దీక్షిత శతకం

దీక్షిత శతకం
‘’ శ్రీ నందిరాజు లక్ష్మీ నారాయణ దీక్షిత శతక౦’’ కర్తవఝల సూర్యనారాయణ కవి .ఇది బాపట్లలోని అత్రి –వాణి ప్రెస్ లో 1938లో ముద్రితం .వెల రెండు అణాలు అనబడే’’ బేడ’’ .ముందు తన వంశ చరిత్ర సీసాలలో ఒలికించాడు కవి .కృష్ణానది బంగాళాఖాతం లో సంగమించే హంసల దీవి క్షేత్రంకు దగ్గరలో ఉన్న రేపల్లె కు దగ్గర ధూళిపూడిలో కవి పుట్టాడు .రామయామాత్య వరతనూజుడైన వఝల వంశం లో సూర్యనారాయణ పేరుతొ పుట్టాడు .ఈశతకం రాయటానికి’’ధీ విశాల కోటీశ్వర దీక్షితార్య సార్వభౌమ మార్కండేయ శర్మ ప్రేరణకల్పించారు .
నందిరాజు వంశం లో ఘ౦టయ్య ,చిన్నమాంబ దంపతుల కుమారుడు దీక్షితులు .కొడుకును ఇంటివద్దనే వదిలి తండ్రి దేశాటనం వెడితే ,రేపల్లెలో దివాకరం రామమూర్తిగారు బాలుడిమీద అభిమానం తో సంస్కృత ఆంధ్రాలు ,సాహిత్యం నేర్పగా వాటిలో గొప్ప దక్షుడయ్యాడు .తెల్లవారుజ్హామునే లేచి స్నాన సంధ్యాది విధులన్నీ యధాప్రకారం చేసి ,బడికి వెళ్లి పాఠాలు బాగానేర్వగా సహాధ్యాయి విశ్వపతి ఓర్వలేక తనకంటే అన్నిటా ముందున్నాడని ఈర్ష్య తో రాజు శబ్దం పై అర్ధ వివరణ అడగటం లో ఈ భేదం మరీ ఎక్కి పోయింది .
కొంతకాలానికి సుంకర వంశంలోని మంత్రి ఒకాయన ఇతన్ని తీసుకొని వెళ్లి ,బంధు మిత్ర సముదాయంమధ్యలో లో తనకూతురు వీరమనిచ్చి వైభవోపేతంగా వివాహం చేశాడు .తర్వాత భార్యతో రేపల్లెలో కాపురం పెట్టాడు .అక్కడ తర్క వ్యాకరణ మీమా౦సాది శాస్త్రాలలో అక్కన శాస్త్రి వద్ద చదువుకోమని శేషగిరిరాయడు ప్రోత్సహించాడు .ఆయనవద్ద అలంకార శాస్త్రంతో సహా అన్నీ నేర్చాడు .గురువంతవాడు అనిపించుకొన్నాడు .అక్కడ నియోగి ,వైదీకి తేడాలొచ్చాయి
తండ్రి దేశాటనం నుంచి తిరిగివచ్చి ,కొడుకును ఇంటికి తీసుకొని వచ్చి నందిగామలో ఉన్న కోడలిని వెంటబెట్టుకొని తీసుకొని వచ్చాడు .ఈ దంపతులతో ఏకోదిష్టం, షోడశ౦ మొదలైన హోమాలు చేయించాడు .గురువు వద్ద అనుమతిపొంది రేపల్లె చేరి నిష్టతో హరదత్తభాష్యాదులు ఆమూలాగ్రంగా చదివి ,స్మార్తంలో నిష్ణాతుడై ‘’అభినవ బ్రహ్మ ‘’అని పించుకొన్నాడు .
బందరులో వడ్లమన్నాటి వెంకప శర్మ అనే ఆర్వేల నియోగి ,త్యాగి యజ్ఞం చేసి అవభ్రుతస్నానం చేసి అన్న సమారాధన మహా వైభవంగా చేశాడు.వైశ్వ దేవం చేసేవారికి విడిగా వంటలు వండించాడు . .విశ్వపతి మొదలైనవారు వచ్చి నియోగుల ఇంట్లో భోజనం చేయము మా సామగ్రి మాకు ఇస్తే వండుకుతింటాము అన్నారు .
