .మొదటిది విప్రకథ – ఒక ఊరిలో గొప్ప విప్రోత్తముడున్నాడు .భార్య అనురూపవతి .కానీ ‘’ధనభాగ్యమెంత తదనరి ఉన్నా –తనయుడొక్కండు గని దక్కని ‘’దౌర్భాగ్యం వారిది .ఎన్నో సత్కార్యాలు తీర్ధ యాత్రలు చేశారు .అనేకమంది మహనీయులను దర్శించి తరుణోపాయం అడిగితె బిక్కవోలు వెళ్లి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సేవ చేస్తే సంతానం కలుగుతుందని చెప్పగా ,దంపతులు ఆర్తిగా దర్శించి మనసులోని కోరిక విన్న వి౦చుకోగా ,సుబ్బారాయ షష్టినాడు చాల నిష్టగా సేవి౦చగా కలలో కన్పించి ‘’స్వాంతమున ప్రసన్నుడనై చింతలు దీర్చాను ‘’అని అభయమివ్వగా ,కొంతకాలానికి కడుపు పండి స్వామి అనుగ్రహం తో పండంటి బిడ్డపుట్టాడు .సుబ్రహ్మణ్యం అని పేరుపెట్టి పెంచారు .
రెండవది ‘’కళానిధి కథ’’-ఒక ఊరిలో పరమ నిష్టాగారిష్టుడు వేద వేదంగ పార౦గతుడు నిరుపేద బ్రాహ్మణుడున్నాడు.పెద్ద పట్నం లో ఒక సద్గురుని ఆశ్రయించి మరిన్ని విద్యలు నేర్చాడు .అక్కడ కళ అనే అపురూప సౌందర్యవతిని చూసి మనసు పారేసుకొన్నాడు .ఆమె దూరమయ్యేసరికి భరించలేక ,తాను సుబ్రహ్మణ్యస్వామి భక్తుడవటం వలన స్వామితో మొరపెట్టుకోగా ,ఆయన ప్రసన్నుడై కళానిధి తో పెళ్లి ఖాయమని చెప్పి అదృశ్యమయ్యాడు .వారిద్దరూ పెళ్ళాడి ఆజంట స్వామి సేవలో తరించారు అని చెప్పి ద్వితీయాశ్వాసం ముగించారు .
మూడవ ఆశ్వాసం లో మూడవ కథమహామహుని గురించి –అతడు గొప్ప రాజు నీతిమంతుడు రాజ్యం పై పక్కరాజు దండెత్తి బెదిరిస్తే ప్రాణాలు అర చేతపట్టుకొని భార్యాబిడ్డలతో అరణ్యానికి పారిపోయి ,అక్కడ ఒకసద్బ్రాహ్మనుడికి తన దీనగాథ చెప్పుకోగా ఆయన ‘’శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరు నాసమెయిన్-భక్తకోటి యాపద లెల్లన్-దాసు౦డై తీర్చును ‘’అని హితం చెప్పి అంతర్ధానం కాగా,కష్టపడి ‘’శేషస్వామి ‘’ని దర్శించి పూజించగా శక్తి సామర్ధ్యాలు వచ్చి శత్రురాజును జయించి తన రాజ్యం స్వాధీనం చేసుకొని సుఖంగా పాలించాడు .
