భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -4

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -4

     స్వరాజ్యపార్టి

1922నాటికి శాసన సభా ప్రవేశం పై కాంగ్రెస్ లో అభిప్రాయ భేదాలు తీవ్ర స్థాయికి చేరగా అధ్యక్షుడు చిత్తరంజన్ దాసు ప్రవేశాన్ని సమర్ధించాడు .కానీ కాంగ్రెస్ తోసేసింది .మనస్తాపంతోదేశాబందు రాజీనామా చేయగా కాంగ్రెస్ అంగీకరించలేదు .కాంగ్రెస్ లో ఉంటూనే దాసు ‘’కాంగ్రస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టి ‘’పెట్టగా , ,ప్రవేశాన్ని కోరేవారంతా అందులో చేరారు .ఈపార్టీతో కాంగ్రెస్ ‘’కటీఫ్’’చేసుకోలేదు .స్వరాజ్యపార్టీ వారు దేశమంతా తిరిగి ప్రచారం చేయగా ,ఢిల్లీ కాంగ్రెస్ లో ప్రవేశాన్ని అంగీకరించింది .స్వరాజ్యపార్టీకి  ఎక్కడ లేని ప్రాముఖ్యమూ లభించింది .ప్రజల సానుభూతి సహకారాలు పుష్కలంగాలభించటం చేత స్వరాజ్య పార్టీ వారు ఎక్కువ  సంఖ్యలొఎన్నికై సభలలో ప్రవేశించారు .ఈ పార్టీకి వెన్నెముక అయ్యాడు విఠల్‌భాయ్ .మోతీలాల్, చిత్తరంజన్ లతో కలిసి తీర్చి దిద్ది ఆరేళ్ళు ఎదురు లేకుండా ఉన్నది స్వరాజ్య పార్టి .శాసన సభలో అడుగుపెట్టిన పటేల్ ,మితవాదుల కు పెత్తనమివ్వలేదు .ఇక్కడ ఆయన సాధించిన విజయాలలో ఫైనాన్స్ బిల్లులు బడ్జెట్ బిల్లులు అనేక సార్లు తిరస్కరించారు .గతిలేక ప్రభుత్వం వీరి మాటలకు విలువ నివ్వటం ప్రారంభించింది .

 నాగపూర్ కాంగ్రెస్ వీరుడు

13-4-1923న జబల్పూర్ లో జలియన్ వాలాబాగ్ సా౦వత్సరికం  జరిపారు .కాంగ్రెస్ యువకులు మున్సిపలాఫీసులపైకి ఎక్కి జాతీయపతాకాన్ని ప్రతిష్టించారు .పోలీసులు వచ్చి లాగేసిచి౦పేసి కాళ్ళతో తొక్కేశారు .మున్సిపల్ డిప్యూటీ కమీషనర్ అయిన యూరోపియన్ చాలా నీచంగా ప్రవర్తిస్తే ,కౌన్సిలర్లు వెంటనే రాజీనామా చేశారు .జిల్లా కాంగ్రెస్ సంఘం సత్యాగ్రహం మొదలుపెట్టింది .జట్లు జట్లుగా యువకులు జాతీయ జెండాలు ఎగరేయటం పోలీసులు వచ్చి పీకేయటం వాలంటీర్లను ఖైదు చేయటం జరిగింది .ఈ తతంగం నాగపూరు కు కూడా పాకింది .రాష్ట్ర కాంగ్రెస్ అక్కడ ఒక సత్యాగ్రహ శిబిరం పెట్టి ,నిధిని పోగు చేసి ఆదుకొన్నారు .వేలాది యువకులు వాలంటీర్లుగా చేరారు .నిరసనలు ,లాటీ చార్జీలు ,జైళ్ళకు పంపటం ఎక్కువైంది .జాతీయ పతాక గౌరవం కాపాడు కోవటానికి ప్రజలు ప్రాణాలు తెగించి ముందుకు వచ్చారు .

  జమన్ లాల్ బజాజ్ నాయకత్వం లో వాలంటీర్ల దళం జాతీయ జండాలు పట్టుకొని సత్యాగ్రహం చేశారు .పోలీసులు ఊరేగింపును ఆపేశారు .144వ సెక్షన్ విధించారు .మేజిష్ట్రేట్ యూనియన్ జాక్ కు అగౌరవం కలిగినట్లు నేరంమోపి తన చర్యలను సమర్ధించుకొన్నాడు .బజాజ్ ను అరెస్ట్ చేయటం తో ఉద్యమం తీవ్రమైనది .పదేసి మంది జాతీయపతాకాలు పట్టుకొని ఊరేగారు .మేజిస్ట్రేట్ వచ్చి శ్రీముఖాలిచ్చి జైలుకు పంపేవాడు .ప్రజల కరతాళ ధ్వనులు మిన్ను ముట్టేవి.వరుసగా నాలుగు నెలలు ఇదే తంతు జరిగింది .వెయ్యి మంది వాలంటీర్లు అరెస్ట్ అయ్యారు .

