తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-5

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-5
జీవక చింతామణి పరిష్కరణ ,ప్రచురణ పూర్తయ్యాక అయ్యర్ ‘’పత్తుపాట్టు ‘’అనే కడ(చివరి ) సంగం కాలం లో వెలసిన సంకలనాన్ని పరిశీలించాడు .వ్రాత ప్రతులకోసం మారుమూల గ్రామాలు తిరిగాడు .అయ్యర్ అంటే ఈర్ష్య కలిగిన కొందరు జీవకచింతామణి పై వ్యాఖ్యలు చేశారు .శైవంలో పుట్టిపెరిగినవాడు జైనం మీద పరిశోధన ఏమిటని వారి అభ్యంతరం .ఈలేఖను మిత్రుడు సాధు శేషయ్యర్ కి చూపిస్తే అలాంటి విమర్శలకు సమాధానం ఇవ్వవద్దని ఇస్తే వాళ్ళకే ప్రచారం పెరుగుతుందనీ ,అయ్యర్ కార్యక్రమానికి భంగం కూడా కలుగుతుందని సాధు సలహా ఇచ్చాడు .పత్తుపాట్టు పరిశీలనలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు .మద్రాస్ లో దాన్ని ప్రచురించాలనుకొని సమగ్రంగా గ్రంధం లభించకపోయినా నచ్చినార్కనియర్ వ్యాఖ్య ఆధారం గా మూలం లోని పద్యాలను నిర్ణయించి ఆరునెలలు విపరీత శ్రమ చేసి 1889జూన్ లో పూర్తి చేశాడు .
దీనితర్వాత ప్రసిద్ధ ‘’సిలప్పాది కార ‘’కావ్య పరిశీలన కు పూనుకొని ,అడియాక్కు నల్లార్ రాసిన వ్యాఖ్యానం సంపాదించి మూలప్రతులకోసం గాలించాడు కానీ అపూర్వ పద పట్టిక ఒకటి దొరికింది .దాని సాయం తో కొన్నిపద్యాల విశేషార్ధాలు గ్రహించాడు .1891వేసవి లో తాళపత్ర ప్రతులకోసం తిరునల్వేలి జిల్లాలో పర్యటించాడు .క్రిములు కొట్టేసిన రెండు ప్రతులు దొరికాయి .సార నిర్ణయంచేసి ముద్రణ మొదలుపెట్టాడు .కుంభకోణం ఉద్యోగం చేస్తూనే ఈపనులు చేశాడు .విశ్రాంతి దొరికితే చాలు కావ్య పరిష్కరణమే .మహా బృహత్కార్యాన్ని అత్యంత సమర్ధ వంతంగా నిర్వహింఛి ముద్రణ పూర్తి చేశాడు అయ్యర్ .మన వేటూరి ప్రభాకర శాస్త్రి గారు గుర్తుకు వస్తారు .
సిలప్పాదికం తర్వాత మనిమేకలై,పురనానూర్ లపై దృష్టిపెట్టి ,రెండవదాని లోని 260పద్యాలకు పూర్వ వ్యాఖ్య సంపాదించాడుకానీ తర్వాత పద్యాలు అయోమయంగానిపించాయి .అప్పటికే సంగం సంస్కృతీ ,పదజాలం కరతలామలకం అవటం తో 1893జనవరిలో మద్రాస్ లో ముద్రణ మొదలుపెట్టగా,సెప్టెంబర్ లో అయ్యర్ తల్లి కాలగతి చెందగా ,మరోముఖ్య స్నేహితుడు పూండి అరణ౦గనాథ మొదలియార్ కూడా చనిపోగా ,గండాలన్నీగడిచి 1894సెప్టెంబర్ లో ముద్రణ పూర్తిచేశాడు అయ్యర్ . చారిత్రాత్మక అంశాలతోపాటు విశేష అంశాలు కూడా రాశాడు .ఇది వెలువడిన తర్వాత పండితులు సంగయుగానికి చెందిన అనేక విమర్శ ,పరిశోధనాత్మక గ్రంథాలు రాసి ప్రచురించారు .
తర్వాత బౌద్ధమత ధర్మాల పెన్నిధి మనిమేకలై కావ్య పరిష్కరణ ప్రారంభించాడు. బౌద్ధమత గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేసిన మద్రాస్ లో ఉన్న ఆచార్య మళూర్ రంగాచారి అయ్యర్ గారిని కలిసి సందేహాలు తీర్చుకొని సంతృప్తి చెందాడు .ఈలోగా ‘పురుప్పోరుళ్ వెణ్బా మలై ‘’ని ప్రచురించాడు అయ్యర్.1896జూన్ లో మనిమేకలై ను ముద్ర ణకిచ్చాడు .బౌద్ధమతాన్ని గురించి తనకు తెలిసిన అంశాలు ,అపూర్వ పద పట్టిక, అకారాది అక్షర క్రమం లో సూచిక తయారుచేసి1898లో ప్రచురించాడు .తర్వాత 59 తమిళ కావ్యాలనుంచి ,29 సంస్కృత గ్రంథాలనుంచి కొన్ని భాగాలుఎన్నుకొని,పరిష్కరణ లో చేర్చి కఠిన శబ్దాలకు అర్ధాలను వివరంగా రాశాడు .కావ్య కధ ను వచనం లో కూడా రాసి ప్రచురించాడు .చదువరికి ఇదిబాగా తోడ్పడుతు౦దికావ్యాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవటానికి .
