భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -11(చివరి భాగం )

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -11(చివరి భాగం )

   ఇండియాస్వయం నిర్ణయ హక్కు

  న్యూయార్క్ లో విఠల్ భాయ్ కి మాజీ భారత కార్యదర్శి వెడ్జి వుడ్ బెన్ కు ఫారిన్ పాలిసి అసోసియేషన్ తరఫున ఒక చర్చ జరిగితే ,రేడియో లో ప్రసారమైతే లక్షలాది జనం విన్నారు .సభకు జేమ్స్ బి మాక్డో  నాల్డ్ అధ్యక్షత వహించి పటేల్ ను పరిచయం చేశాడు .భారత జాతి పునరుద్ధరణకు ఉన్న  ఆటంకాలపై పటేల్ –‘’ఇండియా ప్రతినిధులు ,బ్రిటిష్ ప్రతినిధులు కలిసి ఒక ప్రణాళిక రాసుకొన్నారనీ ,అది ఇండియాలో అమలు కాబోతోందనే అబద్ద ప్రచారం ప్రపంచమంతా చాటారు .ఇండియా ప్రతినిధులు ఎవరు ?బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించిన వారే కదా .ఒక రాజకీయ పార్టీ కాని మత సంఘాన్ని కాని పిలిచారా ? నిజమైన దేశ నాయకుల్ని జైల్లో పెట్టి ,రౌండ్ టేబుల్ నాటకం గుడు గుడు గుంజం గా ఆడారు .శాంతి సమావేశాలలో ,నానాజాతి సభలో ,అంతర్జాతీయ సభలలో కామన్ వెల్త్,ప్రపంచ పరిణామాలలో  ఇండియాకు స్థానం ఉందని చెప్పారు .ఇవన్నీ అసంబద్దాలు .వాటిలో ఇండియా తరఫున హాజరైన వారందరూ బ్రిటిష్ ప్రభుత్వం ఎంపిక చేసి పంపిన వారే .వారి మాటలలో భారత ప్రజల మనో భావాలు ప్రకటితం కానే లేదు .

  ‘’నిజమైన స్వతంత్రం లాంటిదే ‘’అధినివేశ ప్రతిపత్తి’’.కామన్ వెల్త్ లోనే ఒకస్వతంత్ర రాజ్యమై ఉండటం ఒకటి ఉంది అని బ్రిటన్ అంటోంది .ఇది భ్రమ .సంపూర్ణ స్వాతంత్ర్యానికి ,దాస్యానికి మధ్య ఇంకో స్థితి ఉండదని ప్రపంచానికి తెలుసు .’’అన్నాడు పటేల్ ..వెడ్జి వుడ్ –‘’1929నుంచి మా లేబర్ పార్టీ ప్రభుత్వం భారత కాంగ్రెస్ తో సమాధాన పడటా నికికే ప్రయత్నించింది .మాపై అనుమానం తో వాళ్ళు శాసనోల్లంఘనం చేశారు .వేలకొద్దీ జైలు పాలైంది నిజమే .అరాజకం కాకుండా జాగ్రత్త పడ్డాం .గాంధీ –వైస్రాయ్ సమావేశమూ జరిగి ఒడంబడిక జరిగి,ఖైదీలు విడుదలయ్యారన్న సంగతి పటేల్ చెప్పలేదు .బ్రిటిష్ పాలనపై ఉన్న అనేక విమర్శలు నేనూ ఒప్పుకొంటాను .ఎన్నో పొరబాట్లు అపరాధాలు చేసి ఉండవచ్చు .నేను లేబర్ పార్టీ మంత్రిగా ఉండి భారతస్వాతంత్ర కాంక్షను అంగీకరించాము .నేనూ వైస్రాయి ఇండియా ప్రజల సాయం కోరాం.భారత ప్రతినిధులు బ్రిటిష్ ప్రతినిధులతో పాటు సమాన హోదాలో సంప్రదించటానికి ఒప్పుకున్నాం .బ్రిటిష్ పెద్దల హృదయాలలో మార్పు కలిగిందని నాకు నమ్మకం గా ఉంది .పరస్పర స్నేహ సౌహార్ద్రాలద్వారా  ఇండియా కు ఇండిపెండెన్స్ వస్తుందని నమ్ముతున్నాను .అక్కడ మత వైషమ్యం ఉండకూడదని మా భావం  గుండ్ర బల్ల సమావేశం లో మేముఇచ్చింది సంపూర్ణ స్వాతంత్ర్యం కాదు అని ఒప్పుకొంటున్నాను  ‘’అన్నాడు .దీనిపై పటేల్ స్పందించి –‘’మాకు పూర్ణస్వరాజ్యమే కావాలి ఇండియా విషయం లో లేబర్ పార్టీ ప్రభుత్వమైనా ఇంకో పార్టీ ప్రభుత్వమైనా ఒక్కటే పుర్రచెయ్యి తీసి ఎడమచెయ్యి పెట్టమన్నట్టిదే .రామ్సే మాక్డో  నాల్డ్   ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఇండియాకు స్వాతంత్ర్యాన్ని వాగ్దానం చేశాడు కానీ  ఆయన ప్రధాని ,వెడ్జివుడ్ కార్య దర్శిఅయిన మరుక్షణమే  ,మహాత్మునితో సహా 80వేలమందిని జైలులో పెట్టించారు  .స్వత౦త్ర భారత్ తన రాజ్యా౦గాన్ని  తానె రచించుకొంటు౦ది .తన నాగరకతను తానె పెంచుకొంటు౦ది .అంతవరకు ప్రపంచశాంతి కల్ల’’అని దీటుగా సమాధానం చెప్పి భారతీయుల చిరకాల ఆకాంక్ష ‘’సంపూర్ణ స్వతంత్రం ‘’ని నిర్భయంగా ప్రకటించి చెప్పి చిరస్మరణీయమైన సేవ చేశాడు భారత దేశానికి …