   ఈసమయంలోనే నాగపూర్ లో కాంగ్రెస్ సమావేశం జరిగి జులై 18జాతీయ పతాక దినోత్సవాన్ని జరిపారు .దేశమంతా ఇల్లాగే జరగాలని కాంగ్రెస్ ఆదేశించింది .అన్నిపట్టణాలలో మహా వైభవంగా పతాక ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిపారు .ప్రభుత్వాధికారులు కిమ్మనకుండా మౌనపాత్ర పోషించారు .జోక్యం కలిగించుకొని ఉంటె కురుక్షేత్రమే అవుతుందని భయపడ్డారు .ఇలా నాగపూర్ పతాకోత్సవం అఖిలభారత ఉద్యమంగా రూపు దాల్చింది .ప్రభుత్వోద్యోగులు గుంజాటనలో పడ్డారు .విఠల్ భాయ్ ,వల్లభాయ్ సోదరద్వయం చాలాసార్లు గవర్నర్ నుకలిసి ,ఒక పరిష్కారం సాధించి ప్రజా విజయానికి తోడ్పడ్డారు .

  కేంద్ర శాసన సభాధ్యక్షుడు

 అసెంబ్లీ అధ్యక్షుడుగా తన ప్రతిభా సామర్ధ్యాలు చూపిన విఠల్ భాయ్ సభాగౌరవాన్నీ ఠీవీ ని పెంచాడు .ఆ రాజసం ఆయనకే చెల్లింది .శాసనసభకు అధికారాలు పెంచాడు .నిష్పక్షపాతంగా విధి నిర్వహణ చేశాడు .ఓర్పు సహనం ధైర్యసాహసాలు నిష్పక్షపాతం ఆయన సహజ లక్షణాలు .ప్రజా హితైషి .మానవీయ విలువలకు గౌరవమిచ్చేవాడు .నిశిత దృష్టి ఉన్న ద్రష్ట .మహావక్త .మాటలతో వ్యూహం తో తనమాట నెగ్గించుకోగలిగిన సత్తా ఉన్నవాడు .ఆ తెలివి తేటలు చాకచక్యం ప్రజ్ఞా నిరుపమానాలు .

  ఫ్రెడరిక్ రైట్ సభాధ్యక్షుడుగా ఉండి రిటైర్ కాగానే ,విఠల్‌భాయ్ పేరు  ఆపదవికి సూచించగా ,టి రంగాచారిని  పోటీకి పెట్టింది అధికార పక్షం .అనధికారులు తక్కువ సంఖ్యలో ఉన్నా ,58వోట్లు సాధించి 2వోట్ల మేజారిటి తో  ఆచారిపై పటేల్ గెలిచాడు .24-8-1925 న ‘’ఖద్దరు దుస్తులతో గాంధీ టోపీతో కింద భాగం లో కూర్చున్న విఠల్ భాయ్ పటేల్ ను  ఫ్రెడరిక్ రైట్  ఆహ్వానించి ,పటేల్ విజయాన్ని సభ్యులకు  తెలియజేసి, సభాధ్యక్ష స్థానం అల౦కరించమని కోరాడు .అంగీకరించి పటేల్ కృజ్ఞాత చెప్పాడు .ప్రజా ప్రతినిధులనుంచి అధ్యక్షుడిని ఎన్ను కోవటం ఇదే ప్రధమం అయి రికార్డ్ కెక్కింది .ఇది చారిత్రాత్మక సంఘటన అని ప్రభుత్వ ప్రభుత్వేతర సభ్యులంతా పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు .ఫ్రెడరిక్ ఖాళీ చేసిన పీఠాన్ని పటేల్ దేశీయ దుస్తులతో అధిష్టించి జాతి గౌరవాన్ని పెంచాడు . విదేశీ  నూలుతో చేసిన విగ్గుపెట్టుకోటానికి అంగీకరించక ,సరోజినీ నాయుడు స్వయంగా వడికి ఇచ్చిన నూలుతో విగ్గు, గౌను తయారు చేయించుకొని స్పీకర్ పదివిలో హుందాగా కూర్చున్న అసలు సిసలు దేశభక్తుడు విఠల్ భాయ్ పటేల్ . సభ్యులు ఆనంద తాండవమే చేశారుఅప్పుడు .అధ్యక్షోపన్యాసం ఇస్తూ –‘’ఈ పదవితోమాతృదేశ సేవ మరింత ఎక్కువగా చేయటానికే తప్ప పదవీ వ్యామోహం తో నేను రాలేదు .స్వరాజ్యవాదులు నిర్మాణ ఆచరణునలు అని తెలుసుకోండి .పరిపాలన విధానం లో వైస్రాయ్ మన సాయం కోర్తున్నాడు .అలాంటి సహకారం అందిద్దాం .ప్రభుత్వాధికారులకు నా సహయం తప్పక ఉంటుంది ‘’అన్నాడు .సహాయ నిరాకరణను తన భుజస్కంధాలపై నిర్వహించిన విఠల్‌భాయ్ పటేల్ ఇప్పుడు రాజ్య తంత్రజ్ఞు ,ప్రభుత్వ చక్రాన్ని త్రిప్పే వారిలో ఒకరు అవటం జాతి గర్వించదగిన విషయం.అప్పుడు మోతీలాల్ ప్రతిపక్షమైన ప్రభుత్వ పక్ష నాయకుడు .’’నేను ఇప్పుడు ఏ పార్టీకీ చందిన వాడినికాను .అందరి వాడిని. నా పేరు స్వరాజ్య పార్టీ లో కొట్టేయండి ‘’అని సభా పూర్వకంగా మోతీలాల్ కు చెప్పి ఉత్తమ సంప్రదాయానికి నాంది పలికిన మహానాయకుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ .

