తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-2
. మీనాక్షి సుందరం పిళ్ళై శిష్యరికం .
మాయూరం లో తిరువాడుడురై మఠానికి చెందినఒక భవనం లో మీనాక్షి సుందరం పిళ్ళై ఉండేవాడు .తమిళ మహా విద్వాంసుడుగా పేరుపొందాడు .స్థలపురాణాలు ఎన్నో రాశాడాయన .తమిళ భాషా సాహిత్య బోధనలో మహాదిట్ట .స్వామినాథన్ ను వెంటబెట్టుకొని తండ్రి సుబ్బయ్యర్ ఆయనదగ్గరకు వెళ్ళాడు .వీరిని ఆహ్వానించటానికి పిళ్ళై బయటకు రాగా అయ్యర్ మనసులోఆయనపై ఆరాధనా భావం ఏర్పడింది ‘’మా వైపు వస్తుంటే ఆయన ఆకృతి నన్ను ఆకర్షించింది .బలిష్టమైన దేహం చిరుబొజ్జ ,విశాలఫాలభాగం ,చిన్న పిలక శ్వేత వస్త్ర ధారణా ,సంపన్న గృహస్తుడుగా అనిపించాడు .కానీ ముఖం లో ధనిక దర్పం లేదు ప్రశాంతత కళ్ళల్లో కనిపించింది .దయార్ద్ర వీక్షణాలు .జీవిత సమరం లో అలసిన యోధునిగా అవుపించాడు .కంఠ సీమను అలంకరించిన రుద్రాక్షమాల .దీర్ఘ తపస్సు తర్వాత సాక్షాత్కరించిన పరమ శివుని లాగా అనిపించాడు .నాలో ఉత్సాహం కళ్ళలో ఆనంద బాష్పాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి .’’అన్నాడు అయ్యర్.
తండ్రి తనను తాను పరిచయం చేసుకొని గోపాలకృష్ణ భారతితో ఉన్న మిత్రత్వం చెప్పి ,కొడుకు స్వామినాథన్ కు తమిళ భాష పై ఉన్న ఆరాధన తెలియజేశాడు .సంతోషించిన పిళ్ళై అయ్యర్ ను పరీక్షించి ,అనేక ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టగా తండ్రి ‘’ఈ పిల్లాడిని మీకు అప్పగిస్తున్నాను .శిష్యుడిగా స్వీకరించండి .పాఠాలు ఎప్పుడు ప్రారంభిస్తారు ?’’అన్నాడు .పిళ్ళై ‘’చాలామంది నా దగ్గర చదువుకోటానికి వస్తారు .ఏదో అరకొర చదువు చదివి నా శిష్యులమని ప్రచారం చేసుకొంటారు .దానివలన నాకూ వాళ్ళకూ తృప్తి ఉండదు.’’అనగా తండ్రి ‘’మావాడు మీరు ఉండమన్నంతవరకు మీ దగ్గరే ఉంటాడు .వాడిని తమిళం లో సుషిక్షితుని చేసే దాకా మీ వద్దనే ఉంచుకోండి వాడికీ మాకూ అభ్యంతరం లేదు .వాడికేమీ బాధ్యతలు ఇప్పుడులేవు ‘’అని బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు .పిళ్ళై సంతృప్తి చెంది అయ్యర్ ను ఎక్కడ ఉంచుతారో చెప్పమని అడగగా ,ఆ బాధ్యతా పిళ్ళై గారే తీసుకోవాలనే ,ప్రతినేలాకొంతడబ్బు పంపిస్తాననీ అన్నాడు తండ్రి.అందరికీ సంతోషంగా ఉంది .
కొంతకాలం దాకా పిళ్ళై తన శిష్యుడు సావేరి నాథ పిళ్ళై కి అప్పగించాడు .యితడు పండితుడేకాని క్రైస్తవుడు.బాగానే చెప్పేవాడుకానీ గురుముఖతా పాఠాలు నేర్చుకోవాలన్న అయ్యర్ తపన తీరలేదు .ప్రకృతి ఉపాసకుడైన పిళ్ళై పెరటిలో సమూలంగా పెకలించిన చెట్లు నాటాడు .అవి ఎలా బతుకుతాయా అని ఆదుర్దాలో ఉండేవాడు .అయ్యర్ ఉదయాన్నే లేచి కొత్త చివుల్లను గుర్తించి గురువు గారికి చూపేవాడు .ఆయన సంతృప్తి చెండది శిష్యుని మెచ్చేవాడు,మనసు విప్పి మాట్లాడేవాడు .
