ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -2

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -2

  తిరుచూరు వదిలి వెళ్లేలోపే మీనన్ వాల్మీకి రామాయణ అనువాదం మొదలుపెట్టాడు .ఎంతటి పనిఒత్తిడిలొ ఉన్నా ,రోజుకు కనీసం నలభై శ్లోకాలు అనువది౦చేవాడు .విద్వాంసులు ఆమోదించారు .కొందరు చందా దార్లను పోగేసి ధారావాహికంగా 1907లో ప్రచురించాడు .కావ్యం పూర్తయ్యాక ఎన్నో పునర్ముద్రణలు పొందింది .చివరి చివరి ముద్రణలో నగిషీలు చెక్కి భేష్ అని పించాడు ..తిరుచూరులో ఉండగానే ఒకసారి విపరీతమైన జలుబు చేసి చెవులు వినిపించని స్థితి ఏర్పడితే తల్లడిల్లి పోయాడు .ఎందఱో వైద్య ,జ్యోతిష్యులకు చూపించినా,ఎన్నో రోజులు చికిత్స అవసరమైనా,ఫలితం దక్కక, దేవుళ్ళను ప్రార్ధిస్తూ పద్యాలు గుప్పించి రాస్తూ మొరపెట్టుకొన్నాడు .ఫలితం పుట్టెడు చెవుడు ప్రాప్తించింది .గంగ వెర్రు లెత్తాడు.’’బధిర విపాపం ‘’అనే ఆత్మాశ్రయకావ్యం రాశాడు చేసేది లేక .

  1910స్వంతూరు చేరి గొప్ప కావ్యనిర్మాణ౦ చేయాలని భావించాడు అప్పటికే అజకతు పద్మనాభ కురూప్ ‘’రామ చంద్ర విలాసం ‘’,పండాలంకేరళవర్మ’’రుక్మాంగద చరితం ‘’,కోడంగల్లూర్ కాజుణ్ణి తంపురాన్’’పాండవోదయం ‘’,కేసి కేశవ పిళ్ళై ‘’కేశవీయం ‘’ఉల్ళూరు ‘’ఉయా కేరళం ‘’రాసి ప్రసిద్ధికెక్కారు .ఆ ధోరణిలో వలత్తోళ్’’చిత్ర యోగం ‘’ 36వ ఏటరాశాడు .దీనికి సంస్కృత కథా సరిత్సాగర కథ ఆధారం .1591పద్యాలతో రెండేళ్ళు రాశాడు సనాతనులు మెచ్చినా ఆధునికులు ఇంకా పాత చింతకాయ పచ్చడేనా  అన్నారు . ఆతర్వాత 15ఏళ్ళు అతని రచన నిరాఘాటంగా సాగింది.నాటక గేయ వర్ణనాత్మకాలు ఎన్నో రాశాడు.’’బంధనాస్తనాయ అనిరుద్ధన్’’-బందీగా అని రుద్దుడు ,శిష్యానుం మకానుం ‘’-శిష్యుడూ కొడుకూ ,’’మేగ్డలేన మేరియం ‘’  -మేరీ మాగ్డలీన్ వజ్రపు తునకలు .సాహిత్య పద్యమంజరి లోని పద్యసంకలనాలు అప్పుడు రాసినవే .ఇందులో మొదటిది 1917లో, చివరిదైన ఏడవది 1930లో వచ్చాయి .ఆతర్వాత మళ్ళీ నాలుగు సంకలనాలు తెచ్చాడు .కొన్ని సంస్కృత పురాణాలు ,స్వప్నవాసవదత్తం వంటి నాటకాలు అనువదించాడు .కేరళోదయం పత్రికకు సాహితీ సంపాదకుడుగా ఉన్నాడు .

   23వ ఏట ఏడవ ఎడ్వర్డ్ రాజు పై పద్యాలు రాశాడు మీనన్ .ప్రభుత్వం బహుమతి ప్రకటిస్తే ‘’నా గురువైన గాంధీని బంధించిన ప్రభుత్వం నుంచా నేను బహుమతి తీసుకొనేది ??’’అని చెప్పి వద్దన్నాడు .యావత్ప్రపంచాన్నీ గడగడ లాడించిన చక్రవర్తి బహుమతిని వద్దుపొమ్మన్న దేశభక్తికల జాతీయ గ్రామీణ కవి అనిపించాడు .అప్పుడప్పుడే పాదుకొంటున్న జాతీయవాదం మీనన్ ను ఆక్రమించింది .భారతీయ స్వేచ్చకోసం ఎన్నో పద్యాలు రాసి దేశ భక్తి చాటుకొన్నాడు .ఈ పద్యాలు మళయాళ ప్రజలను విపరీతంగా ప్రభావితం చేసి జాతీయతతో స్వాతంత్ర్య సాధనకోసం ముందడుగు వేయించాయి

