శ్రీ నిర్మల్ చేతిలో అందంగా ఎగిరిన రవీంద్రుని ‘’భావ విహంగాలు ‘’
వారం క్రితం నాకు ‘’భావ విహంగాలు ‘’పుస్తకం వచ్చింది .రచయితతో నాకు బొత్తిగా పరిచయం లేదు .అందులోనినంబర్ కు ఫోన్ చేస్తే కవి గారు మాట్లాడారు .మీరు నాకు పంపిన పుస్తకం అందింది అన్నాను. ఆయనా ఆశ్చర్యపోయారు .ఎవరు పంపి ఉంటారు అని అడిగితె ,శ్రీ వడలి రాధాకృష్ణ కాని శ్రీ చలపాక ప్రకాష్ కానీ పంపి ఉంటారని చెప్పారు .మొదటి వారి గురించి తెలుసుకాని ,పుస్తకం పంపే౦త పరిచయం లేదు కనుక చలపాక పంపి ఉంటారని అనుకొన్నా . ఈపుస్తకం ,ఆయన ‘’కరోనా నానీలు ‘’కలిపి వచ్చాయని మా శ్రీమతి చెప్పింది .ఈపుస్తకం కూడా ప్రకాష్, కళాసాగర్ జంట నేతృత్వం లో ముద్రణ పొందినదే .అందుకే క్వాలిటీ కూడా బాగుంది ,.కవి అసలుపేరు వల్లభుని నిర్మల ప్రసాద్ –‘’నిర్మల్ ‘’గా ప్రసిద్ధుడు .విజయవాడలో పుట్టి అక్కడే చదివి ,వరంగల్ ఇంజినీరింగ్ కాలేజిలో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ మొదటి బాచ్ విద్యార్ధిగా చేరి ,పాసై విద్యుత్ ఇంజినీర్ గా చాలా శాఖలలో పని చేసి విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ లో డివిజనల్ ఇంజనీర్ గా రిటైరయ్యాడు .భార్య శ్రీమతి సత్యమణి చీరాల ప్రభుత్వ మహిళా కాలేజిలో ఫిజిక్స్ హెడ్ గా చేసి ఇన్ చార్జి ప్రిన్సిపాల్ గా రిటైరయ్యారు. ఈమెకే ఈపుస్తకాన్ని కవి అంకితమిచ్చారు .ఇంతకు ముందు ఈ కవి ‘’వెన్నెల సుమ మాలికలు ‘’,ముత్యాల మెరుపులు ‘’కవితా సంపుటులు రాసి ప్రచురించిన అనుభవం ఉంది .పుస్తకం ఈ సెప్టెంబర్ లోనే విడుదలైంది .వెల150 రూపాయలు .ఈ పుస్తకాన్ని ఈ పూటే చదివి స్పందిస్తున్నాను .