  8-3-1926న అసెంబ్లీ లో  ఒక విచిత్ర సంఘటన జరిగింది .అంతకు ముందు రెండు రోజులక్రితమే అఖిలభారత కాంగ్రెస్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యు లందర్నీ సభ నుండి బయటికి రమ్మని తీర్మానించింది .మోతీలాల్ ‘’ప్రభుత్వం తో సహకరించి పరిపాలనలో సహకరించటానికి నిశ్చ యించి నస్వరాజ్యపార్టి రెండున్నర ఏళ్ళు గా అసెంబ్లీలో తగిన సంస్కరణలు ప్రవేశపెట్టటానికి ప్రయత్నించింది .మేము చేయగలిగిందేమీ లేకపోగా అవమానాలు పొందాము ‘’అని ప్రకటించి తన సభ్యుఅలతో బయటికి వెళ్ళిపోయాడు .చేసేది ఏమీలేక స్పీకర్ పటేల్ ‘’సభలో మెజారిటి ఉన్న స్వరాజ్యపార్టీ సభ్యులు సభనుంచి బయటికి వెళ్ళటం విచారకరం .ఆపార్టీ  లేకపోతె అసెంబ్లీలో ప్రజావాణి వినిపించటం కష్టం .మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా ప్రభుత్వ విమర్శనాత్మక చట్టాలు అసెంబ్లీలో చర్చకు రాకుండుగాక .పరిపాలన ఆగకుండా నడిపించటమే ఇప్పుడు అసెంబ్లీ చేసేపని ‘’అని చెప్పి సభను మర్నాడు ఉదయానికి వాయిదా వేశాడు పటేల్ .స్వరాజ్య వాదులు లేరుకదా అని ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు బిల్లులు ప్రవేశ పెట్టరాదని పటేల్ ఆశయం .ఇవాళ కేంద్రం లోనూ రాష్ట్ర శాసన సభల్లోనూ విఠల్ భాయ్ ఆదర్శాన్ని పాటించే వారే లేకపోవటం విచారకరం, జాతి దురదృష్టం .

  1926నవంబర్ ఎన్నికలలో విఠల్ భాయ్ పోటీలేకుండా శాసనసభాకే కాక స్పీకర్ కు కూడా ఎన్నికయ్యాడు అదీప్రజాభిమానం .అధికార సభ్యులు యూరోపియన్లు పటేల్ ను విపరీతంగా శ్లాఘించారు .ఇంకోడు అయితే ములగ చెట్టు ఎక్కేవాడు కాని మనోనిబ్బరం ఉన్న పటెలువీటికి అతీతుడు –‘’ఇంతవరకు బ్రిటిష్ ప్రభుత్వం దేశీయులకు పాలనా బాధ్యత ఇవ్వలేదు .ఇస్తే వాళ్ళ శక్తి సామర్ధ్యాలేమితో తెలిసేవి .భారతీయులు బాధ్యతగల పౌరులు .అసంతృప్తి పాలన నిరశిస్తున్నారు .వెంటనే స్వపరిపాలన వారికి అప్పగించాలి ‘’అని చాటాడు పటేల్ .ప్రభుత్వానికి సహకరించటం అంటే డూడూ బసవన్నలాగా తలూపటం కాదు .ప్రభుత్వ విధానాలను ప్రజాభిప్రాయంగా మార్చటం అన్నది పటేల్ ఆదర్శం .

