నిరర్ధక పదప్రయోగ హాస్యం
ఒకసారి మునిమాణిక్యంగారిని మిత్రులు ఒకపద్యం రాసి చదవమన్నారు ఆయనకు అందులో ప్రవేశమే లేదు .బలవంతంగా ఒత్తిడి చేశారుకనుక రాదు అంటే పరువు పోతుందని ఆశువుగా ‘’ఆశ్రిత పక్ష విచక్షణ కృతక్షణ రక్షితా దుర్నిరీక్ష భాక్ష్యాంతర దక్షణా క్షోణీభరా –కమలాక్షా తక్షణ యక్షీకృత పక్షీంద్ర లక్ష్యా –వైరిస్తుత కీర్తీ సాంద్ర వసుక్ష్మాపాల చంద్రా ‘’అని చదివేసరికి మిత్రులు విరగబడి పగలబడి నవ్వేశారు .
బందరులో మాధవపెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి గొప్పకవి హాస్యగాడుకూడా తండ్రిగారూ కవే ,హాస్య గాడే.,గీతాలు దరువులూ రాసేవాడు. ఒకరోజు శాస్త్రి గారింటికి డోలు వాయించే ఇద్దరు వచ్చి,తమలో ఎవరు గోప్పవారో తేల్చి చెప్పమన్నారు .ఈయనకు అందులో ప్రవేశమే లేదు .చెప్పలేను అంటే పరువు తక్కువ పండిత పుత్రః అంటారేమోనని భయం .సరే ఒకరితర్వాత ఒకర్ని వాయిచమంటే వాయించారు అభిప్రాయం అడగగా అందులో ఒకాయన బాగా నేర్పరి అనగా రెండో వాడు ఎందుకు అని అడిగితె ‘’అతడు గాత్ర సంవాహనా నైరాశ్య సంకోచ ‘’పద్ధతిలో వాయించాడు .అదేదొ మంచి పధ్ధతి కామోసు అనుకొన్నాడు వాడు. రెండవవాడి విషయం అడిగితె అతడు’’భయ హర్షా మయాదిభిః’’పద్ధతిలో వాయించాడు .నిజమా అబద్ధమా అన్నాడు.వాళ్ళకేం తెల్సు ?కాని అలాఅనలేక నిజం నిజం అన్నారు .అయినా అనుమానం తీరక ‘’ధిభిః ‘’అన్నారు దానర్ధం ఏమిటి స్వామీ అని అడిగితె పెద్దగా నవ్వి –‘’ దిభిః అక్షరాద్వయ ప్రళయస్య దుఖాభ్యాం చేస్టా జ్ఞాన నిరాకకృతీ’’అని నిర్వచనం చెప్పారు .వాళ్లకు అర్ధం కాకపోయినా ‘’పంతులుగోరు మాబాగా సేప్పేరు నిర్ణయం ‘’అని పొంగిపోతూ వెళ్ళిపోయారు .ఇందులో శాస్త్రి గారు పలికినవన్నీ అర్ధం పర్ధం లేని మాటలే.
ఒక సారి రైలులో ప్రయాణిస్తున్న ముని మాణిక్యం గారికి ఒకాయన కనబడి సెండాఫ్ ఇస్తున్న తనకొడుకును ‘’స్కేనాజర్ ‘’పదం అర్ధం తెలియనందుకు నానా తిట్లూ తిట్టాడు .మాస్టారినీ అడిగితె ఆయనకూ తెలీకపోగా తెలీదు అంటే మర్యాదగా ఉండదని గాంభీర్యంగా ‘’స్కేనాజర్ అర్ధం తెలీని వాడిని దద్దమ్మ వెధవ వెధవన్నర వెధవ అంటారు’’ అన్నారు .దిగే స్టేషన్ వచ్చి మాస్టారు దిగిపోతుంటే ఆపెద్దాయన ‘’మాస్టారూ నేను మీశిష్యుడిని .స్కేనాజర్ ను ఎప్పుడైనా చూశారా అని అడిగితె లేదంటే అప్పుడు వాడు తానూ ఆయన దగ్గర ఎప్పుడు చదువు కోన్నదీ చెప్పి సర దాగా స్కేనాజర్ తో ఆటలాడాను అన్నాడు .ఇంతకీ దాని అర్ధం ఏమిటని మాస్టారు అడిగితె ‘’నాకూ తెలీదు సార ఊరకే వాడాను ‘’అన్నాడట మునిమానిక్యమువాచ .
అలాగే ఒక ప్లీడర్ ఒక దోషిని శిక్షించమని జడ్జి గారితో జోక్యూజ్ అండీ జోక్యూజ్ అందరూ కోరేది జోక్యూజే ‘’అన్నాడు .జడ్జీకి ఏమి తీర్పు చెప్పాలో తెలీక జుట్టు పీక్కుంటూ ‘’జోక్యూజ్ ‘’జోక్యూజ్ ‘’అంటూ లేచిపోయాడు .కోర్టు హాలులో జనం కూడా ‘’కేసు జోక్యూజు అయిపోయిది అనుకొంటూ వెళ్ళారు .ఈకథరాసినాయన ‘’To my mind and eye Jokyuse is one of the funniest words yet invented .It belongs to no known tongue ‘’అని చెప్పాడని మునిమాణిక్యంగారు చెప్పారు. శక్తిలేని పదం వాళ్ళ కూడా హాస్యం సృష్టించవచ్చు అని దీని వలన తేలింది .
సంస్కృతం తెలుగు కలగా పులగం చేసి మాట్లాడితే హాస్యం వస్తుంది ‘’దినం దినం అస్మత్ భార్యే కలహయతి .నేను రోజూ శిరో వేదనేషు బాధ్యతే ‘’,అలాగే ‘’అన్నం కళకళాయతే ,చిటపటాయతే’’మిమ్మల్ని పునరపి సాయంకాలే స్కూల్ వేషు ఆవరణే చూస్తా.’’తస్మిన్ సమయే బాలాఃఫుట్బాల్ క్రీడయతి ‘’
అలాగే ‘’ఎండా మండిత ప్రదేశం ‘’,తిట్టు ను తిట్టితః అంటే నవ్వుతాం .జిగిమిష అంటే పోవాలనే కోరిక దీన్ని బట్టి ‘’తినమిష ‘’,అనాలనుకోనేదాన్ని ‘’అనమిష ‘’అంటే నవ్వుతారు .అలాగే ఒకశ్లోకం –‘’క్షుధా తురాణా౦ న ఉడికి ర్నఉడకః –అర్ధా తురాణా౦ న చెల్లి ర్నచెల్లః నిద్రాతురాణా౦ న మెట్టర్నపల్లః –కామాతురాణా౦ న ముసలిర్నపిల్లః ‘’
మునిమాణిక్యం మాస్టారికి కృతజ్ఞతలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-21-ఉయ్యూరు
చాలా బాగుంది రచన