భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -3
కాంగ్రెస్ కార్యదర్శిగా రెండు సార్లు ఇంగ్లాండ్ వెళ్లి కాంగ్రెస్ ఆశయాలను ప్రచారం చేసిన విఠల్ భాయ్ పటేల్ కృషికి,వీలైనప్పుడల్లా బ్రిటిష్ ప్రభుత్వ దమనకాండను విమర్శించిన నిర్భయతకు భారతీయులందరూ అభినందించారు .స్వపరిపాలన ఆయన ధ్యేయం .మాంట్ ఫర్డ్ సంస్కరణలను సురేంద్రనాథ బెనర్జీ సహాయం తో సుప్రీం కౌన్సిల్ అభినంది౦చినపుడు ధైర్యంగా తిరస్కరించింది విఠల్ భాయ్ ఒక్కడే .చాలావరకు అతివాదులతో ,చాలాసార్లు తిలక్ తో ఏకీభవించి పని చేశాడు .తిలక్ బాగా ఆదరించి ప్రోత్సహించాడు .లోకమాన్యునితో మంచి సాన్నిహిత్యమేర్పడింది .
1919లో రౌలట్ చట్టం రాగా గాంధీ ‘’ఈ చట్టం బ్రిటిష్ పాలకులలో వేళ్ళు పాతుకు పోయిన తీవ్ర వ్యాధి లక్షణం ‘’అని విమర్శించాడు .దేశమంతా వ్యతిరేకించినా చట్టం వచ్చేసింది .దీనితోపాటే రిఫార్మ్స్ యాక్ట్ కూడా వచ్చింది .ఇది స్వపరిపాలనం కోరే వారి కన్నీటి తుడుపుమాత్రమే .పంజాబు దురంతాలూ ఇప్పుడే జరిగాయి .రాయల్ విచారణ సంఘాన్ని నియమించి విచారించాలని ప్రజలు ఆందోళన చేశారు .స్పందన లేదు .నేరం చేసిన ప్రభుత్వమే హంటర్ అధ్యక్షుడుగా కమిటీ వేసి విచారి౦చ మన్నదికానీ ,జైలులో ఉన్న వారిని విడుదల చేయకుండా సాక్ష్యం చెప్పటానికి వీలు కల్పించలేదు .కాంగ్రెస్ గాంధీ మొదలైన లాయర్లతో విచారణ సంఘం నియమించింది .ఇవన్నీ సహాయ నిరాకరణ ఉద్యమానికి దారి తీశాయి .రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా చేసిన గాంధీ సత్యాగ్రహం సహాయ నిరాకరణకు దారి చూపింది .
అప్పటికే తిలక్ ,పటేల్ ఒక కార్యక్రమం ఆలోచించారు ,ఉప్పెనలాగా వచ్చే చైతన్యాన్ని పటేల్ గుర్తించాడు .1920 లో మోతీలాల్ కార్యదర్శి అయ్యాడు .గాంధీ –ఇర్విన్ ఒడంబడిక గాంధీ చేసిన తప్పు అని ప్రకటించాడు కానీ చిత్తరంజన్ ,మోతీలాల్ లకంటే గాంధీ మాత్రమె స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అని చాటగల సత్తా ఉన్నవాడు అని నమ్మాడుపటేల్ .వెంటనే సహాయ నిరాకరణ ఉద్యమం లో దూకాడు పటేల్ .రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ ప్రతిపాదించిన తీర్మానాన్ని 1920 సెప్టెంబర్ కలకత్తా కాంగ్రెస్ మీటింగ్ లో లజపతి రాయ్ అధ్యక్షతన ఆమోదించింది .దీనిప్రకారం బిరుదులూ పదవులుత్యజించటం ,గవర్నమెంట్ ఆఫీసులు దర్బార్లు ,కోర్టులు బహిష్కరించటం ,ప్రభుత్వ కాలేజీ స్కూళ్ళలో చదివే విద్యార్ధులు బహిష్కరించి జాతీయ విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవటం ,విదేశీ వస్తు బహిష్కరణం అమలు చేయటం . బిపిన్ చందు పెట్టిన ఎమెండ్ మెంట్ తీర్మానం వీగిపోయింది .అసలు తీర్మాన్నాన్ని నెగ్గించాటానికే గాంధీ ప్రాణం తలనుంచి తోకకు వచ్చింది .కానీ పంజాబ్ దురంతాలు ఆయనకు గొప్ప బలం చేకూర్చి తీర్మానం నెగ్గింది .దేశం లో ఎన్నికలు జరగాల్సిన సమయం అది .కాంగ్రెస్ అభ్యర్ధులు నామినేషన్లు వేశారు .దేశబంధు దాసు ,మోతీలాల్,విఠల్ భాయ్ మొదలైనవారు శాసన సభా బహిష్కారాన్ని వ్యతిరేకించారు .కానీ ప్రజాభి ప్రాయానికి తలలు వంచారు .డిసెంబర్ లో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ సమావేశం లో తీర్మానం ఆమోదించారు .అప్పుడే పటేల్ కార్యదర్శి పదవికి రాజీనామా చేశాడు .పటేలు ఇంగ్లాండ్ లో చేసిన కృషికి కాంగ్రెస్ కృతజ్ఞతలు చెప్పింది .ఆయన పేరు చెప్పిన ప్రతిసారీ చప్పట్లతో సభ మారు మోగింది .
