ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -4(చివరి భాగం )

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -4(చివరి భాగం )

వలత్తోలళ్ నారాయణ మీనన్ ‘’చిత్రయోగం ‘’అనే పెద్ద కథా కవిత రాశాడు .ఇవికాక ఇంకో నాలుగు రాసినట్లు ముందే చెప్పుకొన్నాం .1914లో అనిరుద్ధన్ ప్రచురింపబడి పెద్దపేరు పొందాడు .నాలుగు చరనాలున్న 73కవితలు ఇవి .నాటకీయత పండించాడు .అనిరుద్ధుడికి కారాగార శిక్ష పడినప్పుడు ఉష తనకు మరణ శిక్షకంటే తక్కువ శిక్ష అన్యాయం అంటుంది .’’ఎంతలేని వాడికైనా పెళ్లిపండుగ –సొంతయి౦టికిచేర్చు బతుకుపండుగ –వేయి శరములకైన వెరువను నేను –ఒక్క నీ అశ్రువుకు ఓర్వ లేకున్నాను ‘’అని పరితపిస్తుంది .చెర వదిలి బయటికి అతడిని రమ్మంటుంది .ఆతడు ‘’యాదవులకోడలవు –తగునటే అది –నీ కొత్త బంధువుల ధాటి వినలేదా ?’’ఈశ్వరుడే ప్రేమ బీజం నాటాడు .ఆయనే పెకలిస్తాడా ?అన్నాడు .కానివేళఒంటరిగా  కారాగృహానికి వెళ్లి ,అనిరుథ్ ను కలిస్తే అతడి గుండె చెరువైంది .ఆమెను హత్తుకోగా అతని దృఢ సంకల్పం మెత్తని హృదయం ఉషకు అర్ధమయ్యాయి .

‘’శిష్యుడూ –పుత్రుడు ‘’లో పరశురాముడు కైలాసం వెళ్ళే  దృశ్య వర్ణన పరమాద్భుతం .’’పురజనులతోపాటు –లక్షలాది యక్ష స్త్రీలు –అతనిలాంటి సుతుడు –కావాలని కోరుకున్నారు –‘’మనసు కనులు గుచ్చి విచ్చి పరవశంగా చూశారు .కైలాసంలో ముందుగా గణపతి కుమారస్వామికనిపిస్తే మర్యాదగా పలకరించి ము౦దుకు పోతుంటే తండ్రి విశ్రాంతిలో ఉన్నారు తొందరపడకు అన్నాడుగణపతి.తనకు ఆమాత్రం చనువుందిలే అని ముందుకు అడుగువేస్తే తొండంపెట్టి గిరగిరతిప్పగా ‘’బోజ్జగణపతి చేతిలో-బొంగరమై పోయాడు’’.ఆగ్రహోదగ్రుడై అవమానం సహించలేక శివుడు ఇచ్చి దివ్యాస్త్రం, ఖడ్గం ప్రయోగించగా చెంపను తాకి పిడుగులు పడే భయంకర శబ్దంతో రెండు దంతాలలో ఒకటి తెగి కిందపడింది .మనవడి పతనం మనసును కలవరపరచగా హిమాచలం ,కైలాసం వణికి పోయాయి కర్మసాక్షి కందిపోయాడు .స్కందుడునవ్వగా నంది నొచ్చుకున్నాడు వీరభద్రుడు ఉద్రేకం తో త్రిశూలం ఊపగా రురుడు చండుడు ఉసూరుమన్నారు.సమస్తలోకం దిగ్భ్రమ చెందే సమయం లో రక్తం కారుతూ వినాయకుని దంతం నేల రాలింది.పార్వతికి ఒళ్ళు మండిపోయి అందర్నీ తోసుకొంటూ ముందుకు వెళ్లి మొగుడిమీద విరుచుకుపడి –‘’గురువంటే తమ శిష్యునికి ఎంత గౌరవం –ఇప్పుడు కనబడి తరించాం-దివ్యాస్స్త్రాలు ఏవైనా మిగిలి ఉంటె –ఆయనకు ప్రసాదించండి –అందుకే అయోగ్యులకు విద్యాదానం తగదు అన్నారు ‘’అని దెప్పగా శివుడు ఏమీ అనలేక ,నివ్వెరపోయి నిలుచు౦డి  పోతే మురళీ రవంతో రాధాదేవితో శ్రీ కృష్ణుడు –‘’నగుమోము కలవాడు నల్లానల్లని వాడు మేటి ఆటలవాడు ,మెరపు వలువలవాడు –మురళిపట్టినవాడు ,మౌళి పింఛమువాడు –సంపెంగ పువుజోడు సఖిని కూడి ‘’సాక్షాత్కరించాడు .రాధ –‘’ఇనుడుపొడిచిన వేళ-కమల కళకళలీల ‘’గా ఉంది .పార్వతితో రాధ ‘’పిల్లలు అల్లరిపడితే తల్లడిల్లటం తల్లికి తగదు  -‘’పరశు రాముని నీ పతి శిష్యుని చేసిన దాదిగ-నీకు పుత్రులు ముగ్గురు ‘’అంది .అతడు పురుటి నెప్పులు లేకుండా పుట్టిన ఘటం. అతడిని అందరికంటే ఎక్కువగా ఆదరించాలి అని హితవు చెప్పగా పార్వతి శాంతించటం తో అయిపోతుంది .