విశ్వకవి రవీంద్ర నాథ టాగూర్ బెంగాలిలో రాసి తానే ఇంగ్లీష్ లోకి అనువదించిన ‘’స్ట్రె బర్డ్స్’’లోని 320కవితలలో 286 కవితలకు నిర్మల్ చేసిన భావాను వాదమే ‘’భావ విహంగాలు ‘’.ఇవి దేనికది హైకూ లలాగా ముక్తకాలు .చైనాభాషలోకి దీని అనువాదాలు చాలా వచ్చాయి .అందులో ఫీయింగ్ అనే అతడు చేసిన అనువాదం లో’’పుట్స్ ఆఫ్ ఇట్స్ మాస్క్ ఆఫ్ వాస్ట్ నెస్ టు ఇట్స్ లవర్ ‘’ ను పొరబాటున ‘’ఆమె పాంట్ ను తీసేసింది ‘’అనే అర్ధం వచ్చే ఫ్రేజు గా అనువదించగా ,పెద్ద ఎత్తున నిరసన జరిగి ఆపుస్తకాన్ని బాన్ చేయటం కూడా జరిగింది .అతడికి టాగూర్ పై అంతగా విశ్వాసం లేదనీ ,ఆయన హృదయం అర్ధం చేసుకోలేదని అన్నారు విమర్శకులు .కనుక అనువాదకుడికి ఎంతటి నిబద్ధత ,ఆరాధనా భావం ఉండాలో తెలుస్తోంది .ఇంతకీ స్ట్రె బర్డ్స్ అంటే దారి ‘’తప్పినపక్షులు’’ .అంటే ఎలా పడితే అలా సంచరించేవి .మన ఆలోచనలూ అలాంటివే అని రవీంద్రుని భావం .అలాగే ఆయన వాడిన ‘’రగ్గేడ్ ఫెదర్స్ ‘’అంటే పూర్వ వైభవం ,బాధ విషాద ఛాయా అని అర్ధం..టాగూర్ దృష్టిలో పక్షి అంటే ప్రకృతి కి చిహ్నం .పాటకు ,స్వేచ్చ కు రూపకం .ఒక్కొక్కసారి ఒక్కో పక్షి ని ఆయన సూచిస్తాడు .టైలర్బర్డ్ ,నెమలి ,కోయిల ,కాకి వగైరా .నిర్మల్ గారి అనువాదం రవీంద్ర భావానికి సమీపంగా ,నిండుగా సాగింది .హృదయావిష్కరణ జరిగింది .వీటిలో నాకు నచ్చిన పద్యాలను మీకు తెలియ జేస్తాను .ఇంగ్లీష్ వెర్షన్ ,దానికింద తెలుగు సేత తో కవితలు ఉంటాయి .కనుక వేరే ఎక్కడా వెతుక్కోవక్కర్లేదు .ముందుగా కవి రవి కవికి కవితాంజలి ఘటింఛి ,ఉపక్రమి౦చాడు.ఆ భావ విహ౦గ సోయగం ‘’ నా మాటలలో’’ చూద్దాం రండి .
మొదటి కవిత -‘’స్ట్రె బర్డ్స్ ఆఫ్ సమ్మర్ కం టు మై –విండో టుసింగ్ అండ్ ఫ్లై అవే ‘’
అనువాదం –‘’వేసవికాలం లో –విచ్చలవిడిగా తిరిగే పక్షులు-నాకిటికీ వద్దకు వచ్చి –కిలకిలారావాలతో –పులకింప జేసి –ఎగిరిపోయాయి ‘’
ఆఖరి కవిత –‘’ది నైట్స్ సైలెన్స్ ,లైక్ ఎ డీప్ లాంప్ –ఈజ్ బర్నింగ్ విత్ ది లైట్ ఆఫ్ ఇట్స్ మిల్కీ వే’’
అనువాదం –రాత్రి లోని నిశ్శబ్దం –వెలుగుతున్న దీపంగా –పాలపుంత కాంతిలో –వెలిగి పోతున్నది .