  విఠల్ భాయ్ పటేల్ అవసాన దశ

అమెరికాలో ఉండగా ఆయన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది .ముసలితనం కూడా తోడై శరీరం వ్యాధి గ్రస్తమైంది .నిరంతర పరిశ్రమ ఆరోగ్యాన్ని మరింతకుంగ దీసింది .అమెరికా నుంచి ఇంగ్లాండ్ వెళ్లగా బ్రిటన్ –ఐర్లాండ్ సంబంధాలు బాగా తెగిపోయి ఎన్నికలలో డీవేలేరా పార్టీ విజయం సాధించి,ఐర్లాండ్  అధికారం హస్తగతం చేసుకొన్నది .క్రమంగా నియంతగా మారాడు .ఒకప్పుడు ఆ దేశం లో ఉండటానికి వీలులేక పారిపోయిన డీవేలేరా ,ఇప్పడు బ్రిటిష్ ప్రభుత్వానికి పక్కలో బల్లె౦ కాక బాంబ్ అయ్యాడు .బ్రిటన్ కు కట్టే కప్పాన్ని ఆపేశాడు .ఆసమయం లో లండన్ లో ఉన్న పటేల్ భాయ్ కి డివేలేరా ఐర్లాండ్ రమ్మని ఆహ్వానించాడు .అలాగే వెళ్లి అతడితోమాట్లాడాడు .బ్రిటన్ –ఐర్లాండ్ మధ్య సయోధ్యకు పటేల్ కృషి చేస్తాడని అందరూ భావించారు .అలాగే కొంత శ్రమించగా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది .

