భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్
గారి జీవిత చరిత్రను ‘’ప్రెసిడెంట్ వి.జే,పటేల్ జీవితం’’పేరుతొ శ్రీ పురాణం కుమార రాఘవ శాస్త్రి సంపాదకత్వం లో శ్రీ కంభం మెట్టు సత్యనారాయణ రావు రచించి తండ్రి స్వర్గీయ కంభం మెట్టు బ్రహ్మాజీ రావు గారి పవిత్ర స్మృతి చిహ్నంగా విజయవాడ గవర్నర్ పేట లోని అరుణ ప్రచురణలు –వెరైటీ ఏజెన్సీస్ లో 1946లో ముద్రించారు.వెల-కేవలం ఒక రూపాయి .
జనన విద్యాభ్యాసాలు
విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ 18-2-1871న గుజరాత్ కైరాజిల్లా కర్సాద్ గ్రామం లో జన్మించాడు. ముగ్గురన్నదన్న దమ్ములలో పెద్దవాడు కొన్నేళ్ళు బతికి చనిపోగా మిగిలిన ఇద్దరిలో విఠల్ భాయ్ పటేల్, భారత తొలి ఉపప్రధాని ,హో౦ మినిస్టర్ వల్లభ భాయ్ పటేల్ ఉన్నారు .సోదరులిద్దరూ నవభారత నిర్మాతలుగా ప్రసిద్ధులు .సుమారు 80ఏళ్ల క్రితమే వీరికుటు౦బ౦ స్వగ్రామం వదలి అహ్మదాబాద్ , బొంబాయ్ లకు చేరింది.
చిన్నతనం నుంచి గడుగ్గాయిగా ఉన్న విఠల్ భాయ్ తనలోని తేజస్సును దాచుకొన్నాడు .స్వగ్రామం లో చదువు పూర్తయ్యాక ఉన్నతవిద్యకు నడియాడ్ వెళ్లి ,లా చదివి పట్టా పొంది 1904లో బార్ అట్-లా చదువుకోసం లండన్ వెళ్ళాడు .ప్లీడర్ గా పెద్దగా సంపాదించింది లేదు ఉన్నదానితోనే పొదుపుగా లండన్ లో కాలం గడుపుతూ ,1908లో ఇండియాకు తిరిగి వచ్చాడు .అకస్మాత్తుగా భార్య చనిపోయింది .దేశ సేవలో జీవితం ధన్యం చేసుకోవాలని నిశ్చయించాడు .లాయర్ గా మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు .బొంబాయ్ దగ్గర బాంద్రా ప్రాంతం సివిల్ వ్యవహారాలూ చూస్తూ 1922-23లో జాతీయవాదం తో ఒక పార్టీ పెట్టి బొంబాయి మున్సిపాలిటిలో ప్రవేశించి కే .ఎఫ్ .నారీమన్ ,జమాన్ దాస్ మెహతా ,మోతీలాల్ నెహ్రు మొదలైన ప్రసిద్ధులతో కలిసి మునిసిపాలిటిలోప్రజోపయోగమైన అనేక మార్పులు తీసుకురావాలని భావించాడు .నెలలోనే వివిధ వార్డులలో 250మీటింగులలో మాట్లాడి ప్రజా చైతన్యం తెచ్చి ,గెల్చి మున్సిపాలిటి కైవశం చేసుకొన్నాడు .అవినీతి అధికారులకు సింహ స్వప్నమైనాడు .
ఈ జాతీయవాదులు పటేల్ నాయకత్వం లో అనేక సంస్కరణలు తెచ్చి ప్రజాస్వామిక సంస్థగా తీర్చి దిద్దారు .మునిసిపల్ వోటింగ్ హక్కు తెచ్చారు .ఖద్దరు ప్రచారం ,స్వదేశీ వస్తు ఉత్పత్తి పెంచారు .ఆయుర్వేద ,యునానీ వంటి దేశీయ వైద్యానికి ప్రాధాన్యత పెంచారు .అన్ని వార్డులలో జాతీయ వైద్య శాలలు ఏర్పాటు చేశారు .ప్రజారోగ్య రక్షణకు తాలిమ్ఖానాలు పెట్టారు .కోట్ల రూపాయల అప్పులో ఉన్న బొంబాయి కార్పోరేషన్ ను పటేల్ సముద్ధరించి నిల్వధనం పెంచాడు .గవర్నర్లకు వైస్రాయి కి స్వాగత పత్రాలు సమర్పించే ఆచారం రద్దు చేసి ప్రజాధనాన్ని కాపాడాడు.