ఒక రోజు గురువుతో తాను నైషధం చదువుతున్నాననీ ,దాన్ని గురువుగారు బోధిస్తేనే బాగుంటుందని వినయంగా చెప్పాడు .చిరునవ్వు నవ్విన పిళ్ళై ఆరోజు నుంచే శిష్యుడికి బోధించటం ప్రారంభించి కోరిక తీర్చాడు .తన రచన ‘’తిరుక్కు డందయి తిరి పందాదిని ‘’కూడా చెప్పటం మొదలుపెట్టి ,అయ్యర్ కున్న భాషా శాస్త్రాభిమానానికి ముగ్ధుడయ్యాడు .అప్పటినుంచి రోజూ చాలాగంటలు పాఠాలు చెప్పాడు ప్రత్యెక శ్రద్ధతో.దీన్ని అయ్యర్ ‘’నాకున్న తమిళ తృష్ణ ,ఏనుగు కు మహా ఆకలేస్తే గుప్పెడు మరమరాలతో సరి పుచ్చుకొన్నట్లు ఉండేది ఒకప్పుడు ఇప్పుడు పిళ్ళై గారివద్ద విందు భోజనమే రోజూ ..ఒక్కోసారి ఆకలిని మించిన భోజనం లభించేది’.ఇక తమిళ విద్యాభ్యాసానికి ఢోకా’లేదు ‘’అని పరవశించి చెప్పుకొన్నాడు .అయ్యర్ గురుసన్నిధిలో ఎన్నెన్నో కృతులు అధ్యయనం చేశాడు .వాటిలో అంతాది,పిళ్ళై త్తమిల్ వంటివి ఉన్నాయి .ఆదర్శ గురువుకు ఆదర్శ శిష్యుడు .పిళ్ళై సాహిత్య వర్ష దారల్ని తనివి తీరా అనుభవించాడు స్వామినాధయ్యర్ .
తిరువాడు దురై లో విద్యాభ్యాసం
ఒకరోజు గురువుశిష్యుడిని ‘’నీకు వెంకటరాన్ ‘’అని ఎందుకు పేరు పెట్టారు ?’’అని అకస్మాత్తుగా అడిగాడు .’’మా ఇలవేల్పు వేంకటేశ్వరుడు కనుక ఆపేరు పెట్టారు ‘’అన్నాడు .’’నీకు ఇంకోపేరు ఉందా ?’’అని అడిగితె ‘’శామా అంటారు అది స్వామినాథన్ కు సంక్షిప్తనామం ‘’అన్నాడు .ఇక అతడిని స్వామినాథన్ పేరుతోనే పిలుస్తానని పిళ్ళై అని అలాగే పిలుస్తూ ఆపేరుకు వ్యాప్తితెచ్చాడు .ఉదయం గోపాలకృష్ణ భారతివద్ద సంగీతం నేరుస్తూ ఒకసారి గురువు అడిగితె నేర్చిన సంగీతం మర్చి పోకుండా ఉండటానికే అక్కడికి వెడుతున్నట్లు, కాని తనకు అందులో ఉత్సాహం లేనట్లు ధ్వనించేట్లు చెప్పాడు .సంగీతం లోకి ప్రవేశిస్తే సాహిత్యం అంటదు అన్నాడు గురూజీ .వెంటనే భారతి దగ్గరకు వెళ్లి తన అశక్తత చెప్పేశాడు ,
కొన్ని నెలల తరవాత పిళ్ళై తోకలిసి అయ్యర్ తిరువాడుదురై వెళ్ళాడు .అక్కడి మఠానికి మేలకరం సుబ్రహ్మణ్య దేశికర్ అధిపతి .ఆయన మహా విద్వాంసుడు ప్రజల్లో చాలా గౌరవాదరాలు ఉండేవి .దేశికర్ కు పిళ్ళై పట్ల విపరీతమైన అభిమానం..మఠంలో కొంతకాలం ఉండమని ,ఆధ్యాత్మిక సాధకులైన ‘’త౦బి రాళ్ల’’కు పాఠాలు బోధించమని అభ్యర్ధించాడు.శిష్యుడిని దేశికర్ కు పరిచయం చేశాడు గురువు .దేశికర్ కోరిక మేరకు ఒకపద్యాన్ని రాగయుక్తంగా పాడి ,అర్ధ వివరణా చేసి వీనులవిందు చేశాడు అయ్యర్ . మఠంలోని శివార్చనా విధానం ఆశ్చర్యం కలిగించి౦ది .తమ్బిరానులు పొడవైన కేశాలతో ,కాషాయ వస్త్రాలతో ,ఆరుకట్టి ఆభరణాలతో ముచ్చట గొలిపెవారు .