  మాతృదేశం భారత్ కు రావాలనే కోరిక ఆయనలో బాగా పెరిగింది .కాని తీరని కోరిక గా మిగిలిపోయింది .చికిత్సకోసం వియన్నా వెళ్ళాల్సి వచ్చింది .ఇండియాలో రాజకీయం శరవేగంగా మారుతోంది .హరిజనాభ్యుదయానికి గాంధీ మూడు వారాలు దీక్ష మొదలు పెట్టాడు .శాసనోల్లంఘనం పడకేసింది .వియన్నాలో ఉన్న నేతాజీ సుభాస్ చంద్ర బోస్ కూ విఠల్ భాయ్ కి అది నచ్చ లేదు .ఇద్దరూ కలిసి గాంధీ నిర్ణయాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన –‘’గాంధీ నిర్ణయం ఓటమిని అంగీకరించటమే .నాయకత్వ బలం తగ్గిందన్నమాట .కనుక కాంగ్రెస్ కొత్త విధానం లో పున ర్నిర్మానం  చెందాలి .దీనికి కొత్తనాయకుడు కావాలి .తన జీవన సూత్రాలకు అనుగుణంగా లేని దాన్ని గాంధీ ఒప్పుకోడు .పునర్నిర్మాణమో ,కొత్త పార్టీయో ఏర్పడాలి .సహాయ నిరాకరణ తీవ్రంగా  కొనసాగాలి .స్వాతంత్ర్య సమరం అన్ని రంగాలోనూ విజయం సాధించాలి ‘’అని ప్రకటన జారీచేశారు .ముసలితనంలో కూడా ఆయన రక్తపు ధమనులలో యువక రక్తమే ప్రవహిస్తోందని చాటి చెప్పాడు విఠల్ భాయ్.భారత స్వాతంత్ర్య యువ వీరుల సరసన ఉండాల్సిన వాడు ఆయన .

  బ్రిటన్ తో పరస్పర సంప్రది౦పు లతోనే భారత్ అభ్యుదయం సాధించాలని పటేల్ పూర్తీ విశ్వాసం .దానికోసం తనకు చేతనైనంతవరకు చేసి చివరికి సహాయ నిరాకరణానికి మొగ్గు చూపాడు  .కాంగ్రెస్ లో పిరికితనం ఉన్నా పటేల్ లో టార్చి లైట్ వేసి వెదికినా పిరికితనం లేనే లేదు .అందుకే అన్ని రంగాలో స్వాతంత్ర్య సమరం సాగాలని కోరాడు .కాంగ్రెస్ లోనుంచే మరోకోత్తపార్టీ జవసత్వాలతో రావాలని ఆకాంక్షించాడు .ఆయన ఉద్దేశ్యం లో కాంగ్రెస్ –సోషలిస్ట్ పార్టీ కావచ్చు .ఇదే పటేల్ చివరి ప్రకటన .

  చివరి దశ

క్రమ౦గా వ్యాధి పెరిగి విఠల్ భాయ్ మంచ మెక్కాడు .ఇండియాలో దేశ ప్రియ జే ఎం .సేన్ గుప్తా చనిపోయాడు .వియన్నాకు ఈ వార్త చేరి వియన్నాలో ఒక సభ జరిపారు .లేవలేని పరిస్థిలో ఉన్నాకూడా పటేల్ వెళ్ల గా మిత్రులు నెమ్మదిగా నడిపించి వేదిక ఎక్కించారు .సభకు అధ్యక్షత వహించాడు  .ఆసభలో ఆయన ఎందేరెందరో దేశ భక్తులను చిత్తరంజన్ దాస్ ,మోతీలాల్ మొదలైన వారిని స్మరించాడు నివాళి అర్పించాడు.వారి సేవలను ప్రస్తుతించాడు .తన అవంతూ వచ్చిందని ఆయనకు తెలుసు .కానీ గంభీర్యం సడలలేదు .అమెరికా వదిలాక ఆయనకు గుండేజబ్బుకూడా వచ్చింది ,చికిత్సతో కొంత నయమైంది .అక్కడినుంచి వియన్నా వెళ్ళినప్పుడు ప్రయాణ బడలికతో మళ్ళీ వ్యాధీ పెరిగింది .అక్కడ ఒక ఆసుపత్రిలో చూపించాడు .నాలుగు రోజులు జ్వరం వచ్చి తగ్గిపోయింది .కానీ గుండె బాధ పెరిగింది .డాక్టర్లు,నర్సులు చాలా జాగ్రత్తగా చూసుకొన్నారాయనాను .ఎనిమిది రోజులు జీవన్మరణ పోరాటం చేశాడు .ఆయనమిత్రుడైన వియన్నా డాక్టర్ కూడా అక్కడే ఉన్నాడు .ఎందఱో స్నేహితులు వచ్చి అన్నీ చూసేవారు .కానీ ఫలితం లేకపోయింది .ఆయన కోలుకోవాలని చాలా దేశాలనుంచి మిత్రులు అనుయాయులు లేఖలు రాశారు .లార్డ్  ఇర్విన్ కూడా –‘’ కిందటి సారి మిమ్మల్ని కలిసినపుడు సుస్తీగానే ఉన్నారు .ఈమధ్య మిస్ హారిసన్ మీఆరోగ్య విషయాలు తెలుపుతూ ఉత్తరం రాసింది .నేనూ నా భార్య మీ ఆరోగ్యం గురించి విచారంగా ఉన్నాం ..మీరు చాలా బాధలో ఉన్నారు .మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుంచుకొంటాను .’’అని రాశాడు .సర్ బిఎల్ మిట్టర్,భార్య వచ్చి చూశారు .వెల్లింగ్టన్ దంపతుఅలను అడిగినట్లు చెప్పమని వారికి పటేల్ చెప్పాడు .మరణ శయ్యమీద ఉన్నా ఆయనమాతృ దేశాన్ని స్మరిస్తూనే ఉన్నాడు .తన జీవితం భారత మాత సేవలో గడిచినందుకు ఆయనకు తృప్తిగా ఉంది .చివరగా మిత్రులతో ‘’నా దేశ ప్రజలకు ,ఇతర మిత్రులకు నా హృదయ పూర్వక ఆశీస్సులు .కొద్ది కాలం లోనే నా మాతృదేశం భారత్ సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందుతుందని  భగవంతుని చివరి విన్నపం తెలియ జేస్తున్నాను’’అని ఆ కృతార్ధ జీవి పలికికిన చివరిమాటలు . 22-10-1933న 60 ఏళ్లకే భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్  మరణించాడు.