బందరులో నియోగులపాఠశాల వేదం పాఠశాల నెలకొల్పి తానె అధ్యక్షుడై తీక్షితులు చక్కగా నిర్వహించాడు .ఇందులో వైదీకులు చేరి చదవనే లేదు .కృత్తి వెంటి వారి పురోహితులం అని కొందరు వైదికులు వచ్చి .తమకు యాజకత్వం ఇవ్వమని కోరగా వెంకపసోమయాజి ఒప్పుకోలేదు రాజభటుల్ని పిలిపించి గెంటి వేయించాడు .
తానుస్థాపించిన రెండు విద్యాలయాలో సమర్ధులైన ఉపాధ్యాయులను నియమించి ,విద్యాబోధన బాగా చేయించి ప్రామాణ్యం పెంచాడు.నియోగులుకూడా వైదీకులతో పోటీపదడిచెడుమార్గాలు పట్టి చెడ్డ పేరు తెచ్చుకొన్నారు .దీక్షితుల తండ్రి ఘంటయ సన్యసించి బ్రహ్మానంద సరస్వతి నామంతో పిలువబడినాడు .అప్పట్నించీ రేపల్లె వేద పాఠశాల బాధ్యతా తీసుకొన్నాడు .నూజి వీడు మొదలైన సంస్థానా ధీశులు వార్షి కాలు పంపుతూ శిష్యగణాలకు విద్యనేర్పటానికి సాయపడుతున్నారు .కలహాలు సద్దు మనగటానికి మేధా దక్షిణామూర్తి తపస్సు చేసి ,ఆనందనామ సంవత్సరం లో అగ్న్యాధానం చేసి ‘’దీక్షితులు ‘’అనే సార్ధక నామం పొందాడు .’’విశ్వపతి అసుర విజయం’’ ,పిష్టపశ్వధ్వరవివేకం ‘’ కావ్యాలు రాశాడు .
రక్తాక్షినామ సంవత్సర శరదృతువులో పుష్పగిరి పీఠాధిపతి రేపల్లెకు60మంది పండితులతోరాగా విశ్వపతి మంత్రిగా ఉన్నాడు. జంగనరాయ భూపాలుడు ,తాటి రామయమంత్రి కొలువు తీరి ఉన్నారు .పుష్పగిరి స్వామినుంచి ఆహ్వానం రాగావెళ్లి యతిపతికి నమస్కరించి ,ఎదురుగా ‘’గ్రంథం’’పెట్టగా అది ఆయనకు అవమానంగా భావించి చులకన చేశాడు శాస్త్ర చర్చలు ఒరుగా సాగాయి రెచ్చి పోయి వాదించాడు దీక్షితులు అందరూ భేష్ భేష్ అని మెచ్చారు కానీ యతిపతి’’నువ్వే గెల్చావు ‘’అనే మాట చెప్పకుండా మౌనంగా ఉన్నాడు .ఎదో ఒకటి చెప్పమని అధికారులు అనగా తీర్పు వ్రాసి పంపిస్తానన్నాడు .విశ్వపతి చిన్నబుచ్చుకున్నాడు మాటలతో గడిపాదేకాని పీఠాధిపతి తుది తీర్పు రాసి ప్రకటించలేదు.
ఇంతమంది మొనగాల్లను వాదం లో ఓడించి దీక్షితనామానికి సార్ధకత కల్పించిన దీక్షితులను మెచ్చుకోకపోవటం తో కలత చెంది సభలోని వారంతా ‘’దీక్షితుడన దేవ దేవుండు –తగు నీతనికి దీక్షిత ప్రశంస ‘’అనగా దేవతలు పుష్పవృష్టి కురిపించారు .కులసతి కోటిమాంబ వలన యజ్న నారాయణ ,సూర్యనారాయణ అనే ఇద్దరు కుమారులను పొందాడు .అద్వైతాన్ని అసురాద్వైతం దేవాద్వైతమ్గా విభజించి ,అసురాద్వైతం దోషమని నిరూపించాడు .తనవారికి దైవతాన్నం పంచాడు .క్రమంగా బ్రహ్మచర్య ,గార్హస్పత్య ,వానప్రస్థాశ్రమం గడిపి ,చివరికి తురీయమైన సన్యాసాశ్రమ౦ తీసుకొని ‘’చిదానంద సరస్వతి ‘’నామ ధేయంతో విరాజిల్లారు.శ్రీముఖ నామ సంవత్సర కార్తీక శుద్దనవమి నాడు దీక్షితార్య అనే చిదానంద సరస్వతి సిద్ధి పొందారు .అప్పటినుంచి ఆరాధనలు జరుగుతూనే ఉన్నాయి .