అయిదవది కాంత కథ-ఒక ఊర్లో ఒక వైశ్యదంపతులు ధర్మంగా జీవిస్తూ ,పుట్టినకోడుకుకూడా వారి మార్గాన నడుస్తూ ఆనందం కల్గిస్తున్నాడు .తానుకూడా తండ్రిలా గొప్ప వ్యాపారికావాలనితండ్రితో కలిసి సముద్ర యానం చేసి ఒక ఊళ్లో దిగి వైశ్యుల ఇంట చేరి చిన్న వ్యాపారం మొదలుపెట్టి న్యాయం గా ఆర్జిస్తూ ,దానధర్మాలు చేస్తూ ,పేదలను ఆదుకొంటూ మంచి పేరుపొంది ,బాగా సంపాదించి మళ్ళీ స్వగ్రామం వెడుతుంటే నావ అనుకోని ప్రమాదానికి లోనై మునిగిపోతుంటే ,,తనకు సాయం చేసిన వీరిద్దరూ మునిగిపోవటం చూసిన ఒకడు వారిద్దర్నీ చనిపోవటం చూసి వారి ఇంటికి కబురు చేస్తే భార్య భర్త ,కొడుకును దూరం చేసుకొన్నందుకు విపరీతంగా దుఃఖించి భర్త తో పాటు అగ్నిప్రవేశం చేయాలనుకొని ప్రదక్షిణాలు చేస్తుంటే సుబ్రహ్మణ్య స్వామి వృద్ధ బ్రాహ్మణ వేషం లో వచ్చి శాంత వచనాలతో ఆమె ప్రయత్నం మాన్పించాల్ని చేస్తే ఆమె ఒప్పుకోక అగ్ని ప్రవేశానికి అనుమతివ్వమని ప్రాధేయపడి ,ఆమెతో ‘’ఈ సాహసం ఇత్తరి వీడితి వేని నీ తనూజాతయు భర్తయున్ బ్రతికి చయ్యన రాగలరు ‘’అని చెప్పగా ,ఆయన పాదాలపై పడి నమస్కరించి ఆ కాంత ‘’దేవుడిలాగా వచ్చారు నాకు దారి చూపండి ‘’అనగా, బిక్కవోలుసుబ్బారాయుడు మహిమాన్విత దేవుడు ఆయన్ను దర్శించి పూజిస్తే మంచి జరుగు తుందని చెప్పగా ఆమె అలానే చేయగా స్వామికి ఆపద మొక్కులు మొక్కుకోగా ,వారిద్దరూ బతికి ఆనందాన్ని కూర్చగా సుబ్రాహ్మణ్య భక్తులయ్యారు
ఆరవది శూద్రక కథ –శూద్రుడైన ఒక నాస్తికుడు ఆస్తికులను భయపెట్టి బాధపెట్టి వీలయితే చంపేసి నాస్తికాన్ని పెంచుతుంటే ఒక సిద్ధ పురుష రూపం లో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వాడి దగ్గరకొచ్చి మంచిమాటలు చెబితే వినక నెట్టేస్తే , నేలమీదపడి తన్నుకొని పడ్డాడు ఆశూద్రుడు ..బాధ భరించలేక సిద్ధుని పాదాలపై పడి రక్షించమని ప్రార్ధిస్తే,స్వామి ప్రత్యక్షమై ‘’అనఘులను బాధ పెట్టి నందుకు ఫలితం ఇది ‘’అని బుద్ధి చెప్పగా వాడు ‘’స్వామీ నిన్ శరణంటి బ్రోవగదే-నీ మహాత్మ్యం బెరుగకప్పుడు ‘’మూఢంగా ప్రవర్తించాను బుద్ధి వచ్చింది ఇక ఎవరినీ హి౦సి౦చను ‘’అని కాళ్ళా వేళ్ళా పడగా
‘’నేను సుబ్రహ్మణ్యేశుడ-దాసుల యడ దాసుడ నయి తప్పింతు నిజం
బేసరి కష్టము లేనియు –గాసంతయు భయము నొందగా వలదు సుమీ ‘’అని అంతర్ధానమయ్యాడు .చివరలో మాలినీ వృత్తం లో పద్యం చెప్పాడు కవి –
‘’ముని హృదయ విహారా భూరిలోక ప్రచారా –వననిలయ గభీరా బ్రహ్మ చర్యాతిదీరా –ఘన ఫణి వరకాయా ఖండితస్వా విధేయా –వినతజన విధేయా –వినత జన విధేయా బిక్కవోల్ సుబ్బరాయా ‘’
మంచి ధారగల పద్యాలతో చక్కని సంభాషణలతో సులభమైన పద విన్యాసంతో గొప్ప వర్ణనా వైచిత్రితో భక్తి భావ బంధురంగా స్వామి మాహాత్మ్యాన్ని చాటే ఆరు కథలు రాసిస్వామి శతావధాని పిశుపాటి చిదంబర మహాకవి తన నిరుపమాన కవితా శక్తి చాటుకొన్నారు ‘
1100 సంవత్సలముల చరిత్ర కలిగిన బిక్కవోలు అతి ప్రాచీన శైవ క్షేత్రములలో ఒకటి, గోదావరి తీర మండలం, రాజమహేంద్రవరము, కాకినాడ కెనాల్ రోడ్డు ప్రక్కన ఉన్న బిక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చారిత్రాత్మక విశేషాలతో తూర్పు చాళుక్యల శిల్పకళా వైభవంతో నిర్మించబడిన అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందినది.
