ఆడంబర పద ప్రయోగ హాస్యం
మామూలు మాటలుకాకుండా పెద్ద పెద్ద మాటలు ఉపయోగించి మాట్లాడితే ఆ వాగాడంబరం వలన వికృతి తో హాస్యం పుడుతుంది అన్నారు మునిమాణిక్యం మాస్టారు .పానుగంటి వారి సాక్షి వ్యాసాలలో ఇది పుష్కలం .ఉదాహరణ –‘’దోమలన్నీ సభ చేసినవి ఆ సభకు కిష్కింధ నుంచి కొన్ని దోమలు వచ్చి చేరినవి .వాటి వర్ణన –శ్రీమాన్ మహా మండలేశ్వరుడు ,మహా రాజాధిరాజు ,క్రీర పటీర నీహార చంద్రికాసాంద్ర ధిక్కార జగద్విశ్రాంత యశస్సాన్ద్రములైన కిష్కింధ మశక మహా రాజులు౦ గారి విడిది యది ‘’.
అప్రసిద్ధ పద ప్రయోగ హాస్యం –ప్రసిద్ధం కాని వికృతమైన పదాల వాడకం వలన రచన వైపరీత్యం పొంది ,సుమనోజ్ఞ హాస్యం వస్తుంది అన్నారు మాస్టారు .సంగీతం బాగాపాడే వాడిని ‘’వాడిగొంతు బాగుంది ‘’అంటే బాగుంటుందికాని ‘’వాడి పీక బాగుంది ‘’అంటే నవ్వుకోలేక చస్తాం .భోజనం చేశాడు అని మామూలుగా అనే దాన్ని ‘’వాడు సాపాటు చెల్లించాడు ‘’అనీ ‘’మూతి తుడుచుకొన్నాడు ‘’అనికాని ‘’పిండా కూడు మెక్కాడు’’అని అంటే నవ్వుకొంటాం .
మనిషి తినే ఆహారాన్ని గురించి భమిడిపాటి వారు ‘’ప్రాణి ప్రాణాన్ని పోషిస్తుంది .పెద్ద ప్రాణి చిన్న ప్రాణిని మింగేస్తుంది .మానవుడు ప్రాణులను ,ప్రాణేతరులనూ తినేస్తాడు .మనిషి ఇంకోమనిషిని తినటం కూడా కొన్ని చోట్ల ఉంది .మనకు ఆఆచారం లేదనుకోండి .ఇంకో మనిషిపై కోపం వస్తే వాడిని తినేట్లు చూస్తాడు కాని తినడు .మనిషి జంతువులను ఫలహారం చేస్తాడు .తన్నే తినేస్తుందేమో అనే భయంతో కొన్నిటి జోలికి పోడు.ఆ భయం లేకపోతె ఏ జంతువునైనా చప్పరిస్తాడు .గాలిలో తిరిగే పక్షుల్నీ, నీటిలోని చేపల్నీ తింటాడు .చెట్ల మొదళ్ళ నుండి చివురుదాకా మేస్తాడు ‘’
అప్రయుక్త ప్రయోగ హాస్యం –అంటే ఉపయోగి౦పరాని మాటలు వాడటం .మంచి శబ్దమే ఒక చోట బాగుంటుంది మరో చోట బాగుండదు .’’సన్ ఆఫ్ ది సాయిల్ ‘’అనే మాటను మట్టి కొడుకులు అనీ ,’’కూల్ హెడేడ్ ఫెలో ‘’ ను చల్లని తలగలవాడు అంటే బోల్డు హాస్యం పుడుతుంది .మన మాజీ రాష్ట్ర పతి సంజీవరెడ్దిగారు నెహ్రు ప్రసంగాన్ని సభలో తర్జుమా చేస్తూ ‘’కోల్డ్ వార్ ‘’ను ‘’శీతల యుద్ధం ‘’అని ట్రాన్స్లేట్ చేసి చెప్పారని పేపర్ వార్త నేనూ చదివాను .
ఒక హాస్య చిత్రం లో మంగలి షాపు దగ్గర బోర్డుపై ‘’ఇక్కడ తలా, వెంట్రుకలు నరకబడును ‘’అని ఉంటె చదివి నవ్వు తన్నుకొస్తుంది ‘’తలవెంట్రుకలు ‘’కు వచ్చిన తిప్పలు ఇది .అరవ హోటలు బయట ‘’ఇక్కడ కూడు వేయబడును ‘’అని ఉన్నా ,ముఖ క్షవరానికి బదులు ‘’ముఖము కోయబడును ‘’అని ఉన్నా నవ్వే నవ్వు .
అశ్లీల పద ప్రయోగ హాస్యం –అశ్లీలాలు అంటే బూతులు .ఇవి కావ్యాలలో నిషిద్ధాలు .కానీ బూతుకావ్యాలూ మనకవులు బాగానే రాశారు ‘’బూతు రచనలు ఉత్తమ హాస్యర రచనలు గా పరిగణి౦చిన రోజులున్నాయి ‘’అని మాష్టారు ఢంకా బజాయించి చెప్పారు .’’ఒకింత బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో ‘’,’నీతులూ ,బూతులు ,లోక ఖ్యాతులురా కుందవరపు కవి చౌడప్పా ‘’బూతు కవితా పితామహుడు చౌడప్ప .ఆయన తర్వాత చాలా మంది రాశారు ఇవి రమణీయాలూ కావు,రమణీయార్ధకాలూ కాకపోయినా నవ్వు పుట్టిస్తాయి అనటం లో సందేహం లేదు .కాని అవి ఉత్తమ రచనలు కానే కావు .అశ్లీలార్ధ స్పురణతోబలహీనమైన నరాలలో ఎదో చలనం కలిగి చక్కిలిగింత పెట్టినట్లు నవ్వుతాము ‘’అని మునిమాణిక్యం వారు స్పష్టంగా చెప్పారు .ఈకాలం లో అసెంబ్లీలో బయటా మహామాత్య శిఖామణులు ,సభ్యులు బూతులు మాట్లాడుతుంటే నవ్వు రావటం లేదు జుగుప్స కలుగుతో౦ది కదా .
మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-11-21-ఉయ్యూరు