మున్సిపల్ కమీషనర్ లను ప్రజలే ఎన్నుకోవాలి .అప్పుడే స్వపరి పాలన జరుగుతుందని భావించి కృషి చేశాడు .1922నుంచి 25వరకు కార్పోరేషన్ లో కాంగ్రెస్ హవానే సాగింది.1925లో విఠల్‌భాయ్ బొంబాయ్ శాసన సభలో ప్రవేశించాడు .మొదట్లో పాఠశాలల కమిటీ కి అధ్యక్షుడుగా ఉండి ,ప్రజాభిమానం తో మున్సిపాలిటీ అధ్యక్షుడయ్యాడు .ఒకప్పుడు బొంబాయి కార్పోరేషన్ వారు లార్డ్ కర్జన్ కు స్వాగతం ఇవ్వాలని సంకల్పించగా ఫిరోజ్ షా మెహతా నెగ్గనియ్య లేదు . అలాగే ఇప్పుడు పటేల్ కూడా వైస్రాయ్ రీడింగ్ కు స్వాగతం ఇవ్వటానికి ఒప్పుకోలేదు .రీడింగ్ విక్టోరియా రాణి ప్రకటనలకు విరుద్ధంగా ,భారత ప్రజల ఆశయాలకు వ్యతిరేకంగా నిరంకుశంగా పాలన చేసే వాడు .ఇలాంటి వాడికి స్వాగతం ఇవ్వటం ఏమిటి అని పటేల్ వాదిస్తే ,చాలామంది ఆయన్ను వ్యతి రేకి౦ఛి విమర్శించగా గా ఆయనమాట నెగ్గలేదు .నిరసనగా తన అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చేశాడు .కానీ మళ్ళీ ఆయననే ప్రజలు గెలిపింఛి అధ్యక్షుని చేశారు .ఆయనమాట ప్రజావాక్కు అయింది .ప్రభుత్వం లోని జోహుకుం చేసే వాళ్ళతో పోరాడుతూ, ప్రజా సక్షేమం కోసం కృషి చేస్తూ మున్సిపల్ వ్యవహారాలను సర్వ సమర్ధంగా నిర్వహించాడు పటేల్ భాయ్.ఈ అనుభవంతో శాసన సభలో కూడా విజయం సాధించాడు .
రైతు పక్షపాతి
త్రికరణ శుద్ధి ,దయా ఉన్న మనీషి పటేల్ .ఇతరులకష్టాలను చూసి సహించలేడు.కార్యదక్ష దీక్షా పరుడు .గుజరాతీయుల ప్రియ బాంధవుడు .గుజరాత్ లోని బార్డోలి రైతు సత్యాగ్రహం ఈయనతమ్ముడు వల్లభాయి పటేల్ నాయకత్వం లో విజయవంతమై దేశ విదేశీయులను ఆకర్షించింది.గాంధీ ఆశీస్సులు పొంది౦ది కూడా . బ్రిటిష్ ప్రభుత్వం శిస్తులను 22శాతం పెంచింది .ఇది అన్యాయం ,లాండ్ రెవిన్యు కోడ్ కు విరుద్ధం అని బార్డోలీ రైతుప్రజలతరఫున ప్రతిఘటించి సహాయ నిరాకరణ చేసి శిస్తులు చెల్లించకుండా రైతులు సత్యాగ్రహం చేశారు .ఈ సందర్భంగా విఠల్ భాయ్ గాంధీగారికి ఒక ఉత్తరం –‘’బార్డోలి సత్యాగ్రహం న్యాయమైనదే .రైతులు నిష్పాక్షిక విచారణ కోర్తుతున్నారు .తమకష్టాలు తీరాలన్నదే వారికోరిక .కానీ ప్రభుత్వం దమననీతితో అణచటానికి ప్రయత్నిస్తోంది .హింసతో శిస్తులు వసూలు చేసే ప్రయత్నం చేస్తోంది .