తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-1
అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ లో శ్రీ ప్రేమానందకుమార్ రాయగా తమిళం లోకి కివా జగన్నాథన్ అనువదించగా ,తెలుగు సేత శ్రీ చల్లా రాధా కృష్ణ శర్మ చేయగా ,కేంద్ర సాహిత్య అకాడెమి 1989లో ప్రచురించింది .వెల-5రూపాయలు .ఇంతకీ ఎవరు ఈ తాత?అనే విషయాన్ని మున్నుడిలో జగన్నాథన్ తెలిపాడు .గత శతాబ్ది ఉత్తరార్ధం లో పుట్టి ,ఈ శతాబ్దం లో మరణించి తమిళ సాహిత్య సేవలో పునీతులైన ఇద్దరు విద్వాంసులలో మొదటివాడు సుబ్రహ్మణ్య భారతికాగా రెండవవాడు ఉ.వే.స్వామినాథయ్యర్ .అద్భుతకవితలతో భారతి తమిళ సాహిత్య తల్లిని సేవిస్తే , అయ్యర్ రెండు వేల ఏళ్ల నాటి తమిళ’’ సంగ కావ్యాలను’’ ,ఇతరకావ్యాలను బయటికి తీసి ,పరిశోధించి ప్రచురించాడు .వీటి వలనననే తమిళ ప్రాచీన చరిత్ర,సంస్కృతీ ప్రపంచం తెలుసుకో గలిగింది .అప్పటినుంచి వీటిపై పరిశోధన ముమ్మరంగా సాగి,అంతర్జాతీయ తమిళ మహా సభలు జరిగాయి. కంబ రామాయణం ,విల్లిపుత్తురార్ రాసిన భారతం తో ఆగిపోయిన తమిళ సాహిత్యం విస్తృతి చెందింది .ఆశ్చర్యానికి లోను చేసింది .సంగకాల సాహిత్యం ప్రాచీనమే అయినా ఈనాటికీ విలువైనదిగానే గుర్తింపు పొందింది .అయ్యర్ స్వయంగా కొన్ని వచన రచనలు కూడా చేశాడు తాను ప్రచురించిన ‘’మణిమేకలై ‘’కి అనుబంధంగా దాని కథాసంగ్రహం ,త్రిరత్నాలైన బుద్ధుడు ,సంఘం, ధర్మం గురించికూడా రాశాడు .పెరుం గదై అంటే బృహత్కథ,పరిష్కరణలో భాగం గా ‘’ఉదయనుడు’’ రాశాడు .గురువైన మీనాక్షి సుందర పిళ్ళై,మొదలైనవారి జీవిత చరిత్రలూ రాశాడు తాళపత్ర గ్రంథాల కోసం పడిన శ్రమలో కలిగిన అనుభవాలనూ గ్రంథస్తం చేశాడు పరిష్కరణ కావ్యాలకు ఆయన రచించిన ఉపోద్ఘాతాలు మణి,మాణిక్యాలే.ఇవన్నీ తమిళ సాహిత్య విజ్ఞాన సర్వస్వం గా భాసి౦చాయి …88ఏళ్ళు సార్ధక జీవితం గడిపి అయ్యర్’’ దైవికం’’ చెందాడు .అయ్యర్ గురించి సుబ్రహ్మణ్య భారతి –‘’తమిళ భాష జీవించినంతకాలం –తెలుస్తుంది నీకు తమిళకవుల ప్రశంస –లభిస్తుంది వారి కృతజ్ఞత –చిరంజీవివయ్యా నీవు ‘’అని కీర్తించాడు ‘’అందుకే అయ్యర్ ‘’తమిళ తాత ‘’అయ్యాడు .
బాల్య విద్యాభ్యాసాలు
తంజావూర్ పాలకరాజు ఒకాయన 48మంది బ్రాహ్మణ కుటుంబాలకు ఉత్తమదాన పురాన్ని కానుకగా ఇచ్చాడు ..అక్కడసాంప్రదాయ విద్వత్తు ,మేధస్సు వెల్లి విరిశాయి.,19వశాతబ్ది మొదట్లో అక్కడ వేంకటాచల అయ్యర్ అనే పేద శైవ బ్రాహ్మణ ,అష్ట సహస్ర శాఖకు చెందిన ఉపాధ్యాయుడు ఉండేవాడు .ఈయనకు వెంకట సుబ్బ అయ్యర్ ,శ్రీనివాసయ్యర్ కుమారులు .వెంకట సుబ్బయ్యర్ కు 19-2-1855 న స్వామి నాథన్ జన్మించాడు .తాతగారి వద్ద అక్షరాభ్యాసం జరిగి ,చాలా గీతాలు నేర్చాడు .తండ్రి మేనమామ ఘనం కృష్ణయ్యర్ గొప్ప సంగీత విద్వాంసుడు .శాస్త్రీయ సంగీత మార్గ త్రయాన్ని ‘’ఘనం ,నయం ,దేశికం ‘’అంటారు .అతి జటిలమైన ఘనం లో ఆయన ఘటికుడు .మేనమామ దగ్గర సంగీతం నేర్చి మహా ప్రావీణ్యం సంపాదించాడు సుబ్బయ్యర్ .కొడుకూ అలా కావాలని ఆశించాడు .సంగీతం కంటే తమిళభాష మీద మక్కువ ఎక్కువ స్వామినాథన్ కు .