శైవానికి ఈమఠం కేంద్రంగా ఉండేది . దేశికర్ పిళ్ళై ను విద్యార్ధులకు బోధించమని మళ్ళీ కోరగా ,అంగీకరించి ,పట్టీశ్వరం వాసి ఆరుముగత్తపిళ్ళై ను కొంతకాలం తన ఊరుకు పంపమని కోరగా సరేనన్నాడు దేశికర్ తిరువాడు దురై-పట్టీశ్వరం మధ్య కుంభ కోణం లో ఉన్న ప్రభుత్వ కళాశాల తమిళపండితుడు .త్యాగరాజ చెట్టిని అయ్యర్ కలిశాడు .శెట్టి ఇతన్ని ప్రశ్నించి చెప్పిన సమాధానాలకు తృప్తిపడి ,’’మీరు ఇతరులకు పాఠాలు చెబుతారా ?’’అని అడిగితె ‘’శక్తి వంచన లేకుండా చెబుతాను ‘’అనగా పిళ్ళై గారి శిష్యుడుకనుక బాగా బోధిస్తాడు అనే నమ్మకం కలిగి వెంటనే ప్రారంభించామన్నాడు చెట్టి.పట్టీశ్వరం లో ఉన్నప్పుడు చుట్టు ప్రక్క దేవాలయాలు సందర్శించి వాటి చరిత్రను గురుముఖతా తెలుసుకొన్నాడు .నాగి ,మాయూర పురాణాలు అధ్యయనం చేశాడు .
తిరుముగత్త పిళ్ళై ఇంటిపద్ధతులు తమాషాగా ఉండేవి .రాత్రి తొమ్మిదింటికి అందరూ నిద్రపోవాలి .అర్ధరాత్రి పిళ్ళై నిద్రలేచి బంధువుల్నీ అతిదుల్నీ లేపి భోజనం చెయ్యమనే వాడు .మీనాక్షి సుందరం పిళ్ళై వెంట వచ్చిన వారికి ఈ పధ్ధతి నచ్చలేదు .కానీ కిమ్మనే వారుకాదు .ఆపిళ్ళై చండ శాసనుడు .ఆయనపై ఎవరికీ ఆదరభావం లేదు .అయ్యర్ కూడా ఆయనకోపానికి బలి అయినవాడే .మాయూరం నుంచి తరచుగా వచ్చే సావేరి నాథ పిళ్ళై ఒక రోజు ఈయనపై చాటువుగా ఒకపద్యం చదివాడు దానిభావం ‘’పట్టీశ్వరం లో రాత్రివేళ ఆకలి బాధపడమని ఆదేశించిన బ్రహ్మ మమ్మల్ని చెట్లు గా పుట్టించలేదు ‘’దీనితో అతనిలో మార్పు తెప్పించి సకాలం లో భోజనాలు జరిగేట్లు చేశాడు .ఇలా ఆరునెలలు పట్టీశ్వరం లో గడిపాడు అయ్యర్ .ఇక్కడ ఉన్నప్పుడే తమ స్వగ్రామ౦ ఉత్తరమదాన పురం వెళ్లి,విజయదశమి నాడు గురువువద్ద కొత్తకావ్యం ప్రారంభించాలని తిరిగిపట్టీశ్వరం వచ్చేశాడు .నైషధం లో ఒక శ్లోకం చదివి నైషధ అధ్యయనం గురు సన్నిధిలో ప్రారంభించాడు .
మనకు కూడా పట్టిస ఉంది .అక్కడినుంచే గోదావరి జలాలను ఎత్తి పోత పధకం ద్వారా కృష్ణాజిల్లకు నీరు సరఫరా చేయించాడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు .దక్ష యాగా ధ్వంసం చేసి పట్టిస ఆయుధంగా అందర్నీ చంపిన వీరభద్రుడు పట్టిస దగ్గర గోదావరిలో ఆనెత్తురును కడిగాడు .పట్టిస ఆయుధం నెత్తురు కడిగిన ప్రదేశం కనుక పట్టిస అనే పేరు వచ్చింది .ఇక్కడి వీరభద్ర భద్రకాళిఆలయ౦ గోదావరి నదిలో చిన్న కొండపై ఉంటుంది .పట్టిసక్షేత్రం మహా క్షేత్రంగా పేరు పొందింది .తమిళ నాడులో పట్టీశ్వరం పేరు ఎందుకు వచ్చిందో ?ఆలోచిస్తే –కామధేనువు దూడ అంటే పట్టి పేరు నంది .అందుకే పట్టీశ్వరం అనే పేరు వచ్చిందని ‘’గూగుల్ సూతమహర్షి ఉవాచ ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-11-21-ఉయ్యూరు