   1927లో విఠల్ భాయ్ ఇంగ్లాండ్ వెళ్ళాడు .కామన్స్ సభా సమావేశానికి హాజరై ,అక్కడి పార్లమెంట్ స్పీకర్ తో చాలా సార్లు సమావేశమై పార్లమెంటరి విధానాన్ని క్షుణ్ణంగా  అవగాహన చేసుకొన్నాడు .ఐర్లాండ్ పార్ల మెంటు నూ  చూశాడు జార్జిరాజునూ  కలిశాడు.

     ప్రజాక్షేమ చట్టం

అసెంబ్లీలో విఠల్ భాయ్ ఆధ్వర్యంలోచిత్ర విచిత్ర చర్చలు జరిగాయి .కమ్యూనిస్ట్ ల కార్యకలాపాలను నియంత్రించటానికి ప్రభుత్వం’’పబ్లిక్ సేఫ్టి బిల్ –ప్రజాక్షేమ  చట్టం తెచ్చింది .ఇది ప్రాధమిక హక్కులకు భంగం అని జాతీయవాదులు వ్యతిరేకించారు .ఇతర దేశపు ఆచారం ఇక్కడ ప్రవేశించ కూడదు  అని ప్రభుత్వం మళ్ళీ1929మార్చిలో చర్చకు పెట్టింది .సెలెక్ట్ కమిటీ పర్యవేక్షణకు దాన్ని పంపారు .ఏప్రిల్ లో మూడవసారి ప్రవేశపెట్టగా స్పీకర్ పటేల్ –‘’చర్చించ బోయే ముందు నామాటలు వినండి. అసెంబ్లీ లీడర్ మాట్లాడింది విన్నాను .మీరట్ కేసులో 31మందిపై చక్రవర్తి మోపిన నేరమూ తెలుసు .ఈ బిల్లుకు ఆ కేసుకు ఉన్నది ఒకటే ప్రాతిపదిక .లా కోర్టు లో తీర్పు పొందే విషయాలు అసెంబ్లీలో చర్చి౦చరాదు అని అందరికి తెలుసు .ఈబిల్లును మనం ఆమోదించినా తిరస్కరించినా మీరట్ కోర్టు తీర్పే ఫైనల్ .కనుక ఆతీర్పును ప్రభావితం చేస్తుంది .కనుక చర్చించటానికి అనుమతి ఎలా ఇవ్వగలను ?మీరట్ కేసు పూర్తయ్యేదాకా ప్రభుత్వం ఈ బిల్లును చర్చించ రాదనీ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను .లేకపోతె మీరట్ కేసు పూర్తిగా ఉప సంహరించు కొని , అప్పుడు చర్చకు పెట్టవచ్చు ‘’అని ఖరా ఖండీ గా చెప్పి ప్రభుత్వం నోట్లో పచ్చి వెలక్కాయ పెట్టినట్లు చేశాడు .తర్వాత రెండు రోజులు హోం లా మెంబర్లు దీర్ఘోపన్యాసాలు చేశారు .బిల్లును చర్చకు రాకుండా చేసే అధికారం స్పీకర్ కు లేదన్నారు .మీరట్ కేసు ఉపసంహరణ జరగదు అని తేల్చి చెప్పారు .బిల్లుపై మోతీలాల్ ,జయకర్, శ్రీనివాస అయ్యంగార్ వగైరా మాట్లాడారు .చివరికి స్పీకర్ విఠల్ భాయ్ పటేల్ ‘’ఈ బిల్లు చర్చకు రానేరదు రాకూడదు ‘’అని స్పష్టంగా రూలింగ్ గా నిషేధపు ఆజ్ఞఇచ్చాడు .మీరట్ కేసు విచారణలో ఉండగా అసెంబ్లీలో ఈ బిల్లు పై చర్చి౦చ కూడదు .ఇది ప్రభుత్వ కపట నాటకం అని చెప్పాడుపటేల్.’’స్పీకర్ నియంత అయ్యాడు ‘’అన్నారు యూరోపియన్ సభ్యులు .తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు అని నిరూపించాడు మనభాయ్ .నిషేధపు ఆజ్ఞ ఇచ్చే అధికారం స్పీకర్ కు ఉంది రుజువు చేశాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-10-21-ఉయ్యూరు  

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.