కవిత్వం –శాశ్వతత్వ౦
కవిత్వానికైనా ,హాస్యానికైనా ,దృష్టిలో వక్రత ఉండాలి. వస్తువును చూసి సామాన్యుడు అనుకొనే దానికంటే కొత్తగా ఉంటేనే కవిత్వమైనా ,హాస్యమైనా పండుతుంది .గిన్నెలో పోసిన ఎర్రని ద్రాక్ష సారాయి పైభాగాన నురుగుతో అందంగా ఉంది. సారాయి నురుగుకట్టింది అని సామాన్యుడు అనుకొంటాడు . .మధువు సిగ్గుపడి మందహాసం చేసింది అంటాడు కవి .ఎర్రదనాన్ని సిగ్గుగా నురుగును నవ్వుగా భావించాడు కవి .మధువుకు ప్రాణం పోసి ,మందహాస సుందర సౌందర్య మూర్తిని చేశాడు కవి .మామూలు విషయమే దృష్టిలోని విలక్షణ వలన ఇలా తయారైంది .
శాశ్వతత్వం –హాస్యం లో బరువు లేకపోతె శాశ్వతంగా ఉండటానికి తగిన జీవ శక్తి లేదనీ ,అందుకే అది క్షణికం అనీ ,తాత్కాలిక ఆనందాన్నే ఇస్తుంది తప్ప శాశ్వతంగా అంటే మళ్ళీ మళ్ళీ చదివినప్పుడల్లా ఆనందాన్ని ఇవ్వగల సత్తా దానికి లేదని తెలుస్తుంది .కవిత్వానికీ ,హాస్యానికీ ఇదొక ముఖ్య భేదం అంటారు విజ్ఞులు .మంచి పద్యం ఎన్ని సార్లు చదివినా ఆనందం ఇస్తుంది .మళ్ళీ మళ్ళీ చదవాలని పిస్తుంది .ఒక హాస్యాపు తునక మొదటిసారి వింటే ఆన౦దిస్తాం.మళ్ళీ చదవాలని పించదుఅంటారు కొందరు.పద్యం లో సంగీతం ఊపు ,లాలిత్యం ,లాలన ఉండటం వలన ఫలితం అది. హాస్యానికి కూడా ఇలా౦టి అద్భుత శక్తి ఉందని చాలామంది భావిస్తారు .వస్తువును బట్టి,అందులోని పదార్ధాన్ని బట్టి క్షణికత్వం ,శాశ్వతత్వం కలుగుతుంది .ఒక విశిష్టమైన పరిస్థితినిబట్టి ,శాశ్వతమైన సమస్యను బట్టి హాస్యానికి చావు లేదు .వితంతు ,రజస్వలానంతర విషయాలు తాత్కాలికం .వీటికి సంబంధిన రచనలు ఆ సమస్యలు సమసి పోగానే కనుమరుగౌతాయి .భార్యాభర్తల జీవిత సమస్యలు ఒకకాలానికి పరిమితం కాదు .అందరికి సంబంధించినవి .మానవుడు మానవుడుగా ఉన్నంతకాలం అది సజీవంగా ఉంటుంది .తెనాలి రామలింగని హాస్యం బీర్బల్ హాస్యం వందల ఏళ్ళు గడిచినా ఆనందాన్నిస్తుంది .
శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-10-21-ఉయ్యూరు