ఇక ఈ మధ్యలో ఉన్న అనువాద కవితల సౌరు నామాటలలో చూద్దాం –‘’సుధలోలికే పాపలార –యదేచ్ఛా విహారులారా –పలికెడు నా పదములందు –పాదముద్రలు వేయ రండి ‘’చలికాలం లో పలుకు లేని పండుటాకులు –జాలి గొలుపుతూ రాలుతున్నాయి ‘’,జగతి తన సువిశాల ముఖా౦బరాన్నితొలగించి –వలపు గీతికా రవలళింపగా –అంతులేని ప్రేమను తొణికిస్తూ –భూదేవిని ముద్దాడింది’’ .భూమి కనుల నుంచి వెలువడే నీరే ఆమె నవ్వుల పువ్వుల్ని కుసుమి౦పజేస్తోంది .గరిక పోచ పొందుకోసం ఎడారి పరితపించింది .అస్తమించే రవిని చూసి విలపిస్తే మిలమిల మెరిసే తారకలను చూడలేవు .అర్ధరాత్రి వర్షించే ముసురు లాగ మమతలూరే ఆమె ముఖం కలలలో వెంటాడింది .ఒకప్పుడు అపరిచితులే నిద్ర లేచాక అత్యంత సన్నిహితులని తెలిసింది .మనసులోని వేదనసంజేవేళ చెట్లలో సద్దు మనిగినట్లు ప్రశాంత శాంతిగా మారుతుంది .సాగరాన్నీ, గగనాన్నీ నీ భాష ఏమిటి అని అడిగితె ‘’నిత్య మౌనరాగం ‘’అన్నాయి .చీకటి రాత్రి వంటిది. సృష్టి రహస్యం ఉదయకాల పొగమంచు లాంటిది భ్రాంతి భరిత జ్ఞానం .ప్రేమను ఉన్నత శిఖరాలపై నిలిపితే ఎవ్వరికీ అందుబాటు లో ఉండదు .ఆకులగలగలలే నా మృదు భావాలు ,మనసులోని ఊగే ఆనంద డోలికలు .నువ్వెవరివో చూడలేవు –చూసేది నీ నీడనే .ఉత్తమమైనది నేను ఎన్ను కోలేదు అదే నన్ను ఎన్నుకొన్నది .లాంతరును వెనుక పెట్టుకొన్నవాళ్ళు తమ నీడనే తాము ముందు చూస్తారు .నేను చిరు కుసుమాన్ని ,ప్రకృతి దరహాసాన్ని అంటుంది గలగలమనే ఆకులు ఎవరు నీవు నిశ్శబ్దంగా ఉన్నావు అని అడిగితె . కనులకు కనురేప్పల్లాగా శ్రమకు చెందేది విశ్రాంతి .పుట్టుకతో పసివాడైన మనిషి కి ఎదగటమే అతడి శక్తి .పచ్చటి ఆకులపై నర్తించే పసిడికాంతికి’’మనిషి అబద్ధం ఆడతాడని తెలీదు .చంద్రుని నిరీక్షణ –సూర్యుడికి నమస్కరించి,దారి ఇవ్వటానికి అట .ఎంత నమ్రతగా ఉంటె ఉన్నతికి అంత దగ్గరౌతాం .అందమైన బరువైన నెమలి పింఛ౦ చూసి పిచ్చుక విచారం వెలిబుచ్చిందట .తుఫానుకు దారి లేకపోతె అడ్డంగా వస్తుంది .దార్లు మూసుకుపోతే వెంటనే ఆగిపోతుంది .దేవుడు మనిషితో –నీకు నయం చేయటానికి గాయం చేస్తా –నిన్ను ప్రేమిస్తా కనుక శిక్షిస్తా ‘’అన్నాడు .