  మేరీమాగ్డలీన్ లో బైబిల్ కథఇతి వృత్తం .క్రీస్తు ధనికుడైన సైమన్ ఇంటికి వెడితెఅతది ఆహ్వానం లో ఆత్మీయత కనిపించదు –నడమంత్రపు సిరి మిడిసిపాటు తో –అహంకరించిన శిరము వొంగునే ‘’అంటాడు కవి .వాడి భటులు క్రీస్తుముందు మధుర ఖాద్యాలు ఉంచుతారు. క్రీస్తు జుట్టు ముఖం చూస్తె ‘’కల్లోలిత కాళిందీ తరంగాలు ‘’కనిపించాయి .మేరీ ప్రవేశించాక అక్కడ స్వర్గద్వారం ఉన్నట్లు భావించింది –‘’నీ కాళ్ళకంటిన నేరాల బురద-నీ కంటి కన్నీరు కడిగినే ప్రమదా ‘’అంటాడు కవి .పేద గుడిసెలో జన్మించిన మేరీ ని చుట్టుముట్టినకాముకులను వారించినా వాళ్ళ పొగడ్తల ఊబిలో కూరుకుపోయింది ఆ అందాల రాశి .రొంపిలో దిగబడింది .క్రీస్తు గురించి బృందావన వేణుగానం విన్న హరిణి అయి   తన పాప ప్రక్షాళన చేసుకోవాలని వచ్చింది . గుండెలు అవిసేట్లుగా రోదించి బాధకొంత ది౦చు కొన్నది –‘’రోది౦చ వే హరిణాక్షిరోది౦చవే –రోదించ మనక్రీస్తు ఓదార్చులే ‘’ అనే అనునయవాక్యాలు వినిపించి వచ్చి ,తనపడుపు వృత్తి సంపాదన అంతా పేదలకు పంచేసి శషజీవితం ప్రార్ధనలతో గడిపి జీవితాన్ని సార్ధకం చేసుకొన్నది మేరీ మాగ్డనాల్డ్.

   1945లో సెప్టెంబర్ దాకా కేరళ ప్రళయ వర్షాలతో మునిగిపోయింది.దాన్ని కళ్ళకు కట్టినట్లుగా చిత్రించాడు ‘’అన్య వేషభ్రమం ‘’కవితలో .కేరళీయుల దుస్తుల్లో పాశ్చాత్య పోకడలు గమనించి గేలి చేస్తూ జాలిలేని వానతో కవి అంటాడు –

‘కప్పు బెకబెక ఆపే నెందుకు –కుప్పతిప్పలు కురిసినందుకు –నెమలి పురి విడి ఆడదేందుకు –నిలువునా ఇల మున్చినందుకు – మెరపు నిను విడి తొలగే నెందుకు పుడమి ఆశలు పూడ్చినందుకు ‘’అంటాడు .పున్నమి రాత్రుల్లల్లో కూడా అర్ధరాత్రి అయినా చంద్రుడూ ,,పగలు మిట్ట మధ్యాహ్నమైనా సూర్యుడు కనిపించలేదు –‘’పంటను కోసే వేళలలో – కంటికి నీరయే కేరళలో ‘’’