ఈ ఆలయాన్ని చాళుక్య రాజులలో ఒకరైన విజయాదిత్య III 849 – 892 సెంచరీ AD లో నిర్మించారు. ఈ క్షేత్రం మొదట చాళుక్య విక్షముని పేరిట విక్షమపురంగాను, కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందినది.
ఈ పవిత్ర దేవాలయము శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయములో ఉన్నది. శ్రీ కుమార సుబ్రహ్మణ్యస్వామి వారు దక్షిణముగా కొలువుదీరి ఉన్నారు. అలాగే, ఇక్కడ పార్వతి, విజయ గణపతి, భద్రకాళి మరియు వీరభద్ర స్వామి ఆలయాలు గమనించవచ్చు. ఆలయలములో నెమలి వాహనం స్వామి విగ్రహం ముందు ఉంటుంది.
శ్రీ కుమార సుబ్రాహ్మణ్యస్వామి వారు బ్రహ్మచారిగా కొలవబడుచున్నారు. ఈ స్వామి అత్యoత తేజస్సు కలిగి చతుర్భుజుడై అభయ ముద్రలో దర్శనం ఇవ్వడం విశేషం. పై రెండు చేతులలో దండం, పాశం ఉంటాయి. ఇక క్రింద కుడి చేతిలో అభయమిస్తున్న స్వామి ఎడమ చేతిని తన నెమలి వాహనం పై ఉంచడం జరిగినది. స్వామి వారికి కుడి వైపున సహజ సిద్ధమైన పుట్టఉన్నది. ప్రతిరోజు రాత్రి పళ్లెంలో పాలు పోసి ఈ పుట్టవద్ద ఉంచడం ఈ ఆలయ సంప్రదాయం.
శ్రీ కుమార స్వామి పళనిలోవలే దక్షిణ ముఖంగా, బ్రహ్మచారిగా కొలువై ఉన్నందున ఈ స్వామిని దర్శించి అభిషేకములు జరిపించినంతనే విశ్వాధిపతి అయిన స్వామి అనుగ్రహం వలన సకల గ్రహశాంతి కలిగి, కోరిన కోర్కెలు నెరవేరడం ఇక్కడ విశేషం. ప్రత్యేకించి రాహు, కేతు, కుజగ్రహశాంతిని కోరి జరిపించే దోష నివారణ పూజలు వలన అనేక మందికి వివాహ సిద్ధి, సంతానం, నష్టాలు మరియు శారీరక ఈతి బాధల నుండి పరిహారం లభిస్తుంది అని ప్రజల నమ్మకం.
ఈ ఆలయాన్ని దర్శించడం వలన అన్నిoటా విజయం లభిస్తుంది అని భక్తుల ప్రధాన విశ్వాసం. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజున శ్రీ కుమార స్వామి వారి షష్ఠి మహోత్సవములు అత్యంత వైభవముగా జరుపబడతాయి. ఆ రోజున సంతానం లేని మహిళలు పుట్టపై ఉంచిన నాగుల చీర ధరించి స్వామి వారి వైపు శిరస్సు ఉంచి నిద్రించడం వలన సంతానవంతులు అవుతారు అని ప్రగాఢ నమ్మకం.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్