గడ్డిపోచ పాదాలకింద భూమిని దాచిపెట్టి౦ది .తప్పు వోటమిని ఒప్పుకోక పొయినా ఒప్పు అంగీకరిస్తుంది.దాహార్తుల దాహం తీర్చటానికి కొంచెం నీరు సరిపోయినా తన సర్వస్వాన్నీ ఇస్తానంటు౦ది ఉదార జలపాతం .గొడ్డలి పిడికోసం చెట్టు నడిగితే ,అనుమానించకుండా పిడి నిచ్చేసింది దానితో వాడు నరుకు తాడని తెలిసినా అదీ లోకం లో ఉదారతా లక్షణం .పవిత్రం అనే భాగ్యం అపరిమిత ప్రేమలోనే పుడుతుంది .గడ్డి తన సమూహాన్ని భూమిలోనే వెతికితే ,చెట్టు తన ఏకాంతాన్ని ఆకాశం లో చూస్తుంది .మనిషి నుంచి మనిషే రక్షణకోసం అడ్డగోలుగాఅడ్డ గోడలు కట్టుకొంటాడు .మరణం లో అందరూ ఒక్కటైతే జీవితం లో సమూహంగా మారుతారు .దేవుడు లేకపోతే మతాలన్నీ ఏకమైపోతాయి.చిత్రకారుడు ప్రకృతి ఆరాధకుడు, దాసుడు ,యజమాని కూడా .ఓ పండూ ఎంత దూరం లో ఉన్నావు అని పువ్వు అడిగితె –‘’నీ హృదయం లోనే ఒదిగి ఉన్నానే ‘’అంది .కత్తిపదును కాపాడే ఒర తను మోద్దుబారినా తృప్తి పడుతుంది .ఎవరికోసం తపిస్తుందో మ౦చు అదేసూర్యుడిని కప్పేస్తుంది .మట్టి నిత్యం అనుమానాలు భరిస్తూ కూడా పువ్వుల్ని సమర్పిస్తుంది .సూర్యుడు పశ్చిమాద్రికిచేరగా ఉదయాద్రి మౌనంగా నిలబడింది ముందు .పొగడ్తలకు మొహమాట పడతా కానీ రహస్యంగా దానికే అర్రులు చాస్తా .ఉత్తమమైనది ఒంటరిగా కాక ఎంతో మంది మధ్యనుంచి వస్తుంది .దేవుడి కుడి చేయి సున్నితం ఎడమ చేయి ఉగ్రం .తాను సృష్టించిన పూలను తనకే తిరిగి కానుకగా ఇవ్వాలని దేవుడు కోరుకొంటాడు .మనుషులు క్రూరాత్ములు కానీ మనిషి దయామయుడు ఇది మాస్ మెంటాలిటి అన్నమాట .మరణానికి బీటలు ఉండవుకనుక ప్రపంచం జారిపోయి అదృశ్యం కాదు .జీవితం ప్రేమను పంచటం తో భాగ్యమౌతుంది .మరణం అనే నీటి బుగ్గ చలనం లేని జీవజలాన్ని చలి౦పజేస్తుంది .జీవిత గమనానికి జీవన గానమే విశ్రాంతి .గులాబీ అందాన్నే కాదు ముళ్ళూ చూడాలి .పక్షి రెక్కలకు బంగారం పూస్తే స్వేచ్ఛ కోల్పోతుంది .ప్రపంచమంతా వెన్నెలలు నింపే చందమామ తన మచ్చలను తనలోనే దాచుకొంటు౦ది .పిరికి ఆలోచనల్లారా నా దగ్గరకు రాకండి నేను కవి ని .ఎలా పూజించాలి నిన్ను అని సూర్యుడిని పువ్వు అడిగితె ‘’నీ పవిత్ర మౌన రాగం తో ‘’అని జవాబు .మానవుడు మృగంగా మారితే దానికంటే క్రూరంగా మారుతాడు .’’మృగాడు’’ అవుతాడని భావం .అబద్ధం అధికారం పొందినంతమాత్రాన సత్యంగా మారలేదు .కళ్ళు తన చూపుని గురించికాక తన కళ్ళద్దాల ను చూసి గర్వపడతాయట.అడుగు పైకేస్తూ కిందకు జారటమే జీవనయానం .కలయిక అనే దీపం కలకాలం వెలుగుతుంది .విడిపోయిన మరుక్షణం ఆరిపోతుంది .ప్రపంచాన్నిప్రేమిస్తేనే అందులో జీవి౦చ గలం..మనిషి నవ్వితే లోకం ప్రేమించింది పరిహాసం చేస్తే భయపడింది .దివ్యమౌనం ఆలోచనల్ని మాటలుగా మారుస్తుంది .కాంతి అనే మామూలు వస్త్రాన్ని సూర్యుడు కట్టుకొంటే ,మబ్బులు మహోజ్వలంగా అల౦కరించుకొన్నాయి .