ఈ పరిస్థితులలో నేను చేతులు ముడుచుకొని కూర్చోలేను. ఈ సత్యాగ్రహం కోసం మీరు నిధిని పోగుచేయటం సముచితం .నా వంతుగా వెయ్యి రోపాయలు అందజేస్తున్నాను .ఉద్యమం సాగిన౦తకాలం నేను ప్రతి నెలా వెయ్యి రూపాయలు అందిస్తాను .బార్డోలీ రైతులకు ఎలాంటి సహాయం కావాలన్నా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను ‘’ అని రాసిన ఉదార హృదయుడు విఠల్ భాయ్ పటేల్ . చివరికి ప్రభుత్వం లొంగి వచ్చి ఆర్ .ఎస్. బ్రూం ఫీల్డ్ ,ఆర్. ఎం .మాక్స్ వెల్ లతో విచారణ సంఘాన్ని నియమించి, వారు రైతులది న్యాయమైన కోరిక అని నివేదిక ఇవ్వగా ,శిస్తు 6శాతం మాత్రమె పెంచి ఊరట కలిగించింది .1918లో పటేల్ గోకుల్ దాస్ పరాన్ దాస్ పరేఖ్ తో కలిసి కైరా జిల్లా పర్యటించి రైతుల కష్టనష్టాలు విని సానుభూతి చూపాడు .
హరిజన పటేల్
హరిజనుల మీద అపారమైన దరాభిమానాలున్న విఠల్ భాయ్ ని చూసి మహాత్మాగాంధీయే స్వయంగా ‘’1916లో నేను గోద్రా వెళ్లాను. అక్కడ ఒక రాజకీయ సమావేశం జరుగుతోంది .అదే సమయంలో అక్కడ ఒక హరిజనుల సమావేశమూ జరిగింది .రాజకీయ సమావేశానికి వచ్చినవారందర్నీ నేను హరిజనవాడలో జరిగే హరిజనసమావేశానికి కూడా రమ్మని పిలిచాను .తీరా నేను వెళ్ళే సరికి అక్కడి దృశ్యం చూసి నేను జీవితం లో మరవలేకపోయాను .అప్పటికే అక్కడ విఠల్ భాయ్ పటేల్ వచ్చి ఉన్నాడు .శాసన సభాధ్యక్షుడు అక్కడ రైతు వేషం లో ,సాధువుల టోపీ పెట్టుకొని ,హరిజనులతో కలిసిపోయి కనిపించి నన్ను ఆశ్చర్యపరచాడు .హరిజనులపై అతడికి ఎంతటి మమకారమో గ్రహించాను .సనాతనులు ఏమనుకొంటారో అనే సందేహం అతడికి లేదు ‘’అని చెప్పాడు .అంతటి నిబద్ధత విఠల్ భాయ్ ది.
శాసన సభా ప్రవేశం
1909లో మింటో –మార్లే సంస్కరణలు అమలులోకి వచ్చాయి .లాన్స్ డౌన్ కాలం లో ప్రవేశపెట్టబడిన సంసరణలకు ఇవి అనుబంధాలు .దీని వలన పరిపాలనలో చెప్పుకోదగిన మార్పులు రాలేదు .పరిపాలనా విధానం ప్రజలు అర్ధం చేసుకోవటానికి ఇవి తోడ్పడ్డాయి .శాసన సభ్యుల సంఖ్య పెరిగింది .సభలో ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరిగింది .పాలన ,ఆర్ధిక విషయాలలో సభ్యులకు కొన్ని అధికారాలు లభించాయి .ప్రజా సమస్యలను శాసన చర్చించే వీలుకలిగింది .