వెంకట సుబ్బయ్యర్ తనమకాం ను ‘’అరియలూరు ‘’కు మార్చి,రామాయణం గురించి సంగీత ఉపన్యాసాలు చేసి జీవిక సాగించాడు. కొడుకును సంగీత సంస్కృతాలలో నిధి అయిన స్వామి నాథయ్యర్ వద్ద చేర్చగా కొన్ని లఘు కావ్యాలు నేర్చుకొన్నాడు.సంగీత , సంస్కృతాలూ ,చిత్రలేఖనం ఒంటబట్టాయి .అందమైన కాగితం బొమ్మలు తయారు చేసేవాడు .భావుకుడు కనుక సంస్కృత సాహిత్యాధ్యయనమూ చేశాడు .కావేరీ తీర మారుమూల గ్రామాల ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశి౦చేవాడు ..మాతామహుడు కృష్ణ శాస్త్రి పరమ శివభక్తుడు అవటం తో శివనామం నిరంతరం జపించేవాడు.
ఆ కాలం లో తమిళం పై చిన్న చూపు , సంస్కృతంపై మర్యాద ఎక్కువ .విజయానికి రాచబాట ఇంగ్లీష్ .దీనిపై ఆయనకు మోజులేదు .శాస్త్రీయ సంగీత శిక్షణ పొందేవాడు .తెలుగులోనూ కొంత పరిచయం సంపాదించే వారు ఆనాటి వారు.ఈయనకు అదీ లేదు .తమిళమే ఆయన్ను బాగా ఆకర్షించింది .
గోపాలకృష్ణ భారతి రాసిన నందనార్ యక్షగానం బాగా ఆకర్షించి విపరీతంగా చదివి అంతా కంఠతా పట్టాడు .ఆవూరిలోనే ఉన్న శఠగోపం అయ్యంగారి తో పరిచయం కలిగి ,తమిళం అభ్యసించాడు .జటిల తమిళాన్ని కూడా కరతలామలకం గా బోధించేవాడు అయ్యంగార్ ‘.దీనితో అయ్యర్ కి అయ్యంగారి వలన తమిళం లో మహానేర్పు అలవడింది .7వ ఏట ఉపనయనం జరిగి వెంకటరామ శర్మ అనే పేరు పెట్టారు .అందరూ ‘’శామా ‘’అనే పిలిచేవారు .తిరు వేరగం లోని స్వామి’పేరు స్వామినాథన్. మేనమామనుంచి కొన్ని మంత్రాలు నేర్చాడు .నియమంగాసంధ్యావందనం చేసేవాడు .
తండ్రి తన నివాసాన్ని దగ్గరలో ఉన్న ‘’కున్నం ‘’గ్రామానికి మార్చాడు .ఆగ్రామస్తులు సంగీతోపన్యాసాలకు తగిన పారితోషికం ఇస్తామని చెప్పటం తో మార్చిన మకాం .అక్కడి చిదంబరం పిళ్ళై తిరు విడైయార్ పురాణం మొదలైనవి అయ్యర్ కు బోధించాడు .తమిళ కావ్య రహస్యాలను ,నన్నూల్ ,నవనీత పాట్టియల్ లక్షణ గ్రంథాలను కస్తూరి రంగయ్యర్ బోధించాడు .తాయుమానవార్ ,పట్టిణత్తార్ లను అనుకరిస్తూ సంప్రదాయ ఛందస్సులో తమిళ పద్యాలు రాశాడు .తమిళం లో మాంచి పాండిత్యం పొందే సమయం లో 16-6-1868 న అయ్యర్ పెళ్లి మధురాంబాళ్ తో జరిగింది .జీవిత విధానం లో మార్పులేదు కానీ ఆర్ధిక సమస్యలున్నాయి.
కొడుకుకున్నతమిళ సాహిత్యాభి రుచి గమనించి తండ్రి అతడిని చెంగన్నం లోని వృద్దాచలం రెడ్డి గారి శిష్యుడిగా చేర్చాడు .ఆయనదగ్గర తమిళ ఛందో శాస్త్ర గ్రంధం ‘’యాప్పరుం గల క్కారికైని ‘’ని నేర్చాడు .గురువు తరచుగా తమిళ విద్వా౦సులగురించి ,ప్రసిద్ధ అధ్యాపకుల గురించి ప్రసంగించే వాడు .’’తిరువాడు దురై మరం ‘’ ఆస్థాన విద్వాంసుడు మహా విద్వాన్ మీనాక్షి సుందర పిళ్ళై పేరు తలిస్తే చాలు రెడ్డిగారు తన్మయులయ్యేవారు .ఆయన శిష్యుడు కావాలని అయ్యర్ అభిలాష ,.తనకున్న తమిళ తృష్ణ తీర్చగలసమర్ధుడు ఆయనే అని నమ్మాడు .
ఆయన దగ్గరచదవాలంటే ,అక్కడే కాపురం పెట్టాలి .ఆయన అనుగ్రహం తో కొడుకు తమిళ మహా విద్వాంసుడు అవుతాడని తండ్రికి గట్టినమ్మకం .తన మిత్రుడు గోపాల కృష్ణ భారతి అక్కడే ఉన్నాడు కనుక ఒకసారి మయూరం వెళ్లి అతడిని కలవాలనుకొన్నాడు సుబ్బయ్యర్ .
సశేషం
నాగుల చవితి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-11-21-ఉయ్యూరు . .