గడ్డిపోచ మహా ప్రపంచానికి పచ్చదనంతో దీటుగా నిలుస్తుంది .నీటిలో బతికే చేపను బయటికి తీసి, దానికి స్వేచ్ఛ ఇచ్చానని గర్వపడుతుందట పక్షి .అసాధ్యం అసమర్ధుడి కలలోనే ఉంటుంది .దేవుడి గొప్పశక్తి హాయినిచ్చే చిరుగాలిలో ఉంటుందికాని ,భీభత్స తుఫానులో కాదు .సాలె పురుగు మంచు బిందువులను పట్టుకొన్నట్లు నటిస్తూ ఈగల్ని పట్టుకొంటు౦ది.కాపట్యానికి గొప్ప ఉదాహరణ .పరులకు మంచి చేయటం లో నిమగ్నమైన వాడు తనమంచి ఆలోచించాడు .దూసుకుపోయే బాణం తో విల్లు ‘’నీ స్వేచ్చే నా స్వేచ్చ ‘’అంటుంది .దేవుడు తను సృష్టించిన నక్షత్రాలకన్నా .మానవుడు వెలిగించే దీపాలనే బాగా ప్రేమిస్తాడు .సూర్యాస్తమయం లో సూర్యుడి ముద్దుకు పసిడిభరిణ మబ్బు హృదయం .కాలిపోతున్నదుంగ ఇదినా పువ్వు నా మరణం అనుకొన్నది .చీకటి వెలుగు వైపుకు, గుడ్డితనం చెవిటి వైపుకు సాగుతాయి .ప్రతిధ్వని వెక్కిరిస్తోంది ధ్వనిని ‘’నేనే మొదటి ధ్వని ‘’అని .తీరిక కదిలితే పని అవుతుంది .సముద్ర నిశ్చలత అలలను కదిలిస్తుంది .రాత్రి విచ్చిన పువ్వును ఉదయకాంతి ముద్దాడితే అది చలించి నిట్టూర్చి నేలవాలిపోయింది .కెరటాలకడలి దాటి గీతాలాపన జరిగే సంగీత దీవిని చేరాలని నా వాంఛ.జీవిత జీవకా౦తుల దీవి చుట్టూ రాత్రీ పగళ్ళు అంతులేని మరణం అనే సముద్ర గీతం హోరుమంటు౦ది .సంధ్యాసమయం నాకు ఒక కిటికీ ,వెలిగించిన దీప స్తంభం –దాని వెనక ఎవరిదో నిరీక్షణ.నిశ్చలంగా నిష్కల్మషంగా ఉన్న హృదయంప్రపంచాన్నీ ,దైవాన్నీ చేరే మార్గం చూపిస్తుంది .సముద్ర ప్రయాణ జీవితం లో ఇరుకైన ఓడలోకలుసుకొనే వారు మరణం తో ఒడ్డుకు చేరతారు ఎవరిలోకాలకు వాళ్ళు వెళ్ళిపోతారు .
ఎన్నో ఎన్నెన్నో ఉదాత్తభావాలు తాత్వికత ,ఆలోచామృతం ,జీవిత సత్యాలు మనుషుల నడవడి, మార్గ నిర్దేశం ,మనసుల రాపిడి ,అందాన్ని చూసి పరవశం ,ఏదినిత్యం ఏది భ్రమ తెలిపే తత్వ బోధ ,జీవిత పాఠాలు రవీంద్రుని కలం నుండి అమృతవాహిని గా జాలువారిన కవితలివి .ప్రతిదానికి ఎంతైనా విశ్లేషణ చేయవచ్చు .ఇదంతా ఉపనిషత్ ప్రబోధం. మానవ స్వేచ్చా గీతం .మానవ హృదయ ఆవిష్కరణ .నిసర్గ రమణీయ సుందరం .పండిన రవికవి జ్ఞానఫలం .అనుభవించటం మనకర్తవ్యం .
నిర్మల్ గారి అనువాదం బాగానే ఉన్నా,’’ బ్రివిటి’’ లేక పోవటం వలన ‘’బ్యూటీ ‘’తగ్గిందని పించింది .ఏమైనా ,ఒక టెక్నికల్ వ్యక్తిఇలాంటి భావ సంపదను తెలుగు వారికి అందించినందుకు మనస్పూర్తి గా అభినందిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-21-ఉయ్యూరు