రెండు భాషల కలయిక వల్లా హాస్యం పుడుతుంది
ఔను నిజం .అందులో సౌందర్యం ఉండకపోవచ్చు .చమత్కారంగా ఉంటుంది .తుపాకీ రాయుళ్ళు అనే పగటి వేష గాళ్ళు ఇలా హాస్యం పుట్టిస్తారు .వేదపనసలు చదివినట్లు ఏవో తమాషా శ్లోకాలు చదివి నవ్విస్తారు –‘’బాకీసారా సుమనాసా సర్వాదాయం .యధాక్రమం తిన్నట్టే తినకున్నట్టే .మాడడం.మాట మాట ప్రసంగేన డబ్బు దిబ్బుస్త దైవచ .పాద రక్ష ప్రయోగేనశరీరం పీడా వర్జయేత్ ‘’.దీన్ని వేదం చదివినట్లు ఉదాత్త అనుదాత్తలతో స్వర భేదంతో చదివితే వింతగా చమత్కారంగా అనిపించి నవ్వొస్తుంది .
ఇంగ్లీష్ –తెలుగు కలిపి కొట్టుడు గిరీశం బాగాచేసి చూపించాడు కన్యా శుల్కం లో .’’ఇన్నాళ్ళాయ్ నీకు విడో మేరేజి విషయమై లెక్చర్లు ఇస్తుంటే ,ఈ కథ ఎప్పుడూ చెప్పావుకావు .మీ ఇంట్లోనే ఓ అన్ ఫార్త్యునేట్ యాంగ్ విడో ఉందటోయ్.ఏమి దురవస్థ .మైహార్ట్ మేల్ట్స్.నేనే తండ్రి నైతే ఈ పిల్లకు విడో మీరేజ్ చేసి శాశ్వతమైన కీర్తి సంపాదిద్దును .ఏమిచక్కదనం .ఈ సోంపు ఎక్కడా చూడలేదు .పల్లె టూళ్లో ఉబుసు పోదనుకున్నానుకానీ ,పెద్ద కాంపెయిన్ కు ఇక్కడ కూడా అవకాశం ఉండటం నా అదృష్టం ‘’అంటాడు వెంకటేశం తో.
కవులు కూడా రెండు భాషల కలయికతో పద్యాలు రాశారు .అవీ తమాషాగానే ఉంటాయ్ .’’పోస్టాఫీసున పోస్టు చేయు డొక కార్డున్ రేపే నామాటలన్ –టెష్టున్ జేయగవచ్చు .స్టార్టిమీడియట్లీ యంచు వైరిచ్చుటే –బెస్టన్ని౦టను –వైరు జూచుకోనుచున్ వేవేగ మేల్ ట్రెయినో -నే స్టార్టౌ,నతడారణాలెకదవేష్టయిన చోన్ ‘’’అలాగే వరశుల్క నాటకకర్త తెలుగు అరవాలను కలగా పులగం చేసి హాస్య పులగం వాడాడు .ప్రతాప రుద్రీయాం లో వేదం వారూతెలుగు ఉర్దూ కలిపికొట్టి ఈ తమాషా మాటలతో సాధించి చూపారు .
ఒక తెలుగాయన కన్నడిగుల విందుకు వెళ్ళాడు .భోజనాలలో రెండు మాటలు అందరు అనటం విన్నాడు. అర్ధం మాత్రం తెలియలేదు .ఎవరైనా వడ్డించటానికి వస్తే ‘’కొంచెం సాకు కొంచెం సాకు ‘’అనేవాడు అక్కర్లేదనుకొని వడ్డించకుండా వెళ్ళేవారు .విస్తట్లో తినటానికి ఎవరూ వడ్డించలేదు .మండి పోయింది .ఒకాయన వస్తేఆకలి మంటతో ‘’అరగంట నుంచీ ఒక్కడూ సాకలేదు .నీ సాకు చట్టు బండలుకాను .నువ్వైనా రెండు బేకులు బేకి పో ‘’అన్నాడు అందరూ పగలబడి నవ్వక చస్తారా .
ఉర్దూ సంస్కృతం వచ్చిన ఒక బ్రాహ్మణుడు వరుసగా పది హేను రోజులు సంధ్యావందనం చేయటానికి కుదరపోతే ,అన్నీ కలిసి ఒక రోజే చేద్దామనుకొని ,దీనికి సంస్కృతం లో ఎలాచెప్పాలో తెలీక ‘’పంద్రా యాం కా సంధ్యావందన్ ఏక్ ధం మేకరిష్యే ‘’అని సంకల్పం చెప్పాడు .
అస్పష్ట ఉచ్చారణతో హాస్యం
దీనికి రెండు విధానాలున్నాయి ఒకటి మ్లిస్టం’’..దీనిలో రెండురకాలు ఒకటి అవిస్పష్టం రెండోది అనర్ధకం .ఈ రెండూ శబ్దాన్ని అస్పష్టంగా ఉచ్చరిస్తే వచ్చే వికృతి వలన హాస్యం పుడుతుంది .
మ్లిష్టం అంటే అర్ధం తెలియరాని మాటలు ఇన్ డిష్టింక్ట్ స్పీచ్ .అవిస్పష్టం అంటే ఇంగ్లీష్ లో మంబ్లింగ్ అంటారు .గొణుక్కోవటం వంటిది-ఉదాహరణ-
హలో రావ్ –ఆ రావునే మాట్లాడుతున్నా .మీరు మత్శ్యశాస్త్రం లో నిష్ణాతులట కదా .ఇవాళ ఒక అపురూపమైన చేప పట్టాం.ఏమిటవి? 0ద్ జాతివి ,అమ్బుల్ క్కా చ్చీ జాతివి అయ్యా .ఆయన మళ్ళీ అనటం వీడు అలాగే చెప్పటం జరిగింది .ఈ ఫోన్ సంభాషణలో మాటలు సరిగా వినపడకపోవటం చివర్లోనో మొదట్లోనో కట్ అవటం వలన వినే వాడు హాస్యం ఫీలౌతాడు .
అనర్ధకం –ఇందులోనూఅర్ధం లేనిమాటలే బాగా మాట్లడుతున్నానుకొని మాట్లాడే మాటలన్నమాట .మనకు అర్ధంకాక తికమక పడతాం .దీన్నే ఇంగ్లీష్ లో ‘’డబుల్ టాక్ ‘’అంటారు .దీనికిఒక ఉదాహరణ –రావూరు సత్యనారాయణ రావు గారు ఒకసారి మునిమాణిక్యం గారింటికి వచ్చి ‘’రాత్రి జమ్మలమడక మాధవ రాయ శర్మగారి ఉపన్యాసం విన్నాను .మీరూ విన్నారుగా .కాని మొక్కపాటి ఆ ఉపన్యాసం ‘’వే౦డాయమానం ‘’గా ఉందన్నాడు నాకు అందులో లాటాను ప్రాసం కనిపించింది .మీరు ఏమంటారు ‘’?అని అడిగితె మాస్టారు ‘’వేండాయ౦ గా నూలేదు, లాటాయమానంగానూ లేదు .అది ‘’భార వేరం’’ గా ఉంది.కాళిదాసస్య భార వేరః ‘’అన్నాడుకనుక ఆ ఉపన్యాసం’’ భారవేర సంయుక్త సమాహారం’’ నోడౌట్ ‘’అనగా అక్కడున్నవారంతా పగలబడి నవ్వారని మునిమాణిక్యం ఉవాచ .
మునిమాణిక్యం మాస్టారికి కృతజ్ఞతలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-11-21-ఉయ్యూరు