  విఠల్ భాయ్ అవసాన దశలో కళ్ళల్లో ఒత్తులు వేసుకొని అనుక్షణం వెంట ఉన్న వాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ .ఆయన కళ్ళల్లో  ఎన్ని సుడిగుండాలకన్నీళ్ళు తిరిగాయో చెప్పలేం .పటేల్ చనిపోతూ తన యావదాస్తినీ యువనేత నేతాజీ పేర రాసి ,దాన్ని విదేశాలలో భారత ప్రచారానికి వాడమని కోరి ప్రాణాలను నిశ్చింతగా వదిలాడు పటేల్ .సుభాస్ బాబు దాన్ని అక్షరాలా పాటించాడు .ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి విదేశానుంచే భారత్ స్వాతంత్ర్యానికి పాటు బడ్డ త్యాగధనుడునేతాజి

  అంత్యక్రియలు

విఠల్ భాయ్ పార్ధివ దేహ౦ ఉన్న శవపేటిక ను  తీసుకొని ఓడ బయల్దేరింది. ఏడెన్ రేవులో ఆగినప్పుడు ప్రజలు తండోపతండాలు గా వచ్చి దర్శనం చేసుకొన్నారు .ఓడలో కొంచే ఎత్తు మీద శవ పేటిక ఉంచి అందరికి దర్శనానికి వీలు కల్పించారు .ఖద్దరు నూలు పూలు సమర్పించి జనం శ్రద్ధాంజలి ఘటించారు  .దహన క్రియలు బొంబాయిలోని చౌపతి లో తిలక్ దహన క్రియలు జరిపిన చోట నిర్వహించాలని నిర్ణయించారు .కానీ ప్రభుత్వం అనుమతించలేదు .అసెంబ్లీ సభ్యులు కూడా వైస్రాయ్ కి అర్జీలు పెట్టినా ఒప్పుకోలేదు .