 వలత్తోల్ మొదటి ప్రాణం కవిత్వమైతే రెండవప్రాణ౦ కథాకళి.’దీనికి పునరుజ్జీవనం తేవటమే అతని ధ్యేయమైంది .ఈ కళ ప్రదర్శనకు ఒక శిక్షణాలయం పెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తే మానాకులం రాజా స్పందించి  తనభవనం లో ఏర్పాటు చేయమని కోరగా ‘’కళామండలం ‘’స్థాపించి ,విరాళాలు స్వీకరించి సమర్ధులైన గురువులను ఏర్పాటు చేశాడు .పర్యవేక్షణలో రాత్రింబవళ్ళు గడిపేవాడు .విద్యార్ధులకు గట్టిపునాది ఏర్పడటానికి పండితుడు, విమర్శకుడు, స్నేహితుడు అయిన కృష్ణ మరార్ ను నియమించాడు .స్వంతభవన’’౦చేరు తిరుత్తి’’లో  నిర్మించి కళామండలం ‘’ను ఇక్కడికి మార్చాడు .కేరళలోని అన్ని ప్రాంతాలనుంచీ ,దేశ విదేశాలనుంచీ కూడా విద్యార్ధులు వచ్చిశిక్షణ పొందారు .కేరళ నృత్యానికీ శిక్షణ ఇచ్చేవారిక్కడ .1939లో తనబృందాన్ని రవీంద్రుని శాంతి నికేతనానికి తీసుకు వెళ్లి ప్రదర్శన ఇప్పించాడు. తిలకించిన రవికవి ,పులకించి ‘’ భారతీయ నృత్య సంప్రదాయం కనుమరుగై పోతున్న ఈ కాలంలో ఉత్తరాది వాళ్ళమైన మాకు ఈ మహత్తర నృత్య నాటి క ప్రదర్శన చూపించి,గగుర్పొడిచే  మధురానుభూతి కలిగించారు ‘’అని మనస్పూర్తిగా మెచ్చాడు.దేశ దేశాలను దృష్టిలో పెట్టుకొని మంచి క్రమ శిక్షణతో సంస్థను  మీనన్  తీర్చి దిద్దాడు .అదే తపన ఆయనకు .1941లో ఈ సంస్థను కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేశాడు .అది మూడుపూలు ఆరుకాయలుగా దినదిన ప్రవర్ధమానమై ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఇదంతా వలత్తోళ్ నిరంతర కృషి ఫలితమే, విజన్  ఫలితమే . ఆయన ఇలాంటి శిక్షణాలయం స్థాపిస్తున్నప్పుడు చాలామది ‘’బూజు పట్టినకళ కు చైతన్యం తేవటం అసాధ్యం .మ్యూజియం లో భద్రపరచటం మంచిది ‘’అని విమర్శించి నిరుత్సాహపరచే ప్రయత్నం చేశారు .కానీ వలత్తోళ్ పుణ్యమా అని ఆ ‘’అవశేషం’’ కొత్త ఊపిరులు పోసుకొని నవనవోన్మేషంగా విరాజిల్లుతోంది .

  1930 తర్వాత కళామండలం కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా ,కవిత్వం రాయటం ప్రచురించటం మానలేదు సాహిత్యమ౦జరి నాలుగు భాగాలతోపాటు, విషక్కుని ,దివాస్వప్నం,వీరశృ౦ఖల  లఘుకావ్యాలు రాసి ప్రచురించాడు .1941లో ‘’అచ్చానుం మాకలుం ‘’-తండ్రీ- కూతురుకావ్య౦ రాసి  గొప్ప ప్రశంసలు పొందాడు.1940-50మధ్య రాసినకవితలలో వామపక్ష భావం కనిపిస్తుంది .’’ఇండియా యుచే కరాచిల్ ‘’-ఇండియా కన్నీళ్లు ,’’వళ్ళత్తోళ్ రష్యాయిల్—రష్యాలో వల్లత్తోళ్ సంకలనాలు అతని వామపక్షభావ దృక్పధానికి ప్రతీకలు .

   1937లో కాళిదాస శాకుంతల నాటకం వంటి అనేకం అనువదించాడు .12వ శతాబ్ది సంస్కృతకవి వత్సరాజు నాలుగు నాటికలు –కపటకేళి,కర్పూర చరితం ,రుక్మిణీ హరణం ,త్రిపురదహనం తర్జుమా చేశాడు  .1951లో క్షేమేంద్రుని బోధి సత్వ సాధన ,కల్పలత లకు మీనన్ చేసిన అనువాదాలను తిరువాన్కూర్ యూని వర్సిటి ప్రచురించింది .1952లో హాలుని గాథా సప్తశతి ని ‘’గ్రామ సౌభాగ్యం ‘’గా అనువదించి వెలువరించాడు .

  75 ఏళ్ల వృద్ధాప్యం లో సంస్కృత ఋగ్వేదాన్ని మళయాళ భాషలోకి అనువాదం చేసే బృహత్తర బాధ్యతను తలకెత్తుకొన్నాడు. దీనికి ప్రేరణ ‘’వెనుకబడిన వర్గాలకు వేదాలు నేర్పాలి ‘’అన్న వివేకానందుని  స్పూర్తి వాక్కు  .రెండేళ్ళు విపరీతంగా కృషి  చేసి అనువాదం ప్రచురించాడు .పండితులనుంచి పెద్దగా మెచ్చికోలు రాకపోయినా, మలయాళం లో చిరకాలం మిగిలి పోయినస్వప్నం , కోరిక మాత్రం తీరిపోయింది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-10-21-ఉయ్యూరు ,  

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.