తర్వాత ఐం గురునూరు ,పదిట్రుస్సత్తు,ఆగనానూరు ,పెరుం గదై అంటే బృహత్కధ మొదలైనవి పరిశోధించాడు .వీటిలో మొదటిది తమిళకావ్యాలలో ప్రధాన భౌగోళిక భాగ పంచకం గురించి 500 గీతాలు .ఒక్కొక్క భాగం గురించి వందపద్యాలున్నాయి .చేరరాజుల గొప్పతనాన్ని చెప్పేది పదిట్రుసత్తు .ప్రణయం గురించిచేప్పేది ఆగనానూరు .పెరుం గదై లో ఉదయనుడి కథ ఉంది .వీటిని ఒక్కొక్కటిగా ప్రచురించాలని ప్రాచీన తమిళ చరిత్ర ,సంస్కృతీ వగైరాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు .
గ్రామదానాన్ని వద్దన్న అయ్యర్
రామనాథపురం రాజకుటుంబానికి చెందిన,మదురై లో తమిళ సంగ స్థాపకుడు ,చాలాకావ్యాలు ప్రచురించిన పొ.పాండిత్తురై తేవర్ అనే సహృదయుడు మని మేకలై ,పురుప్పోరుళ్,వెణ్బా మాలై ల ప్రచురణకు సాయంచేశాడు. 1898లోతేవర్ తల్లి చనిపోయింది .పలకరించటానికి అయ్యర్ రామనాథపురం వెళ్ళాడు .ఈయన భవనం పేరు ‘’సోమసుందర విలాసం ‘’.ఇక్కడ నెలరోజులు ఉండి ఉదయం సాయంత్రాలలో తేవర్ తో అయ్యర్ సాహిత్య చర్చ చేశాడు .ఆయన చాలా ఆనందించి తన దుఖం తగ్గింది అని చెప్పాడు .తేవర్ ఒకరోజు రాజు సేతుపతిని కలవటానికి వెడితే ఆయన ఒక ముఖ్య విషయం చెప్పగా ఆయన సరాసరి అయ్యర్ నుకలిసి ‘’మీకో శుభ వార్తతెచ్చాను ‘’అనగా ‘’ఏదైనా కొత్తపుస్తకం పరిష్కరించాలా ?’’అని అమాయకంగా అడిగాడు అయ్యర్ .’’ఒకటికాదు ఎన్నైనా పరిష్కరించుకోవచ్చు ఇకమీరు. రాజుగారు మీకు ఒక గ్రామాన్ని దానం చేయాలనుకొంటున్నారు .ఇన్నాళ్ళూ మీకుచెప్పుకోతగిన సాయం చేయలేకపోయానని రాజుగారు బాధ పడుతున్నారు .గ్రామదానం గురించి రాజాగారు నన్ను మీకు తెలియ జేయమన్నారు ‘’అన్నాడు ఆనందంగా తేవర్.వెంటనే ఎగిరి గంతేసి సరే అనకుండా ‘’ధన్యవాదాలు చెప్పండి .నేనొకసారి వారితో మాట్లాడుతాను ‘’అన్నాడు అయ్యర్ . సేతుపతి ని సందర్శింఛి అయ్యర్ ‘’తేవర్ గారిద్వారా మీ మనసులోని మాట తెలిసింది. నాపై ఉన్న గౌరవానికి ధన్యవాదాలు .కానీ నాకు ప్రభుత్వం జీతం ఇస్తోంది .గుట్టుగా సంసారం చేసుకొంటున్నాను .మీ కోరికను తిరస్కరించినట్లు భావించకండి .సంస్థానం స్థితిగతులు నాకు తెలుసు .మీ ఔదార్యాన్ని భరించలేను ‘’అని వినయంగా చెప్పాడు .నిజంగానే సంస్థాన ఆర్ధిక స్థితిబాగాలేదు .’’సరే మీ ఇష్టం ‘’అని రాజు అయ్యర్ కు వీడ్కోలుపలికాడు .గ్రామం కోల్పోయానే అనే భావం ఏనాడూ అయ్యర్ మనసులోకి రానే లేదు .అదీ మేరునగ ధీరత్వం అంటే .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-11-21-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.