ఒకసారి బెంగాల్ సభలో లార్డ్ కాల్ మైకేల్ ‘’ప్రభుత్వం శాసన సభకు బాధ్యత వహించి ఉండనంతవరకు ,సభలలో ప్రభుత్వం ఓటములపాలు అయినా ప్రయోజనం ఉండదు ‘’అన్నాడు అయినా ఈ సంస్కరణలు ఆహ్వానిమ్పదగినవే .నిశిత విమర్శకుడు గోఖలే ‘’ఉదార న్యాయమైన సంస్కరణలే ‘’అన్నాడు .కాంగ్రెస్ కూడా స్వాగతించింది .
విఠల్ భాయ్ కి ఇది మంచి అవకాశం అనిపించి ,ప్లీడరీకి స్వస్తి చెప్పి ,బొంబాయి శాసన సభలో చేరాడు. లార్డ్ వెల్లింగ్టన్ గవర్నర్ .శాసన సభాధ్యక్షుడు కూడా గవర్నరే .ఆయన విఠల్ భాయ్ ప్రతిభాసామర్ధ్యాలు చాకచక్యం అర్ధం చేసుకొని గుర్తించాడు .శాసన సభా ప్రవేశం చేయగానే పటేల్ కు ఉత్సాహం ఉరకలు వేసింది .క్షణం కూడా వృధాకాకుండా ప్రజా సంక్షేమం ,రైతు సేవకు నడుం కట్టాడు .హిందువులలో వర్ణాంతర వివాహాలను అంగీకరిస్తూ ఒక తీర్మానం ప్రతిపాదించాడు .కానీ అది నెగ్గలేదు .ఈ తీర్మాన్నే ఇంపీరియల్ కౌన్సిల్ పో ప్రతిపాది౦చాడుకానీ అక్కడా చుక్కెదురైంది .ఈ రెండు సార్లు సనాతనుల ఆందోళన మిన్నంటింది.అంతమాత్రాన నిరుత్సాహపడలేదు .సంఘ సంస్కరణాభిలాష తగ్గలేదు .దేశాన్ని సాంఘిక రాజకీయ వైజ్ఞానికంగా ముందుకు తీసుకు వెళ్లాలని ఆయన దీక్ష .దీనికోసం బొంబాయి శాసనసభలో ‘’ఎడ్యుకేషన్ యాక్ట్ ‘’ప్రవేశపెట్టాడు .అంతకు ముందు గోపాలకృష్ణ గోఖలే తన రాష్ట్రం లో నిర్బంధ ప్రాధమిక విద్య ప్రవేశపెట్టటానికి ప్రయత్నించి విఫలుడయాడు.
విఠల్ భాయి బొంబాయి శాసన సభలో ఐరిష్ పధ్ధతి ప్రవేశపెట్టాడు .అంటే ప్రభుత్వ బిల్లులను వ్యతిరేకించటం .వీరిది సభలో మైనారిటీ వర్గం కనుక తోసెయ్యలేకపోయారు .పతిఘటన మాత్రం చేయగలిగారు .ఇండియాకార్యదర్శిగా ఉన్న మాంటేగ్ –‘’శాసన సభలో ప్రజా సమస్యల లగురించి చర్చించే సమయం లేకపోవటం పటేల్‌కు బాధకలిగించింది .దేశీయవైద్యానికి తీర్మానం చేస్తే ప్రభుత్వం తిరస్కరించింది .ప్రభుత్వ ఖర్చు తగ్గించమని 50 తీర్మానాలు పెట్టాడు .ఫైనాన్స్ సభ్యుడు వాటినన్నిటినీ తోసేశాడు .ఫైనాన్స్ ఖర్చు గురించి మాట్లాడే అవకాశం ఫైనాన్స్ కమిటీలోనైనా ఇవ్వమని కోరాడు .దాన్నీ తిరస్కరించాడు .నిర్బంధ విద్యావిధానాన్ని కూడా ప్రభుత్వం తిరస్కరించింది .మొత్తం మీద శాసన సభలో ఎక్కువ హడావిడి గల్లంతు చేసి౦దిమాత్రం విఠల్ భాయ్ పటేలే ‘’అని చెప్పాడు మాంటేగ్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-10-21-ఉయ్యూరు