మహాత్ముని నాయకత్వం లో సహాయ నిరాకరణ దావాగ్నిలా దేశమంతా వ్యాపించింది .జాతీయ నాయకులలో ఉన్నకుళ్ళు ఈ అగ్నిలో ఆహుతై,స్వచ్చమై పవిత్రమై౦ది .ఉద్యమం పరిశుద్ధమైంది .మితవాదులు ధనికులు సంస్కరణలను బలపరిస్తే జాన్ బ్రైట్ ‘’ధనికులు రాజకీయంగా పిరికి వాళ్ళు’’అని చెప్పినట్లు ఈపిరికితనం కాంగ్రెస్ లో చేరి ,మార్లే మితవాదులను బుజ్జగించి దగ్గరకు తీసి కాంగ్రెస్ లో కొంత పిరికితనం కలిగించాడు .కానీ సహాయ నిరాకరణలో ఈ పిరికి పాలు విరిగిపోగా అతివాదులు మిగిలిన హక్కులకోసం పోరాటానికి సిద్ధమయ్యారు .అహమ్మదా బాద్ కాంగ్రెస్ లో దేశబంధు అధ్యక్షుడయ్యాడు .ఆయన ప్రభుత్వం నిషేధించిన ఒక దళ సభ్యుడు .ప్రభుత్వం జైలులో పెట్టింది .ప్రజల బాధ్యత ప్రభుత్వానికి పట్టలేదు .అందుకే అహ్మదాబాద్ కాంగ్రెస్ శాసనోల్లంఘనను తీర్మానించింది .గాంధీ రాజకీయం లో హింసకు చోటు లేదు. ఎక్కడైనా హింస ప్రజ్వల్లితే ఆయన నిరాహార దీక్ష చేసేవాడు .
జన్మతః వీరుడైన విఠల్ భాయ్ కి యుద్ధమంటే మక్కువ .అహమ్మదాబాద్ కాంగ్రెస్ ఆయన భుజస్కంధాలపైనే నడిచింది .శాసనోల్లంఘన తీర్మానాన్ని బలపరచాడు ..’’భారతీయులు కత్తితోనో ,ప్రసాదంగానో స్వరాజ్యం తప్పక సాధిస్తారు ‘’అని ప్రకటించాడు . ‘’ఈ ఉల్లంఘన లో మీరుజైలుకు వెళ్ళవచ్చు ,ప్రాణ త్యాగం చేయాల్సి రావచ్చు .కానీ పోరాటం శాంతియుతంగా ఆహి౦సతో మాత్రమె చేయాలి .ఇతరులను శారీరకంగా ,మానసికం గా హింసించ కూడదు ‘’అని ఉద్బోధించాడు వేదికపై నుంచి .
సంస్కరణలు ప్రవేశ పెడుతూ అయిదవ జార్జి చక్రవర్తి భారతీయులకు ఒక సందేశం పంపాడు –‘’దేశభక్తులు ,రాజభక్తులు అయిన భారతీయులు స్వరాజ్య స్వప్నం కంటున్నారు .దానికి బీజాలు ఈ సంస్కరణలవలన కలుగుతాయి .స్వతంత్ర మార్గం లో ఇండియా పురోగమించటాతానికి అవకాశాలు కల్పిస్తున్నాం ‘’.ఎంతకాలం లో స్వరాజ్యం ఇస్తారో రాజు చెప్పకపోవటం తో నిరాశాకలిగినా కాలపరిమితి ప్రజాబలం పై ఆధారపడి ఉంటుందని చెప్పాడు విఠల్ భాయ్ .జనం ఆయన ఉపన్యాసానికి ఫిదా అయ్యారు .
శాసనోల్ల౦ఘన విచారణ సంఘం
6-6-1922న కాంగ్రెస్ కార్యవర్గం ఉల్లంఘన గురించి దీర్ఘంగా చర్చించి .దీనికి దేశం సిద్ధంగా ఉందొ లేదో నిర్ణయించటానికి నియమించిన విచారణ సంఘం లో విఠల్ భాయ్ ముఖ్య సభ్యుడు .ఈకమిటీ దేశమంతా తిరిగి ప్రజలు సిద్ధంగా లేరని రిపోర్ట్ ఇచ్చింది .దీనితో శాసన సభలో ప్రవేశించాలా వద్దా అనే సమస్య వచ్చింది .అన్సారీ రాజాజీ, కస్తూరి రంగయ్యర్ మొదలైనవారు శాసన సభా బహిష్కారాన్నే సమర్ధించారు .కానీ విఠల్ భాయ్ , మోతీలాల్ ,హకీమ్ సాహెబ్ మొదలైనవారు శాసన సభలో ప్రవేశించాల్సిందే అని పట్టుబట్టారు .ప౦జాబ్ ,ఖిలాఫత్ సంఘటనలలో ప్రజలకు జరిగిన అన్యాయానికి శాసన సభలు ఏమీ చేయలేకపోయాయి .ప్రజలు తీవ్రకష్టనష్టాలకు గురైనారు కనుక శాసనసభా ప్రవేశం కాంగ్రెస్ వారికి తప్పదు ‘’అని విఠల్ భాయ్ వాదించాడు .ఈ సందర్భం గా –ఎన్నికలలో కాంగ్రెస్ వారు పాల్గొని ఎక్కువ సీట్లు సాధించాలి ,ఖిలాఫత్ పంజాబ్ గాయాలను మాన్చే కృషి జరగాలి ,ప్రజలకు జరిగిన అన్యాయాలను సరిదిద్దాలి ,స్వరాజ్య సంపాదనమే లక్ష్యం కావాలి .కోరం కు మించిన సభ్యులు ఎన్నిక అయితే పదవులు పొంది బయటికి రావాలి ,ప్రభుత్వ బిల్లులను వ్యతిరేకించాలి .తక్కువ సంఖ్యలో గెల్చినా అలాగే చేయాలి .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-10-21-ఉయ్యూరు