  అప్పుడు విఠల్ భాయ్ పటేల్ తమ్ముడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా జైలులోనే ఉన్నాడు .అంత్యక్రియలకోసం  మూడు రోజులు ఆయన్ను విడుదల చేయటానికి ప్రభుత్వం ఒప్పుకొన్నది .విఠల్ భాయ్ శవ పేటిక బొంబాయి రేవు చేరింది .పోలీసులు కొద్దిమందినే  ఓడలోకి అనుమతించారు .వీరిలో సరోజినీ నాయుడు ,బి.జి.హారిమన్ ,కె.ఎఫ్. నారిమన్ ,జమ్నా దాస్ మెహతా ,కేశవ భాయ్ పటేల్ మొదలైన వారున్నారు  .ఆ రాత్రి శవ పేటికను జి.టి. హాస్పిటల్ లో ఉంచి మర్నాడు ఏషియన్ బిల్డింగ్ కు తీసుకు వెళ్ళారు ..అక్కడి నుంచి ఊరేగింపు బయల్దేరింది .శవపేటికను ఒక మోటారుకారులో ఉంచి డ్రైవర్ సీటులోఆయన  పెద్ద ఫోటో పెట్టి ఊరేగింపు గా సాగించారు..జనం ఆరు వరసలుగా నిలబడ్డారు .దుకాణాలన్నీ మూసేశారు స్వచ్చందంగా .నిశ్శబ్దంగా శాంతి యుతంగా ఊరేగింపు సాగింది .అన్ని మతాలవారూ ఊరేగింపులో పాల్గొన్నారు .కాంగ్రెస్ వాలంటీర్లు కాంగ్రేస్ జెండాలతో వచ్చారు .కొంత దూరం సాగాక స్త్రీ వాలంటీర్లు వచ్చి పటేల్ ముఖం కనిపించేట్లు చేయాలని కోరారు .పేటికలో ఊరేగించటం హైందవ సంప్రదాయం కాదు అంటే సరోజినీ నాయుడు వారికి నచ్చ చెప్పి సమాధాన పరచింది .

  కార్పోరేషన్ ముందు ఆగగానే కార్పో రేటర్లు వచ్చి తమ నాయకునికి శ్రద్ధాంజలి ఘటించి పూలమాలలు వేశారు .కలబా దేవి వీధిలో కి రాగానే లక్షలాది జనం వచ్చారు .అయిదు అంతస్తుల మేడల నుంచి పుష్ప వర్షం కురిపించారు  .దాదాపు నాలుగు లక్షలమంది స్త్రీ ,పురుషులు స్మశాన వాటికకు వచ్చారు .మహాను భావుడు ,కృతార్ధుడు ,భారత దేశ అబ్రహాం లింకన్ అంటూ జనం ఆయనగురించి గొప్పగా చెప్పుకొన్నారు .

  జెనీవా డాక్టర్లు పటేల్ శవాన్ని  పేటికలో కొన్నేళ్ళు అయినా చెడిపోకుండా ఉండేట్లు జాగ్రత్తగా పాక్ చేశారు .శవం పై కాశ్మీర్ శాలువా కప్పబడి ఉంది ..భగవద్గీత పుస్తకం శవం పై ఉంచారు .గంగాజలం తో శుద్ధి చేసి ,గంధం పూసి తులసిమాలలు వేసి భగవద్గీతను శవం పై పెట్టారు .సరోజినీ నాయుడు మాట్లాడుతూ ‘’విఠల్ భాయ్ శవం కాసేపట్లో దహనం చెందుతుంది .కానీ ఆయన ఆత్మ భారతస్వాతంత్ర్య సమరయోధులకు సదా మార్గదర్శిగా ఉంటుంది ‘’అని నివాళి ఘటించింది .’’నాయకులకు నాయకుడు విఠల్ భాయ్ ‘’అన్నాడు జన్నుదాస్ ద్వారకాదాస్ .విఠల్ భాయ్ కి అండ దండ గా ఉండి, ఆయన పార్ధివ దేహాన్ని ఇండియాకు పంపించిన సుభాష్ బాబుకు అందరు కృతజ్ఞతలు తెలిపారు .  సర్దార్ వల్లభాయ్ కుమారుడు చితికి నిప్పు అంటించాడు .జయజయ ధ్వానాలు మిన్ను ముట్టాయి. అగ్ని జ్వాలలు బంగారు తామర పూల రేకులలాగా భాయ్ దేహాన్నిఆవరించాయి .ఒక మహోజ్వల తార మింటికి ఎగసింది .వందేమాతరం .ఓం తత్సత్ .

ఇంతటి మహా దేశభక్తుని గురించి రాసే అదృష్టం నాకు కలిగిందుకు మహదానందంగా ఉంది .

   ఈ రచనకు ఆధారం –శ్రీ కంభం పాటి కుమార రాఘవ శాస్త్రి గారు రచించిన ‘’ ప్రెసిడెంట్ వి.జే .పటేల్ జీవితం’’పుస్తకం .

 మీ గబ్బిట దుర్గాప్రసాద్ -6-11-21-ఉయ్యూరు  

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.