‘’పొరుగింటి పులుపుకూర మధురమా –నలుపు నీకు సొగసు నీదు శిశిరమా –జిలుగుచున్న చలువవలువ దాల్చుమా ‘’అని విదేశీ వస్త్ర వ్యామోహం పై కవితాశరం ఎక్కు పెట్టాడు .వేసవిలో చినుకు పడకపోవటాన్ని –‘’ఫెళఫెళా ఉరుములభేరీమృదంగాలు –తళతళామెరుపుల మిరుమిట్లు నాట్యాలు –కుండపోతగా వానకురియు సూచనలు –ఓ చుక్కవానైనా పడదుఅసలు ‘’

పావురాన్ని –‘’ముక్కున ,పదమున చిక్కని లత్తుక –రెక్కల సందున రంగుల అల్లిక –ఎర్రనికన్నుల కుంకుమ అమరిక –అరటి పూవు నీ దేహము పోలిక –వివరించుటకై చాలునే నాలుక ?’’అని వర్ణించాడు మీనన్ .మనదేశ అహింసా పధ్ధతి చెబుతూ –‘’గరిక పరకను పెకలించటానికైనా పాపం అనుకొనే దేశం లో –అహింసను పరమ ధర్మంగా త్రికరణ శుద్ధిగా పాటించే దేశం లో –మహాత్ములు నివశించే దేశం లో ‘’ఇంకా ఆటవికత్వమా మనుష్యులలో అని ప్రశ్నించాడు .పొలాల దగ్గర పశువులపాలన లో –‘’దున్నలూ మీరు మాకు అన్నలు –మా అమ్మపాలకోసం మేమూ ఎదురు చూస్తాం తెన్నులు .ఎద్దులూ –మీరేమాకు నిజమైన పెద్దలు –మీరు దున్ని పండిస్తేనే మా నోటికి అందుతాయి ముద్దలు ‘’.

  తనకు వచ్చిన చెవుడు పై రాసిన’’ బధిర విలాపం’’ లో’’తెల్లవారినా –చింతయే మిగిలేన్ ‘’.సాటికవులు వచ్చి కవితలు వినిపిస్తుంటే ‘’చెవికి చేరక తెలియనేరక –కష్టం ‘’అనిపించింది .

  వచనంలోనూ చాలా విశిష్టరచనలు చేశాడు వలుత్తోల్ .అతని కవితా శిల్పం అమోఘమైనది .నైర్మల్య మాధుర్య సౌందర్య విలసిత౦ కవితలు రాశాడు .మధుర మనోజ్ఞ వర్ణనలతో మనసు ఆకర్షిస్తాడు .సత్వం మృదుత్వం కోమలత్వం అతని సొత్తు .మాటలతో కదలికలు కవళికలు వివిధ ఉచ్చారణలు చిత్రి౦చగల నేర్పరి .అతని వర్ణనాత్మక ప్రతిభ అనన్య సదృశమని పిస్తుంది .

స్వతంత్ర భారతం గురించి –‘’భారతమను మత్తేభము –సాధించెను స్వాతంత్ర్యము –అణగ ద్రోక్క కాదుసుమీ –నిస్సహాయ జనరక్షకు ‘’అని దేనికోసమో వివరించాడు .అతనికవితలలో ధ్వనీ ఔచిత్యమూ పుష్కలంగా దర్శనమిస్తాయి .సంస్కృత ,ద్రావిడ ఛందస్సులపై అతడి ఆధిపత్యం తిరుగు లేనిది .లయలో ఉయ్యాలలూగిస్తాడు .పురాతన సంప్రదాయ రీతిలోని గొప్ప మంచి లక్షణాలన్నీ పుణికి పుచ్చుకొన్నాడు .లఘుకావ్యాలను నాటకీయతతో సజీవం చేశాడు గేయాలను  అత్యంత చలన శీలంగా మలిచాడు. పద సముదాయ నిర్మాణం లో అతడొక మహా శిల్పి .తన జీవన దృక్పధం తో పొందిన ,పండిన  ఆనందాన్నితనదైన శబ్ద జాలం తో మలచి జనావళికి అందజేసిన మహాకవి వల్లత్తోళ్ నారాయణ మీనన్ .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-10-21-ఉయ్యూరు  

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.