ప్రజోత్పత్తి నామ సంవత్సరం లో 60వ ఏట ఈ దీక్షిత శతకం రాశానని కుమారుడు సూర్యనారాయణ కవి తెలిపాడు .ఈయన కోటీశ్వర దీక్షిత శతకం మొదలైనవి రాసినట్లు చెప్పి 100 సీస పద్యాలతో శతకాన్ని ముగించాడు .
మొదటి పద్యం –
‘’శ్రీ మహితాచార శిష్ట భూయిష్ట ప్రకాశితా –ర్యవర్తదేశమందు-గాలికాల వశమున గులధర్మము లడ౦గి –వర్ణ సంకరముగా వచ్చినంత
విశ్వ హితార్ధమై ఈశ్వరంశమ్మున –నాది శంకరుడవై నవతరించి-తగువాదముల దుర్మతంబులు ఖండించి –సన్మత స్థాపన సలిపి యేగి
యప్పటప్పటికరుగు దెంచి –యరయవలసి –హరిహరా౦శను మరలి –ఈయవని కవత
రించి యద్వైతమతము భాగించినావు –భవ్య గుణ ధుర్య –లక్ష్మి నారాయణార్య’’
హంసల దీవి వర్ణన –‘’
‘’కృష్ణా మహా తరంగిణి సాగరుతోడ –గాలియు నెయ్యది కేళికా గృహంబు –సరస యౌవన దశా పురుషయిత క్రియా –భోగంబులకేది పూలపాన్పు –ఉర్విపై నేయది పర్వకాలస్నాన –పుణ్యంబులకు నెల్ల బుట్టినిల్లు
పరమభాగవతాది బహు పురాణంబులు –వినిచి స్వర్గము చూర విడుచునెద్ది –అట్టి హంసల దీవి ‘’
బందరు ఉప్పెన
‘’స్వామి తోడనే వచ్చే ఝ౦ఝానిలంబది-ప్రళయ భైరవ ముఖార్భటి యనంగ నీల మేఘమ్బులాని౦గిపై గాలికి –గొట్టుక పోయెడుకొండలనగ
పృధు వర్ష ధారలా యింద్రచాప విముక్త –రసలోహమయపు నారసములనంగ
ధన జీవంబులకు నిర్దయుడై బాధించు –యతిరాజు లయకాల యముడనంగ
దోచె యుప్పెన బందరు నూచె నేచె-లోకములెల్ల నల్లకల్లోలమయ్యె-యయ్యయో ఏమనంగలదా యవస్థ ‘’
చివరిపద్యం –
‘’బ్రహ్మ చర్యంబు గార్హస్త్యంబు నడిపి –వానప్రస్థమును దీర్చి సుప్రసిద్ధ
వాసరంబందు సన్యాసము గై కొంటి –రహి జిదానంద సరస్వతి యన
శ్రీ ముఖాబ్ది కార్తిక శుద్ధ నవమి ని –సిద్ధి గాంచితికీర్తి శేషుడగుచు
నాట నుండియు నీనాటికారాధనల్-వరలు చున్నవి నీకు వార్షికముగ
నఘ నిబర్హణమని భవదనఘ చరిత –సీస పద్యములయందు వ్రాసి శతకంబు
నీ దయన్ బూర్తి జేసితి నేర్చినట్లు –రమ్య గుణ ధుర్య-లక్ష్మి నారాయణార్య ‘
‘’దివ్య తేజుడైన కోటీశ్వర ,దీక్షితాది –కృతున కలరుగగృతి సమర్పించి నాడ
నందుకొను మివె నా యభినందనములు
రమ్యగుణదుర్య -లక్ష్మి నారాయణార్య’’
’అని శతకం ముగించాడు కవి
పద్యాలన్నీ నవనవోత్సాహంగా గంగా తరంగ నిర్ఝరిగా పవిత్రంగా ప్రవహించాయి ప్రతిపద్యం దీక్షితులకే సమర్పయామిగా రాశాడు కవి ‘’రమ్యగుణదుర్య -లక్ష్మి నారాయణార్య’’ అనే మకుటం మకుటాయమానమై భాసించింది .ఆయనకే శతకం విన్నవించుకొన్నాడు కవి .సార్ధక రచన .కవి గురించి ,దీక్షితులగారి గురించి పెద్దగా మనకు తెలిసింది తక్కువే .ఆలోటు తీర్చాడు సూర్యనారాయణకవి .అరుదైన ఈ శతకాన్ని పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-21-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.